మంత్రిగారి ఇలాకాలో మూడుముక్కల పేకాట

720

గుమ్మనూరులో గుంభనంగా పేకాట క్లబ్
అడ్డుకున్న పోలీసులపై రౌడీల ఎదురుదాడి
కర్నూలు: అది ఓ ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం గారి రాజ్యం. అంతేకాదు. అది ఆయన స్వగ్రామం. ఆ రాజ్యంలో ఆయనకు ఎదురులేదు. ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. శివుడాజ్ఞలేనిదే చీమయినా కుడుతుందేమో గానీ.. ఆయనకు తెలియకుండా అక్కడి రాజ్యంలో చీమకూడా కదలదు. అలాంటి రాజ్యంలో కొద్దికాలం నుంచీ విజయవంతంగా సాగుతున్న, పేకాట క్లబ్‌పై మహిళా పోలీసు అధికారి ధైర్యంతో చేసిన మెరుపుదాడి, మంత్రి గారి ఇలాకాను దిగ్భ్రాంతికి గురిచేసింది. మా రాజ్యంలో మాకే ఎదురుతిరుగుతారా? అంటూ ఆగ్రహించిన అధికార పార్టీ నేతలకు అనుచరులయిన గూండాలు, పోలీసులపై దాడులకు దిగి తమ పెత్తనం రుజువుచేసుకున్న ఘనమైన ఇది.

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే-మంత్రి జయరాం సొంత గుమ్మనూరు గ్రామంలో, కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట క్లబ్‌ను, కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. వ్యూహాత్మకంగా జరిపిన ఈ దాడిలో.. డజన్ల కార్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు ఆటోల్లో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై గూండాలు దాడి చేశారు. ఆటోలను ధ్వంసం చేశారు. మా గ్రామానికి ఎలా వస్తారని బెదిరించారు. ఈ విధంగా చాలాకాలం నుంచి అనుమానితులను ఆ గ్రామంలోకి రానీయకుండా, ఇదేవిధంగా అడ్డుకునే వ్యూహం కొనసాగిస్తున్నారు. అందువల్లే ఇప్పటివరకూ ఈ దందా బయట ప్రపంచానికి తెలియలేదు. కానీ కర్నూలు అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి, ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదలలేదు. తనకు వచ్చిన సమాచారం తెలుసుకునేందుకు, ఆమె స్వయంగా రంగంలోకి దిగారు.

తొలుత పోలీసులపై తెగబడిన గూండాల తెగింపు సమచారంతో అక్కడికి చేరుకున్న ఖాకీదళం, లాఠీ ఝళిపించడంతో ఎక్కడివారక్కడ పరారయ్యారు.పేకాట నిర్వహిస్తున్న షెడ్ దగ్గరకు వెళ్లే మార్గంలో పేకాటరాయుళ్లు పారేసిన రూ.5.34 లక్షలు న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ నిలిపి ఉన్న 32 కార్లు, 6 బైక్‌ల‌తో పాటు 38 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏపీలో నిషేధం ఉన్న ఖరీదైన లిక్కర్ బ్రాండ్లన్నీ ఆ పేకాట డెన్‌లో దొరకడం! కొన్ని నెలల నుంచి యధేచ్చగా జరుగుతున్న ఈ తతంగంపై కన్నేసి, మెరుపుదాడి చేసిన పొలీసు అధికారిణి గౌతమిని, గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. అధికార బలం చూసి, ఇప్పటివరకూ తాము నిజాలు చెప్పలేక మౌనంగా ఉన్నామని గ్రామ ప్రజలు చెబుతున్నారు.ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న మంత్రి జయరాం పెదనాన్న కొడుకు నారాయణ.నారాయణ పై ,మంత్రి అనుచరులు శ్రీధర్, జగన్ లపై కూడా కేసు నమోదు చేయాలని అడిషనల్ ఎస్పీ గౌతమి ఆదేశించారు.వెంటనే 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ గౌతమి తెలిపారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు పరారీలో ఉన్నారని ఇంకా 14 కార్లు గ్రామంలో ఉన్నాయని చెప్పారు.

ఇదిలాఉండగా.. ఆలూరుకు 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బళ్లారి నుంచి, గత ఏడాది కాలంగా లిక్కరు యధేచ్ఛగా దిగుమతి అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలూరు నుంచి ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్న లారీలలోనే, తిరిగి వచ్చే సమయంలో అక్కడి నుంచి లిక్కరును దిగుమతి చే స్తున్నారన్న ఆరోపణలు, చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా మంత్రి గ్రామంలోనే ఖరీదైన మద్యం-పేకాట జరుగుతుందంటే.. ఈ వ్యవహారం ఏ స్ధాయిలోజరుగుతోందో ఊహించుకోవచ్చు.

రాయలసీమ-బళ్లారి ప్రాంతాల నుంచి వస్తున్న పేకాట రాయుళ్లు, కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వారం ఒక వ్యాపారి, కోటిన్నర డబ్బులు పేకాటలో పోగొట్టుకున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా.. మంత్రి గ్రామంలోనే జరుగుతున్న ఈ పేకాట దందా గుట్టును రట్టు చేసిన పోలీసు అధికారిణి గౌతమి ధైర్యాన్ని అభినందిచాల్సిందే. అయితే.. ఈ సాహసం చేసినందుకు.. ఆమెను సర్కారు అభినందిస్తుందో, లేక మంత్రిగారి ఇలాకాలో ధైర్యం చేసి.. పేకాట దందాను అడ్డుకున్నందుకు ఆమెపై బదిలీ వేటు వేస్తుందో చూడాలి.