బాసటగా నిలిచిన బీజేపీ
తెలంగాణ బీజేపీ తెగువ ఆంధ్రా బీజేపీకి ఏదీ?
జగన్ సర్కారు నిర్ణయంపై హిందూ మహాసభ జంగ్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

గణపతి మండపాలు- నవరాత్రోత్సవాలపై తెలంగాణ సర్కారు విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా తెలంగాణలో కాషాయదళం గర్జించింది. విశ్వహిందూ పరిషత్-భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ సేన నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, వీటిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను స్ధానిక బీజేపీ నేతలు ప్రతిఘటించారు.

కరోనా సాకుతో గణపతి ఉత్సవాలకు.. కేసీఆర్ సర్కారు ప్రతిబంధకాలు సృష్టిస్తోందని, కేసీఆర్ ఈ విషయంలో నయా నిజాం మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. హిందువు పండుగలలో జోక్యం చేసుకుంటున్న కేసీఆర్, ముస్లింల పండుగలకు మాత్రం రెడ్‌కార్పెట్‌వేస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీ ఆదేశాలను పాటిస్తూ.. పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అబలుచేయని కేసీఆర్ సర్కారు, మిగిలిన ప్రాంతాలపై తన ప్రతాపం చూపిస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు సైతం.. కోవిడ్‌పై జోక్యం చేసుకున్నట్లే, గణపతి ఉత్సవాలపై ప్రభుత్వ తీరుపైనా గవర్నరు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా … గణపతి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలను ఖండిస్తూ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలు విజయవంతమయ్యాయి.  బీజేపీ సహా.. వీహెచ్‌పీ, బజరంగదళ్, ఏబీవీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపతి ఉత్సవాలకు కేసీఆర్ ప్రతిబంధకాలు సృష్టిస్తోందంటూ, గత కొద్దిరోజుల నుంచి గళమెత్తుతున్న భాజపా వాణి ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణతో, కాషాయసేన నిరసన వీధివీధికీ చేరినట్టయింది.

అయితే.. ఇదే  అంశంలో ఏపీ బీజేపీలో మాత్రం చలనం కనిపించకపోగా, ఆ పార్టీ పాత్రను కొత్తగా రంగప్రవేశం చేసిన,  అఖిల భారత హిందూ మహాసభ పోషిస్తుండటం చర్చనీయాంశమయింది. పక్కనే ఉన్న తెలంగాణ బీజేపీ.. గణపతి అంశంపైనే సర్కారుతో యుద్ధం చేస్తుండగా, ఆ అంశంపై ఏపీ బీజేపీ మాత్రం.. అసలు తనకు సంబంధం లేనట్లు మౌనరాగం ఆలపించడంపై, ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జగన్ సర్కారు వైఖరిని నిరసిస్తూ, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్న కనీస ఆలోచన కూడా, బీజేపీ నాయకత్వానికి లేకపోవడం మరో ఆశ్చర్యం. మొహర్రం పండుగకు అన్ని మినహాయింపులిచ్చిన జగన్ సర్కారు, గణపతి ఉత్సవాలపై మాత్రం ఆంక్షలు విధించడంపై,  బీజేపీ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రధానంగా.. ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని.. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ శివమెత్తుతుంటే, ఏపీ దళపతి సోము మాత్రం పెదవి విప్పకపోవడం, కనీసం టీవీ చానెళ్ల చర్చావేదికల్లో కూడా ఆ పార్టీ నేతలు కనిపించకపోవడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

గణపతి ఉత్సవాలపై ఏపీ సర్కారు ఆంక్షల నేపథ్యంలో.. బీజేపీ మౌనంగా ఉన్నప్పటికీ, అఖిల భారతహిందూ మహాసభ మాత్రం గర్జించడం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. దేశంలో  హిందూ ధర్మానికి ఎక్కడ హాని జరిగినా, ముందుండి పోరాడే హిందూ మహాసభ.. ఈ అంశంలో స్పందించి, గవర్నర్‌కు లేఖ రాయడం బట్టి.. ఇకపై ఏపీలోనూ దాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న సంకేతం కనిపిస్తోంది. గవర్నర్ కు హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి రాసిన లేఖ పరిశీలిస్తే, ఈ అనుమానం నిజమనిపిస్తోంది. గణపతి ఉత్సవాలపై జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని, ఇది రాజ్యాంగం-సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి తన లేఖలో గుర్తు చేశారు.Letterhead-Hindu Mahasabha to Hon’ble Governor

 కాగా ఉత్సవాలు ఎలా చేసుకోవాలో, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సర్కారుకు లేఖకు ముందే… రాష్ట్రంలో గణపతి ఉత్సవాలకు, హిందు ధర్మానికి ఆటంకం కలిగించవద్దని హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూ సంస్కృతి-సంప్రదాయాలలో ప్రభుత్వ జోక్యంపై వెలగపూడి మండిపడ్డారు. మిగిలిన మతాల్లో జోక్యం చేసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. మద్యం షాపుల వద్ద లేని ఆంక్షలు, వినాయకచవితికి ఎందుకని ప్రశ్నించారు. ఈవిధంగా.. రాష్ట్రంలో కొత్తగా రంగప్రవేశం చేసిన హిందూమహసభ వంటి సంస్థనే.. గణపతి ఉత్సవాల అంశంలో సర్కారు విధానాలపై, ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే.. హిందుత్వపై పేటెంట్ హక్కులతోపాటు, ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ మాత్రం.. మౌనవ్రతం పాటించడమే హిందూ సమాజానికి రుచించడం లేదు.

By RJ

Leave a Reply

Close Bitnami banner