రాజు గారు చెప్పారు.. వాళ్లు పాటిస్తున్నారు!

102

టీటీడీ భూముల నుంచి స్కూళ్ల వరకూ..
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

‘‘దేవుడు ఆదేశిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు’’ ఇది అరుణాచలం సినిమాలో రజనీకాంత్ డైలాగ్. ఇప్పటి రాజకీయాల్లో నర్సాపురం యుశ్రారైకా పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజు అడిగినవి కూడా అలాగే విచిత్రంగా అమలయిపోతున్నాయి. ఆంధ్రా రాజకీయాల్లో అసలు సిసలు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న రాజుగారు.. రోజూ రచ్చబండ పెట్టి, జగనన్న సర్కారును ఉతికి ఆరేస్తున్నట్లు కనిపించకుండానే, ఉతికి ఆరేస్తున్నారు. ఈ విషయంలో, శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారో తెలియని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే..ఏం మాట్లాడితే జగనన్న చిన్నబుచ్చుకుంటారోనని మొహమాటపడి, ఆయనకు ఎక్కడ దెబ్బతగులుందేమోనన్న బెంగతో.. తమలపాకుతో యుద్ధం చేస్తున్న భాజపా కంటే..  రాజుగారే నిఖార్సయిన విపక్షపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసిన ఓ ఫొటో అందరికీ  ఆసక్తి కలిగించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్-యుశ్రారైకా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫొటోలకు ‘వీళ్లిద్దరిలో ఎవరిది ఏ పార్టీ అని తెలియక, తెలుగు ప్రజలందరూ తీవ్రమైన మానసిక వేదనకు, ఆవేదనకు, విస్మయానికీ గురవుతున్నారు’ అన్నది ఆ ఫొటో రైటప్ సారాంశం.

రోజువారీ పరిణామాలపై.. వాయువేగంతో స్పందిస్తున్న రాజు గారి రియాక్షన్‌కు, అటు తెదేపా-ఇటు యుశ్రారైకా పార్టీలు నిర్ఘాంతపోతున్నాయి. వారు తీరి కూర్చుని ప్రెస్‌మీట్లు పెట్టేలోపు, రాజుగారు రచ్చబండ ఎక్కి జగనన్న సర్కారు నిర్ణయాలను ఫినాయిల్‌తో కడిగిపారేస్తున్నారు. దానితో ఆయన ప్రస్తావిస్తున్న అంశాలకు మీడియాలో ఉచిత ప్రచారం లభిస్తోంది. పేరు-నోరున్న కొన్ని చానెళ్లయితే, ఆయనతో ఆరోజు అంశాలపై ఏకపాత్రిభినయం చేయిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే.. రాజు గారు ఫేసు-వాయిస్ కనిపించని, వినిపించని చానెళ్లంటూ లేకుండా పోయాయి. ఏకవీరుడయినా సర్కారును ఏకిపారేయడంలో, ప్రతిపక్షాలను మించిపోతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకాలపై, రాజు గారు గళమెత్తిన తర్వాత.. ఇక విపక్షాలు గొంతు అందుకున్నాయి. నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సర్కారుకు లేఖ రాశారు. టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారం, జాతీయ స్థాయిలో చర్చగా మారింది. దానితో జగనన్న సర్కారు దిగి వచ్చి, ఆ ఉత్తర్వు ఉపసంహరించుకోవలసి వచ్చింది. అది రాజు సాధించిన తొలి ఒంటరి విజయంగానే చెప్పక తప్పదు. ఇక ఇసుకపై రాజు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సొంత పార్టీ సభ్యుడే ఇసుకు బంగారమయిందని ఆరోపించిన ఉదాహరణ చూపి, అటు తెదేపాయులు మరింత రెచ్చిపోయారు. వారి ఉత్సాహం చూసి, యుశ్రారైకా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెలరేగిపోయాయి. ఫలితంగా.. కొంతమేరకు, జగనన్న సర్కారు ఇసుక పాలసీని సరిదిద్దాల్సి వచ్చింది. రాజు గారు కనుక అప్పుడు ఇసుకపై రచ్చ చేయకపోతే, తెదేపా అరుపులు గాలిగర్జనగానే మిగిలిపోయి ఉండేవి.

ఇక తాజాగా స్కూళ్లు తెరిచేందుకు ఉబలాటపడుతున్న జగనన్న సర్కారుపై రాజుగారు సంధించిన లేఖాస్త్రం.. నేరుగా కేంద్రానికే తగిలినట్లుంది. అందుకే.. స్కూళ్లను తెరవడానికి వీల్లేదని కేంద్రం హుకుం జారీ చేసింది. సెప్టెంబర్1న అన్‌లాక్-4 ప్రారంభమవుతున్నందున, సెప్టెంబరు 5 నుంచి మళ్లీ స్కూళ్లు తెరవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇది మీడియాలో ప్రముఖంగా రావడంతో, ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆయన అభిమాన నాయకుడయిన  సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘కరోనా మహమ్మారి ఇంకా ఉన్నందున, ఈ పరిస్థితిలో స్కూళ్లు తెరిస్తే అది పిల్లల ప్రాణాలకు అపాయంగా మారుతుంది. చిన్నపిల్లలకు రోగ నిరోధ క శక్తి తక్కువగా ఉంటుందన్న విషయం మీకు తెలియనిది కాదు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు సరిపడా గదులుండవు. మరుగుదొడ్లు  ఉండవు. ప్రైవేటు స్కూళ్లు ఇరుకుగా ఉంటాయనీ మీకు తెలుసు. కాబట్టి స్కూళ్లు తెరవాలన్న మీ ఆలోచనను విరమించుకోండి’ అని రాజు గారు, సీఎంకు లేఖ రాశారు.

అయితే విచిత్రంగా.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ముందు స్పందించి, రాజు గళానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలో, ఎట్టి పరిస్థితిలో స్కూళ్లు తెరిచేందుకు అనుమతించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో స్కూళ్లు తెరిచే ఆలోచన ఇఫ్పట్లో లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించారు. స్కూళ్ల ప్రారంభంపై రాజు గారు ఈనెల 23న లేఖ రాస్తే, కేంద్రం 25న అదే అంశంపై స్పందించడం విశేషం. ఆంధ్రాలో ఇంతమంది వీరుల మధ్య, ఏకవీరుడైన రాజుగారు చేస్తున్న యుద్ధమే అందరినీ అబ్బురపరుస్తోంది.