కన్నాకు అలా..జీవీఎల్‌కు ఇలా!

113

సోము భలే భలే
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కన్నా లక్ష్మీనారాయణ.. ఓ నెల క్రితం వరకూ ఏపీ  బీజేపీ  అధ్యక్షుడు.  జీవీఎల్ నరసింహారావు… నాడు, నేడు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి. నాడు కమల దళపతి కన్నాపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆయన ఓ 20 కోట్లకు చంద్రబాబునాయుడుకు అమ్ముడుపోయారని, అందులో ఎంపీ సుజనాచౌదరి మధ్యవర్తిత్వం చేశారన్నది విజయసాయి చేసిన ఆరోపణ. అప్పుడు సోము వీర్రాజు బీజేపీ ఎమ్మెల్సీ. పైగా జాతీయ కార్యవర్గంలో ఉన్న నాయకుడు. పరాయి పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి, తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేసిన నిందలు ఖండిస్తూ, విజయసాయిరెడ్డికి లేఖ రాసిన దాఖలాలు లేవు. సీన్ కట్ చేస్తే.. తన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, జీవీఎల్ నరసింహారావుపై ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ఓ వ్యాసం రాశారు. ఆయనను దూరంగా ఉంచాలని ఆర్కే తన కాలమ్‌లో సలహా ఇచ్చారు. అంతే.. గతంలో తన పార్టీ అధ్యక్షుడు కన్నాపై వచ్చిన ఆరోపణపై, విజయసాయిరెడ్డికి లేఖ రాయని అదే సోము వీర్రాజు.. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఆంధ్రజ్యోతిలో జీవీఎల్‌కు వ్యతిరేకంగా వచ్చిన వ్యాసంపై స్పందించి, నేరుగా ఆ పత్రికకే ఓ బహిరంగలేఖ రాశారు. మరి ఈ ఊపు-ఉత్సాహం, నాడు కన్నాపై ఆరోపణ చేసిన విజయసాయిపై ఏమయింది? వైసీపీ రెడ్డిగారిని నాడు వదిలేసి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి చౌదరిగారిపై ఎందుకు లేఖ రాసినట్లు? ఇందులో ప్రస్తుతం పార్టీకి- అధ్యక్షుడికి,  రెడ్డి-కమ్మలో  వర్గ శత్రువులు ఎవరు? ఇదీ.. సగటు కమలనాధుడికి ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాని ప్రశ్న.

జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై శరపరంపరగా దాడి చేస్తూ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా విస్తుపోయే విమర్శలు  చేసిన.. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు, వైకాపేయులను ఇబ్బందులకు గురిచేసింది.  జగన్ తీసుకున్న వివిధ నిర్ణయాలపై, ఆయన దాదాపు 50 లేఖ రాశారు. అందులో ఒక్కదానికీ సర్కారు నుంచి సమాధానం లేదు. దీనితో వైసీపీ వ్యూహబృందం.. కన్నా-చంద్రబాబు ఒకటేనని, బాబు అజెండానే కన్నా అమలుచేస్తున్నారన్న బురదచల్లే ప్రచారానికి తెరలేపింది. నిజానికి, వైఎస్ సీఎంగా, అంతకుముందు విపక్షనేతగా ఉన్నప్పుడు..అసెంబ్లీలో-బయటా కాంగ్రెస్ తురుపుముక్కగా కన్నానే ప్రయోగించారు.

వైఎస్ ఒక్కరే కాదు. కోట్ల-నేదురుమల్లి హయాంలో కూడా,  ‘దేశైం’పె దాడికి  ఇంటా బయటా- కన్నానే నాయకత్వం వహించేవారన్నది నిష్ఠున నిజం. ఒక దశ లో బాబు తనపై హత్యాయత్నం చేశారంటూ, కన్నా చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. సీఎల్పీ నేతలు ఆ విషయాన్ని, నాటి సీఎం ఎన్టీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఇప్పటితరం, నేతలకు చాలామందికి తెలియదు. చంద్రబాబును ఆ స్థాయిలో శత్రువుగా భావించే కన్నాకు-అదే చంద్రబాబుతో లాలూచీ అంంటకట్టడాన్ని, ఇప్పుడు వైసీపీలో పదవులు అనుభవిస్తున్న, నాటి కాంగ్రెస్ నేతలు కూడా విశ్వసించలేదు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినప్పటికీ.. కన్నా తన బాబు వ్యతిరేక వైఖరి విడనాడలేదు. టీడీపీ సర్కారులో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, బాబు సర్కారు విధానాలపై కన్నా విరుచుకుడేవారు. అప్పట్లో కన్నా-పురంధీశ్వరి-కావూరి-సోము టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తడం చర్చనీయాంశమయింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడయిన కన్నా, టీడీపీ-వైసీపీపైనా విరుచుకుపడ్డారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉండి, అనేక మంది సీఎంల వద్ద వ్యూహకర్తగా పనిచేసిన కన్నా.. పతనమయిన టీడీపీ కంటే, అధికారంలో ఉన్న వైసీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. సహజ రాజకీయ వ్యూహం  ప్రకారం.. ఏ ప్రతిపక్షమయినా, అధికార పార్టీపైనే దాడి చేస్తుంది. ఇది సహజ రాజకీయ సూత్రం. కన్నా కూడా అద పనిచేశారు. ఫలితంగా.. వైసీపీ సర్కారుకు ఆయన శత్రువుగా మారారు. దానితో బాబు నుంచి కన్నా, 20 కోట్లు లంచంగా తీసుకున్నారని, సుజనా చౌదరి అందులో రాయబారి పాత్ర పోషించారని, వైసీపీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించింది.

అయితే.. ఎమ్మెల్సీతోపాటు, బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్న సోము వీర్రాజుకు, ఇప్పటి మాదిరిగానే విజయసాయిరెడ్డికి లేఖ రాయాలన్న ఆలోచన, అప్పుడు రాకపోవడమే ఆశ్చర్యం. కొద్దిరోజుల క్రితం..  ఆంధ్రజ్యోతిలో జీవీఎల్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్ వచ్చింది. సహజంగా అయితే.. దానిపై స్పందించాల్సింది, ఆ పత్రికలో విమర్శలు ఎదుర్కొన్న జీవీఎల్ మాత్రమే. ఎందుకంటే ఆయన బాధితుడు కాబట్టి! కానీ.. విచిత్రంగా.. జీవీఎల్ బదులు, సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బహిరంగ లేఖ రాయడమే, పార్టీ శ్రేణులను విస్తుపోయేలా చేసింది. ఇలాంటివి సహజంగా పార్టీ అధికార ప్రతినిధులే చేస్తుంటారు. అసలు జీవీఎల్లే అధికార ప్రతినిధి కాబట్టి, ఆయనకు మరో అధికార ప్రతినిధి అవసరం లేదు. ఆయన కూడా తన అధికార.. అనధికార ప్రతినిధిని, ‘అధికారికంగా’ ఏనాడూ ప్రకటించలేదు.మరి ఈ విషయంలో సోము వీర్రాజు ఎందుకు స్పందించారన్నది పార్టీలో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. పోనీ.. జీవీఎల్ ఏమైనా నిన్నా మొన్నా వచ్చిన నాయకుడు కాదు. జాతీయ మీడియాలో విపక్షాలపై ఎదురుదాడి చేసే గండరగండడే.

మరి.. రోజూ మీడియాతో సహవాసం చేసే జీవీఎల్, తనపై వచ్చిన వ్యాసాన్ని తాను ఖండించకుండా, ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారంటే.. ఏపీలో ఎవరి ఆదేశాలతో ఎవరు పనిచేస్తున్నారు? మాజీ అధ్యక్షుడిపై వైసీపీ ఎంపీ తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు, ఇదే స్థాయిలో స్పందించి, లేఖ రాసిన సోము వీర్రాజు.. మరి అప్పుడు విజయసాయిపై విరుచుకుపడుతూ, ఎందుకు లేఖ రాయలేదన్న సందేహం, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరికైనా వస్తుంది కదా? అంటే ఆయన దృష్టిలో.. రాధాకృష్ణ చౌదరి గారికి, విజయసాయి ‘రెడ్డి’గారికి లెక్కలు వేర్వేరుగా ఉంటాయన్న సందేహం ఎవరికయినా వస్తుంది కదా? అదిగో.. అలాంటి సందేహమే ఇప్పుడు కమలనాధుల్లో వచ్చింది.

ఇక వినాయకచవితి పండుగను నిషేధాలు-నిర్బంధాల మధ్య చేసుకోవడంపై.. పక్క రాష్ట్రానికి   చెందిన,  తెలంగాణ కమల దళపతి బండి సంజయ్.. కేసీఆర్ సర్కారును ఇప్పటికీ దునుమాడుతున్నారు.  హిందువులెవరూ భయపడకుండా, మండపాలు ఏర్పాటుచేసుకోవాలని ధైర్యం ఇచ్చారు. హిందువుల మనోభావాలతో కేసీఆర్ సర్కారు చెలగాటమాడుతోందని విరుచుకుపడతున్నారు. నిషేధాజ్ఞలపై బీజేపీ కోర్టుకూ వెళ్లింది. కానీ.. అదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హోంమంత్రికి రాసిన లేఖ సగటు హిందువులో బీజేపీపై ఆగ్రహానికి కారణమయింది. వినాయక చవితి ఎలా చేసుకోవాలో ఓ పది సూత్రాలను వివరిస్తూ సోము లేఖ రాశారు. అందులో ఒకరోజులోనే విగ్రహాలు తొలగించాలని పేర్కొన్నారు.

ఇది సగటు హిందువుకు ఆగ్రహం కలిగించింది. ఓ వైపు తెలంగాణలో బండి సంజయ్, వినాయకచవితి ఉత్సవాలకు విఘాతం కలిగిస్తున్న సర్కారుపై విరుచుకుపడుతూ, నవరాత్రోత్సవాలు ఘనంగా జరిపేలా చూడాలంటూ పోరాడుతుంటే.. మరోవైపు తమ రాష్ట్రంలో పండుగను ఒకరోజుకు పరిమితం చేసుకోవాలని, సోము హిందువులకు లేఖ రాయడమేమిటన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై సోషల్‌మీడియాలో ప్రశ్నాస్త్రాలు వెల్లువెత్తాయి. ‘క్రైస్తవుల మాదిరిగా పదిసూత్రాలు హిందువులకు ఇవ్వడానికి ఆయనెవరు? పండుగ ఎలా చేసుకోవాలో చెప్పే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? దశాబ్దాల నుంచి పండుగ చేసుకుంటున్న మాకు, ఆయనిచ్చే సలహా ఏమిటి? తొమ్మిదిరోజులు పండుగ చేసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకుండా, ఒక్కరోజుతో పూర్తి చేయాలని లేఖ రాయడానికి ఆయనేమైనా పీఠాథిపతా? మఠాథిపతా? వారు కూడా ఆరకంగా చెప్పరు. కావాలంటే ఆయన తన పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చుకోమనండి. కానీ హిందువులు పండుగ ఎలా చేసుకోవాలో చెప్పడానికి ఆయనెవరు’ అంటూ సోషల్ మీడియాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సంఘర్షణ చెందే సిద్ధాంతాలు ఎదురయినప్పుడు, ఇలాంటి సందిగ్థ పరిస్థితి తప్పదు!