రెడ్డిగారూ.. మీరు సూపరో సూపర్!

0
93

ఉద్యోగులకు వడ్డీ వద్దన్న త్యాగరెడ్డి గారు
వెంకట్రామిరెడ్డికి ఎంత ‘సామాజిక’ చైతన్యమో?
ఉద్యోగ  సంఘ నేతలకు నవ చైతన్యస్ఫూర్తి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా.. రాజేంద్రనాధ్‌రెడ్డి ఆర్ధికమంత్రిగా.. సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్‌కల్లం రెడ్డి  ప్రభుత్వ సలహాదారులుగా వర్ధిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో.. కోర్టు ఆదేశించిన జీతం వడ్డీ డబ్బులు,  మాకు వద్దని చెప్పిన వెంకట్రామిరెడ్డి అనే మహనీయుడు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండటం, లక్షలాదిమంది ఆంధ్రా ఉద్యోగులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అంతేనా? జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అదృష్టం కూడా! లేకపోతే… కరోనా కాలంలో సర్కారు ఇవ్వాల్సిన బకాయిలను, 12 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించినా.. మాకు ఆ వడ్డీ డబ్బు అవసరం లేదని, ఎంతమంది ఉద్యోగ సంఘ నేతలు చెబుతారు? ఒక్క మన సచివాలయ ఉద్యోగ సంఘాల మహానేత వెంకట్రామిరెడ్డిగారు తప్ప!

నిజమే. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఉద్యోగులకు పూర్తి జీతాలివ్వకపోయినా సరే.. కిందామీదా పడుతూ, పాపం కాంట్రాక్టర్ల బిల్లులు, అవ్వ-తాతలు, అక్కచెల్లెళ్లు, ఆటోడ్రైవర్లు, లాయర్లు, చర్చి ఫాదర్లు- ఇలా అన్ని వర్గాలకు వేల కోట్లు ఇస్తూనే ఉంది. అంతమందికి డబ్బులిస్తున్నప్పుడు, తమ జీతాలెందుకు కోతపెడుతున్నారన్నది ఉద్యోగుల వాదన లాంటి  వేదన.  కానీ, పాపం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, జగ్మోహన్‌రెడ్డి గారి ‘సంగతి’ తెలుసు కాబట్టి, అందరూ కుక్కిన పేనుల్లా ఉండిపోతున్నారు. అందుకే పాపం.. చాలాకాలం క్రితమే పెంచాల్సిన జీతాలు, పిఆర్‌సి, వేతనాల బకాయిల గురించి డిమాండ్ చేయడానికే వణికిపోతున్నారు.

అదే..  ఏ చంద్రబాబునాయుడో సీఎంగా ఉన్నారనుకోండి. సీఎంఓ వద్దకు లంచ్ అవర్లో కట్టలుకట్టుకుని వెళ్లి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, మురళీకృష్ణ లాంటి నేతలు చంద్రబాబుతో చర్చలు జరపరూ? తమ డిమాండ్లు నెరవేర్చకపోతే, సర్కారు సంగతి తేలుస్తామని ఉద్యోగ సంఘాల నేతలు బెదిరించేవారు కదూ? ఉద్యోగులపై టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని నానా యాగీ చేసేవారు కదూ?  దానితో బాబు బెదిరిపోయి, దారికొచ్చి  వారి కోర్కెలు తీర్చాల్సి వచ్చేది కదూ? ఇప్పుడు సచివాలయం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి!  కోర్కెలు కోర లేరు. కొత్త కోర్కెల ముచ్చటే లేదు. ఎంచక్కా లంచ్ అవర్లో క్యాంటిన్‌లో భోజనం. సాయంత్రం టీ స్నాక్సుతో కాలక్షేపం. అప్పటిలా బకాయిలు ఎప్పుడు వస్తాయన్న ముచ్చట్లు గానీ, కొత్త కోరికల అచ్చట్లు గానీ చెవి రిక్కిరించినా వినబడవు. దటీజ్ జగన్మోహన్‌రెడ్డి! ఉద్యోగులకు ఆయనే సరైన పాలకుడు!!

అయినా.. ఆ మాత్రం పేదల కోసం ఉద్యోగులు త్యాగం చేయలేరా? మన త్యాగరెడ్డి.. అదేనండీ వెంకట్రామిరెడ్డి గారికి ఉన్న ‘సామాజిక’ బాధ్యత, ‘సామాజిక’ స్పృహ, ‘సామాజిక’ చైతన్యం, మిగిలిన ఉద్యోగులకు లేకపోతే ఎలా? ఇంత స్వార్థం అన్యాయం కదూ?! ఉద్యోగులకు ‘సామాజిక’ బాధ్యత ఉండాలి. అది మన ‘యూనియన్ రెడ్డి’గారిని చూసి నేర్చుకోవాల్సిందే. అయితే.. వెంకట్రామిరెడ్డి వాదనను, అదే ‘సామాజిక’ స్పృహ ఉన్న కొందరు ఉద్యోగులు మాత్రమే సమర్ధిస్తుండగా.. మాకెందుకీ ’సామాజిక’ బాధ్యత? అంత ‘సామాజిక’ స్పృహ మాకు అవసరం లేదు. మా జీతం డబ్బులు మొత్తం మాకిస్తే అదే పదివేలని వాదిస్తున్నారు.

ఇంతకీ.. విపరీతమైన ‘సామాజిక’ బాధ్యతతో మాట్లాడిన, ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి చేసిన వాదనను ఎందుకు విమర్శిస్తున్నారు? ‘మేం ప్రభుత్వాన్ని పెండింగ్ జీతంతోపాటు వడ్డీ ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. కోర్టుతీర్పుపై కమిటీలో చర్చించి, అప్పీలుకు వెళతాం. కరోనా కాలంలో మేం పనిచేసినా చేయకపోయినా ప్రభుత్వం జీతమిస్తుంటే, ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన జీతానికి వడ్డీ తీసుకోగలమా? మాకు ‘సామాజిక’ బాధ్యత లేదా? ఉండకూడదా? ఈ వ్యాజ్యం కారణంగా ఉద్యోగుల వ్యక్తిత్వంపై చిన్నచూపునకు కారణమయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా ప్రభుత్వానికి, 150-200 కోట్ల ఆదాయం పడిపోయింది. అందుకే ప్రభుత్వ ఇబ్బందులు గమనించే, మేం 50 శాతం జీతాలు తీసుకునేందుకు అంగీకరించాం. పాపం ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చినా, రాకున్నా రెండునెలల జీతమిచ్చింది. సర్కారు సమస్యలతో మాకు సంబంధం లేదు. మా జీతాలు మాకు ఇవ్వాల్సిందే అని ఉద్యోగులు పట్టుపట్టారనుకోండి. అలాగైతే మీ ఇబ్బందులతో మాకు సంబంధం లేదు. పనిచేస్తేనే జీతమిస్తామని సర్కారు చెబితే, నష్టపోయేది ఉద్యోగులే’’ ఇదీ.. ఆంధ్రప్రదేశ్ గవర్నరమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవపాల్ పేరుతో ఉన్న లెటర్‌హెడ్‌పై విడుదలయిన ఓ ప్రకటన సారాంశం!

ఇందులో తప్పేమిటి? ప్రభుత్వం పడుతున్న సీత కష్టాలకు మనసు కరిగిన ఓ ఉద్యోగ సంఘనేతగా.. దానికంటే ఆయన మనసులో-రక్తంలో  నరనరాన జీర్ణించుకునిపోయిన ‘సామాజిక’ బాధ్యతనే,  రెడ్డిగారితో ఆవిధంగా లేఖ రాయించింది. గతంలో ఎన్జీఓ సంఘ నేతలుగా ఉన్న పూర్ణచంద్రరావు, రమణయ్య, గోపాల్‌రెడ్డి, అశోక్.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ సచివాలయ నేతలుగా పనిచేసిన హన్మంతరెడ్డి, రామకృష్ణ, మురళీకృష్ణ వంటి వారిలో ఒక్కరికీ.. వెంకట్రామిరెడ్డికి ఉన్న ‘సామాజిక’ బాధ్యత, సర్కారు కష్టాలపై ఉన్న సానుభూతి లేకపోవడమే విచారకరం. సహజంగా ఏ ఉద్యోగ సంఘమయినా,  ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై పోరాడతుంటాయి. వాటి కోసం నేతలు నిరంతరం సీఎం, సీఎస్‌తో చర్చిస్తుంటారు.

గతంలో ఎన్జీఓ నేతగా పనిచేసిన గోపాల్‌రెడ్డి కూడా అదే పనిచేశారు. ఆయన ‘ఈ రెడ్డిగారి మాదిరిగా’ ‘సామాజిక’ బాధ్యతతో ఆలోచించకుండా, ఉద్యోగుల కోసం పోరాడారు. సరే.. మరో ఎన్జీఓ నేత అశోక్ అయితే, విభజిత రాష్ట్రంలో టీడీపీ సర్కారుకు సేవ చేసి, ఆ కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారనుకోండి. అది వేరే విషయం!  వీరికెవరికీ లేని ‘సామాజిక’ బాధ్యత- ‘సామాజిక’ చైతన్యం-సర్కారు సమస్యలపై సానుభూతి,  ఒక్క సచివాలయ ఉద్యోగుల సంఘ నేత వెంకట్రామిరెడ్డి గారికే ఉండటం అద్భుతం, అనిర్వచనీయం, అనన్యసామాన్యం. ఈ విషయంలో ఆయనకంటే ముందు పనిచేసిన.. సచివాలయ సంఘ నేతలుగానీ, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఎన్జీఓ నేతలుగానీ దిగదుడుపే. ఒకరకంగా దేశంలోని ఉద్యోగ సంఘ నేతలకు, వెంకట్రామిరెడ్డి ఒక స్ఫూర్తి. ప్రభుత్వ ఇబ్బందులను ఇట్టే గమనించి, పాలకులు పెదవి విప్పకపోయినా.. వారి సమస్యలు చెప్పకపోయినా, తమ సామాజిక బాధ్యత గుర్తించి, ప్రభుత్వాలకు సహకరించే వెంకట్రామిరెడ్డి వంటి ఆణిముత్యం దొరకడం.. జగన్మోహన్‌రెడ్డి అదృష్టం. అలాంటి ‘సామాజిక’ స్పృహ లేని ఉద్యోగ సంఘ నేతలు లేకపోవడం మిగిలిన రాష్ట్రాల దురదృష్టం.

అప్పుడెప్పుడో.. ఎన్టీరామారావు సీఎంగా ఉన్నప్పుడు.. ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం, 43 రోజులు సమ్మె చేశారు. అప్పుడు ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులు.. సచివాలయంలోని, జీ బ్లాకులోని సీఎంఓలోకి చొరబడి నానా రభస సృష్టించారు. ఎన్టీరామారావు ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నాయన కాబట్టి, వారి చర్యకు నిరసనగా రోడ్డుపైనే పడక సీను వేశారు. అప్పట్లో అదొక సంచలనం. ఆ ఎన్జీఓ-సచివాలయ నేతలు సతె్తకాలపు మనుషులు కాబట్టి.. ఉద్యోగుల ప్రయోజనాలు, గోంగూర అని సమ్మె కట్టారు. వెంకట్రామిరెడ్డిలా వారిలోనూ ‘సామాజిక’ బాధ్యత ఉంటే, అంతపని చేసేవారు కాదు.

అన్నట్లు..వెంకట్రామిరెడ్డి సారథ్యంలో, హైదరాబాద్‌లోని నెక్నంపూర్ ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగులకు.. 167 గజాల స్థలంలో బ్రహ్మాండమైన ఇళ్లు  కట్టించి, అంతకంటే ముందు.. దానికి ఆగమేఘాలపై గవర్నమెంటు నుంచి అన్ని అనుమతులూ తెప్పించిన ఘనత, తమ నాయకుడు వెంకట్రామిరెడ్డిదేనని, ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇప్పటికీ  చెబుతుంటారు.కానీ, గిట్టనివారు మాత్రం.. సర్కారు ఆమోదించిన లే అవుట్‌ను ధిక్కరించి, నడిచేందుకు విడిచిపెట్టాల్సిన రోడ్లను కూడా,  తనను నమ్ముకున్న ఉద్యోగులకు కేటాయించారని.. అందుకే ప్రభుత్వం దానిని అనుమతించకుండా, నిలిపివేసిందని రెడ్డిగారిని నిందిస్తున్నారు. ఏం చేస్తాం..? చెట్టున్న కాయలకే రాళ్లు పడతాయి! నీలాపనిందలు కృష్ణ భగవానుడికే తప్పలేదు. వెంకట్రాముడెంత చెప్పండి?  సచివాలయ ఉద్యోగుల సంఘం-ఆంధ్రప్రదేశ్ గవర్మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్‌గా.. జమిలి బాధ్యతలు నిర్వర్తిస్తున్న, వెంకట్రామిరెడ్డిగారి ‘సామాజిక’ బాధ్యతను మెచ్చుకోని వారు, ‘సామాజిక’ ద్రోహుల కిందే లెక్క. కాదంటారా?