దేవినేని ఉమ పేరుతో జేబు దోపిడీ

701

ఆయన బంధువంటూ ఉద్యోగుల వద్ద వసూళ్లు
లోకేష్, కెఇ కొడుకు పేరుమీద కూడా దందాలు
పత్తా లేని టీడీపీ యువనేత వంశీకృష్ణ

అధికారంలో ఉండగా, కృష్ణా జిల్లాను శాసించిన టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బంధువు పేరుతో టీడీపీకి చెందిన యువ నేత ఒకరు.. ఉద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి, పత్తా లేకుండా పారిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుల గోడు ప్రకారం.. వరలక్ష్మిపురం, తులసినగర్, విజయవాడ రూరల్‌కు చెందిన.. ఎన్.వంశీకృష్ణ అనే టీడీపీ యువనేత, అప్పట్లో మంత్రిగా ఉన్న దేవినేని ఉమ మేనల్లుడినంటూ, ఏసీబీ కేసుల్లో సస్పెండ్ అయిన ఉద్యోగులను చాకచక్యంగా పట్టేవారు. ఉమ కార్యక్రమాల్లో చురుకుగా కనిపించేవాడు. సీఎంతో శాఖాపరమైన విచారణ చేయమని రాయిస్తే, ఆ విచారణ పూర్తయ్యే వరకూ మీరు ఉద్యోగం చేసుకోవచ్చని.. సస్పెండయిన ఉద్యోగులకు, సదరు వంశీకృష్ణ ఆశ చూపేవాడు. అందుకు లక్షల రూపాయలు అవుతాయని వారి వద్ద వసూలు చేసేవారు. అయితే, డబ్బులిచ్చిన ఉద్యోగులకు నెలలు దాటుతున్నా.. మళ్లీ ఉద్యోగాలు రాకపోవడం, ఆలోగా వారు కోర్టుకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకోవడం కూడా జరిగేది.

తమ సస్పెన్షన్‌ను ఎత్తివేసే వ్యవహారంలో.. మీరు చేసిందేమీ లేదు కాబట్టి, మా డబ్బులు మాకు ఇచ్చేయమని ఉద్యోగులు, నాటి నుంచి నేటి వరకూ సదరు వంశీకృష్ణ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ, అతను తాను హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నానని, తనకున్న భూములు అమ్మి మీ డబ్బు మీకు ఇచ్చేస్తానని, ఏళ్ల నుంచి నమ్మబలుకుతూనే ఉన్నాడని అతని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వంశీ తండ్రికి చెప్పినా, ఏం చేస్తాం. మా ఖర్మ అని.. వంశీ తమ వద్ద ఉండటం లేదని చెబుతున్నారని బాధితులు వెల్లడించారు.

సదరు వంశీకృష్ణ మామూలు తెలివితేటలున్నవాడు కాదు. ఏకంగా సీఎస్ పేరుతోనే బ్యాంక్‌లో డిడి తీసి, వాటిని ఉద్యోగులకు చూపేవాడట. ఉద్యోగం మళ్లీ కావాలంటే అప్లికేషన్‌తోపాటు, చలానా కూడా కట్టాల్సి ఉంటుందని చెప్పి, వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఆరకంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏసీబీకి చిక్కిన ఉద్యోగులే లక్ష్యంగా, లక్షల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. గుంటూరులో ఏసీబీకి, అతి తక్కువ మొత్తంతో చిక్కిన ఓ ఉద్యోగి వద్ద, తొలుత 4 లక్షలు తీసుకున్న వంశీ… దానిని 20 లక్షల వరకూ తీసుకువెళ్లాడట. నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఓ అధికారికి ఐ ఫోన్ ఇవ్వాలని, లక్షరూపాయలు అదనంగా వసూలు చేసిన ఈ ఘనుడు.. చివరకు నాటి మంత్రి లోకేష్, కెఇ కృష్ణమూర్తి చిన్న కుమారుడు పేరును కూడా, అడ్డగోలుగా వాడుకున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వానికి చలానా కట్టాలంటూ.. లక్ష రూపాయలు, సీఎస్ పేరిట విజయవాడ యాక్సిస్ బ్యాంకులో డిడి కట్టడం విశేషం. ఇది కాకుండా లక్షా 25 వేలు, 2లక్షలు, 74 వేల రూపాయలు యాక్సిస్ బ్యాంకు ద్వారా, ఓ బాధితుడు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇవికాకుండా 7 లక్షల రూపాయలు నేరుగా తీసుకున్నాడట. ఈ విషయాన్ని బాధితుడు నాటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదట. విచిత్రమేమిటంటే.. టీడీపీలో చురుకుగా పనిచేసే వారి కుటుంబాలను కూడా వంశీకృష్ణ వదిలిపెట్టలేదట.

ఇక శ్రీశైలంలోని ఒక ఆలయంలో పనిచేసే ఓ అధికారి… ఏసీబీకి చిక్కిన తర్వాత, ఆయన వద్ద 20 లక్షలు తీసుకుని, సీఎంఓ నుంచి శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇప్పిస్తానని ఆశ చూపించాడట. తర్వాత సదరు ఉద్యోగి, పైస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తే.. కొంత డబ్బు, మిగిలిన దానికి హామీగా చెక్కులు-ప్రామిసరీనోటు ఇచ్చి, వాటిపై వంశీ తలిదండ్రులు కూడా సంతకం చేశారని చెబుతున్నారు. ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదట. ఇంకా విచిత్రమేమిటంటే.. వంశీ వలలో ఓ ఏఎస్‌ఐ కూడా అమాయకంగా ఇరుక్కోవడం. ఆయన కూడా 5 లక్షల రూపాయలు సమర్పించుకున్నారట.

ప్రస్తుతం సదరు వంశీకృష్ణ, విజయవాడలోనే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో భూములు అమ్మి, డబ్బులిస్తానని బాధితులకు చెబుతున్నాడట. కాగా ఈ విషయాన్ని ‘సూర్య’ ప్రతినిధి, మాజీ మంత్రి దేవినేని ఉమ దృష్టికి తీసుకువెళ్లగా.. వంశీ ఎవరో తనకు తెలియదని, ఆ పేరుతో తనకు బంధువులెవరూ లేరని, అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈవిధంగా లోకేష్-దేవినేని ఉమ-కెఇ కుమారుడు-నాటి సీఎంఓలో చక్రం తిప్పి, ప్రస్తుతం ఓ కీలక శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఎస్‌ఎస్ అధికారి పేర్లను అడ్డగోలుగా వాడి, ఆ డబ్బుతో జల్సా చేస్తున్న సదరు వంశీపై..  గతంలో చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయని చెబుతున్నారు.

స్పీకర్ చాంబర్ సాక్షిగా జరిగిన మరో దోపిడీ… త్వరలో!

కాగా టీడీపీ అధికారంలో ఉండగా.. స్పీకర్ చాంబర్ సాక్షిగా జరిగిన 12 కోట్ల అవినీతి బాగోతం ఒకటి వెలుగుచూసింది. బాధితుడు కూడా తెలుగుదేశం నాయకుడు కావడమే ఇక్కడ విషాదం. అధికారపార్టీ పగ్గాలతోపాటు-మంత్రి పదవిని, జమిలిగా నిర్వహించిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ అగ్రనేత సమక్షంలో జరిగిన కుంభకోణమిది. విద్యుత్ శాఖలోని ఓ విభాగానికి ఎండి పదవి.. సీఆర్డీయే కమిషనర్.. నెడ్‌క్యాప్ ఎండితోపాటు, ఓ నామినేటెడ్ పోస్టుకు నాటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి-ఆయన తనయుడు తీసుకున్న డబ్బు.. అక్షరాలా 12 కోట్ల రూపాయలట. అందులో ఇద్దరు ప్రముఖులకు వాటాలివ్వాలని, సదరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి తీసుకున్న లంచం ఖరీదు అదట! సీఆర్డీఏ కమిషనర్ పదవి కోసం.. సదరు ప్రముఖుడి కుమారుడు, విశాఖలోని ఓ హోటల్‌లో సాగించిన మంతనాలు.. ‘పోస్టు రెడీగా ఉంది. డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారంటూ’ తండ్రీకొడుకులు శరపరంపరగా చేసిన ఫోన్ల  వివరాలు… అసెంబ్లీ చాంబర్‌లో ఆ పెద్దాయన-నాటి ఉత్తరాంధ్ర మంత్రి భేటీ ముచ్చట్లు…. త్వరలో.. ‘సూర్య’లో చదవండి.