హైందవ సైన్యంలో దళితులేరీ?

765

బడుగువర్గాలకు భాగస్వామ్యమేదీ?
దళితవాడతలకు స్వాములు దూరం
స్వాములకు ఏసీకార్లు, సెక్యూరిటీ అవసరమా?
ముడుపులిస్తేనే ముక్తి ప్రసాదిస్తారా?
సర్వసంగ పరిత్యాగులకు ఈ సుఖాలెందుకు స్వామీ?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

దేశంలో హైందవ ధర్మ ప్రచారం.. రాను రాను క్షీణించిపోతోందన్న ఆవేదన-ఆందోళన సగటు హిందువుల్లో తరచూ వినిపిస్తుంటుంది. అనేక వేదికలు, సమూహాల సమావేశాల్లో అది వ్యక్తమవుతుంటుంది. అయితే.. ఈ ఆవేదన పీఠాధిపతులు-స్వాముల స్వరాల నుంచి కూడా వినిపించడమే విడ్డూరం. దేశంలో హిందూ ధర్మ ప్రచారం-పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాలు, ప్రచారంలో దళిత-బడుగువర్గాలకు భాగస్వామ్యం కల్పించని ఫలితంగానే.. మతమార్పిడులు ఊహించని స్థాయిలో జరుగుతున్నాయన్న వాదనలో, అణువంతయినా అబద్ధం లేదు. పీఠాలలో ఏసీల కింద పీఠం వేసుకునే స్వాములకు.. కాసుల సంపాదన-రాజకీయాలు- బడా వర్గాలను మచ్చికచేసుకోవాలన్న తపనలో.. హిందూ మత ప్రచారంపై, ఇసుమంత కూడా లేదన్న విమర్శ,  అక్షర సత్యం.

క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారని, అందుకు వారికి మిషనరీలు, విదేశీ సంస్థల నుంచి భారీ స్థాయిలో నిధులు వస్తున్నాయన్నది, సగటు స్వామీజీ చెప్పే ఓ అరిగిపోయిన రికార్డు. మరి పీఠాథిపతులు-స్వామీజీలు ఏమైనా తక్కువ సంపాదిస్తున్నారా? క్రైస్తవులకు విదేశాల నుంచి నిధులు వస్తుంటే, స్వాములకు స్వదేశంలోనే నిధులు ప్రవహించడంలేదా? ఇంకా క్రైస్తవ మిషనరీలు, తమ నిధులకు వారి మత ప్రచారంతోపాటు,  త్రికరణశుద్ధితో సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నాయి. మరి స్వాములు-పీఠాథిపతులు, ఆ పని ఎందుకు చేయడం లేదంటూ.. దశాబ్దాల నుంచి వినిపిస్తున్న ప్రశ్నకు, ఇప్పటికీ జవాబు లేదు. సమాధానం ఇచ్చే ఒక్క స్వామి కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించడు.

దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. పాదయాత్ర చేసిన ఆదిశంకరాచార్యుడు కన్నతల్లికే దూరంగా ఉండి, ధర్మ ప్రచారం కోసం ఆజన్మాంతం పరితపించారు. దానికోసం దేశం నలువైపులా నాలుగు పీఠాలు స్థాపించారు. అవే నిజమైన పీఠాలు. మిగిలినవి కొన్ని, ఆయన తర్వాత వచ్చిన పరంపరలో భాగమే. ఆ తర్వాత.. అంటే, ఓ ఇరవై ఏళ్ల నాటి నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పీఠాలన్నీ ఎవరికి వారు స్థాపించుకున్నవే. వీరంతా స్వయంభువులు, స్వయంప్రకటిత పీఠాథిపతులూ, స్వాములే!  ఆంధ్ర దేశంలో అయితే ఇద్దరు స్వాములు పూర్వాశ్రమంలో, బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునో, వంటమనిషి దశ నుంచి సొంత పీఠాలు స్థాపించుకుని, రాజకీయ నేతలు-బడా భక్తులను పట్టేశారన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

శంకరాచార్య ఇప్పటి స్వాముల మాదిరిగా ఏసీ కార్లు-వాటికి ముందు వెనుక ఎస్కాట్లు, పైలెట్ వాహనాలలో దేశంలో పర్యటించలేదు. అసలు సర్వసంగ పరిత్యాగి అయిన పీఠాథిపతి..  సముద్రం దాటకూడదన్నది ధర్మసూత్రం.  కానీ ఇప్పటి స్వాములు-పీఠాథిపతుల్లో ఒకరిద్దరు మినహా, మిగిలిన వారంతా విమనాల్లో, విదేశాలు చుట్టి వచ్చిన వారేనన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఈమధ్య నిత్యానంద స్వామి అనే కలియుగ విశ్వామిత్రుడు..  అక్కడెక్కడో ఓ ద్వీపం సృష్టించి, దానికో పేరు పెట్టి తన మొహంతోనే, కరెన్సీని కూడా సృష్టించారట. కానీ, ఆదిశంకరాచార్య మాత్రం, కాలినడకన దేశం చుట్టివచ్చి, ధర్మ ప్రచారం చేసిన పరమాత్ముడు. దళితుడికి నమస్కరించిన నిజమైన హైందవ దర్మ ప్రచారకుడాయన.

ఆ సర్వసంగ పరిత్యాగి, నాడు కన్నతల్లికి దూరంగా ఉంటే… నేటి స్వాములు మేనల్లుళ్లు, దత్తపుత్రులను వారసులుగా మారుస్తున్న పరిస్థితి. ఇప్పటి స్వాముల పీఠాల్లో పనిచేసే వారంతా, సదరు స్వాముల బంధువులే. సర్వసంగ పరిత్యాగులకు ఈ బంధుప్రీతి ఏమిటో, బుద్బుదప్రాయమైన జీవితానికి.. కోటిరూపాయల కార్లేమిటో, వాటిపైన సైరన్లేమిటో, గన్‌మెన్లు, పోలీసు అవుట్ పోస్టులెందుకో పామరులెవరికీ అర్ధం కాని ప్రశ్న. నిత్యాగ్నిహోత్రులు, కటిక నేలమీదనే శయనించి, సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు తినే స్వాములు కూడా.. మామూలు పామరుల మాదిరిగా.. భారీ కాయంతో, సుగర్-బీపీ-పంటినొప్పి-గుండెనొప్పి గోలీలు ఎందుకు వేసుకుంటారో.. లవకుశ-భీష్మ-శకుంతల- పాండవ వనవాసం- విశ్వామిత్ర వంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినవారెవరికీ బోధపడని విషయం. ఎందుకంటే ఆ సినిమాల్లో రుషులు, స్వాములంతా బక్కపలచగా కనిపించేవారు.

శంకరాచార్య స్థాపించిన బద్రికాశ్రమ జ్యోతిపీఠం-ద్వారకా శారదాపీఠం-గోవర్ధనపీఠం-శృంగేరీ పీఠాల అధిపతులెవరూ భక్తులను తాకరు. ఇప్పటిమాదిరిగా.. ప్రవచాలకు  మైకులు వాడిన సందర్భాలు గానీ, ఎడిటర్ల స్థాయి వ్యక్తులకు ఫోన్లు చేసుకుని.. మీడియాలో ప్రచారం/ప్రెస్‌కాన్ఫరెన్సులు గానీ, సొంతంగా చానెళ్లు గానీ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు గానీ లేవు. ఇప్పటి పీఠాథిపతులు ఏకంగా రాజకీయ నాయకులకు ముద్దులు పెట్టి.. వారి ఉన్నతి కోసమే తపశ్శక్తులు ధారపోశామని నిర్లజ్జగా ప్రకటించుకుంటున్న, దిక్కుమాలిన ధర్మసంకర సంస్కృతి కొనసాగుతోంది.  పూర్వం పీఠాథిపతులు ఎక్కడికయినా వస్తే, ఆశ్రమాలు/దేవాలయాల్లో మాత్రమే బస చేసేవారు. కానీ నయా స్వాములు/పీఠాథిపతులు మాత్రం, సకల సౌకర్యాలున్న ఖరీదైన భక్తుల ఇళ్లలో సేదదీరుతున్న వైచిత్రి. ఇప్పుడున్న స్వాముల్లో, ఏసీలలో పవళించనివారు అరుదు. పాదపూజకు లక్షల రేట్లు కట్టి పూజలు చేయించుకుంటున్న సంస్కృతి రెండు దశాబ్దాల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది.

ఉత్తరాంధ్రలో ప్రస్తుతం రాజకీయంగా హవా సాగిస్తున్న ఓ ‘సర్కారీ స్వామి’.. పాదపూజకు కనీసం లక్ష తీసుకుంటారట. అది పది లక్షల నుంచి, భక్తుల భూములు తీసుకునే వరకూ ఉంటుందట. ఇటీవలి కాలంలో ఆయన సినిమాస్టార్ల మాదిరిగా పాషింగ్‌మాల్స్, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకూ హాజరవుతుండటం మరో విచిత్రం.  ఇటీవలి తమ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ.. విజయవాడలో ఉన్న కొందరు న్యాయాధికారుల ఇళ్లకు ప్రసాదాలు పట్టుకుని ఆహ్వానించి వచ్చారట. అసలు పీఠాథిపతులు సామాన్యుల ఇళ్లకు వెళ్లి, పెళ్లి-పుట్టినరోజు-గృహప్రవేశాల మాదిరిగా.. ఈ ఇన్విటేషను కార్డులివ్వడమేమిటో ఎవరికీ అర్ధం కాదు. సదరు స్వామివారు కొందరు శిష్యగణాల ద్వారా, ఈ పాదపూజ వ్యవహారం లాగిస్తారు. గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్లు, పేషెంట్లను తెచ్చినందుకు పట్నం ఆసుపత్రుల వాళ్లు, ఆర్‌ఎంపీ డాక్టర్లకు  కమిషన్ ఇస్తుంటారు. అలాగే సదరు స్వామి వారు కూడా.. గిరాకీ తెచ్చిన శిష్యులకు 50 వేలు నజరానాగా ఇస్తుంటారన్న ప్రచారంలో నిజం ‘నారాయణుడి’కెరుక!

ఇక హైదరాబాద్‌లో కొన్నేళ్ల నుంచి, రాజకీయ-వ్యాపార రంగంవారి సాంగత్యంలో తరించే మరో స్వామి వారి, పాదపూజ రేటు పదిలక్షలట. ఆయన వద్దకు సీఎం, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయి వ్యక్తులు వస్తుంటారు. అదే సమయంలో భారీ ప్రాజెక్టులు చేసే బడా కాంట్రక్టర్లు ప్రత్యక్షమవుతారు.  ఇక అక్కడే సదరు వీవీఐపిలతో, కాంట్రాక్టరు భక్తులు వీఐపిల  రాష్ట్రాల్లో, కొత్త ప్రాజెక్టుల కథాకమామిషు పూర్తి చేసుకుంటారన్న ప్రచారం ఉంది. అంతేకాకుండా, తెలంగాణ-ఆంధ్రాకు చెందిన బడా వ్యాపారస్తుల నిధులన్నీ, సదరు పీఠం వద్ద ఉన్నాయన్న ప్రచారంలో నిజమెంతో ఆ వెంకటేశ్వరుడికెరుక? ఇక చాలామంది పీఠాధిపతులు దేవాలయాలకు వస్తే, వారి ఫీజు హీనపక్షం 50 వేల రూపాయలు ఉంటుంది. దేవాలయ ఈఓ వాటిని సమర్పించుకోవాలి మరి. ఇక పలు పీఠాలు నిర్వహించే, ఆధ్మాత్మిక కార్యక్రమాలకు టీటీడీ నిధులివ్వకపోతే.. తిరుమలలో హిందూ ధర్మం ప్రకారం, పూజాదికాలు కొనసాగడం లేదని ప్రకటనలిచ్చే స్వాములు మరికొందరు. దేవదాయ శాఖ మంత్రులతో, టీటీడీ సహా పెద్ద దేవాలయాలకు ఉత్తర్వులు ఇప్పించుకునే తరహా స్వాములు ఇంకొందరు. ఇక పార్టీల కండువాలు కప్పించుకుని, ఎన్నికల్లో పోటీ చేసే తరహా పీఠాథిపతులు ఇంకొందరు.

ఈ స్థాయిలో.. ధర్మం పేరుతో, పీఠాన్ని అడ్డుపెట్టుకుని, నాలుగుచేతుల సంపాదిస్తున్న ఈ స్వాములు.. ధర్మప్రచారానికి చేస్తున్నది శూన్యం. బ్రాహ్మణ-వైశ్య-క్షత్రియ-కమ్మ-కాపు-వెలమ-రెడ్ల వంటి అగ్రకులాలతో నిత్యకల్యాణం-పచ్చతోరణంగా కనిపించే వారి ఆశ్రమాలు-వాటి కార్యక్రమాల్లో.. దళితులు, బీసీ వర్గాలకు చెందిన వారెవరూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడమే ఆశ్చర్యం. హిందూ ధర్మానికి ఆపద వచ్చిప్పుడు, ముందు వరసలో నిలబడి యుద్ధం చేసేది వాళ్లే. అప్పుడు ఈ అగ్రకులాలేవీ అక్కడ కనిపించవు.  హిందూ మాల-హిందూ మాదిగలు ఇప్పటికీ దేవాలయాలకు వెళతారు. పూజలు చేస్తారు. అయినా స్వాములు సృష్టించిన, హెందవ సైన్యంలో వారెవరూ కనిపించరు. వారినెవరూ ఆదరించరు. దళితవాడలకు వెళ్లే స్వాములు బహు అరుదు.

పాతతరం బ్రాహ్మణ చాందస వర్గం సృష్టించిన ఈ సంప్రదాయం, ఇంకా కొనసాగుతుండటం దౌర్భాగ్యం. ధర్మంపేరుతో, వందలకోట్లు సంపాదిస్తున్న పీఠాథిపతులు-స్వాములు కూడా.. గ్రామాల్లో దేవాలయాలతోపాటు, హిందూ ధర్మప్రచారం చేయనందుకే.. హిందువులుగా ఉన్న దళితులు-బీసీల్లో ఉన్న కడుపేదలు, మతమార్పిళ్ల ప్రభావానికి లోనవుతున్నారన్నది, మనం మనుషులం అన్నంత నిజం. అసలు పీఠాలకు పోగుపడుతున్న నిధులతో, లెక్కలేనన్ని ఆసుపత్రులు- స్కూళ్లు-అనాధాశ్రమాలు-వృద్ధాశ్రమాలు-వేదపాఠశాలలు నిర్మించవచ్చు. కానీ అవేమీ చేయరు. అయితే, ఎకరం 5 రూపాయలకు సర్కారు ఇచ్చే భూములు మాత్రం, ఆశ్రమ నిర్మాణాలకు వాడుకుంటారు.

అసలు ఈ పీఠాథిపతులు-స్వాముల కంటే.. ఆర్‌ఎస్‌ఎస్-విశ్వహిందూపరిషత్-బజరంగ్‌దళ్ వంటి సంస్థలు చేస్తున్న ధర్మ ప్రచారమే వేయిరెట్లు మిన్న. ఈ సంస్థలు సొంతగా స్కూళ్లు నడుపుతూ, ధర్మం-సంస్కృతికి దోహదం చేస్తున్నాయి. కానీ,  వందలకోట్ల నిధులు-ఖరీదైన భక్తులున్న పీఠాథిపతులు-స్వాములు మాత్రం.. ఒక్క స్కూలు-ఒక్క ఆసుపత్రి కూడా కట్టించకుండా, వారసుల కోసం పోగేసుకుంటున్న వైనాన్ని విమర్శిస్తే తప్పేంటి?.. వీరందరికన్నా, విదేశీనిధులతోనయినా.. స్కూళ్లు-ఆసుపత్రులు-అనాధాశ్రమాలు నడుపుతున్న క్రైస్తవ మిషనరీల సేవలను అభినందిస్తే తప్పేంటి? మహమ్మదు దగ్గరకు కొండ రాకపోతే, మహమ్మదే కొండవద్దకు వెళ్లాలి. ఈ సూత్రం అన్ని మతాలకూ వర్తిస్తుంది. కాదనే దమ్ము ఎవరికయినా ఉందా?  హిందూ మత పెద్దలు తమ వద్దకు రాకపోతే, ఇతర మతాలు తమ తలుపుతట్టి, ఆదరించి అవసరాలు తీరుస్తున్నందుకే మతమార్పిళ్లు పెరుగుతున్నాయన్నది నిష్ఠుర నిజం. స్వాములూ.. సమయం దొరికితే కాసింత సిగ్గుపడండి!