‘సాక్షి’కి వందకోట్లిచ్చారా.. అయితే ఏంటిట?

564

నాడు ‘కమ్మ’దనం  నేడు ‘రెడ్డి’కార్పెట్
టీడీపీ-వైసీపీ దొందూ దొందే
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

గత ఏడాదిలో వైసీపీ అధికార మీడియా సాక్షికి, జగనన్న సర్కారు వంద కోట్ల రూపాయల ప్రకటనలు ధారాదత్తం చేసింది. ఇదొక వార్త. దానికో విశేషం! ఏడాదిలో 200 కోట్లు ఇస్తే అది వార్త గానీ, పాపం చాలా మొహమాటంతో 100 కోట్లు ఇస్తే అది వార్త ఎందుకవుతుంది? సోషల్‌మీడియా-టీడీపీ వీరాభిమానుల పిచ్చి తప్ప! వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఈనాడు-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు అడ్డగోలుగా ప్రకటలిచ్చి, ప్రజాధనాన్ని దోచిపెడుతోందని, ఆ పార్టీ అధికార మీడియా అయిన సాక్షి నానా యాగీ చేసింది. ఇప్పుడు అదే వైసీపీ అధికారంలో ఉంటూ, తన సాక్షి మీడియాకు అడ్డగోలుగా ప్రకటలిస్తున్న వైనం వెలుగుచూసింది. మరి చెప్పడానికేనా నీతులు?

అవును. ఏడాది నుంచి జగనన్న కుటుంబ కంపెనీ అయిన, సాక్షి మీడియాకు మొత్తం 100 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చినట్లు, సమాచార హక్కు చట్టం కింద వెల్లడయింది. అంటే సాక్షి ప్రింట్‌మీడియాకు 50, చానెల్‌కు ఓ 50 కోట్లు ఇచ్చినట్లు సమాచార శాఖ ఇచ్చిన సమాధానంలో తేలిందట. ఆరకంగా ఇదే ఊపు-ఉత్సాహం ఏడాది పొడవునా చూపిస్తే, వాటికి ఓ 250 కోట్లు ఇచ్చే అవకాశం ఉందన్నది ఓ అంచనా. రికార్డెడ్ లైవ్‌కు ఇప్పటివరకూ ఓ 50 కోట్లు ఇచ్చినట్లు తేలిందట. ఇది మొత్తం ప్రకటనల్లో 51.62శాతం. ఏడాదిలో సాక్షికి 52 కోట్లు ఇస్తే, అత్యధిక సర్య్యులేషన్ ఉన్న  ఈనాడుకు మాత్రం 39.64 కోట్లు మాత్రమే దక్కాయి. ప్రజాశక్తికి 3 కోట్ల యాడ్స్ ఇచ్చారు. పాపం ఎటొచ్చీ తన బాధను, ప్రపంచబాధగా ఫీలయ్యే ఆంధ్రజ్యోతికి నయాపైసా ఇవ్వలేదు. కిలారు నాగశ్రవణ్ అనే వ్యక్తి సమాచారహక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు, సమాచారశాఖ ఇచ్చిన సమాధానం ఇది. ఆ ప్రకారంగా.. 2019 మే నుంచి 2020 మే వరకూ సమాచార శాఖ ఇచ్చిన ప్రకటనల్లో..  సాక్షి 51.62 శాతం, ఈనాడు 33.33 శాతం, ప్రజాశక్తి 2.96 శాతం, విశాలాంధ్ర 1.86 శాతం, ఆంధ్రప్రభ 2.14 శాతం, ఆంధ్రభూమి 0.50 శాతం, వార్త 1.34 శాతం, ఆంధ్రజ్యోతి 0.25 శాతం ప్రకటనలు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది.click on this: ipr (pdf by Department of information & public relations)

ఇక్కడ విచిత్రమేమిటంటే… ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త కంటే… అత్యధిక సర్య్యులేషన్ ఉండి, మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 0.25 శాతం ప్రకటనలే దక్కడం ఆశ్చర్యం. ఈ పత్రికల్లో విశాలాంధ్ర-ప్రజాశక్తి-ఆంధ్రభూమి మినహాయిస్తే, మిగిలిన పత్రికలన్నీ ఫ్రాంచైజ్ పద్ధతిలో నడుస్తున్నాయి. అంటే జిల్లాల్లో ఎవరు డబ్బులు కడితే, వాళ్లే ఆ జిల్లా యజమానుల కింద లెక్క. అక్రెడిటేషన్లు అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదులు, తమను అన్యాయంగా తొలగించారని కలెక్టర్లకు ఫిర్యాదులు, తమ వద్ద డబ్బులు తీసుకుని అక్రెడిటేషన్ కార్డులివ్వలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. అక్రెడిటేషన్ల సిఫార్సులు, ఆయా పత్రికల ఎడిటర్లు కాకుండా, డబ్బులిచ్చి కొనుకున్న బ్రాంచి మేనేజర్లు ఇస్తున్న సంస్కృతి కొనసాగుతోంది. నిజానికి వాటి సర్క్యులేషన్ కూడా పెద్దగా ఉండదు. ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి వద్ద డబ్బులుంటే, ఆ రోజు పత్రిక ప్రింటవుతుంది. లేకపోతే ఆరోజు ప్రింటవదు.

బీసీ ఉద్యమం పేరుతో చాలాకాలం ఉనికిలో ఉండి, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓ రాష్ట్ర మంత్రికి సమీప బంధువు కూడా అయిన ఓ పత్రిక.. టీడీపీ హయాంలో తీసుకున్న  భూసేకరణ ప్రకటనల అవకతవకలపై విచారణ జరుగుతోంది. ఈ పత్రిక చంద్ర బాబు హయాంలో కూడా ఆయనకు భజన చేసి, కోట్లాదిరూపాయల ప్రకటనలు పట్టేసింది. ఇప్పుడూ అదే వ్యూహం అనుసరిస్తున్నా, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీనిమాదిరిగానే.. గతంలో చంద్రబాబుకు బాకా ఊదిన గోదావరి జిల్లా మూలాలు ఉన్న పత్రిక ఇప్పుడు, ప్రకటనల్లో 5వ స్థానంలో ఉండటం మరో ఆశ్చర్యకరం. ఈ పత్రిక కూడా ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేయడం, ఆ యజమాని ఆ పార్టీలో చేరటం ఒక ఆనవాయితీగా మారింది. ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ.. ఆంధ్రజ్యోతికి ఈ పత్రికలన్నింటికంటే, వందలరెట్లు విస్తృతమైన యంత్రాంగం, సొంత ప్రెస్, మంచి వేతనాలు ఇచ్చే పద్ధతి ఉంది. కాకపోతే.. ఆంధ్రజ్యోతి జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నందున,  ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యం.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, కమ్మ వర్గానికి చెందిన మీడియా ఆర్ధికంగా లబ్ధిపొందితే, జగన్మోహన్‌రెడ్డి పాలనలో రెడ్లకు చెందిన మీడియా.. అంటే ఆయన సొంత మీడియా ఆర్ధికంగా లబ్ధి పొందుతోంది. ఈ విషయంలో అప్పుడు-ఇప్పుడూ పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఈటీవీకి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులు ధారాదత్తం చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ మరొకరికి ఆవకాశం ఇచ్చారు. విభజిత రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బాబు.. ఎలాంటి టె ండర్లు లేకుండా ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టుతోపాటు, సమాచారశాఖ కూడా సీఎం కార్యక్రమాల లైవ్‌ను ఆ చానెల్‌కే అధికారికంగా కట్టబె ట్టారు. బాబు జమానాలో సమాచారశాఖ నిధుల్లో సింహభాగం ఈనాడు-ఆంధ్రజ్యోతికి కేటాయించారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అయితే.. తన సిబ్బందికి జీతాలన్నీ ప్రభుత్వ ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుతోనే చానెల్ నడిపిందన్న వ్యాఖ్యలు వినిపించేవి. మిగిలిన ఎలక్ట్రానిక్ చానెళ్లలో ప్రకటనలు కూడా, కమ్మ వర్గానికి చెందిన చానెళ్లకే ఇచ్చారన్న విమర్శలుండేవి. వాటికి నెలకు ఇన్ని లక్షల రూపాయలని కేటాయించేవారు. అయితే, ఎన్నికల చివరి రెండేళ్లలో సాక్షి, ప్రజాశక్తికి కూడా బాబు బాగానే ప్రకటనలిచ్చారు. ఇప్పుడు రెడ్డి సామజికవర్గానికి చెందిన మీడియాకు, జగన్మోహన్‌రెడ్డి సర్కారు,  చేతికి ఎముక లేకుండా ప్రకటనలిస్తున్నారన్న విమర్శలు మూటకట్టుకుంటోంది. ప్రధానంగా జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే సాక్షి మీడియాకు, సింహభాగం నిధులు ఇస్తున్నారన్న విమర్శలు సమాచార హక్కు చట్టంతో వెలుగుచూసింది.

అయితే, ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు నిమిత్తమాత్రులే. ఏ కమిషనరయినా, అధికారంలో ఉన్న వారు ఎవరికి సిఫార్సు చేస్తే, వారికి ఇవ్వాల్సిందే తప్ప, వారి సొంత అభిప్రాయాలకు తావుండదు. గతంలో సాక్షి-ప్రజాశక్తికి ప్రకటనలు ఇవ్వకూడదన్న చర్చ జరిగింది. అప్పుడు నాటి కమిషనర్.. సాక్షికి ఎక్కువ సర్క్యులేషన్ ఉండటం, ప్రజాశక్తిని కిందిస్థాయి ప్రజలు ఎక్కువగా చదువుతారు కాబట్టి.. ఆ పత్రికల్లో కూడా ప్రకటనలిస్తే, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువమందికి చేరువవుతాయని వాదించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రకటనల విషయంలో, సమాచారశాఖ ఉన్నతాధికారులకు ఒక అవగాహన ఉన్నప్పటికీ..  స్వయంగా పత్రిక నడిపిన అనుభవం ఉన్న  సీఎం జగన్మూహన్‌రెడ్డికి, అంతకంటే ఎక్కువ అవగాహనే ఉంది. ప్రభుత్వ ప్రకటనలను ఆయన నిశితంగా పరిశీలించిన తర్వాతనే, ఆమోదిస్తారు.