అగ్గిమీద గుగ్గిలమైన రాహుల్ గాంధీ

293

సీడబ్ల్యూసీ భేటీలో అగ్గిమీద గుగ్గిలమైన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ఏ సమావేశంలోనైనా మిస్టర్ కూల్ గా ఉండే రాహుల్ గాంధీ… నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో మాత్రం అగ్గిమీద గుగ్గిలమైనట్లు సమాచారం. 23 మంది సీనియర్లు కూడబలుక్కుని ఏకంగా సోనియాకు లేఖ రాయడంపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ నేతలను నిలదీశారు. అంతేకాకుండా ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, ఆ సమయంలోనే లేఖ పంపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో లేఖలు రాయడం భావ్యమా? అని నిలదీశారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను కూడా బాహాటంగానే చర్చిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విషయాలు ప్రత్యర్థులకు కూడా తెలిసిపోతున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో ఒక్క సారిగా వాతావరణం గంభీరంగా మారిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ లేఖపై మాజీ ప్రధాని మన్మోహన్ కూడా స్పందించారు. ‘‘లేఖ రాయడం చాలా దురదృష్టకరం. ఆ లేఖ హైకమాండ్‌ను, పార్టీని కూడా బలహీనపరుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేత ఆంటోనీ కూడా లేఖపై సీరియస్ అయ్యారు.