అలా.. ఎప్పటినుంచి ‘స్వామీ’?

0
110

తెలంగాణలో కొన్ని కులాలదే పెత్తనమట
కొత్తగా స్వామిగౌడ్ పాత ఆవేదన
       (మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

‘‘కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి. అధికారం కొంతమందికే పరిమితమయింది. కులరక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోంది. కులాన్ని మతాన్ని పక్కనపెట్టి, ఎవరికయితే తెలివితేటలుంటాయో వారందరూ, త్వరలో ఏకముఖ సిద్ధాంతం మీద ఒక్కటయ్యే రోజు రాబోతోంది. బడుగు బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు కానివ్వండి, గుడి-బడి కొంతమందికే పరితమనే మళ్లీ మొదటికి రావడంతోనే నారాయణగురును మనం గుర్తుచేసుకుంటున్నాం’’
– శ్రీనారాయణగురు జయంతి వేడుకల్లో తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్  ఆవేనద యధాతథ సారాంశమిది.

మండలి చైర్మన్ పదవీకాలం ముగిసిన చాలాకాలం తర్వాత, ఒకప్పటి తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడయిన స్వామిగౌడ్ గళం విప్పిన వైనం ఆశ్చర్యంతోపాటు, ఆవేదన కలిగించేదే. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలలో ఇటీవలి కాలంలో కనిపించని స్వామిగౌడ్.. హటాత్తుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేయడం సహజంగానే చర్చనీయాంశమయింది.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఉద్యమబాట పట్టించిన నాయకులకు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, విద్యార్ధి సంఘ నేతలు, వివిధ రంగాల నిపుణులకు, కేసీఆర్ సీఎం అయిన వె ంటనే తగిన ప్రతిఫలం ఇచ్చి గౌరవించారు. దేవీప్రసాద్‌కు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించగా, స్వామిగౌడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మండలి చైర్మన్‌గా నియమించారు. ఇక విఠల్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మెంబరు పదవి ఇచ్చారు. శ్రీనివాసగౌడ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. ప్రముఖ జర్నలిస్టు అల్లం నారాయణకు ప్రెస్‌అకాడమీ చైర్మన్, మరో జర్నలిస్టు క్రాంతికిరణ్‌కు ఎమ్మెల్యే సీటిచ్చారు. కట్టా శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, బుద్దా మురళి వంటి జర్నలిస్టులకు ప్రభుత్వ పదవులిచ్చారు. ఉద్యమ సమయంలో జైలుకు సైతం వెళ్లొచ్చిన, విద్యార్ధి నేత బాల్క సుమన్‌కు ఎంపి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. మరికొందరు విద్యార్ధి సంఘ నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. వీరంతా తెలంగాణ ఉద్యమంలో వారి వారి విభాగాల్లో టీఆర్‌ఎస్ కోసం ప్రత్యక్షంగా- పరోక్షంగా కష్టించి పనిచేసిన వారే.

అధికారం వచ్చిన తర్వాత, ఉద్యమంలో నాయకత్వ స్థానంలో ఉండి పనిచేసిన నాయకులకు, కేసీఆర్ ఆవిధంగా పదవులిచ్చి గౌరవించారు. ఒక్క ఉద్యోగ నేతలకే కాదు. ఉద్యమ సమయంలో తనకు ప్రత్యక్షం-పరోక్షంగా సహకరించిన జర్నలిస్టుల నుంచి అన్ని రంగాల ప్రముఖులకు ప్రభుత్వ పదవులిచ్చి, కృతజ్ఞత ప్రకటించారు. కేసీఆర్ ఆ విషయంలో… చంద్రబాబునాయుడు మాదిరిగా, కులాలు చూడలేదు. కేవలం విధేయత-ఉద్యమ సమయం నాటి సహకారం ప్రాతిపదికనే పదవులిచ్చారు. ఆవిధంగా కేసీఆర్ ఇచ్చిన పదవుల్లో వెలమలు పెద్దగా కనిపించరు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ. అదే చంద్రబాబు నాయుడు.. విభజిత రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత, అన్ని విభాగాల్లోనూ ఆయన సొంత సామాజికవర్గం వారికే పెద్ద పీట వేసి, విమర్శల పాలయ్యారు. ప్రతి కమిటీల్లోనూ వారికే స్థానం కల్పించారు. చివరకు అదే వైసీపీకి బ్రహ్మాస్త్రమయింది.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తమ హయాంలో రెడ్డి రాజ్యం నడిపిస్తున్నారనే విమర్శలు ఎదుర్కుంటున్నారు

దాదాపు ఏడాదిన్నర తర్వాత.. స్వామిగౌడ్‌కు మళ్లీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ గుర్తుకు రావడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఇటీవలి శాసనమండలి-రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు.  పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ టికెట్ ఆశించినా అదీ దక్కలేదు. కానీ, స్వామిగౌడ్ ఆవేదనలో అక్షరం కూడా అబద్ధం లేదు. ఆయన మాట్లాడినవన్నీ అక్షర సత్యాలే. అయితే.. ఆయన చెప్పిన అంశాలన్నీ, కేసీఆర్ ఆయనకు మండలి సీటు ఇచ్చి, మండలి చైర్మన్ ఉన్నపుడూ జరిగాయి. అంతకుముందూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నవే. మరి తాను చైర్మన్‌గా ఉన్న సమయంలో ఇలాంటి అన్యాయాలు, దుర్మార్గాలు, బీసీల పట్ల వివక్ష ఎందుకు గుర్తుకు రాలేదన్న సందేహం మెదడున్న ఎవరికయినా రాక తప్పదు. తెలంగాణలో ప్రస్తుత కుల వ్యవస్థ- ఏ కులం ఆధిపత్యం వహిస్తోందన్న అంశం  గురించి, తెలంగాణ సమాజానికి  కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. బడుగువర్గాలపై అణచివేత అనేది, కొన్నేళ్ల నుంచి విజయవంతంగా జరుగుతోంది. అది స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా జరిగింది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు.. ఇప్పటిమాదిరిగానే నాడు, ఎందుకు ఆవేదన వ్యక్తం చేయలేదన్న ప్రశ్న, అదే బడుగు వర్గాల నుంచి రావడం సహజమే కదా?

ఒక వ్యక్తికి ఏదైనా  పదవి వస్తే, ఆ వ్యక్తి ప్రాతినిధ్యం వహించే వర్గాలకు స్వేచ్ఛ-స్వాతంత్య్రాలు వచ్చినట్లు.. వారికి పదవులివ్వకపోతే, ఆ వర్గాలు అణచివేతకు గురి అవుతున్నట్లుగా జరుగుతున్న చిత్రీకరణ, నమ్మే రోజులకు ఎప్పుడో తెరపడింది. బడుగుకార్డులతో పదవులు పొందిన కొన్ని డజన్ల మంది నాయకులు..  ఆ తర్వాత తమకేమీ చేయలేద న్న ఆగ్రహం, అదే బడుగులలో బలంగా నాటుకుపోవడం కూడా, దానికి ఓ కారణంగా కనిపిస్తోంది.  ఆ వర్గాల ప్రతినిధులుగా పదవులు పొందిన వారంతా,  దక్కిన పదవులతో తమ వర్గ ప్రయోజనాల కోసం పోరాడకుండా, పాలకుల ముందు సాగిలబడటమే దానికి కారణం. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. అది అప్పుడు..  ఇప్పుడు.. ఎప్పుడూ.. కాదంటారా?