భోగాది బాధలో భావమేటి

303

(మలసాని శ్రీనివాస్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)  

భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గారికి భోగాది వెంకటరాయుడు గారు రాసిన బహిరంగ లేఖలో ( డియర్ కామ్రేడ్స్…ఏం చేస్తున్నారిప్పుడు!? )భావం లేదా ఆయన బాధ ఏమిటో స్పష్టంగా రూఢి కావడం లేదు. అంత సీనియర్ జర్నలిస్టు ఒక లేఖ అదీ బహిరంగంగా రాసేటప్పుడు లేఖలో సారాంశం లేదా ఏ లక్ష్యంతో తను ఈ లేఖను రాస్తున్నారో తర్కించుకోకుండా రాస్తారని భావించలేం. మరి ఆయన ఇప్పుడు ఈ లేఖలో సి.పి.ఐ.కి సుద్దులు చెప్పడానికి ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు? సమయం ఎందుకు కీలకం అంటే సి.పి.ఐ. పార్టీ ప్రస్తుత స్థితి ఇప్పుడే కొత్తగా ఏర్పడినది కాదు. సైద్ధాంతిక విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు నడుస్తున్న సాధారణ రాజకీయాల స్థాయిని ప్రమాణంగా పెట్టుకుని చూస్తే ఆ పార్టీ ప్రస్తుత స్థితికి ఇరవై ఏళ్ళ క్రితమే స్పష్టంగా చేరుకుంది. ఈ ఇరవై ఏళ్ళలో భోగాది గారు గొప్పగా ప్రస్తావించిన నారాయణ గారే ఆ పార్టీని మొన్నటి వరకూ నడిపారు.(నడిపారు అనేదానికంటే ఆ పార్టీని నవ్వులుపాలు చేశారు అనడం సరైన వాఖ్యాణం అవుతుంది) పార్టీలో కొత్త రక్తం రాకపోవడం అనే పరిణామం దశాబ్దాల క్రితమే జరిగిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలో నాయకులుగా ఉన్న రామకృష్ణ లాంటి వారే ఆఖరి తరం అని చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు ఏమిటి అని చర్చించడం ఇక్కడ నా ఉద్ధేశ్యం కాదు. చర్చ చేస్తే వందల పేజీలు, రోజుల సమయం పడుతుంది. భోగాది గారు సి.పి.ఐ.లో జరిగేవి, జరగాలి అని చెప్పిన కార్యకలాపాలు ఎప్పుడో దశాబ్దాల క్రితమే అడుగంటిపోయాయి. ఆ పార్టీ లో ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఈ మార్పు దేశవ్యాప్తంగా ఆ పార్టీలో జరిగిన మార్పు. రాష్ట్రంలో దాదాపు ఉనికి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో నాలుగేళ్ల క్రితమే రామకృష్ణ భుజాలపై ఆ పార్టీ కష్టాల కావడిని ఉంచారు. రాయలసీమలో క్రూర రెడ్డి భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు, ఆ పెత్తందారీ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి రెండు దశాబ్దాల పాటు ఒక లాయర్ గా, ఒక దఫా ఎమ్మెల్యేగా ఉండి పోరాడి అనంతపురం ప్రజల చేత “మగాడు రామకృష్ణ” (మగాడు అనే పదం ఉపయోగించడం సరికాదు. కాని ఆ జిల్లా ప్రజలు మాట్లాడుకున్న భావోద్వేగాన్ని యధాతథంగా చెప్పాలన్న భావంతో ఆ పదం రాసేను) అని రెడ్డేతర కులాల ప్రజలు మాట్లాడుకోవడం ఆ జిల్లాలో జర్నలిస్టుగా పనిచేసిన నాకు తెలుసు.

ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పెద్దలు…కష్టకాలంలో ఉన్న పార్టీని నడపడానికి కష్టాలు ఎదుర్కొని వచ్చిన రామకృష్ణే మోయగలడని ఆ బరువును ఆయన భుజాలపై పెట్టారని ఆ పార్టీ సంగతులు తెలిసిన వాళ్ళు చెప్పే మాట. “కార్యదర్శి పదవి చేపట్టాక మీరు ఏమేమి పనులు చేశారు?” అని భోగాది గారు ఘాటుగా ప్రశ్నించారు? ప్రశ్న ఎప్పుడూ ఉన్నతమైనదే. కాకపోతే “ప్రశ్న కొన్ని సమయాలలోనూ, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వేస్తాను” అంటేనే సమస్య. ఇలా పార్టీ లను ఎంపిక చేసుకుని, వ్యక్తులను ఎంపిక చేసుకుని, సమయాలను ఎంపిక చేసుకుని, స్థలాలను ఎంపిక చేసుకుని ప్రశ్నలు వేస్తే…అప్పుడు ఆ ఎంపికకు ప్రమాణం ఏమిటి? ఎంపిక చేసే వ్యక్తి (జర్నలిస్టు కావచ్చు లేదా వేరొకరు కావచ్చు, ఎవరైనా అవ్వొచ్చు) తాలూకూ ప్రశ్న వెనుక ప్రయోజనాలపై గురించి ప్రశ్నించాల్సివస్తుంది. ఇప్పుడు పరిశీలిద్దాం…భోగాది గారు ఎంపిక, ప్రశ్నా పరమార్థం ఏమిటో?…ప్రస్తుత సమాజంలో ప్రజలు తరపున పోరాడే పార్టీ కానరావటం లేదు అని ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత తోనూ ఈ జర్నలిస్టు గారు సి.పి.ఐ. పార్టీపై అభిమానంతో ఇలా బహిరంగ లేఖ రాశారా? అదే నిజమనుకుంటే ఆయన ప్రశ్నలు హితవు కోరే హితోభిలాషి మాటలు ఆ లేఖలో లేవు. సి.పి.ఐ. ఆశించినంతగా పని చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఆ కారణాలు సీనియర్ జర్నలిస్టుగా భోగాది గారికి తెలియదు అనుకోలేం. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ పాటి కార్యకలాపాలైనా రామకృష్ణ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాతేనన్న గత పదేళ్ళ దినపత్రికలు పరిశోధిస్తే వెల్లడవుతుంది. మరి ఈ నేపథ్యంలో….భోగాది గారు సి పి.ఐ.పై అభిమానంతో ఆ పార్టీ వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో రాశారా? ఆయన విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీ అభిమానంతో ఉన్నట్లు రాశారు. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో అప్పట్లో విద్యార్థులలో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీ అభిమానులుగా ఉన్నవారే. వారు ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తే….ఏఏ స్థాయిల్లో ఉన్నారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కాబట్టి విద్యార్థి దశలో కమ్యూనిస్టు అభిమానం కలిగి ఉంటే ప్రస్తుత ప్రజల పక్షపాతిగా ఉంటాడు అనడానికి ఏ రుజువులు లేవు. అది సర్టిఫికెట్ కూడా కాదు.

భోగాది లేఖలో అసలు విషయం స్పష్టంగా దాచుకోకుండా హెడ్డింగ్ లోనే పెట్టారు. “జగన్ ను విమర్శించవద్దు” అని. ఇది ‘మోకాలికి బోడిగుండికి’ ముడి వేసినట్లు గా వుంది. కమ్యూనిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం పోరాడే పార్టీ. అలా పోరాడే పార్టీ నే నిజమైన కమ్యూనిస్టు పార్టీ అని గుర్తించడం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల కమ్యూనిస్టు రాజకీయ వర్గాల్లో ఉన్న సంప్రదాయం. మరి భోగాది గారు ప్రభుత్వంను విమర్శించవద్దు, ఆ ప్రభుత్వ హెడ్ సి.ఎం.ను విమర్శించవద్దని చెప్పడం ఏ తర్కానికి అందనిది. సుద్దులు చెబితే అంతర్గత విషయాలతో పాటు ప్రభుత్వంపై గట్టిగా పోరాడండి అని చెప్పాల్సింది పోయి ఇదేమిటి ఈ సీనియర్ గారు? ఈయన జగన్ అధికారంలోకి వచ్చే ముందు రోజు వరకు చంద్రబాబు ప్రభుత్వానికి తన సర్వీసులు శక్తి వంచన లేకుండా అందజేశారు. అంటే భోగాది గారు ఏదో లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం చేరడానికి పాపం ఏదో ఉన్నంతలో కష్టపడి పని చేస్తున్న రామకృష్ణ గారిని వాడుకున్నారా అనిపిస్తుంది. కోపం రామకృష్ణ గారిపై కాదని, జగన్ ప్రేమ పొందాలన్న ఆరాటమే ఆయన చేత ఈ లేఖ రాయించిందా? కొసమెరుపు: సమాజమే మాయాబజార్ గా మారిపోయిన ఒక విపత్కర కాలంలో జీవిస్తున్నం మనమందరమూ. ఇటువంటి లోకం పాఠకులు, ప్రేక్షకులు తమ పంచేంద్రియాలను స్పష్టంగా ఉపయోగించి సత్యాలు కనిపెట్టాలి. లేకపోతే…”చదివేదంతా నిజమనుకునే వెర్రివాళ్ళు ఏమి చదవకపోవటం ఉత్తమం ” అని జర్నలిజంలో నా గురువు గారుగా భావించే పతంజలి గారు చెవిలో చెప్పారు.