కాంట్రాక్టర్లకు కాసులే తప్ప ప్రాంతం ముఖ్యం కాదు
తెలంగాణలోనూ ఆంధ్రారెడ్డిగారిదే హవా
అనుభవమయినందుకే తత్వంపై తగాదా
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

‘‘ఉమ్మడి ఏపీలో పాలకులు ఆంధ్రా కాంట్రాక్టర్లకే  అన్ని పనులిచ్చారు. ఇప్పుడు కూడా వాళ్లకే ఇస్తున్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం పనులప్పగించి, కేసీఆర్ సర్కారే పెంచి పోషిస్తోంది. ఆ కంపెనీని తెలంగాణలో అడుగుపెట్టనీయవద్దు’’
– ఇది తెలంగాణ ఉద్యమాన్ని భూమార్గం పట్టించి, యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముఖులను చేసిన, నాటి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపు.

‘‘ సంగమేశ్వరం ప్రాజెక్టును కూడా మేఘా కంపెనీకే కట్టబెడతారని నేను ముందే చెప్పా. అపెక్స్ మీటింగును కావాలనే వాయిదా వేయించుకుని, మేఘాకు సంగమేశ్వరం పనులు దక్కేలా చూశారు. రాష్ట్ర ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచి, ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. కమిషన్ల కోసం కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు’’
– బీజేపీ నేత, మాజీ ఎంపి వివేక్ ఆరోపణ ఇది.

తెలంగాణలో జరుగుతున్న భారీ ప్రాజెక్టు పనులలో, సింహభాగం దక్కించుకున్న ఆంధ్రాకు చెందిన.. మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై, తెలంగాణ నేతల రుసరుసలివి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులెలా ఇస్తారంటూ.. అలనాటి ఉద్యమకారులు అమాయకంగా సంధిస్తున్న ప్రశ్నలివి.

తెలంగాణ గడ్డపై ఆంధ్రా కాంట్రాక్టర్ల అడ్డా..

నీళ్లు-నిధులు-నియామకాల్లో ఆంధ్రా పెత్తందారులకు వ్యతిరేకంగా పుట్టిన తెలంగాణ ఉద్యమం.. దశాబ్దాల నాటి స్వప్నమయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. అయితే.. సొంత రాష్ట్రం వచ్చినా, కాంట్రాక్టులన్నీ అదే ఆంధ్రా కంపెనీలకు ధారాదత్తమవుతుండటం, తెలంగాణ కోసం ఉద్యమించి.. రాష్ట్రం వచ్చిన తర్వాత పిడికిలి సడలించిన వారిని, మళ్లీ పిడికిలి బిగించడానికి సమాయత్తం చేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులలో సింహభాగం దక్కించుకుంటున్న, మేఘా సంస్థ పెత్తనంపై ఎట్టకేలకూ తెలంగాణవాదులు కళ్లు తెరిచారు. ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజంలో వినిపిస్తున్న హాట్‌టాపిక్.

కాసులున్న వారికే  కాంట్రాక్టులు..

అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటే ఇదే. తెలంగాణ రాష్ట్రం వస్తే..  సొంత పరిపాలన మాదిరిగానే, సొంత రాష్ట్రంలోని కంపెనీల హవా సాగుతుందని, ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నినదించిన ప్రతి గొంతూ ఆశించింది. సొంత రాష్ట్రం వస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో పెత్తనం సాగించిన కాంట్రాక్టర్ల ఉక్కుపాదం నుంచి ప్రాజెక్టులు విముక్తమవుతాయని, తెలంగాణ కోసం రోడ్డెక్కి నిరసించిన ప్రతి స్వరం భావించింది. కానీ, ఉమ్మడి రాష్ట్రమయినా, సొంత రాష్ట్రమయినా.. ‘కాసులున్న వాడిదే కాంట్రాక్టన్న’ది అనుభవంలో గానీ ఆ గళాలు తెలుసుకోలేకపోయాయి.  ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న, కాంగ్రెస్-తెలుగుదేశం హయాంలో హవా సాగించిన, ఆంధ్రాకు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. తెలంగాణ ప్రాజెక్టుల్లోనూ అదే హవా కొనసాగిస్తుండటం, తెలంగాణకోసం ఉద్యమించిన వారిని తెల్లబోయేలా చేస్తోంది.

అందరికీ ఆపద్బాంధవుడు..

మేఘా ఇంజనీరింగ్. దీని అధిపతి కృష్ణారెడ్డి, ఆయన రూటే వేరు. ఏ పని ఎక్కడ అవుతుంది? ఎవరిని పట్టుకుంటే ప్రాజెక్టు వస్తుంది? అన్న కూపీలు లాగి, అనుకున్నది సాధించే కార్యదక్షుడాయన. పాలకుల అవసరాలను, ఇట్టే కనిపెట్టగల సమర్ధుడు. కాంగ్రెస్-టీడీపీ-టీఆర్‌ఎస్-వైసీపీ. ప్రభుత్వాలు-పార్టీలు ఏవైనా ఆయనకు సంబంధం లేదు. కృష్ణారెడ్డి అజాతశత్రువు. ‘అందరి బంధువయా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలుతీర్చే వాడయ్యా కోదండరామయ్యా’ అని అదేదో సినిమాలో పాడినట్లు.. మేఘా కంపెనీ అందరికీ ఆత్మబంధువే. ఏ సీఎంలయినా సరే రెడ్డిగారి కంపెనీకి రెడ్‌కార్పెట్ వేయాల్సిందే. అసలు ఆయన కంపెనీ కోసమే, మున్సిపాలిటీలలో ప్రాజెక్టులు పెట్టిన ఘనత చంద్రబాబుతో సహా అందరు ముఖ్యమంత్రులది. దేశంలో ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ దాదాపు బాల్చీ తన్ని, కాళ్లు బారుచాపేసుకుని కూర్చుంటే.. నిశ్చితంగా, నిర్భయంగా కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందంటే, ‘మేఘా’లలో తేలుతున్న కంపెనీకి ఇక అడ్డెవరు?

ఇంకా తత్వం బోధపడకపోతే ఎలా?

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా.. ఆంధ్రా కంపెనీలే పెత్తనం చేస్తున్నాయన్న తెలంగాణ నేతల ఆవేదన చూస్తే, అందులో అమాయకత్వమే కనిపిస్తుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లకు కాసులే తప్ప, ప్రాంతాలు ముఖ్యం కాదు. ఆంధ్రా కంపెనీలకు అసలు కాంట్రాక్టర్లు ఎట్లా ఇస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘అప్పుడంటే ఆంధ్రా పెత్తందారీతనం పోవాలని, ఉద్యమించి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు మన రాష్ట్రమే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి కోణంలో ఆలోచించకపోతే, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుందని’ పాలకుల నుంచి సింపుల్‌గా సమాధానం వ స్తుంది. ఏడేళ్లయినా ఇంకా తత్వం బోధపడకపోతే ఎలా?

‘మేఘా’లలో తేలిపొమ్మందిలే..

ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులూ.. ఆంధ్రాకు చెందిన ‘మేఘా’ కంపెనీకే కట్టబెడుతున్నారన్న చర్చ జోరుగానే సాగుతోంది. దాదాపు లక్ష కోట్ల విలువైన పనులు, మేఘాకే దక్కాయన్నది ఆ చర్చ సారాంశం. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే సంగమేశ్వరం లిఫ్ స్కీమ్‌టెండర్, కాళేశ్వరం, మిషన్ భగీరధ సహా బడా ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీ ఖాతాలోనివే. ప్రభుత్వం మాట ఇచ్చిన ఇంటింటికీ నల్లా పథకంతోపాటు, రాజధాని హైదరాబాద్‌లో రోడ్ల పనులు కూడా మేఘాకే దక్కాయి. నంది మేడారం పంప్‌హౌస్ తప్ప, మిగిలిన అన్ని పంప్‌హౌస్ పనులూ మేఘాకే ధారాదత్తం చేసింది. థర్డ్ టీఎంసీ పనులను టెండర్ లేకుండానే, మేఘా సామర్ధ్యం చూసి 4,659  కోట్ల విలువైన పనులు పువ్వుల్లోపెట్టి అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ అవసరాల కోసం, మూడు భారీ సబ్ స్టేషన్లను కూడా ఆ కంపెనీనే కట్టింది. ఈ ప్రాజెక్టులో మేఘా దక్కించుకున్న పనుల వాటా కేవలం 65 వేల కోట్ల రూపాయల పైమాటేనట.

‘మేఘా’ను చూసి ముచ్చట పడి..

మేఘా కంపెనీ సామర్థ్యం చూసి ముచ్చట పడ్డ ప్రభువులు.. సీతారామ లిఫ్ట్‌స్కీములో  సగం, భక్త రామదాసు లిఫ్ట్‌స్కీం, దేవాదుల మూడవ దశ పంప్‌హౌస్ పనులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మూడు పంప్‌హౌసులు ఆ కంపెనీకే ధారాదత్తం చేశారు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్ భగీరధలో, ‘మేఘా’ వాటా కేవలం  10 వేల కోట్ల రూపాయలు మాత్రమేనట. తాజాగా రాజధాని నగరంలో, రోడ్ల మరమ్మతుల కోసం 698 కోట్లతో కొత్త పనులు అప్పగించింది. అవీ, ఇవీ అన్నీ కలిపి.. మేఘా కంపెనీకి కట్టబెట్టిన సొమ్ము కూడా కేవలం లక్ష కోట్ల రూపాయలవరకూ ఉంటుందని ఒక అంచనా. మరి తెలంగాణ సాధించుకున్నప్పటికీ.. తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎందుకు పనులు ఇవ్వడం లేదన్న సందేహం రావచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పనులు దక్కించుకున్నది ఆంధ్రా కంపెనీలు అయినప్పటికీ, సబ్ కాంట్రాక్టు పనులు చేసేది మాత్రం తెలంగాణ కంపెనీలే. ప్రస్తుతం ఆంధ్రా సర్కారులో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులంతా… తెలంగాణలో నిక్షేపంగా కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో కాంట్రాక్టులు దక్కని వైసీపీ నాయకులకు.. అప్పట్లో విపక్షనేతగా ఉన్న జగన్, తెలంగాణ పాలకులకు తన పలుకుబడి వినియోగించి కాంట్రాక్టులు ఇప్పించి, సాయపడ్డారన్నది బహిరంగ రహస్యం.  తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మీడియా-సమైక్య ఉద్యమకారులకు తెరవెనుక సాయం చేసిన ఆంధ్రా కంపెనీలే, ఇప్పుడు తెలంగాణ లో సింహభాగం ప్రాజెక్టులు దక్కించుకుంటున్నాయన్నది, అలనాడు అలసిపోయిన తెలంగాణ ఉద్యమ నేతల ఆవేదన. అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటే ఇదే.

నాడు  బాబు.. నేడు జగన్

ముందే చెప్పినట్లు.. మేఘా కంపెనీకి పాలకులంతా ఇష్టులే. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ‘మేఘా’ కంపెనీకి, మునిసిపాలిటీలతో సహా బడా పనులన్నీ కట్టబెట్టారు. విభ జిత రాష్ట్రంలో కూడా,  రెడ్డిగారి కంపెనీకే ‘రెడ్డికార్పెట్’ వేయడం విశేషం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇదే టీడీపీ మేఘా కంపెనీపై ఆరోపణలు గుప్పించింది. ‘అది కెవిపి బినామీ కంపీనీ. మేము అధికారంలోకి వస్తే, దానిని బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి పనులపై విజిలెన్సుతో దర్యాప్తు చేయిస్తామ’ని సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు హెచ్చరించారు. అయితే, విచిత్రంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత,  పట్టిసీమ సహా.. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, పురుషోత్తంపట్నం, చింతలపూడి,  కొరిసపాడు, వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ బాబు సర్కారు, మేఘా కంపెనీ ఖాతాలోనే వేసింది.

అప్పట్లో పట్టిసీమ సహా, మేఘా కంపెనీ పనులపై విపక్షంలో ఉన్న వైసీపీ గళమెత్తింది. అదే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, పోలవరం రివర్స్ టెండరింగ్‌లో పనులు అప్పగించడం ఆశ్చర్యం. అటు తెలంగాణలో సింహభాగం పనులు చేస్తున్న ఇదే కంపెనీ.. అదే రాష్ట్రంలో ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాలను ఎడారిగా మార్చే, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమును కూడా,  మేఘానే చేపడుతుండమే తెలంగాణ నేతల అభ్యంతరాలకు కారణం. కాంట్రాక్టర్లకు కాసులు ముఖ్యం. అవి ఇస్తే.. ఏ ప్రాంతాలు మునిగినా, ఏ రాష్ట్రాలు తేలినా వారికి అనవరసం. కాంట్రాక్టర్లకు కాసులు ముఖ్యమయితే, పాలకులకు కమిషన్లు ముఖ్యం. పైకి ఇవన్నీ శాస్త్రప్రకారం టెండర్ల ద్వారానే దక్కుతాయి. కాకపోతే, ఆ నిబంధనలు తాము ఇవ్వదలచుకున్న కంపెనీకి అనుగుణంగా ఉంటాయంతే! ఈ తత్వం తెలుసుకోకపోవడమే అమాయకత్వం!!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner