(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నర్సాపురం నియోజకవర్గ యుశ్రారైకా పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైన్యం వచ్చేసింది. భద్రతా కారణాల వల్ల తాను ఏపీలో అడుగుపెట్టలేకపోతున్నానంటూ, ఇప్పటివరకూ ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.  రాష్ట్ర రాజకీయాలపై.. అక్కడే రోజువారీ రచ్చబండ నిర్వహించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తనకు రక్షణ కల్పించాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడం,  ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో.. కేంద్రం ఆయనకు, 11 మంది సాయుధ సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. రాష్ట్రంలో తనకు రక్షణ లేదని.. తనపై సొంత పార్టీ నేతలు దూషణకు దిగుతున్న వైనాన్ని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, గతంలో రాజు నానా యాగీ చేశారు. ఒకదశలో రాజు బెజవాడ వస్తే,  ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేయాలని, పాలకపార్టీ ప్రయత్నించిందన్న ఆరోపణలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అంగరక్షకులతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

ఇక గోదావరి జిల్లాను భారీ వరద ముంచెత్తిన నేపథ్యంలో, ఆయన తన అభిమానుల సైన్యాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ సేన’లో పనిచేసే కార్యకర్తలు, గ్రామాలకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. శేషగిరి నాయకత్వంలోని  ఆర్‌ఆర్‌ఆర్ సేన .. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాలకు పడవలలో వెళ్లి, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. చుట్టూ నీళ్లు చేరడంతో, తినడానికి తిండి లేక అల్లాడుతున్న అభాగ్యులకు, ఆర్‌ఆర్‌ఆర్ సేన  నిత్యావసర వస్తువులు అందించింది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో ఇప్పటివరకూ సర్కారు ఇంకా సహాయక చర్యలకు ఉపక్రమించకపోయినా.. రాజు గారి సైన్యం మాత్రం వెంటనే రంగంలోకి దిగి, గ్రామానికి 500 మంది చొప్పన, నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయం. ఓ వైపు తన నేత జగన్మోహ న్‌రెడ్డి తీసుకుంటున్న జనామోద పథకాలు-నిర్ణయాలను ప్రశంసిస్తూనే… మరోవైపు ప్రజావ్యతిరేక నిర్ణయాలను మాత్రం,  నిర్మొహమాటంగా విమర్శిస్తున్న రాజుగారిలోని.. ఈ మానవత్వమనే మూడవకోణాన్ని జనం మెచ్చుకుంటున్నారు. ఏదైనా రాజు గారు.. రాజు గారే!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner