శహభాష్.. రామచంద్రమూర్తి గారు!

746

సలహాదారు పదవికి రామచంద్రమూర్తి సెలవు
 అమరన్న ఆయనను అనుసరిస్తారా? అంటిబెట్టుకుంటారా?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

‘‘వ్యక్తిత్వం ఉన్న వారెవరూ జగన్ పాలనలో సలహాదారులుగా కొనసాగలేరు. ఈ 14 నెలల కాలంలో జగన్ ఒక్కరి నుంచి కూడా సలహాలు స్వీకరించిన పాపాన పోలేదు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా, మిగిలిన వారు కూడా రాజీనామా చేయాలి’’
– ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొద్దినెలల క్రితం  నియమితులయిన, ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలివి.
సీపీఐ నాయకుడు ఈ వ్యాఖ్యలు యథాలాపంగా చేసినా, రాజకీయ కోణంలో చేసినప్పటికీ.. ఆయన వాడిన వ్యక్తిత్వం అనే పదాన్ని మాత్రం విస్మరించకూడదు. ఏపీలో సలహాదారులుగా ఉన్న పెద్ద తలకాయల్లో సజ్జల రామకృష్ణారెడ్డి-కృష్ణమోహన్ తప్ప, పూర్తి స్థాయి పని ఎవరూ చేయడం లేదన్నది నిజం. అయితే, సలహాదారు పదవులిచ్చిన వారికి జగనన్న సర్కారు కూడా.. ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదన్నది మరో నిఖార్సయిన నిజం.

మూర్తి గారూ.. ది గ్రేట్

పదవుల పాకులాడేవారు కొందరయితే.. పదవులు తీసుకున్నా ఆత్మాభిమానం-వ్యక్తిత్వం దెబ్బ తింటే, ఆ పదవులు త్యజించేవారు ఇంకొందరు. ప్రముఖ జర్నలిస్టు కొండుభట్ల రామచంద్రమూర్తి రెండవ కోవకు చెందిన వ్యక్తి. సీపీఐ నేత రామకృష్ణ చెప్పినట్లు… వ్యక్తిత్వం ఉన్నందుకే, ఎక్కువ కాలం ఆత్మాభిమానం చంపుకోలేక, రామచంద్రమూర్తి తన సలహాదారు పదవికి సెలవిచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి ఆయన గత రెండు నెలల క్రితమే రాజీనామా ప్రయత్నం చేసినా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను వారించినట్లు సమాచారం. అయినా, రామచంద్రమూర్తికి సరైన బాధ్యతలు-యంత్రాంగం- అధికారాలు అప్పగించకుండా, జగన్ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించింది. పత్రికా సంపాదకుడిగా ఎంతోమంది సీఎంలతో సులభంగా భేటీ అయిన ఆయన, కనీసం.. సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్ కూడా గగనమయింది.  ఫలితంగా ఇన్ని విమర్శలు ఎదుర్కొని.. తీసుకున్న, ప్రభుత్వ పదవికి తాను న్యాయం చేయలేనన్న నిర్ధరణకు వచ్చిన మూర్తి గారు.. ఆ పదవికే రాజీనామా చేశారు.

తొలి నుంచీ….

జర్నలిజం నేపథ్యంతో, తెలంగాణ మూలాలు ఉన్న రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌కు.. ఆంధ్రాలో పదవులివ్వడమే వివాదమయింది. దానికితోడు మీడియాపై ఆంక్షలు విధిస్తూ, జర్నలిజం నేపథ్యంలో పదవులు పొందిన వారిద్దరూ,  ఆ జీఓపై మాట్లాడకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. వీరిద్దరిలో అమర్ ఎక్కువ విమర్శల పాలయ్యారు. ఎల్జీ పాలిమర్స్ అంశంలో జాతీయ మీడియా సంధించిన ప్రశ్నలకు, ఆయన జవాబు ఇవ్వకపోవడం,  వైసీపీ నాయకులకూ అసంతృప్తి కలిగించింది. జాతీయ మీడియాలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నా, ఆ విషయంలో సమన్వయం చేసుకోలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో దేవులపల్లి అమర్ హైదరాబాద్- రామచంద్రమూర్తి విజయవాడ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. నిజానికి వారికి ప్రభుత్వం అప్పగించిన విధులపై ఏ స్థాయి అధికారుల పర్యవేక్షణ లేదు. స్టేషనరీ కూడా ఇచ్చే సౌకర్యం లేదు. అసలు సలహాదారులు ఏ శాఖ కిందకు వస్తారన్న అంశంపై స్పష్టత లేదంటున్నారు.

సీఎంకు లేఖ రాసినా దిక్కులేదు.. అందుకే..

నిజానికి రామచంద్రమూర్తి.. చాలామంది సలహాదారుల కంటే చిత్తశుద్ధితోనే పనిచేశారన్నది నిర్వివాదాంశం. పేరుకు డజన్ల మంది సలహాదారులున్నప్పటికీ, వారిలో ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లేవారిలో అజయ్‌కల్లం రెడ్డి- సజ్జల రామకృష్ణారెడ్డి-జీవీడీ కృష్ణమోహన్- రామచంద్రమూర్తి వంటి తక్కువమంది వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. రామచంద్రమూర్తికి సంక్షేమం-విద్య-వైద్యం అంశాలు అప్పగించారు. కేంద్రప్రభుత్వం పేదలకోసం రూపొందించిన అంత్యోదయ పథకాన్ని, రాష్ట్రంలోని పేదల అవసరాలకు అనుగుణంగా మార్చాలని ఆయన ప్రయత్నించారు. కర్నాటక విధానంపై అధ్యయనం చేశారు. ఆ మేరకు సతీష్‌చంద్ర-రవిచంద్ర-పివి రమేష్-రాజశేఖర్ వంటి అధికారులతో అనేకసార్లు భేటీ వేశారు. దళిత సంఘాల సూచనలు స్వీకరించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనలు అమలుకావాలంటే.. అందుకు ఇద్దరు రీసెర్చి స్కాలర్లు అవసరం ఉన్నందున, వారి నియామకానికి అనుమతించాలంటూ చాలా కాలం క్రితమే సీఎంకు ఓ లేఖ రాశారు. దానిపై ఇప్పటికీ అతీగతీ లేదు. ఎన్నిసార్లు గుర్తుచేసినా స్పందన లేకపోవడంతో, గౌరవం లేని చోట పనిచేయడం భావ్యం కాదన్న భావనతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

గతంలోనే రాజీనామా యత్నం

వీటిపై చర్చించేందుకు, సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. పైగా.. ఆయన పేరుకు ప్రభుత్వ సలహాదారుడైనప్పటికీ, కార్యాలయానికి స్టేషనరీ కూడా ఇచ్చే దిక్కులేదు. అన్నీ కొనుగోలు చేసుకోవడమే. జీఏడీ కూడా.. మంత్రుల కార్యాలయ వ్యవహారాలు తప్ప, సలహాదారులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత కాదని చేతులెత్తేసింది. ఏపీలో సలహాదారులందరి పరిస్థితి ఇదే. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి చాంబరు కోసం మాత్రమే… అజయ్‌కల్లం స్వయంగా చాంబరు చూసి, అక్కడున్న సెక్రటరీని ఖాళీ చేయించారు. దానితో, ఇక పనిలేకుండా సర్కారు జీతం తీసుకోవడం మంచిదికాదన్న భావనతో.. రెండు నెలల క్రితమే, తన రాజీనామా లేఖను సజ్జలకు ఇచ్చారు. అయితే, తొందరపడవద్దని, తాను మాట్లాడతానని చె ప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రాజీనామా ఇచ్చి.. ఏపీ నుంచి నిష్క్రమించారు.

అలవెన్సు, గన్‌మెన్లు కూడా తీసుకోని మూర్తి

రామచంద్రమూర్తి తన పదవీకాలంలో.. క్యాబినెట్ మంత్రి హోదాలో వచ్చే సౌకర్యాలు గానీ, టీఏ-డీఏ వంటి అలవెన్సులు గానీ, చివరకు గన్‌మెన్లు కూడా తీసుకోకపోవడం ప్రశంసనీయం. ఏదైనా పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా, సొంత నిధులే ఖర్చు చేశారు. గతంలో మంత్రులుగా పనిచేసిన కలిదిండి రామచంద్రరాజు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి-ప్రస్తుత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వంటి కొద్దిమంది మాత్రమే ఈరకంగా ప్రభుత్వంపై కాకుండా, సొంత డబ్బు ఖర్చు పెట్టడం చూశాం. ఇప్పుడు రామచంద్రమూర్తి కూడా, అలాంటి సంప్రదాయం పాటించడం గొప్ప విషయమే. కనీసం సీఎం అపాయింట్‌మెంట్లు కూడా,  సలహాదారులకు దొరకడం లేదన్న నగ్నసత్యంతోపాటు.. సలహాదారుల పదవులు ఉత్సవవిగ్రహం మాత్రమేనని, మూర్తి గారు ఆవేదనతో తీసుకున్న నిర్ణయం చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకూ మంత్రులు-ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్లు ఇవ్వరన్న ప్రచారం దీనితో నిజమయింది.

అమరన్న సంగతేమిటో…?

కాగా మూర్తిగారు  రాజీనామా చేసి, తన ఆత్మాభిమానం-వ్యక్తిత్వం నిలబెట్టుకున్నారన్న వ్యాఖ్యల నేపథ్యంలో.. మరో సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ కూడా.. మూర్తి గారి బాటలోనే నడిచి, ఆత్మగౌరవం-వ్యక్తిత్వం కాపాడుకుంటారా? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. ప్రస్తుతం అమర్ జాతీయ మీడియా సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే, ఆయన ప్రభుత్వానికి ఇస్తున్న సలహాలేమిటో, ఆయన నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న సలహాలేమిటన్నది బ్రహ్మరహస్యమే.

సీనియర్ జర్నలిస్టు అయిన రామచంద్రమూర్తి లాంటి వ్యక్తే.. ఆత్మాభిమానం-వ్యక్తిత్వం చంపుకోలేక, ఉత్తి పుణ్యానికి జీతం తీసుకుంటానన్న ఆత్మవిమర్శతో రాజీనామా చేశారు. మరి అలాంటి ఉన్నత విలువలు, ఆత్మగౌరవ నిర్ణయం.. పోరుగడ్డపై  పుట్టి, అలాంటి గుణాలు పుష్కలంగా ఉన్న దేవులపల్లి అమర్ కూడా తీసుకుంటారా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకరకంగా ఇది అమరన్నకు ధర్మసంకటమేనన్న చర్చ జర్నలిస్టు వర్గాల్లో జరుగుతోంది. నిజంగా..అమర్ కూడా ముందుకొచ్చి, రాజీనామా చేస్తే ఆయన నిర్ణయం ఆదర్శప్రాయమవుతుంది. తనకు నచ్చని విషయాలు ప్రభుత్వం అమలుచేస్తుందని భావించినప్పుడు అమర్ రాజీనామాకు సిద్ధపడతారని, అసలు ఆయన రాజీనామా పత్రం జేబులోనే పెట్టుకుని తిరుగుతారని, గతంలో వైఎస్‌కు అలాగే రాజీనామా లేఖ ఇచ్చారని గతంలో జర్నలిస్టు బెజవాడ సభలో వెల్లడించారు. ఆ నాయకుడి చెప్పినది నిజమైతే, అమర్ కూడా సహజంగా మూర్తి గారినే అనుసరించాల్సి ఉంటుంది.  అదే రాజీనామా చేయకుండా పదవిలోనే కొనసాగితే.. ఆ ఇద్దరిలో రామచంద్రమూర్తి గారికే ఎక్కువ ఆత్మగౌరవం ఉందన్న ప్రచారం-భావన ఏర్పడుతుంది. చూడాలి. ఏం జరుగుతుందో?!

మూర్తికి బదులు.. అమర్ స్పందనా?

మూర్తి గారి రాజీనామాపై స్పందించిన, సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై.. ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన రామచంద్రమూర్తి స్పందించకపోవడం..  ఆయన బదులు దేవులపల్లి అమర్ స్పందించడం ఆశ్చర్యకరం. సహజంగా అయితే.. ‘తాను వ్యక్తిగత కారణంతోనే రాజీనామా చేశాను. ఇందులో రామకృష్ణ ప్రస్తావించిన  ‘వ్యక్తిత్వం’ అనే పదాలకు తావు లేదు. సహచర సలహాదారులపై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా’నని రామచంద్రమూర్తి గారే స్పందించాల్సి ఉంది. కానీ, విచిత్రంగా అమర్ తెరపైకొచ్చి.. సలహాదారులు పత్రికాప్రకటనలు, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వరని పేర్కొన్నారు. తాము ఇచ్చే సలహాలేమిటన్నది, రామకృష్ణ లాంటి వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని, ఎదురుదాడి చేయడం చర్చనీయాంశమయింది. నిజానికి ఏపీ సర్కారుకు డజన్లమంది సలహాదారులున్నారు. వారిలో ఏ ఒక్కరూ రామకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఆయన వాదన- ఆవేదన ప్రకారం, బహుశా… దేవులపల్లివారు మాత్రమే, మిగిలిన సలహాదారుల కంటే చిత్తశుద్ధి-అంకితభావం-ఆంధ్రా ప్రజలిచ్చే పన్నుల ద్వారా తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తున్నట్లు భావించాలేమో మరి!

1 COMMENT