రాహుల్‌ గాంధీని కడిగేసిన ఆజాద్, సిబల్

100

న్యూఢిల్లీ : సీడబ్ల్యూసీ సమావేశం చాలా హాట్ హాట్‌గా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక చుట్టే తిరుగుతుందని అందరూ భావించినా సీనియర్ల లేఖ చుట్టూ తిరుగుతోంది. ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భేటీలో కలకలం రేగింది. అసమ్మతి నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్ రాహుల్‌కు ఘాటు సమాధానాలిచ్చారు.
‘‘మీరు ఆరోపించినట్లు ఒకవేళ నేను బీజేపీ ఏజెంట్‌నే అయితే ఇప్పుడే వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతాను’’ అని ఆజాద్ రాహుల్ గాంధీకి ఘాటుగా బదులిచ్చారు. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలే కారణమని ఆజాద్ రాహుల్‌తో స్పష్టం చేశారు. మరోవైపు మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ వేదికగా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను నిలబెట్టింది ఎవరు?మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను కాపాడిందెవరు? గత 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అలాంటిది… మమ్మల్నేబీజేపీతో కుమ్మక్కయ్యారంటారా?’’ అంటూ సిబల్ ట్విట్టర్ వేదికగా కడిగిపారేశారు.
రాహుల్‌ గాంధీని కడిగేసిన ఆజాద్, సిబల్
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ నేతలను నిలదీశారు. అంతేకాకుండా ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, ఆ సమయంలోనే లేఖ పంపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో లేఖలు రాయడం భావ్యమా? అని నిలదీశారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను కూడా బాహాటంగానే చర్చిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విషయాలు ప్రత్యర్థులకు కూడా తెలిసిపోతున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు.