అప్పుడూ…ఇప్పుడూ వారి దారి వారిదే…!

504

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి తరలించ రాదని రాజధాని గ్రామాలకు చెందిన రైతులు 250 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో-ఇప్పటి ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం గుర్తుకు వస్తున్నది. ఈ రెండింటికీ మధ్య కొన్ని పోలికలు కనపడుతున్నాయి.మరి కొన్ని తేడాలనూ గమనించవచ్చు.
తెలంగాణ ఉద్యమాన్ని సాగదీయగలిగినంత కాలం కేంద్రం సాగదీసింది. దీనివల్ల, విషయం మరింత జటిలమైంది. ఇప్పుడూ అమరావతి లో కూడా…రాజధాని తరలింపు విషయంలో ఒక స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు.
ప్రకటనలు…. మీడియా లీకుల రూపంలో -ప్రభుత్వ ఆలోచనలకు -అవసరం లేనంత భారీ ప్రచారం లభించింది. ఫలితంగా ఇదో జటిల సమస్యగా తయారై కూర్చుంది. ఆపరేషన్ థియేటర్ లో వాడాల్సిన నైఫ్ లను గాకుండా-కొబ్బరి బొండాలు కొట్టే కత్తులను ప్రభుత్వం వాడింది. (ఈ తరలింపు అనేది- వీలైనంత రచ్చ కావాలి అనేది ప్రభుత్వ భావన అయితే….సరే.అది కోరుకున్నట్టే-రచ్చ రచ్చ అయింది.)
తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపుతున్నదనే విషయం 100శాతం స్పష్టమైన తరువాత-ఆంధ్ర ప్రాంతం లో అప్పుడు నిరసనలు చెలరేగాయి. అలాగే;రాష్ట్ర రాజధాని కి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు విశాఖ కు తరలించడం ఖాయం అనే వాతావరణం ఏర్పడిన తరువాత…రైతు కుటుంబాలు నిరసన బాట పట్టాయి.
అప్పుడు ఆంధ్ర ప్రాంతం లో చెలరేగిన ఉద్యమాన్ని ‘పెయిడ్ ఆర్టిస్టుల’ఆందోళన కింద తెలంగాణ వాదులు తీసిపారేశారు. ఇప్పుడు అమరావతి ప్రాంతం లో జరుగుతున్న ఆందోళనను కూడా ‘పెయిడ్ ఆర్టిస్టుల’ఆందోళన గానే రాష్ట్ర మంత్రులు అభివర్ణిస్తున్నారు.
అప్పుడు-ఆంధ్రప్రాంతపు ఆందోళనల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించలేకపోయారు. ఇప్పుడు, తమ రాజధాని కార్యాలయాల తరలింపును నిలువరించడానికి న్యాయస్థానాలపై ఆధారపడుతున్నారు.
అప్పుడు రాష్ట్ర విభజనను నిలువరించాలని కోరుతూ అప్పటి ఎం.పీ ఉండవల్లి అరుణ కుమార్, అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ ప్రభృతులు సుప్రీమ్ కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్లు ఏమయ్యెయో ఇప్పటి వరకూ అజ.. పజ లేవు. అమరావతి లోని రాష్ట్ర హై కోర్టు లో దాఖలయిన-ఈ కార్యాలయాల తరలింపు వ్యతిరేక పిటిషన్ లు మాత్రం విచారణకు వచ్చాయి.
అయితే…ఈ రెండు ఘటనల్లోనూ ఒక అతిముఖ్యమైన పోలిక ఒకటి గుర్తుకు వస్తుంది.
పాడిందే పాట రా…పాచి పళ్ళ దాసురా అన్నట్టు గా-రాష్ట్ర విభజనకు నిరసనగా ఆంధ్రప్రాంతం లో ఆందోళనలు చేసిన వారు-రాష్ట్రాన్ని విభజించవద్దని హడావుడి చేయడమే తప్ప; రాష్ట్రాన్ని విభజిస్తే…., తమకు ఏమి కావాలో మాట మాత్రంగా కూడా కేంద్రాన్ని కోరలేదు. అందువల్లే…రాజధానితో సహా -కొత్త రాష్ట్రానికి ఏమీ లేకుండా పోయాయి.
‘అయ్యా! రాష్ట్రాన్ని ఇలా విభజించండి. మాకు ఇవి ఇవ్వండి…’అని ఆంధ్ర ప్రాంత ఆందోళన కారులు గానీ; వారి నేతలు గానీ కేంద్రాన్ని కోరి ఉన్నట్లయితే…; ఇవ్వాళ ఆంధ్రప్రాంతం నివాసయోగ్యం గా కూడా ఉండి ఉండేది.
అలాగే, రాజధాని కార్యాలయాల తరలింపుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కూడా…ఇప్పుడు నేల విడిచి సాము చేస్తున్నారనిపిస్తున్నది. ‘అయ్యా! మీరు తరలించాలని నిర్ణయిస్తే…మరి మా భూములు ఇచ్చిన వారిని ఏమి చేస్తారు? మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మాట ఏమిటి?’ అంటూ, తమకు ఏమి కావాలో- ప్రభుత్వం ముందు ఒక స్పష్టమైన కార్యాచరణ ఆలోచనను పెట్టి ఉండవలసింది.
అప్పుడూ ఓ జే ఏ సీ ఉంది…ఇప్పుడూ ఓ జే ఏ సీ ఉంది. ఆందోళనలకే ఈ రెండూ పరిమితమై పోయాయి తప్ప; ఆచరణీయమైన వాస్తవిక దృక్పధానికి కాదనే అనిపిస్తున్నది.
అప్పుడు-ఆందోళనల వెనుక రాజకీయపార్టీలు లేవు. ఇప్పుడు- అమరావతి ఆందోళనల వెనుక తెలుగు దేశం పార్టీ ఉన్నది. చంద్రబాబు సూపర్ బ్రెయిన్ ఉన్నది.ఆయన రాజకీయ వ్యూహం ఉంది.
అందుకే…అమరావతి సమస్య…..కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్న సామెత చందంగా తయారైంది.

-భోగాది వెంకట రాయుడు