కమలంలో ‘గణపతి’ గందరగోళం
ట్యాపింగ్‌నూ రాష్ట్రానికో వాదన
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

బీజేపీ ఒక  జాతీయ పార్టీ. అంటే సహజంగా  అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే సిద్ధాంతం ఉంటుంది. కర్నాటకలో ఒకలా, తెలంగాణలో మరోలా, ఆంధ్రాలో ఇంకో మాదిరిగా ఉండదు. కానీ, విచిత్రంగా వినాయక విగ్రహాల విషయంలో.. బీజేపీ రెండు రాష్ట్రాల  అధ్యక్షులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయటం, ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ దళపతి కేసీఆర్ సర్కారుపై ఒంటికాలితో లేస్తుండగా.. ఏపీ కమళదళపతి మాత్రం జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఇబ్బందులు పడకుండా రాసిన లేఖ, ఆ పార్టీ సైద్ధాంతిక వాదనను వేలెత్తిచూపేలా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో.. ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌లో, గణపతి నవరాత్రులు ఏ స్థాయిలో చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ప్రభుత్వాలే, గణేష్ కమిటీతో సంప్రదింపులు చేస్తుంటుంది. అయితే ఈసారి కరోనా కారణంగా, ప్రభుత్వం వినాయక మండపాలపై ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేసీఆర్ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు. రంజాన్ సమయంలో ఎలాంటి మినహాయింపులు ఇచ్చారో, అదేవిధంగా గణపతి నవరాత్రులకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం, పోలీసుల ద్వారా మండప నిర్వహకులపై బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ సంతుష్టీకర విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదిరోజులు భక్తులు, సామాజికదూరం పాటిస్తూ వినాయకచవితి చేసుకోవాలని, పోలీసుల ఒత్తిళ్లకు భయపడవద్దని పిలుపునివ్వడం చర్చనీయాంశమయింది.

అయితే.. ఇదే వినాయకచవితి నిర్వహణ అంశంలో,  ఏపీ బీజేపీ దళపతి సోమువీర్రాజు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి, కమలనాధులను ఖంగుతినింపించింది. పండుగకు ఒక్కరోజు అవకాశం ఇవ్వాలని, అదేరోజు నిమజ్జనం కూడా చేసుకోవాలంటూ రాసిన లేఖ, అటు హిందువులనూ విస్మయపరిచింది. ఇలాంటి లేఖలు కమ్యూనిస్టు పార్టీలు రాస్తే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు. కానీ, హిందుత్వంపై పేటెంట్ హక్కులున్నట్లు భావించే బీజేపీనే, ఆ లేఖ రాయడం హిందువులను ఖంగుతినిపించింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ హోంమంత్రులకు ఎస్‌ఐలను బదిలీ చేసే అధికారం లేదని ఎద్దేవా చేసిన సోము.. అదే హోంమంత్రికి లేఖ రాయడమే విడ్డూరం.

అదే బీజేపీ సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి, అంతకుముందు.. తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాసినప్పటికీ స్పందించని తీరుపై జగన్మోహన్‌రెడ్డి సర్కారును ఘాటుగా విమర్శించారు. మొహర్రం పండుగకు 40 మంది వరకూ మత పెద్దలను అనుమతించిన ప్రభుత్వం, వినాయకచవితి నిర్వహణపై ఎందుకు ఆంక్షలు విధిస్తోందని విరుచుకుపడ్డారు. జగన్ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ముస్లింల విషయంలో మాదిరిగా హిందు మత పెద్దలతో సమావేశం నిర్వహించాలని విష్ణు డిమాండ్ చేశారు.

వీరికంటే ముందే.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, మండపాల విషయంలో జగన్ సర్కారు హిందువుల మనోభావాలు గౌరవించాలని సీఎంకు లేఖ రాశారు. మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటన, హిందువుల మనోభావాలు గాయపరిచిందన్నారు. తొమ్మిదిరోజుల పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎంపీనే చవితిని తొమ్మిదిరోజులు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే.. హిందుత్వంపై పేటెంట్ ఉందని భావించే, బీజేపీనే అధికారికంగా ఒక్కరోజు చాలంటూ లేఖ రాయడం.. విస్మయంతోపాటు, విడ్డూరం కలిగించింది.

ఇది బీజేపీలో సహజంగానే గందరగోళానికి దారితీసింది. సంప్రదాయం ప్రకారం.. గణపతి నవరాత్రోత్సవాలను 9 రోజులు నిర్వహించుకునేందుకు, ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించవద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లేఖ రాయాల్సిన వీర్రాజు.. ఒక్కరోజుతో సరిపెట్టాలంటూ లేఖ రాయడం, పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. బహుశా వినాయకచవితి విషయంలో.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ‘పెద్దమనసు’తో వీర్రాజు అలా లేఖ రాసి ఉండవచ్చన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి ‘పెద్దమనసు’ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్‌కు లేకపోవడం, కేసీఆర్ ప్రభుత్వ దురదృష్టమంటున్నారు.

ఇలాంటి భిన్న సిద్ధాంతం ఒక్క వినాయకచవితి విషయంలోనే కాదు. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ కనిపించింది. ఆంధ్రాలో న్యాయమూర్తుల ఫోన్లపై, జగన్ సర్కారు నిఘా పెట్టిందన్న ఆరోపణలపై హైకోర్టు విచారిస్తోంది. నిఘాపై జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధానికి లేఖ రాశారు. దానిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆక్షేపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం, దానితో కేంద్రానికి ఏం సంబంధమని ఎదురుదాడి చేశారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు కేంద్రం గుర్తుకు వస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీబీఐ అవసరం లేదంటారని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.

కానీ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారు తమ ఫోన్లపై నిఘా పెట్టిందని, బీజేపీ నేతలు కేంద్రానికే ఫిర్యాదు చేశారు. దానిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ ఎంపీ శోభ కూడా, నాటి కేంద్ర హోంమంత్రి రాజనాధ్‌సింగ్‌కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు కూడా, ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సరే.. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ఆరోపణలు పక్కనపెడితే.. స్వయంగా అధికార పార్టీ వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు కూడా, తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేయడాన్ని.. జీవీఎల్ గ్రహించకుండా అడ్డంగా వాదించడమే  విడ్డూరం. ఆ ప్రకారంగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగితే, అక్కడ కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. తమ మిత్రపక్షాలున్న రాష్ట్రాల్లో అదే ట్యాపింగ్ జరిగితే మాత్రం..  ఆ వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదు. అదన్న మాట.. కమలనాధుల నయా సూత్రీకరణ! ఇందులోని మతలబేమిటో పైనున్న ‘నరసింహుడి’కే ఎరుక!!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner