‘కమలం’ మెడపై జగన్ ‘హోదా’ కత్తి

152

జీవీఎల్ ఎక్కడ సారూ?
సోము మాట్లాడరేం?
అన్నింటికీ విష్ణు ఒక్కడేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అప్పుడు చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి. పార్టీలు వేరయినా పాలిసీలు సేమ్ టు సేమ్. ఇద్దరి లక్ష్యం బీజేపీని ఇరుకున పెట్టడమే. కమలం మెడపై కత్తి పెట్టడమే. కాకపోతే బాబు కళ్లు ఉరుముతూ.. జగన్ కన్ను కొడుతూ. తేడా అదే!  ఇద్దరిదీ.. హోదా ఇవ్వని బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి, ప్రత్యర్ధులను పేల్చే వ్యూహం. 15 నెలల నుంచీ హోదాపై పెదవి విప్పని జగనన్న, ఇప్పుడు పంద్రాగస్టు వేదికపై నుంచి గళం విప్పారు. కేంద్రంపై పోరాటం చేస్తామని సెలవిచ్చారు. అంటే.. కేంద్రం హోదా ఇవ్వడం లేదన్న పాత గాయాన్ని మళ్లీ రేపారు. తన జోలికి వస్తే, హోదా అస్త్రం సంధిస్తానన్న పరోక్ష హెచ్చరిక సంకేతం పంపారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, భవిష్యత్తులో  సాధిస్తామని చెప్పడం ద్వారా, బీజేపీ-టీడీపీ జీరో.. తానొక్కడినే హీరోనన్న సంకేతాలు పంపారు. అయినా ఏపీ కమలదళపతి సోము వీర్రాజు పలకలేదు. రాష్ట్రంలో చిన్న చప్పుడయితేనే, నేనున్నాన ంటూ ప్రత్యక్షమయ్యే జీవీఎల్ నరసింహారావులో ఉలుకులేదు.  సుజనా చౌదరిలో పలుకులేదు. మాజీ అధ్యక్షుడు కన్నాలో చలనం లేదు. ఎటొచ్చీ.. అన్ని అంశాలపై స్పందించే విష్ణువర్దన్‌రెడ్డే మళ్లీ దిక్కు. ఇదీ ఏపీ బీజేపీలో వైచిత్రి.

‘పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా కోరుతూనే ఉంటాం. కేంద్రం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా వచ్చే అవకాశం లేకపోయినా, హూదాను కచ్చితంగా సాధించే ధృడ సంకల్పంతో ఉన్నాం. ఈరోజు కాకపోతే భవిష్యత్తులోనయినా.. కేంద్రం మనసు మారి, హోదా వస్తుందన్న నమ్మకంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పంద్రాగస్టు వేడుక వేదికపై స్పష్టం చేశారు.అంటే.. చంద్రబాబు మాదిరిగా, తన అమ్ములపొదిలో హోదా అస్త్రం రిజర్వుగా ఉందని జగన్, బీజేపీకి చెప్పకనే చెప్పినట్టయింది. ఈ విషయంలో ఆయన బాబు వ్యూహాన్నే అమలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

జగన్ చెప్పినట్లు.. ఎప్పటికయినా హోదా సాధిస్తానన్న హామీ,  ఎప్పటికి-ఎన్నేళ్లకు  నెరవేరుతుందన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ, కేంద్రంలో బీజేపీ సర్కారే కొనసాగుతుంది. అంటే అప్పటివరకూ జగన్ ఏమీ చేయలేరన్నది సుస్పష్టం. ఆ ప్రకారంగా అప్పటివరకూ హోదాపై ఇదేవిధంగా ప్రకటనలు, హెచ్చరికలు చేస్తూనే ఉంటారు తప్ప, విపక్షంలో ఉన్నప్పటి మాదిరిగా.. ఎంపీలు రాజీనామాలు చేయబోరని అర్ధమవుతూనే ఉంది. నిజంగా.. జగన్‌కు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేస్తే, తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి, తిరిగి ప్రజల తీర్పు కోరతారని సవాల్ చేసి ఉండాలి. కానీ, హోదాపై బంతిపూల యుద్ధం చేస్తామన్న తరహా ప్రకటనలు, వైసీపీ అప్పటిలా రాజీనామాలకు సిద్ధంగా లేదన్నది స్పష్టం చేస్తోంది.

అయితే.. జగన్ మళ్లీ వ్యూహాత్మకంగా ప్రత్యేక హోదాను ప్రస్తావించినా.. బీజేపీలో చలనం లేకపోవడం, ఆ పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. గతంలో ఎవరైనా హోదాను డిమాండ్ చేస్తే.. ఎక్కడో ఢిల్లీలో ఉండే జీవీఎల్, ‘అది ముగిసిపోయిన అధ్యాయం. రాష్ట్రానికి కావలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. అంత ప్యాకేజీ స్వతంత్ర భారతంలో, ఏ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేద’నే పడికట్టు పదాలు వాడే, ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు.. ఇప్పుడు జగన్, హోదాపై గళం విప్పినా పత్తా లేకపోవడం బీజేపీ శ్రేణులను విస్మయపరిచింది. కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ.. రాష్ట్రంలో చీమచిటుక్కుమన్నా ఏపీలో వాలిపోయిన జీవీఎల్, చాలారోజుల నుంచీ పత్తాలేకపోవడం ప్రస్తావనార్హం.

ఇక గతంలో హోదా డిమాండ్ చేసిన చంద్రబాబుపై ఒంటికాలితో లేచిన, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. సీఎం జగన్ హోదాపై మాట్లాడి ఇన్ని గంటలయినా, ఆయనపై మాటల దాడి చేయకుండా, మౌనరాగం ఆలపించడం కమలనాధులను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి సీఎం జగన్ హోదాపై గళం విప్పిన వెంటనే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వేగంగా స్పందించి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక జగన్, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని స్పష్టం చేసినప్పుడు..ఆయనపై ఒంటికాలితో లేచే, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మౌనవ్రతం పాటించడం బీజేపీ శ్రేణులను విస్మయపరుస్తోంది. ఇటీవల.. కమలం-కరోనా ఒక్కటేనని మంత్రి కొడాలి నాని దారుణమైన విమర్శ చేసినా, అధ్యక్షుడి నుంచి ఎంపీల వరకూ ఎవరూ స్పందించకపోవడాన్ని, పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయోధ్య భూమిపూజను, 200కి పైగా చానెళ్లు ప్రత్యక్ష  ప్రసారం చేశాయి. కానీ  టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఆపని చేయకపోవడాన్ని.. బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ద్‌రెడ్డి, రమేష్‌నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విష్ణు అయితే ఒకడుగు ముందుకేసి, శారదాపీఠానికి జగన్ వెళ్లినప్పుడు ఇచ్చిన ప్రత్యక్ష ప్రసారం, మోదీ అయోధ్య భూమిపూజకు వెళ్లినప్పుడు ఎందుకివ్వలేదని నిలదీశారు. ఆ సమయంలో బీజేపీ నేత యామినీశర్మ కూడా, టీటీడీ వైఖరిని విమర్శించారు. అయితే, విచిత్రంగా విష్ణు-రమేష్‌నాయుడును విడిచిపెట్టి.. అంతకంటే తక్కువ విమర్శలు చేసిన యామినీపై టీటీడీ కేసు పెట్టడం విస్మయపరిచింది. ఆమెపై కేసు పెట్టిన టీటీడీ వైఖరిని, బీజేపీ నేతలెవరూ ఖండించకపోవడం ఒక ఆశ్చర్యమయితే.. రాష్ట్ర అధ్యక్షుడు సోము ఆలస్యంగా ఖండిస్తూ, ఆమెపై పెట్టిన కేసు ఎత్తివేయాలని ట్వీట్ చేయడం మరో ఆశ్చర్యం. బహుశా.. యామినీశర్మను  పార్టీ నేతలు, బీజేపీ నేతగా ఇంకా మానసికంగా గుర్తించడం లేదేమో?!

అయితే..సీఎం జగన్ ప్రకటనపై, పార్టీ సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి మాత్రం.. అందరికంటే ముందుగానే స్పందించి, పార్టీ పరువు కాపాడారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘ఇలాంటి అబద్ధపు మాటలు, హామీలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని’ విష్ణు సీఎంపై ఎదురుదాడి చేశారు. చాలాకాలం నుంచీ వివిధ అంశాల్లో.. పార్టీ అగ్రనేతలు అనేక కారణాలతో మౌనం వహించినా, విష్ణు మాత్రం ఎప్పటికప్పుడు పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి విష్ణువర్దన్‌రెడ్డి నిలదీయడం వల్లే, టీటీడీ బోర్డు ఎస్వీబీసీ సీఈఓను తొలగించింది. తిరుమల భూముల అమ్మకాలపైనా ఆయనే గళమెత్తారు.

చివరకు హోదాపై బీజేపీని ఇరికించే ప్రయత్నం చేసిన జగన్‌పైనా.. విష్ణువర్దన్‌రెడ్డే ఎదురుదాడి చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈవిధంగా రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా విష్ణువర్దన్ ఒక్కరే దిక్కవుతున్నారని సీనియర్లు చెబుతున్నారు. ‘‘సీఎం స్థాయి వ్యక్తి చేసే ప్రకటనలకు, ఆస్థాయిలో స్పందించాల్సిన అధ్యక్షుడు మౌనంగా ఉంటే, విష్ణు ఎదురుదాడి చేయడం బట్టి, రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చురుకుగా ఉంటున్నారు? ఎవరు మౌనంగా ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. దీన్నిబట్టి మా పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్లవరకూ, రాజకీయ శిక్షణా తరగతులు పెట్టాల్సిన అవసరం ఉందని అర్ధమవుతోంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.