ఏ వెలుగులకీ ప్రస్థానం ..

144

చేసింది చాలు. ఒక్క నిముషం కుదురుగా నిలబడదాం. మనలోకి మనం తొంగి చూసుకుందాం. ఉరుకులు, పరుగుల దివాలా జీవితానికి కొన్ని క్షణాలయినా విరామమిద్దాం. ఇన్నేళ్ల నిరంతర, నిరంతరాయ శ్రమతో ఏమి సాధించాం, ఏం కోల్పోయాం? స్థిమితంగా రెండు నిముషాలు ఆలోచిద్దాం. ఓ ఐదు నిముషాలయినా సమీక్షించుకుందాం. “క్షణం తీరిక లేదు – పైసా ఆదాయం లేదు” .. అన్నట్టే కదా జర్నలిస్టులుగా దశాబ్దాల తరబడి పని చేస్తున్నాం. ఏ ఆశయాలతో ఈ వృత్తిలోకి వచ్చాం, ఏ “విలువ”ల్లోకి పతనమయ్యాం? సమాజం కోసం ఏం చేయాలనుకున్నాం, చివరికి ఏమి అందించాం? కుటుంబానికి ఎంత సాధించాం, ఇంట్లో ఏమి కోల్పోయాం. ఒక్క పది నిమిషాలు స్థిరంగా నిలబడి ఆలోచించే వెసులుబాటును కల్లోలిత కరోనా కాలంలోనూ మనం కల్పించుకోలేమా?

అలా అయితే చెప్పుకోడానికి మరేమీ ఉండదు. మన ప్రాణమే మనతో మిగలదు. ఈ నాలుగు నెలల్లో ఎందరు మిత్రులను కోల్పోయాం? ఎందరి ప్రాణాలను బలిచేశాం? మరెందర్ని పణంగా పెట్టాం! గత నెలరోజులుగా మన దుస్థితి మరెంత దయనీయంగా మారిందో చూస్తూనే వున్నాం. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక దుర్వార్త వింటూనే ఉన్నాం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి విశ్రమించే లోపు గుండెలు పగిలే విషాద దృశ్యాలెన్నో చూస్తున్నాం. ఎవరికీ చెప్పుకోలేని మనో వేదనను అనుభవిస్తున్నాం. కడుపు నిండా తినగలుగుతున్నామా? ఆ ఆరు గంటలైనా కంటి నిండా నిద్రిస్తున్నామా? చస్తూ బతుకుతూ పడుతూ లేస్తూనే, కుటుంబానికి కాసింత మనశ్శాంతినయినా ఇవ్వగలుగుతున్నామా?

సరే .. ఇన్నాళ్లూ గడిచిందంతా స్వర్ణయుగమే అనుకుందాం. కాలరెగరేద్దాం. ఆత్మవంచన చేసుకుందాం. మనకు అలవాటే కదా..! సిగ్గూశరం లేకుండా బతికేస్తున్నాం, అవునా? కాదా? కరోనా కల్లోలంలో మనకు కష్టమొస్తే, సాయం చేసిన వాడెవడైనా వున్నాడా? పోనీ, కనీసం మనసు విప్పి మాట్లాడిన వాడు వున్నాడా? అయ్యో పాపం .. అని స్పందించిన వాడున్నాడా? మన జీవనోపాధికే పనిచేశామని వొప్పుకుందాం. పాతికేళ్ల, ముప్పయ్యేళ్ళ మన కెరీర్ ను ఒక్కసారి వెనక్కి తిరిగి పోల్చుకుంటే.. వాడెక్కడున్నాడు? మనమెక్కడ కునారిల్లుతున్నాం! వేలకోట్లు కూడబెట్టిన యజమానులకు కానివాళ్ళమయ్యాం. లక్షల కోట్లకు పడగలెత్తిన పాలకుల ముందూ పురుగుల కన్నా హీనంగా మిగిలాం. ఇకనైనా సిగ్గుపడదామా? అదే గొర్రెలమందలా కుంటుతూ, దేకుతూ వెట్టిచాకిరీ చేద్దామా? ఫాల్స్ ప్రిస్టేజ్ తో అల్పసంతోషిగా కుక్కచావు చద్దామా? మైండ్సెట్ మార్చుకొని కొంత కాలమైనా ఆత్మగౌరవంతో బతికుందామా..!?

– పాషా