మదర్ థెరీసా గూర్చి పచ్చి నిజాలను సీనియర్ జర్నలిస్టు , ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య గారు ఈ వ్యాసంలో విపులంగా రాశారు…చదవండి…
-(నరిసెట్టి ఇన్నయ్య)

కేన్సర్ బాధ భరించలేక మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్ను ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నదట. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని సిఫారసు చేయమని ఆమెను అడిగాడట. జీసస్ చేత ముద్దు పెట్టించుకోవడానికి ఎవరు మాత్రం చనిపోతారు…!! ( ఈ జీసస్ ముద్దు పెట్టుకునే సూత్రం ఆమె విషయంలో వర్తించదు. ఏ చిన్న అనారోగ్యం వున్నా సరే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరేది. అంతేగానీ జీసస్ తనను ముద్దుపెట్టుకుంటున్నాడు అని సరిపెట్టుకుంది కాదు.)

ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా “పిల్లల ఆశ్రమం” లో. ఆమె నిర్వహించిన అనాథపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం. సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ “లాన్సెట్” ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్( Christopher hitchens) కూడా స్వయంగా మదర్ తెరిసాను కలస్తే ఇలాంటి సంఘటనలే చూసారు.

అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దుపెట్టుకున్నాడని అనుకుని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటీ విచక్షణ? అలాంటి ప్రశ్నలు “భారతరత్న” మదర్ తెరిసా గురించి వేయకూడదంతే? మీరు అడక్కూడదు అంతే?

మదర్ తెరిసా పేరుమార్చి,ఊరుమార్చి పోప్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ గ్రహించింది. భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్బైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు దాంతో దానికి కారణం అయిన అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందని భ్రమపడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది. అది ఆమె ప్రత్యేకత!
1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటరర్వూ చేసాను.

అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యూరోఛీఫ్ గా నేను పబ్లిక్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం సందర్భంగా మదర్ తెరిసాతో మాట్లాడాను. ఏది అడిగినా ఆమె సమాధానం ఒక్కటే, అంతా దైవకృప అనీ, పరిష్కారానికి యేసు ప్రార్థన మార్గమని చెప్పడమే. చాలా నిరుత్సాహపడ్డాను. ఆమెనుండి నేను ఏవో సమాధానాలు ఆశించడం పొరపాటని గ్రహించాను. అయితే అప్పట్లో ఆమెకు మద్దతుగా బలమైన క్రైస్తవ మతం, ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఉన్నందువల్ల సాగిపోయింది. మదర్ తెరిసా గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవని, గుడ్డినమ్మకమే ఆధారమని గ్రహించాను. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, ఎంతో మంది యువతులు చెరచబడి పారిపోయి, ఇండియా వచ్చారు. అయినా సరే, వారెవరూ గర్భం తొలగించుకోరాదని అదంతా దేవుడిచ్చిన వరమని అని మదర్ తెరిసా ప్రకటించింది. అది ఆమె జీవకారుణ్యానికి, దైవభక్తి గీటురాయి.
ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం, విడాకుల విషయం పార్లమెంటులో చర్చకి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు, గర్భాన్ని తొలగించుకోవడం ససేమిరా వీలుకాదన్నది.

కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు,పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది.

ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రచన ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా, మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు.
మదర్ తెరిసా(1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరుకాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో(Skopje). సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్(సన్యాసినులు) అయ్యే ఒక సాంప్రదాయం పాటించి, 15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడినుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది. 1929లో కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్(nun) గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోంషా బొజాక్సు(Anjezë Gonxhe Bojaxhiu).

చిన్నపిల్లల్ని సేకరించి, అనాధశరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మతప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే, వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ అగస్టీన్( Saint Augustine) మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంతమంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. దాంతో అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.

పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలె ఆచరించారు. అసలు ఉద్దేశం అది కాదంటుండేవారు! ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని వూదరగొట్టాయి. పొప్ కూడా పొగిడాడు. దాంతో గుర్తింపుతోబాటు దేశదేశాల నుండి డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో ఛారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా వసూళ్ళు చేసింది.

హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని
నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యువలియర్(Jean-Claude Duvalier) ఆమెకు సన్మానాలు చేసి, డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువలియర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు.

అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి, మోసగించిన ఛార్లెస్ కీటింగ్ (Charles keating) జైల్లో పడ్డాడు. 252 మిలియన్ డాలర్ల మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది! కీటింగ్ 1.25 మిలియన్ డాలర్లు ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కోటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్ట్ మాక్స్ వెల్ అనే పత్రికా ప్రచురణ కర్త 450 మిలియన్ పౌండ్లు వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మతమార్పిడులు విపరీతంగా చేయించింది.

భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉద్యోగాలు బాగా లభిస్తున్నాయని, సమ్మెలు లేవని మదర్ తెరిసా సర్టిఫికెట్ ఇచ్చింది. అందువల్లనే అనలేంగానీ, ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది.

మదర్ తెరిసా ట్రస్టులకు సంబంధించి భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయేనాటికి ఒక్క న్యూయార్క్ లోనే 50 మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. చట్టప్రకారం ఛారిటీస్ కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగెదెవరు?
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్ లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టురట్టు చేసారు. ‘ది మిషనరీ పొజిషన్'( the missionary position) శీర్షికన హిచిన్స్( Christopher hitchens) ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ ‘న్యూ స్టేట్స్ మెన్’లో 1997 సెప్టెంబర్ 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరుషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు. మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత,ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు.

స్టెర్న్ పత్రికలో వాల్టర్ వ్యూలెన్ వెబర్ 1998 సెప్టెంబర్ 1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు, బాంకులో దాచి, పిల్లలకు ఖర్చు పెట్టని తీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయట పెట్టాడు. సుజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్ లో డబ్బు విషయాలు వెల్లడించింది.

కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, పేదపిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం,మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది.
మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మతవ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండాలి. మతవ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక. అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు.

ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు చికిత్స చేయగా, కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా॥రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంతభూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.

మదర్ తెరిసా బ్రతికుండగా అనాధపిల్లల పేర నిధులు వసూలు చేసి, రోమ్ కు చేరవేస్తే, చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్ళు సాగుతుంది. దీన్నే మతవ్యాపారం అనవచ్చు. ఇలా నిత్యనూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనుచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏ మాత్రం కొదవలేదు.

You can see more information on this wiki link. https://en.m.wikipedia.org/wiki/Criticism_of_Mother_Teresa

 

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner