బతికేదెట్టా సామీ

598

బతికేదెట్టా సామీ
తిందామంటే తిండి లేదు చేద్దామంటే పని లేదు
బతికేదెట్టా సామీ
యాడ కెళ్ళినా ఏ దిక్కు చూసినా
పొద్దు పొడవదు పొద్దు గూకదు
కడుపు నిండదు నిదర పట్టదు
కాయకష్టం చేసేటోడికి అష్ట కష్టాలు
దోసుకునేటోడికి అష్టైశ్వర్యాలు
ఈ విడ్డూరం ఏంది సామీ
సొతంత్రం వచ్చి 74 ఏళ్ళైందన్నారు
ఎవురికొచ్చిందో ఎట్టా వచ్చిందో
నీకు పున్నెముంటది కాస్త సెప్పు సామీ
సదూకోటానికి డబ్బు లేదు
సదూకొన్నోడికి ఉద్దోగం లేదు
ఉద్దోగం సేసేటోడికి జీతం రాదు
వొచ్చేటోడికి ఆ జీతం సాలదు
యాపారం సేద్దామంటే లచ్చ పెశ్నలు
సేసేటోడికి ముప్పుతిప్పలు
బతికేదెట్టా సామీ
పెతోడికీ ఎదుటోడ్ని దోసుకునే యావ తప్ప
అందరం బాగుండాలనే తెలివి లేకపాయె
వాడు మాత్రం ఏం సేత్తాడ్లే
వాడూ బతకాలిగా
సేత్తే మోసాలు సేసి డబ్బు కూడబెట్టాల
లేకపోతే గవర్నమెంటోల్ల దగ్గర అడుక్కోవాల
మద్దెలో సెయ్యటానికి ఏమీ కానరావట్లా
మీరు సెప్పేదదేగదయ్యా
జనమంతా రెండే రకాలంటారు
బిచ్చం ఏసే నాయకులు
వాటికెగబడే వోటర్లు
కానీ మద్దెలో శానామంది ఉండారు సామీ
కష్టపడి గౌరవంగా బతుకుదామని అనుకునేటోల్లు
ఎగసాయం చేసి నలుగురికీ అన్నం పెట్టేటోల్లు
పెద్ద సదువులు సదివి జనాలకి మంచి సేసేటోల్లు
ఇట్టా శానామంది ఉండారయ్యా
కానీ ఈళ్ళందరూ సావలేక బతుకుతున్నారు
ఈళ్ళంతా బతికేదెట్టా సామీ
అరెరె ఏం సేద్దామన్నా తప్పే
ఏది మాట్టాడాలన్నా నేరమే
నాయం అడిగితే కులాలంటారు
దర్మం సేయమంటే మతాలంటారు
పెశ్నిస్తే కేసులంటారు
పెతి పనికీ పోలీసోల్లంటారు
ఇదేమిడ్డూరం సామీ
మడుసుల్ని మోసంజేసే మడుసుల్ని సూసాం గానీ
పెజల్ని మోసంజేసే పెబుత్వాల్ని సూడ్లేదయ్యా
మాట కోసం డబ్బు పేనాలిచ్చినోల్లని సూసాం గానీ
పూటకో అబద్దంతో బతికే నాయకుల్ని సూడ్లేదయ్యా
కలికాలం అంటే ఏదో అనుకున్నాం కానీ
ఆకలికాలమనీ గోరకలి కాలమనీ అనుకోలేదు సామీ
కానీ మీరు శానా గొప్పోళ్ళయ్యా
అప్పుకు కూడా మోమాట పడేటోడ్ని
సేయి సాచి అడుక్కునే బిచ్చగాడ్ని సేసారు
ఆత్మగౌరవం జెన్మహక్కనుకునే వాడ్ని
అడుక్కోటం జెన్మహక్కనుకునేటట్టు సేసారు
సరే యియ్యాల మేం అడుక్కుంటున్నాం
రేపు మా బిడ్డల పరిస్తితేంది
వాళ్ళు కూడా సేయి సాపాల్సిందేనా
పనీ పాట లేకుండా కూసోవల్సిందేనా
మీకాడ డబ్బులైపోయి మొకం సాటేత్తే ఏంజేయ్యాల
సదువుల్లేక పని సెయ్యలేక తిండి లేక
వాళ్ళు బతికేదెట్టా సామీ
మా బిడ్డలు సొంత కాళ్ళ మీద నిలబడాలి కానీ
పని సేతగాక కుంటుకుంటూ దేక్కుంటూ
అడుక్కోగూడదు సామీ
మమ్మల్నేలతామని మీరు గద్దెనెక్కారు ఏలండి
మాకు పనులు సూపియ్యండి
మా బిడ్డలు సదూకోటానికి సాయం జెయ్యండి
మా మానాన మేం బతుకుతాం
మీ జోలికి రాము
అంతేగానీ మమ్మల్ని బిచ్చగాళ్ళను సెయ్యమాకండి
ఇట్టాగైతే బతికేదెట్టా సామీ
రైతు రాజ్జెం రైతే రాజు
అనే మాటలు వినీ వినీ విసిగెత్తిపోయాం
ఏ రైతుదీ రాజ్జెం ఏరాజ్జానికాయన రాజు
కూసింత ఇడమరిచి సెప్పు సామీ
ఏ రైతుని తన పొలంలో ఉండనిచ్చారు
ఏ రైతుని ఎగసాయం చెయ్యనిచ్చారు
మీకు ఓట్లు కావాలంటే ఆ రైతు పొలం పంచాల
మీ యాపారానికీ ఆ రైతు పొలమే కావాల
మీరు దోసుకోటానికీ ఆ రైతు బూములే లాక్కోవాల
మీరు డబ్బు పోగేసుకోటానికీ ఆ రైతు బూములే అమ్మాల
పెతోడికీ కావల్సిది ఆ రైతుల పొలాలే
త్యాగం పేరుతో బూములొదుకోవల్సింది రాజనబడే ఆ రైతే
కానీ ఆ రైతు మీకెవురికీ అక్కర్లేదు
ఆ రైతుని ఎవురూ పట్టంచుకోరు
ఆ రైతంటే ఎక్కడలేని ఎటకారం
ఆ రైతంటే మీకు అసయ్యం
పొలాలు లాక్కుంటారు
వాటిని ఎడారి సేత్తారు స్మశానం సేత్తారు
మీకు అవసరమైనప్పుడు దేవుళ్ళంటారు
అవసరం తీరాక దెయ్యాలంటారు
మీకు కావాల్సినప్పుడు త్యాగమంటారు
నచ్చనప్పుడు యాపారమంటారు
పోలీసోళ్ళతో కొట్టిస్తారు కేసులు పెడతారు
ఆడా మగా సూడకుండా బండబూతులు తిడతారు
రాజంటే ఇట్టాగే సేత్తారా సామీ
రాజ్జెమంటే ఇదేనా
ఇదెక్కడి నాయం సామీ
ఎగసాయం సెయ్యటానికి పొలం మిగలక
ఇవ్వాల్సిన సాలు కవులు సమయానికి ఇయ్యకపోతే
మీరు రాజు అనే ఆ రైతు ఏంజేయాల
ఎట్టా బతకాలి సామీ
మీరేమీ మమ్మల్ని రాజుల్ని సెయ్యొద్దు రాజ్జాలు ఇవ్వొద్దు
మమ్మల్ని కూడా మడుసుల్లా సూడండి సాలు
అసలు ఎవడి బతుకు వాడ్ని బతకనీయకుండా
పెతోడి బతుకూ మీరు మార్చేదేందయ్యా
మీరు రాకముందూ బానే బతికాం
మీరు లేకపోయినా బాగానే బతుకుతాం
మా బతుకుల్ని మీరు మార్చక్కర్లేదు సామీ
మా బతుకు మమ్మల్ని బతకనీయండి సాలు
కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండయ్యా
ఎగసాయం చేసుకునే రైతుకి
ఎగనామం పెట్టినోల్లు బాగుపడరయ్యా
ఆడకూతుళ్ళని ఏడిపంచినోల్లు
జెన్మ జెన్మలకీ కుళ్ళి కుళ్లి ఏడుత్తారు సామీ
ఇప్పుడు సెప్పండయ్యా
బతికేదెట్టా సామీ
సచ్చేదెట్టా సామీ
బతకలేక సత్తూ సావలేక
బతికేదెట్టా సామీ