ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలవరకు-13 జిల్లాలలోను పెద్ద సంఖ్యలో విస్తరించివున్న కాపులకు నిజంగా శుభవార్త ఇది.
గత అయిదారేళ్లుగా తమ బతుకులు తాము సగౌరవంగా…దర్జాగా బతకడం మానేసి; ఖాళీ పళ్ళాలు మోగించుకుంటూ -వాళ్ళనూ వీళ్ళనూ దేబిరించుకుంటూ బతుకుతున్న బతుకు నుంచి కాపులను విముక్తి చేయగలిగిన శుభ వార్త ఇది.
రాష్ట్రం లో జనసంఖ్య పరంగా అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులంగా(Single largest caste) ఉన్న కాపులను…గత ఆరేడేళ్ళుగా-చంద్రబాబు నాయుడు అల్లరి చేసినంతగా మరే నాయకుడూ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఆట పట్టించినంతగా మరే నాయకుడూ కాపులను ఆట పట్టించలేదు.
2014 ఎన్నికల్లో గెలవలేకపోతే…ఇక తనకు రాజకీయంగా బతుకు లేదనే విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు; 2012 అక్టోబర్ లో మొదలు పెట్టిన పాదయాత్ర లో కాపులను అల్లరి చేయడం మొదలు పెట్టారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాను….ఏడాదికి 500 కోట్లు కేటాయిస్తాను….కాపుల్లో చాలా పేదవారు ఉన్నారు… వాళ్ళకు పెద్ద కొడుకులా ఉంటాను అంటూ ఆ పాద యాత్రలో గోబెల్స్ ను మించిన ప్రచారం చేసుకుంటూ ఊరూరా తిరగడం తో…; కాపులు – నిజమే కాబోసు అనుకుంటే నిజమే కాబోసు అనుకున్నారు. ‘ఏంటీ వింత!? చంద్రబాబు కూడా మాట మీద నిలబడేట్టున్నారూ…!’అంటూ తీవ్ర ఆశ్చర్యానికి కూడా లోనై పోయారు.
సైకిల్ గుర్తుపై గుద్దో…అంటే…గుద్దో అనుకుంటూ గుద్దేశారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచేశారు. ఏరు దాటేశారు.
అప్పటి దాకా…ఎవరి పని వారు చేసుకుంటున్న కాపులు; ఎవరి బతుకు వారు బతుకుతున్న కాపులు; సమాజంలో అందరితోనూ గౌరవంగా…. సఖ్యతగా జీవిస్తున్న కాపులు-ఆ బతుకులు వదిలేశారు. మా బొచ్చెల్లో ఏమేస్తావ్….ఎంతిస్తావ్ …అంటూ ఖాళీ పళ్ళాలు మోగించుకుంటూ తిరగడం మొదలు పెట్టారు.
ఆయన ఇవ్వకపోతే….ఆయనను బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళను రంగం లోకి దింపారు. నిద్రలేవడం మొదలు….’ఏమిస్తావ్….?…ఎంతిస్తావ్…?’అంటూ అడుక్కోడానికి బయలుదేరడం తప్ప…కాపులకు ఇక రెండో పని ఏమీ లేదా అంటూ మిగిలిన కులాలవారు ఈసడించుకునేంత రేంజ్ లో కాపులను అల్లరి పెట్టిన ఖ్యాతి చంద్రబాబు నాయుడు కే దక్కుతుంది.
ఎప్పుడూ కులాల ప్రస్తావనే లేకుండా శుభ్రంగా బతికినవారు కూడా…..;’ చంద్రబాబు దెబ్బకు-‘కాపు-నాన్ కాపు’ అనుకుంటూ బతకాల్సి వచ్చింది.
‘కాపులకు రిజర్వేషన్’అనే పులి మీద ఐదేళ్లు స్వారీ చేసిన చంద్రబాబు నాయుడుని ఆ పులి తృప్తిగా తినేసింది. బొమికల్ని కూడా వదల్లేదు. అధికారం అనే అయిదో తనాన్ని ఆయనకు దూరం చేసింది.
ఇప్పటికి గానీ…చంద్రబాబు నాయుడుకి తెలిసి రాలేదు….; కాపులకు రిజర్వేషన్లు అంటూ ఎంత ప్రమాదకరమైన ఆట ఆడారో!
అందుకే….’కాపు..!’, ‘రిజర్వేషన్లు…’ అనే మాటలను సైతం ఉచ్ఛరించకూడదని ఆయన నిర్ణయించుకున్నారని; పార్టీ కూడా ఈ రెండు మాటలకు దూరంగా ఉండాలనే సంకేతాలు పంపారని తెలియవచ్చింది. ఇది -ఆయన తాజా U టర్న్.
ఖాళీ పళ్ళాలు మోగించే దేబిరింపు ఆలోచనలకు కాపులు ఇకనైనా స్వస్తి చెప్పాలి. రిజర్వేషన్ ల సౌకర్యం కాపులకు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ …కంకణం కట్టుకుని; ఆ అంశం మీదే రాజకీయ కదనరంగంలోకి దూకే కాపు ప్రముఖుడు ఆ కులానికి దొరికే వరకు; ఈ హామీని ఇతరులు ఎవరు ఇచ్చినా…మోసం…మోసం అనుకునే జ్ఞానోదయం కాపులకు కలగాలి.
గందుబిల్లి ప్రవచనాలను… కలుగుల్లోని ఎలుకలు ఆలకిస్తే ఎలా?!

-భోగాది వెంకట రాయుడు

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner