అక్కడ కాంగ్రెసు…. ఇక్కడ దేశం. మధ్యలో 23!

0
54
-భోగాది వెంకట రాయుడు

-(భోగాది వేంకట రాయుడు)

ఢిల్లీలో కాంగ్రెస్….తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం.
మొన్నటి ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలూ మంచి ఫ్రెండ్స్. తెలుగు దేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు -విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఎగిరెళ్లితే….వెళ్ళేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరికే. తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కు ఎదురేగి స్వాగతం చెప్పేది…కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే. తెలంగాణ లో 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…రెండు పార్టీల జాతీయ అధ్యక్షులూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ -ఒక ఊపు ఊపేశారు. ఎన్నికల ముందునాటి స్టోరీ ఇది.
కట్ చేస్తే….
ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అమరావతిలో తెలుగు దేశంకు ప్రతిపక్ష హోదా దక్కిందా….అంటే; ఏదో….దక్కిందిలే అనుకోవడమే.
అక్కడ ఢిల్లీలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో….ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పరిస్థితి అలా ఉంది. వారసత్వం గా వచ్చిన కాంగ్రెస్ పార్టీని సోనియా అమ్మ …చాలా శ్రమపడి….అవసాన దశకు తీసుకు వచ్చారంటూ కాంగ్రెస్ అభిమానులు ఒక కన్నీటి చుక్క ను రాలుస్తున్నారు. ఇక్కడ కూడా- వారసత్వం గా చేజిక్కించుకున్న తెలుగు దేశం పార్టీ ని చంద్రబాబు నాయుడు అవసాన దశకు చేర్చేశారంటూ తెలుగుదేశం అభిమానులు ఓ దీర్ఘ నిట్టూర్పు విరుస్తున్నారు.

తెలంగాణ ఆసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం ఉన్నదని కొందరు….; లేదని కొందరు మొన్న ట్యాంక్ బండ్ మీద వాదించుకుంటూ కనిపించారు. అదీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి.అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ; రాహుల్ గాంధీ చేతుల్లో కాంగ్రెస్ పగ్గాలు ఉంటుంటే; ఇక్కడ బాబూ-కొడుకుల చేతుల్లో తెలుగుదేశం పగ్గాలు నలిగిపోతున్నాయి. సోనియా, రాహుల్ పదవులకూ ఎన్నికలు జరగవు. ఇక్కడ చంద్రబాబు, లోకేష్ పదవులకూ ఎన్నికలు జరగవు. టీడీపీ అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు 1995 లో చేపట్టారు. అంటే-ఇప్పటికి పాతికేళ్ళు. ఇప్పటికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయనే. లోకేష్ నూ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎవరూ ఎన్నుకోలేదు. వాళ్లకు వాళ్లే- నువ్విది; నేను ఇది అని అనేసుకున్నారు- సోనియా, రాహుల్ అనేసుకున్నట్టుగా. ఆవిడకు 74 ఏళ్ళు. ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకు చేతుల్లో పార్టీని పెడదామా అంటే….రాహుల్ పై ఆవిడకే గాదు….; పార్టీ నేతలకూ నమ్మకం లేదు. ఏం జేయాలో ఆ నాయకులకు తెలియడం లేదు.

ఇక్కడ చంద్రబాబుకూ అటూ ఇటుగా డెబ్భై ఏళ్ళు. పోనీ కొడుకు చేతుల్లో పార్టీని పెడదామా అంటే…లోకేష్ అంత పనోడు కాదు అనే అభిప్రాయం అటు ప్రజాల్లోనూ; ఇటు పార్టీ శ్రేణుల్లోనూ బలంగా నాటుకు పోయింది. అక్కడ ఢిల్లీ లో అటు సోనియా, ఇటు రాహులూ కాకుండా…ఇందిరమ్మను తలపించే ప్రియాంక వస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు గట్టిగానే అనుకుంటున్నారు.ఇక్కడ కూడా అటు చంద్రబాబు; ఇటు లోకేశూ కాకుండా -ఎన్టీఆర్ కు అసలైన మనవరాలు బ్రాహ్మణిని తెరమీదకు తెస్తే…; అటు ఎన్టీఆర్ ఆత్మా సంతోషిస్తుందని….; పార్టీ కూడా బాగుంటుందని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయని అనుకుంటున్నారు. పైపెచ్చు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఉత్తరోత్రా లోకేష్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా కూడా బయటపడొచ్చని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మధ్యలో ఈ 23 ఏంటి?
తల్లీ…సోనియా! కాంగ్రెస్ పార్టీ ని సమర్థులైన వారి చేతులో పెట్టు అమ్మా అంటూ ఆవిడకు ఓ రహస్య ఉత్తరం రాసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల సంఖ్య 23. చంద్రబాబుకు ఏపీలో- మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్య కూడా ఇరవై మూడే! ఒకటి ఎక్కువా లేదు.ఒకటి తక్కువా లేదు.