భోగాది గారి లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

496

భోగాది వెంకటరాయుడు.. తెలుగు జర్నలిస్టులలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్లోనూ, అధికార యంత్రాంగంలోనూ బహుశా ఈ పేరు తెలియని వారుండరు. ఇది అతిశయోక్తి కాదు. ఆయన కలం శక్తి. 30 సంవత్సరాలుగా భోగాది వెంకట రాయుడు గారి గురించి వింటూనే ఉన్నాను. 1991లో నేను జర్నలిజంలో ప్రవేశించే నాటికి రాయుడు గారి పేరు మార్మోగుతూ ఉంది. రాజకీయ నాయకుల అక్రమాల గురించి, కాంట్రాక్టర్ల వక్రమార్గాల గురించి, వారికి వంత పాడుతూ ఆమ్యామ్యాలు పుచ్చుకుని అన్నీ మూసుకు కూర్చునే అధికార గణం గురించి రాయుడు గారు రాసిన వార్తా కథనాల గురించి అప్పట్లో కథలు, కథలుగా చెప్పుకునే వారు. ‘ఆకివీడులో ఆటల పోటీలు.. పాలకొల్లులో పాటల పోటీలు’ వంటి పనీ పాటా లేని వార్తలు ఆయన రాయరని చెప్పేవారు. పరిశోధనాత్మక వార్తా రచనలో రాయుడు గారిది అందె వేసిన చెయ్యి అని సగర్వంగా చెప్పేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ గురించి రాయుడు గారు రాసిన ఒక్క వార్త అప్పట్లో 32 మంది మంత్రులు ఒక్కసారిగా తమ పదవులు కోల్పోవడానికి కారణభూతమయ్యిందని సంచలనంగా చెప్పేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘రాయుడు రాయడు.. రాస్తే మాత్రం రప్ఫాడిస్తాడు..’ అని ఫక్తు సినిమా ఫక్కీ డైలాగులు కూడా రాయుడు గారి కలం రాతల సత్తా గురించి చెప్పుకునే వారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనతో ఇప్పటికీ వ్యక్తిగత పరిచయ మహాభాగ్యం లేకపోయినా ఆయన గురించి విన్నదీ, ఆయన రాసినవి చదివీ రాయుడు గారంటే ఒక గురుతర భావన ఉండేది. కానీ ఇటీవల రాయుడు గారి కలం నుండి జాలువారిన ఒక వార్తా కథనం సూర్య.కో.ఇన్ లో చదివిన తరువాత నేను విన్న రాయుడు గారేనా ఇది రాసింది అన్న సంశయం నాలో ఉద్భవించింది.

కాపులకు శుభవార్త! బాబు U టర్న్?!‘ అంటూ రాయుడు గారి పేరిట http://suryaa.co.in లో నేను ఒక కథనం చదివాను. ఒక్కసారి కాదు ఐదారు సార్లు పదేపదే ఆ కథనం చదివాను. కించిత్ కూడా ఆ కథనంలో భోగాది గారి భావమేమిటో నాకు అవగతం కాలేదు. కాపులకు రిజర్వేషన్ల అంశం గురించి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ఇక కాపులు గరిటెలు పట్టుకుని కంచాలు మ్రోగించక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళుగా కాపులకు రిజర్వేషన్ అంశాన్ని భుజాన వేసుకుని కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు ఏదో అన్యాయం చేశారనే అభిప్రాయం ఆయన కథనంలో వ్యక్తమవుతోంది. ఎన్నో సంచలన కథనాలు వండి వార్చిన భోగాది వారి కలం నుండేనా ఇటువంటి కుల కథనం వెలువడింది అనే సంశయం నన్ను ఆపాద మస్తకం తొలిచి వేసింది. ఒక్కోసారి ఆత్మావలోకనం చేసుకున్నాను.

2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమానికి భోగాది వారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి గారు నిర్మించ తలపెట్టిన, నిర్మాణం చేపట్టిన పలు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి భోగాది గారి సారధ్యంలో బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది. జలయజ్ఞం విజయాల గురించి పుంఖానుపుంఖాలుగా పత్రికా కథనాలు వెలువడ్డాయి. పలు ప్రత్యేక గ్రంథాలు కూడా ప్రచురితమయ్యాయి. భోగాది గారి వంటి విషయ పరిజ్ఞానం, విశేష అనుభవం ఉన్న జర్నలిస్టు మీడియా సలహాదారుగా ఉన్నందున జలయజ్ఞం విజయాల గురించి విపులంగా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి కదా అని ఒక సగటు జర్నలిస్టుగా సంతసించాను. రాజశేఖరరెడ్డి గారి మరణానంతరం రోశయ్య గారి జమానాలో ఎక్కడా భోగాది గారి గురించి వినిపించ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన స్వంత ప్రచారం కోసం ఐ న్యూస్ ఛానల్ సేవలు వినియోగించుకున్నారు. పనిలో పనిగా అందులో భోగాది గారి సేవలు వినియోగించుకుంటున్నారని తెలిసి సంతోషించిన జర్నలిస్టులలో నేనూ ఒకడిని.

2014 తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ ఏర్పాటు కావడం, ఆ కార్పొరేషన్ కు భోగాది గారే మీడియా వ్యవహారాలు చూస్తున్నారని తెలిసి భోగాది గారి శక్తి సామర్ధ్యాల గురించి మొట్టమొదటి సారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. భిన్న ధృవాలైన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి నేతలను మెప్పించి ఒప్పించి ముందుకు సాగడమంటే అది ఒక్క భోగాది గారికే చెల్లుతుందేమో అనుకున్నాను. నిజమో కాదో తెలియదు కానీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం తీసుకోవలసిన చర్యలు, అభ్యర్దుల ఎంపిక.. తదితర అంశాలపై ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పగించారని, ఆ అధికారికి భోగాది గారు కుడి భుజంగా వ్యవహరించారని కూడా నేను విన్నాను. అటువంటి ప్రచారం జరుగుతున్న చోట నేను ఉన్నాను కూడా. 2004 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానంలో భోగాది గారి పాత్ర చూసిన తరువాత ‘కాపులకు శుభవార్త ‘ వంటి కథనం ఆయన కలం నుండి జాలువారిన ఆణిముత్యం అంటే ఎందుకు ఆశ్చర్యపోవాలనే ప్రశ్న తొలిసారిగా నా మస్తిష్కాన్ని తొలిచి వేస్తోంది.

బహుశా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గారిని కూడా ప్రభావితం చేసే దిశగా భోగాది గారు అడుగులు వేస్తున్నారేమో! అనే సంశయం నాకు వ్యక్తమవుతోంది. తప్పేముంది మొన్న రాజశేఖరరెడ్డి గారిని, అటు పిమ్మట కిరణ్ కుమార్ రెడ్డి గారిని, నిన్న చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఒప్పించిన భోగాది గారు నేడు జగన్మోహన రెడ్డి గారిని కూడా అలరిస్తారేమో వేచి చూడాల్సిందే. బహుశా భోగాది గారి కలం నుండి జాలు వారుతున్న కథనాల అంతరార్దమదేనేమో. భోగాది గారి కథనాల లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.

– బోళ్ళ సతీష్ బాబు.
ఓ జూనియర్ జర్నలిస్ట్.