రాధా.. ఏమిటి నీ బాధ?

692

‘ఆంధ్రజ్యోతి’పై వీర్రాజు ఎదురుదాడి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎవరు ఎలా ఉండాలి? ఏ పార్టీ ఏ విధానాలు పాటించాలి? ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఏ పార్టీ వ్యూహం ఎలా ఉండాలి? ఒకవేళ జాతీయ పార్టీ అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకుల వైఖరి ఆ రాష్ట్రంలో ఎలా ఉండాలి? ప్రాంతీయ పార్టీలయితే జాతీయ పార్టీలపై ఏ వ్యూహం అనుసరించాలి? ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పొత్తు మంచిదా? కాదా? అనేక కీలక విషయాలను అధ్యయనం చేసేందుకు రాజకీయ శిక్షణా తరగతులకు వెళ్లాల్సిన పనిలేదు. ప్రశాంత్ కిశోరాలను కోట్లు పోసి తెచ్చుకోవలసిన అవసరం, అంతకంటే లేదు. రాజకీయాలను అవపోసన పట్టిన, రాజకీయ వ్యూహకర్త,  ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ ప్రతివారం రాసే ‘కొత్తపలుకు’ చదివితే చాలన్న భావన-భ్రమ నిన్నటి వరకూ చాలామందిలో ఉండేది. కానీ ఏపీ  భారతీయ జనతా పార్టీ కొత్త ప్రెసిడెంటు సోము వీర్రాజు వచ్చి, ఆ ఇమేజీని డ్యామేజీ చేసేశారు. నీ సలహాలేవో ఆ చంద్రబాబుకు ఇచ్చుకోమని నిర్మొహమాటంగా చెప్పడమే కాదు. అదే ముక్క నేరుగా లేఖాస్త్రంగా సంధించి వదిలారు.

‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ ప్రతివారం రాసే ‘కొత్తపలుకు’ శీర్షికలో.. ఈసారి బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గురించి ప్రస్తావించారు. అందులో ఆయనను జాతీయ నాయకత్వం కట్టడి చేయాలన్న సలహా కూడా ఒకటి వదిలారు. పార్టీ ఎదుగుల గురించి దాదాపు ఆవేదన వ్యక్తం చేసినంత పనిచేశారు. ఇంకా పార్టీ ఎందుకు ఎదగడం లేదన్న ఆందోళన వ్యక్తం చేసినంత పనిచేశారు. ఏపీలో పార్టీ ఎదగాలంటే జీవీఎల్‌ను కట్టడి చేయాలని.. చంద్రబాబును విమర్శించడం మంచిదికాదన్న మరో విజ్ఞాన సలహాగుళికను కూడా, ఎవరూ కోరకుండానే ప్రసాదించిన వైనం వీర్రాజుకు ఎక్కడో కాలినట్టయింది. అందుకే ఆయన కూడా రాధాకృష్ణకు బహిరంగ లేఖ రాశారు.

‘మీరు టీడీపీకి సలహాదారుగా, అనుకూలంగా పనిచేస్తారని వినికిడి. మరీ ఇంత పబ్లిగ్గా, ఇంత నిర్లజ్జగా (అంటే సిగ్గులేకుండా అనకుండా) పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి? గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారినీ, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు.. సడన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఏపీలో ఎదగడం లేదని మీరు తెగ ఫీల అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.  మీ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీపై పుట్టిన ప్రేమ కాదని, పతనానికి చేరువలో ఉన్న బాబుగారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్నపిల్లలకు సైతం అర్ధమవుతుంది. మీ రాజకీయ సలహాలు బాబుగారికి మాత్రమే ఇవ్వండి. గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితవడంలో మీ పాత్ర కూడా ప్రధానం కాదా’ అని కమలదళపతి కడిగిపారేశారు.

ఎవరి చేయాల్సిన పని వారే చేయాలి. లేకపోతే ఫలితాలు గత ఎన్నికల మాదిరిగానే ఉంటాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కమలం చచ్చీ చెడీ, చావుతప్పి గన్నులొట్టపోయినట్లు గెలిచింది.అదే సమయంలో మైనారిటీలు మోదీపై కత్తిగట్టారు. అది కాంగ్రెస్ సానుకూల వాతావరణంగా కనిపించింది. దాన్ని చూసిన ‘కొత్తపలుకు’ నిర్వహకులు, రాజకీయ వ్యూహకర్తయిన రాధాకృష్ణ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అదే ఫలితాలుంటాయని ఊహించారు. మోదీ ప్రభ మసకబారింది కాబట్టి, ఆయనతో ఉంటే టీడీపీ కూడా మునిగిపోతుందని డజన్ల కొద్దీ వ్యాసాలు రాశారు. బీజేపీ మునిగిపోయే నావ కాబట్టి, అందులో ప్రయాణిస్తే టీడీపీ కూడా మునిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా బోలెడన్ని కథనాలు వండారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ, ఏపీలో ఆశవదలుకోవసిందేనని ముందస్తు తీర్పు ఇచ్చారు.  బయట నుంచి రాధాకృష్ణ ఆ విధంగా పోరాడితే, లోపల పార్టీలో ‘తూర్పుగోదావరి జిల్లా మేధావి’ కూడా అదే వాదన వినిపించారు. చివరాఖరకు.. టీడీపీ భాజపాతో తెగదెంపులు చేసుకునేవరకూ ఇద్దరూ విశ్రమించలేదు. లేకపోతే, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. చంద్రబాబు అవిధంగా అరువు ఆలోచనలు చేయకపోతే, మళ్లీ మోదీతో కలసినడిచేవారు. కాలం కలసిరాకపోతే అంతే మరి!

ఒరిజినల్  రాజగురువు వయోభారంతో.. సలహాలివ్వకుండా దూరంగా ఉన్నప్పుడు, ఈ కొసరు రాజగురువు రంగప్రవేశం చేసి, ఎన్నికల ముందు ఇచ్చిన సలహాలే పార్టీ కొంపముంచాయని, తమ్ముళ్లు ఇప్పటికీ రుసరుసలాడుతుంటారు. బీజేపీని భ్రష్టుపటించే కథనాలు రాసిన ఆంధ్రజ్యోతిపై..  ఓ దశలో ఇదే సోము వీర్రాజు, శాసనమండలిలో  సభాహక్కుల తీర్మానం ఇచ్చేందుకూ సిద్ధమయ్యారు. అంటే ఆ స్థాయిలో తన పార్టీని బద్నాం చేసిన రాధాకృష్ణ.. ఇప్పుడు అదే పార్టీ ఎదిగి వృద్ధిలోకి రావాలంటే, జీవీఎల్ లాంటి వాళ్లను తప్పించాలని సుద్దులు పలికితే, ఎవరికైనా ఒళ్లు మండదూ? మరి.. మరొకరి పుట్టలో వేలెడితే ఎవరైనా కుట్టరా?

సరే… జీవీఎల్ అనే ఆయన, రాధాకృష్ణ గారి లెక్క-అనుమానం బట్టి వైసీపీ పట్ల ప్రేమానురాగంతోనే ఉన్నారనుకోండి. వాళ్లకూ వాళ్లకూ బాదరాయణ సంబంధమేదో ఉందే అనుకోండి. అందుకే జీవీఎల్..  అధికార వైసీపీని, సీఎం జగన్మోహన్‌రెడ్డినీ విడిచిపెట్టి.. బాబును, టీడీపీనే విమర్శిస్తున్నారో అనుకోండి. అహ .. కాసేపు అలాగే అనుకోండి. ఆ బాధ- నొప్పి-కోపం గట్రాలన్నీ, తెలుగుదీశీయులకు కదా ఉండాల్సింది? ఆ ప్రశ్నలేసి ఇరికించాల్సింది బాబు తమ్ముళ్లే కదా? మరి ఎలాంటి సంబంధం లేని రాధకృష్ణకు, జీవీఎల్ ఏం మాట్లాడితే బాధేమిటి? అయినా.. ఫలానా పార్టీలో ఫలానా వ్యక్తిని కత్తిరించాలని చెప్పడానికి అసలు రాధాకృష్ణ ఎవరు? ఆయన బాధేమిటి? బాబుకు చెప్పినట్లు, బీజేపీకి చెబితే.. వాళ్లు రాధాకృష్ణ మాట వింటారా? వాళ్లకూ రాధాకృష్ణ మాదిరిగానే ఇంకో బాధాకృష్ణ ఉంటారని గ్రహించకపోతే ఎలా స్వామీ?