లంబోదర.. లబోదిబో!

439

వినాయక విగ్రహాలకూ తప్పని విఘ్నాలు
కమలదళాలను ఖాతరు చేయని ‘సీఎం బ్రదర్స్’
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి విఘ్నాలు జరగకూడదని భక్తులు వినాయకుడిని ప్రార్ధిస్తుంటారు. గణపతిపూజలు చేస్తుంటారు. ఇక వినాయకచవితి పండుగలంటే దేశంలో చెప్పలేనంత హడావిడి. పందిర్లు, పూజలు, నిమజ్జనం హంగామా. దేశంలో ముంబయి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అయితే, నిమజ్జనం యమా సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో గణపతి మండపాలు పోటాపోటీగా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు కరోనా వల్ల అలాంటి హడావిడేమీ చేయకుండా, ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకుని, ఎవరి ఇళ్లలో వారు విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని, రెండు రాష్ట్రాల అపూర్వ సహోదరులయిన, ముఖ్యమంత్రులు హుకుం జారీ చేశారు. మొహర్రం కూడా అదేవిధంగా చేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే కేసీఆర్-జగన్ ప్రభుత్వాల వైఖరిపై కమలదళాలు కన్నెర చేస్తున్నాయి.

కానీ.. కరోనా ఉన్నందున, సామాజిక దూరం పాటిస్తూ, వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలంటూ, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల బీజేపీ నాయకులు సర్కారును డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత, నెహ్రు యువజన కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి.. గత వారం రోజుల నుంచి చేస్తున్న ట్వీట్లు, డిమాండ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. దానిపై స్పందించిన ఏపీ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. విగ్రహాలు రెండు అడుగులకు మించి ఉండకూడదని, ఎక్కడ విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడ, అదేరోజు నిమజ్జనం చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజలకు అనుమతి లేదన్నారు.

అయితే, అదే ఆంధ్రా సర్కారు.. మొహర్రం పండుగ కోసం ఇచ్చిన వెసులుబాటు, కమలదళాలకు కన్నెర కలిగించింది. పీర్లచావిడి ప్రాంతాల్లో ముతవల్లి, ముజవార్లు, కమిటీ సభ్యులతో కలిపి 10 మంది మించకుండా ఉండాలి. మత బోధకులు 30 నుంచి 40 మంది వరకూ అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. ఇది బీజేపీ నాయకుల ఆగ్రహానికి గురయింది. వినాయక విగ్రహాలపై ఆంక్షలు విధించిన జగన్ సర్కారు, గణపతి విగ్రహాల విషయంలో మోకాలడ్డటం ఏమిటని మండిపడుతున్నారు. మొహర్రం రోజు 40 మంది వరకూ మతపెద్దలకు అనుమతించిన ప్రభుత్వం, వినాయక విగ్రహాల ఏర్పాటుపై మాత్రం షరతులు విధించడం, దారుణమని విష్ణువర్దన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.

‘మద్యం షాపులపై లేని ఆంక్షలు గణేషు పండుగపై ఎందుకు? అన్ని జిల్లాల్లో మొహర్రం పండుగకు ముందస్తు అనుమతులిచ్చారు. దాన్ని మేం వ్యతిరేకించడం లేదు. మంచిదే. మరి వినాయకచవితి విషయంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాదా? హిందూ సమాజం అన్నీ గమనిస్తోంది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు, వెసులుబాటు కల్పించిందో, వినాయకచవితికీ అలాంటి సౌకర్యాలు, వెసులుబాటు కల్పించాలి.  వినాయకచవితి విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎందుకు అధికారిక సమావేశం నిర్వహించలేదని’ విష్ణు గర్జించారు.

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు-తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ కూడా గణపతి విగ్రహాల ఏర్పాటుపై, ప్రభుత్వ ఆంక్షలను ఖండించారు. బండి సంజయ్ ఓ అడుగుముందుకేసి, పోలీసులు వినాయక మండపాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తే, అంతా కేసీఆర్ ఇంటిముందు విగ్రహాలను నిమజ్జనం చేస్తారని హెచ్చరించారు. ముస్లిం పండుగలకు అనుమతులు, మినహాయింపులు ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. హిందువుల పండుగలపై ఎందుకు ఆంక్షలు విధిస్తోందని విరుచుకుపడ్డారు.

సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, బండి సంజయ్ కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినవాళ్లు. అయినా ఇప్పటిదాకా పాలకుల సెక్యులర్ విధానాలు, దానిపై కనబరిచే సత్యనిష్ఠను ఇప్పటికీ అర్ధం చేసుకోకపోవ డమే విచిత్రం. ఈ దేశంలో మైనారిటీ లకు హక్కులు, స్వేచ్ఛ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది. పైగా ఇటు కేసీఆర్-ఇటు జగన్ ఇద్దరూ మైనారిటీ పరిరక్షకులే. వారి కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే, పంటితో తీసేంత ప్రేమ ఉన్నప్పుడు.. ఆపాటి మినహాయింపులివ్వడం సహజం. పాలకుల కవి హృదయాలను అర్ధం చేసుకోకపోవడమే, కమలదళాల అమాయకత్వం. సోము వీర్రాజు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విష్ణువర్దన్‌రెడ్డి ఆవేదనలో మరో పెద్ద అమాయకత్వమే కనిపిస్తోంది. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. గత 14 నెలల్లో దాదాపు 50కి పైగా లేఖలు రాస్తేనే దిక్కులేదు. ఇప్పుడే వచ్చిన సోము వీర్రాజు లేఖ రాస్తే, జగనన్న సర్కారు వెంటనే స్పందించి, సమావేశం నిర్వహిస్తారా? అబ్బా…ఆశ దోశ అప్పడం!  ఏదైనా ఆశ మంచిదే. కానీ అత్యాశ పనికిరాదు. కమలదళాలూ.. మీకు అర్ధమవుతోందా?