జాతీయ విద్యా విధానం – 2020

249

“National Education Policy – 2020 : Perspectives – Challenges in Implementation”
“జాతీయ విద్యా విధానం – 2020 : దృక్పథాలు – అమలు చేయటంలో సవాళ్ళు”

ప్రఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో National Education Policy – 2020 : Perspectives – Challenges in Implementation (జాతీయ విద్యా విధానం – 2020 : దృక్పథాలు – అమలు చేయటంలో సవాళ్ళు) అనే అంశంపై జాతీయ అంతర్జాల సదస్సు తేదీ 16, 17 ఆగష్ట్ 2020 లలో నిర్వహించబడుతోంది. ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (Vice-Chancellors) వక్తలుగా ఉండడం గమనించదగ్గ విషయం.
ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు గారు సంచాలకులుగా వ్యవహరిస్తున్న ఈ సదస్సులో మొదటి రోజు అనగా తేదీ 16.08.2020 నాడు ప్రారంభ సమావేశానికి  యోగి వేమన విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి వర్యులు ఆచార్య బి. శ్యామసుందర్ గారు అధ్యక్షత వహించి భారతీయ విద్యావిధాన చారిత్రకత గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశంలో వచ్చిన వివిధ విద్యా కమీషన్లను గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రధాన వక్తగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతివర్యులు ఆచార్య కె. వియన్నారావు గారు మాట్లాడుతూ భారతీయ విద్యావిధానంలో 1986 సంవత్సరం తరువాత వచ్చిన మూడవ పెద్ద విద్యాసంస్కరణ జాతీయ విద్యావిధానం 2020 అని తెలియజేశారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రధానంగా 4 విషయాలని తెలియజేస్తుంది. అవి 1. పాఠశాల విద్యా, 2. ఉన్నతవిద్య, 3. వృత్తి విద్య, 4. ఇవి అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యలు అనే అంశాలను గురించి చర్చించారు.
అస్సాం సైన్స్ అండ్ టెక్నాలజి విశ్వవిద్యాలయం, గౌహతి, ఉపకులపతి ఆచార్య ధీరజ్ బోరా గారు ప్రసంగిస్తూ జాతీయ విద్యావిధానం 2020 లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఆచరించగలిగితే స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) పాఠశాల స్థాయి నుండి విద్యార్థులలో ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఒడిస్సా కేంద్రీయ విశ్వవిద్యాలయం, కొరపుట్, ఉపకులపతి వర్యులు ఆచార్య ఐ. రామబ్రహ్మం గారు మాట్లాడుతూ ఆత్మనిర్భర భారత్ సాకారం కావాలంటే విద్యావిధానం 2020 అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం పూర్వ ఉపకులపతి ఆచార్య కె. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈ జాతీయ విద్యా విధానం 2020 ప్రధాన ఉద్దేశం ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని విషయ పరిజ్ఞానంగల దేశంగా తయారుచేయడమేనని తెలియజేశారు.
యోగివేమన విశ్వవిద్యాలయం, కడప ఉపకులపతి ఆచార్య ఎం. సూర్యకళావతి గారు ప్రసంగిస్తూ దేశం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందాలంటే విద్యావిధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
జవాహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, అనంతపురం ఉపకులపతి ఆచార్య ఎస్. శ్రీనివాస కుమార్ గారు మాట్లాడుతూ ఈ జాతీయ విద్యావిధానం అమలు చేయడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియచేశారు.
వివిధ కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (Vice-Chancellor), పూర్వ ఉపకులపతులు (Former Vice-Chancellor) పాల్గొన్న ఈ సదస్సు మొదటి సమావేశాన్ని ప్రత్యక్షంగా 100 మంది, పరోక్షంగా YOUTUBE( https://www.youtube.com/watch?v=qsXrSJrGE08&feature=youtu.be )ద్వారా 560 మంది వీక్షించారు. ఈ కార్యక్రమంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్ గారు, ఆచార్య భారతుల శారదాసుందరి గారు, ఆచార్య చల్లా శ్రీరామ చంద్రమూర్తి గారు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, చరిత్రశాఖ సహాయాచార్యులు డా. ఎస్. శ్రీనివాసరావు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ సహాయాచార్యులు డా. వరప్రసాద్ గారు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐ‌ఐ‌ఐ‌టి-ఒంగోలు) డా. మన్నూరు శివప్రవీణ్  సమన్వయకర్తలుగా వ్యవహరించారు.