నా రాజ్యం.. నా ఇష్టం!

339

ఎవరైతే నాకేంటి?
( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

అనగనగా ఓ రాజు. ఆయనకు అశ్రద్ధ ఎక్కువ. మంత్రిగారు ఏమైనా చెబి తే పట్టించుకుంటాడు. లేకపోతే లేదు. ఆ మంత్రి కూడా అదే తరహా. దొందూదొందే. పోనీ భటులేమైనా తెలివిగలవాళ్లా అంటే వారూ ఆ ఇద్దరికీ తోడుపోయినవాళ్లే. అయినా ప్రజలు ఆయనను భరిస్తున్నారు. రాజరికం కదా తప్పదు మరి! ఆ రాజ్యంలో ఒక కుమ్మరి కుండలు చేసుకుంటూ,  పూరి గుడిసెలో బతుకుతుంటాడు. అతను కొంచెం ఎక్కువ కష్టపడి నాలుగుడబ్బులు సంపాదించుకుని, మట్టి గోడలతో ఇల్లు కట్టుకుంటాడు. నాలుగవ రోజుకే పెద్ద వర్షం వచ్చి, ఆ మట్టిగోడలు రాలిపోయేసరికి కుంగిపోతాడు. సాయం కోసం రాజు గారి వద్దకు వెళతాడు. అతని సమస్య ఏమిటో చెప్పమంటాడు రాజు. ‘అయ్యా నేను కష్టపడి కట్టుకున్న ఇంటిని వరుణదేవుడు కూల్చివేశాడు. కాబట్టి, వరుణ దేవుడిపై చర్య తీసుకోవాల’ని విన్నవిస్తాడు.

వెంటనే స్పందించిన రాజు.. ‘ఆ వరుణ దేవుడిని తీసుకువచ్చి ఉరి శిక్షి విధించమని’ మంత్రిని ఆదేశిస్తాడు. మంత్రి కూడా అలాగే మహాప్రభు అని, వానదేవుడిని ఉరి తీయమని భటులను ఆదేశిస్తాడు. బయటకు వచ్చిన మంత్రి.. వరుణదేవుడు దొరక్కపోతే, ఆ మబ్బులను పట్టుకుని శిక్షించమంటాడు. అయినా వానదేవుడు గానీ, మబ్బులు గానీ దొరకలేదు. రాజు గారి ఆదేశం అమలుచేయడం ఎలా అని ఆలోచిస్తున్న మంత్రికి, కుమ్మరి ఇంటి దగ్గర ఉన్న ఓ యాగం చేస్తున్న బ్రాహ్మణుడు కనిపిస్తాడు. యాగం చేస్తున్నందువల్లే పొగ పైకి వెళ్లి వర్షం వచ్చింది కాబట్టి, ఆ బ్రాహ్మణుడిని శిక్షించమని ఆదేశిస్తాడు. దానికి ఖంగు తిన్న సదరు బ్రాహ్మణుడు ‘అదేమిటయ్యా. నాపేరు ఎందుకు చెప్పావ’ని కుమ్మరిని అడుగుతాడు. ‘అయ్యో నేను చెప్పలేదు. మీరు యాగం చేస్తున్నందుకే పొగ పైకి వెళ్లిందని మాత్రమే చెప్పారు. ఈ రాజు వరణుదేవుడినే శిక్షించమన్న తెలివితక్కువవాడు. మీరు తెలివైన వారు కాబట్టి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండ’ని సలహా ఇస్తాడు. దానితో ‘ఇందులో నాతప్పేమీ లేదు. ఎదురింట్లో పెళ్లి కోసం ఈ యాగం చేస్తున్నందున, వాళ్లకు శిక్ష విధించమ’ని చెప్పి, బ్రాహ్మణుడు తప్పించుకుంటాడు. వెంటనే భటులు పెళ్లికొడుకును పట్టుకుంటారు. అయితే.. నేను సన్నగా ఉన్నందున, శూలదండన కోసం మీరు తెచ్చిన శూలం సరిపోదు కాబట్టి, ఎవరైనా లావుగా ఉన్న వాళ్లను చూసుకోమని చెప్పి, పెళ్లికొడుకు చల్లగా తప్పించుకుంటాడు. భటులు వెతకగా వెతకగా, ఓ భారీకాయుడు అరుగుమీద కనిపిస్తాడు. దానితో ఎవరో ఒకరు దొరికారు కదా అని, భటులు అతనిని తీసుకువెళ్లి శిక్ష విధించేస్తారు. ఆ రకంగా వరుణదేవుడిని శిక్షించాలనుకున్న రాజు, చివరకు ఓ భారీకాయుడిని శిక్షిస్తాడు. కానీ పాపం కుమ్మరికి పరిహారం మాత్రం అందదు. ‘ఆముక్తమాల్యద ’లో శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన ‘అవకతవక రాజు- తెలివితక్కువ మంత్రి- పనికిమాలిన భటులు’ కథ ఇది.
ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఇటీవల పండితుడు గరికపాటి నరసింహారావు చెప్పిన ఈ కథ గుర్తుకురాక మానదు.

అంతేనా? ‘‘ ‘‘నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదురో
పరులెవరూ నడవనిదీ ఆ రూట్లోనే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు  లోకం ఒకవైపు’’
‘‘టక్కరిదొంగ’’లో హీరో మహేష్ పాట కూడా గుర్తుకురాక మానదు.

హైకోర్టు-సుప్రీంకోర్టులో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై,  శరపరంపరగా వ్యతిరేక తీర్పు వస్తున్నప్పటికీ- ఆయన నిర్ణయాలలో ఏమాత్రం మార్పు రాకపోవడం, సహజంగానే చర్చనీయాంశమవుతోంది. కోర్టు ఇచ్చిన తీర్పులను అమలుచేయకుండా, తనకు సంక్రమించిన అధికారాలతో- దానిని ధిక్కరిస్తూ దొడ్డిదారి నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ను భారత రాజ్యాంగం-చట్టాలతో సంబంధం లేని, ప్రత్యేక రాజ్యంగా ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోంది. జగన్ పార్టీ నాయకులు కూడా దీనినే కోరుకుంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలను జనం గె లిపించారు కాబట్టి, తమకు కోర్టులు-రాజ్యాంగం-చట్టాలతో పనిలేదన్న బేఖాతరిజం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు రాష్ట్రంలో కోర్టులు, ఇతర రాజ్యాంగబద్ధ సంస్ధలేవీ అవసరం లేదన్నట్లుగా ఉంది.  ఈ పోకడలన్నీ  రాజరికంలోనే దర్శనమిస్తాయి. ఇది ఏమాత్రం స్వాగతించదగ్గ పరిణామం కాదు.

గతంలో మాస్కు అడిగిన పాపానికి, విశాఖలో  దళిత వైద్యుడు సుధాకర్‌పై అమానవీయంగా వ్యవహరించిన ఘటన నుంచి… ఇటీవల విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో, డాక్టర్ రమేష్ అనే ప్రఖ్యాత కార్డియాలజిస్టును వెంటాడుతున్న వైనం వరకూ, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలకు అర్హమైనవే అనిపించక మానదు. అసలు స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ బాధితులను ఉంచేందుకు అనుమతించిన జిల్లా అధికారులు, అక్కడి సౌకర్యాలు పర్యవేక్షించాలి కదా? అసలు ఆ హోటల్‌కు ఫైర్ అనుమతులు లేనప్పుడు, ఆరోగ్య శాఖ కోవిడ్ చికిత్సకు అంత గుడ్డిగా ఎందుకు అనుమతించింది?  పోనీ మధ్యలో తనిఖీలు చేయాలి కదా? అసలు స్వర్ణ ప్యాలెస్‌తోగానీ, విజయవాడ రమేష్ ఆసుపత్రిలో గానీ పనిచేయని.. గుంటూరు రమేష్ ఆసుపత్రి వైద్యురాలికి నోటీసులివ్వడమేమిటి?  తాము నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తుంటే వాకబు చేయకుండా, అధికారులు గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? అసలు సర్కారు కోవిద్ చికిత్సకు అనుమతించిన హోటళ్లలో, బిల్లులు ఎక్కువ వసూలు చేస్తుంటే ఆరోగ్య శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారా? అంటే ఆ లెక్కన అనుమతించిన రెవిన్యూ-ఆరోగ్య శాఖ జిల్లా బాసులపై కూడా కేసులు నమోదుచేయాలి కదా? అనుమతులు తీసుకున్న వారికి ఎంత బాధ్యత ఉందో, ఇచ్చిన వారికీ అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది కదా? మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరికయినా వస్తుంది కదా మరి!


హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగినందుకు, లీజు తీసుకున్న వారిపై కేసు పెట్టిన సర్కారు… మరి అదే నిబద్ధతను, నంద్యాలలో తన పార్టీకి చెందిన ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుకు ఒకరు చనిపోయి, ఇద్దరు కార్మికులు క్షతగ్రాతులయినప్పుడు, ఆ యజమానిని ఎందుకు అరెస్టు చేయలేదు? రమేష్  ఆసుపత్రి మాదిరిగా మేనేజ్‌మెంట్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం పోలీసుస్టేషన్‌కు విచారణ కోసం ఎందుకు పిలవలేదు? విశాఖలో తన పార్టీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ ఎస్‌ఈజడ్‌లో, రెండు కంపెనీలలో  అగ్నిప్రమాదం జరిగింది. అందులో ఐదుగురు చనిపోతే యజమానిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయనను కూడా డక్టర్ రమేష్ మాదిరిగా ఎందుకు పోలీసుస్టేషన్‌కు పిలిచి ఎందుకు విచారించలేదు? విశాఖలో భూముల సెటిల్‌మెంట్లో, విజయసాయిరెడ్డి పేరు దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రసాదరెడ్డి అనే నాయకుడిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది. మరి ఆయనపై పోలీసు కేసు ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వ సంస్థ చైర్మన్‌గా ఉన్న ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించి, ఆ గొంతు తనదేనని చెప్పినా, ఇప్పటివరకూ ఆయనను ఎందుకు తొలగించలేదు? నిజంగా జగన్మోహన్‌రెడ్డి నీతి-నిజాయితీకి నిలువుట్టదం అయితే.. వీరందరిపై, మిగిలిన వారి మాదిరిగానే కేసులు పెట్టి, జైళ్లకు ఎందుకు పంపించలేదన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వరేం? వైసీపీ పెద్దనోరు గళధారులు పెదవి విప్పరేం? అంటే గిట్టనివారికే చట్టాలు? చెప్పడానికేనా నీతులు?