( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరితినమ్మా భవానీ
నీ దరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
జయమునీయవే అమ్మ భవానీ’’
– 1963లో వచ్చిన నర్తనశాల సినిమా పాటను.. 2020లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కచేరీలో.. అమ్మ సమక్షంలో, కీర్తన రూపంలో తాదాత్మ్యంతో బహుబాగా ఆలపించిన, కాంగిరేసు వీరవిధేయ వృద్ధ నాయకుల భక్తి ప్రపత్తిని చూసి, కాంగ్రెస్ జెండా మురిసి ముక్కలవుతోంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన భారతీయ కాంగ్రెస్‌కు, ఇటలీమాత తప్ప మరొక తెరువు లేదని, కాంగ్రెస్ నాయకులు భక్తిపూర్వకంగా తీర్మానించిన ఆ ముచ్చట చూసిన వారి జన్మలు ధన్యం. అంతోటి అదృష్టానికి నోచుకోని కాంగ్రెస్ కార్యకర్తల దురదృష్టానికి పేరు పెట్టలేం.

అవును.. నిజం. నిజంగా నిఝం. అంతపెద్ద కాంగ్రెస్  అనే మహా సముద్రంలో, పార్టీ పడవను సోనియాగాంధీ తప్ప.. మరొకరు నడపటం సాధ్యం కాదంటూ, ఆ పార్టీ వర్కింగు కమిటీ గంటల మేధోమథనమనంతరం తీరికూర్చిని తేల్చిందట. దేశంలో కాంగ్రె సును ఉద్ధరించి, మళ్లీ అధికారంలోకి తెచ్చే దమ్ము-ధైర్యం తమకు లేవని, ఆ విషయంలో తాము అత్యంత అర్భకులకుమని, కాంగిరేసు నాయకమ్మన్యులు చేతులెత్తేశారు. పాహిమాం మాతా.. ఇక ఈ దిక్కులేని కాంగ్రెస్ నావకు, నీవే దిక్కు మహామాతా అని, సామూహిక భజన చేసిన తర్వాత గానీ, ఇటలీ మాత కాంగ్రెస్‌ను దయతలచలేదు.

కొన్ని గంటల మేధోమథనం, సామూహిక సోనియా స్తోత్రం, కీర్తనలు, అభిషేకాలు, అష్టోత్తరాలు, అర్చనలు, ఇతర పూజాదికాల అనంతరం అమ్మ దలచి.. ఓకే ఓకే.. మీరు ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి.. మీ భక్తి నన్ను ప్రసన్నురాలిని చేసింది కాబట్టి.. నా శక్తేమిటో మీ ద్వారా మరోసారి నాకు తెలిసింది కాబట్టి.. రాహులబ్బాయికి ఇంకా మీసం వచ్చేంత వయసు రాలేదు కాబట్టి.. అబ్బాయికి మీసాలు-రోషాలు వచ్చేవరకూ ఇక నాకెలాగూ పార్టీని ఉద్ధరించక తప్పదు కాబట్టి.. ముందు ఓ ఆరునెలలు కొనసాగుతానని సోనియమ్మ ఇచ్చిన అభయహస్తం, ఏళ్ల తరబడి కాంగ్రెస్ చూరుపట్టుకుని వేళ్లాడుతున్న, కాంగ్రెస్ మహనీయుల ప్రాణాలు లేచివచ్చేలా చేశాయి. అమ్మగారు ఆ మాట అనడమే ఆలస్యం.. ఒక శశిధరూర్, ఇంకో కబిల్‌సిబల్, మరో గులాంనబీ ఆజాద్‌ల కళ్లవెంట నీరు ఏరులై, ఆనందభాష్పాల రూపంలో పొంగి పరవెళ్లెత్తాయట. ఆ దృశ్యం చూడని వారు దురదృష్టవంతులేనన్నది జనపథ్ భక్తుల ఉవాచ.

రాహులబ్బాయిని పార్టీ బరువు మోయమంటే, నావల్ల కాదని కాడికింద పడేశారు. ‘ఈ సీనియర్లున్నారే’.. అంటూ, హీరో ఉదయకిరణ్ మాదిరిగా అలిగి అమ్మ వెనుక దాక్కున్నారు. సరే.. చెల్లెమ్మ ప్రియాంక, పోలికలో ఇందిరమ్మలా ఉన్నా, పనితీరు మాత్రం అన్నయ్య కంటే ఒకటి ఎక్కువ-రెండు తక్కువ అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌ను ఉద్ధరించే నాయకుడు, జనపథ్‌కు భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. పేరుకు సీనియర్ల  లిస్టు కొండవీటి చాంతాడంత ఉన్నా, వారికెవరికీ పార్టీని ఉద్ధరించే సత్తా లేదన్నది, వారితో సహా అందరి మూకుమ్మడి అభిప్రాయం. అందుకే.. ఎవరికి తప్పినా, ఓనర్లకు తప్పదు కదా మరి? అందుకే ఇటలీమాత ఇష్టం లేకపోయినా, ఇంటిపార్టీ పగ్గాలు తాత్కాలికంగా తీసుకున్నారట. అది కూడా ఆరునెలలు మాత్రమేనన్న షరతులతో!

మరో ఆరునెలల్లోపు మీ నాయకుడిని, మీరే ఎన్నుకోమని అమ్మగారు సెలవిచ్చారు. అప్పటికీ, రాహులబ్బాయి రాటుతేలకపోతే.. పురప్రజల కోరిక మేరకు, మళ్లీ అమ్మగారే అధ్యక్ష పదవిని అలంకరిస్తారన్న మాట! మరి ఇంతోటి ప్రహసనానికి ఒక ఆజాద్.. మరో సిబల్ ఆవేశపడి.. పార్టీపై మా పాతివ్రత్యాన్నే శంకిస్తారా? పార్టీ జెండాను పుండ్లు పడేలా మోసిన మాపైనే, ‘కమలప్రేరిపిత కుట్రదారులు’గా ముద్ర వేస్తారా? అంటూ నానా ఆవేశ-ఆయాసపడటమేల? అంతలోనే రాహుల్‌బాబు అబ్బెబ్బే నేను అన్నది మీ గురించి కాదని సర్దిచెప్పడమేల? సరే అలా అయితే మేము చేసిన ట్వీట్లన్నీ తూచ్ అని, వృద్ధనేతలు వాటిని డిలీట్ చేయడమేల? హేమిటో.. ఆరేళ్లు అధికారంలో లేకపోతే, కాంగ్రెస్ నాయకులకు జీర్ణశక్తి తగ్గి, అజీర్తి లాంటి వికారాలు, తమకు తామే చక్కిలిగింతలు పెట్టుకుని, ఈ ఏడ్చి నవ్వడామిటో హెవ్వరికీ హర్ధం కాదు.

అయినా ఇప్పటికిప్పుడు రాహులబ్బాయి, పార్టీని టేకోవర్ చేసినా పెద్దగా ఊడబొడిచేదేమీ లేదు. ఆల్రెడీ కమలం.. అశ్వమేధయాగం మాదిరిగా, ఒక్కో రాష్ట్రాన్నీ కబళించే పనిలో ఉంది. కాంగ్రెసుకు ఉన్న ఆ ఐదో,ఆరో రాష్ట్రాలు కూడా.. భవిష్యత్తులో  ఎన్ని కాంగ్రెస్ చేతిలో ఉంటాయో,  ఎన్ని పరాధీనమవుతాయో గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఉన్నంత కాలం.. ముదిమి మీద పడిన ముదురు నాయకులు ఉంటారు కాబట్టి, ఇక దానికి వేరే శత్రువులు అక్కర్లేదు! ఏదయినా.. జనంలో మోదీపై విరక్తి కలిగి, మైనారిటీల్లో చీలికలు లేకుండా అందరి ఆలోచనలు ఒక్కటయి, అందరూ చేయెత్తి జైకొట్టినప్పుడే, కాంగ్రెస్ గుర్రం ఎగురుతుంది. అప్పటివరకూ హింతే… హింతే.. కాంగ్రెస్ బతుకు హంతే!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner