మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.

పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మంచితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.

నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.

ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !

పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.

ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.

పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.

ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు తీయని పలకరింపు అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ”నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను” అని పాత్రలో వివరిస్తుంది.

డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.

లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.

మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.

కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.

నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.

”నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా” అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !

అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !

-రవికుమార్

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner