డియర్ కామ్రేడ్స్…ఏం చేస్తున్నారిప్పుడు!?

143

సీపీఐ ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారూ, నమస్కారం.
బాగున్నారా? .నేను-భోగాది వేంకట రాయుడు ని.జగన్ ప్రభుత్వం పై పేపర్లలో,టీవీల్లో మీ రోజువారీ ప్రకటనలు చూస్తున్నాను. ఈ విషయం లో చంద్రబాబు నాయుడుతో మీరు పోటీ పడుతున్నట్టుగా ఉంది. అయితే నాకో సందేహం కలిగింది. జగన్ ప్రభుత్వపు ‘అప్రజాస్వామిక’తీరుపై ఆందోళన వ్యక్తం చేయడం లో మీరు కనపరుస్తున్న శ్రద్ధ, కన్సీస్టెన్సీ, ఆవేదన-ఆంధ్రాలో సీపీఐ ని బతికించడంలో…బలోపేతం చేయడం లో…ముందు తరాల వారికి అందించడం లో- మీలో పెద్దగా కనిపించడం లేదేమో అన్న అనుమానం కలుగుతోంది. ఈ అనుమానం నా ఒక్కడికే కాదు. నిర్లక్ష్యమైపోయే వర్గాలకు బాసటగా సీపీఐ మరికొంత కాలమైనా నిలబడాలని కోరుకునే వారిలో చాలామందికి కలుగుతోంది.
చండ్ర రాజేశ్వరరావు లాటి గొప్ప పోరాట మహా మహాయోధులకు వారసుడిగా మీరు రాష్ట్ర సీపీఐ సారధ్య బాధ్యతలు చేపట్టారు.
సీపీఐ అంటే ఏమిటి? సీపీఐ కి; అందులోంచి విడిపోయి వేరేగా పెట్టుకున్న సీపీఎం కి గల మౌలిక తేడాలు ఏమిటి? అసలు సీపీఐ ఎందుకు చీలిపోయింది? సీపీఐ ప్రయాణం గత 70 సంవత్సరాలలో ఎలా సాగుతూ వస్తున్నది? ఈ పార్టీ నిర్మాణం కోసం…లేకపోతే….ఆశయాల కోసం…తమ జీవితాలను అర్పించిన మహా నాయకులు ఎవరు? నీలం సంజీవరెడ్డి గురించి భావి తరాలకు తెలియక పోయినా… వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు గానీ; నీలం రాజశేఖరరెడ్డి గురించి తెలియాలి కదా! ఈ రకంగా తమ జీవితాలను సీపీఐ కోసం అర్పించిన మహా నేతలు గురించి తెలియాలి కదా! మీరు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన తరువాత…పార్టీ లోకి ఎంతమంది విద్యార్థులు, యువకులు, శ్రామికులు, చిరుద్యోగులను ఆకర్షించారు? ఎన్ని శిక్షణా శిబిరాలను నిర్వహించారు. అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, యూత్ ఫెడరేషన్, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభలు గానీ; శిక్షణా శిబిరాల నిర్వహణకు గానీ తోడ్పడి; వాటి మనుగడను బలోపేతం చేయడానికి మీరు ఈ అయిదారేళ్లలో మీరు చేసిన కృషి తెలుసుకుని సంతోషిద్దామని ఉంది.
ఎందుకంటే…నేను గుంటూరు జే కే సీ కాలేజ్ లో చదివే రోజుల్లో…కే. నారాయణ అని విద్యార్థి నాయకుడు ఉండేవారు. గుంటూరు కొరిట పాడు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చదువుతూ ఉండేవారు. అన్ని కాలేజ్ లూ తిరగడం…చురుకైన విద్యార్థులు అనుకున్నవారిని పరిచయం చేసుకోవడం…సాయంత్రాలు కొరిట పాడు పార్క్ కు ఆహ్వానించి; వారితో సరదాగా ఇష్టాగోష్ఠి రాజకీయ సమావేశాలు నిర్వహించడం…వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేసేవారు. బ్రాడిపేట శంకర్ విలాస్ ఎదురుగా అరండల్ పేట వైపు మెయిన్ రోడ్ మీదే ఉన్న ఇస్కస్ కార్యాలయం లో విద్యార్థులతో సమావేశాలు పెట్టి…సీపీఐ అంటే ఏమిటి? ఇస్కస్ అంటే ఏమిటి? వంటి విషయాలు సరదాగా (నొప్పి కలగని ఇంజక్షన్ తరహాలో) చెబుతూ ఉండేవారు.
మా కాలేజ్ ఏ ఐ ఎస్ ఎఫ్ టీమ్ కు నేను లీడర్ ని. అప్పటికే..సీపీఐ లో సీనియర్ లీడర్స్ (జిల్లా కార్యదర్శి)గా ఉన్న వల్లూరి గంగాధరరావు గారి అబ్బాయి నాగార్జున..వేములపల్లి శ్రీ కృష్ణ(అప్పుడు ఆయన ఎం.పి అని గుర్తు) గారి చిన్నమ్మాయి కల్పన నా టీమ్ లో మెంబెర్స్. మాకు ముప్పాళ్ల నాగేశ్వరరావు నాయకుడు. పొట్టిగా ఉంటాడని చిన్న నాగేశ్వర రావు అనే వాళ్ళం. పొడుగు నాగేశ్వర రావు అని మరొకరు ఉండేవారు. పైన- వెంకటప్పయ్య. ఆయన పైన- కే. నారాయణ. మేమంతా కలిసి, 15 రోజులకోసారి స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన మా పిల్ల శాల్తీలతో ఎంతో ఆత్మీయంగా…కలివిడిగా మాట్లాడేవారు. స్టాలిన్ గారి భార్య- మా అందరికీ తినటానికి ఏదో ఒకటి చేసి పెట్టేది.
ఆ రోజుల్లో…బాంగ్లాదేశ్ విమోచన పోరాటం జరుగుతోంది. బాంగ్లాదేశ్ లోని ఢాకా యూనివర్సిటీ నుంచి టిటో అనే విద్యార్థి నాయకుడు గుంటూరు వచ్చారు, బాంగ్లాదేశ్ పోరాటానికి సంఘీభావాన్ని కూడగట్ట డానికి. నారాయణ అప్పటికప్పుడు ఇస్కస్ మేడ మీద విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. నేనూ, కల్పనా, నాగార్జున- రోడ్ మీద నిలబడి జోలె పట్టి 600 రూపాయలు వసూలు చేశాము. టిటో ప్రసంగం ముగియగానే…మేము సేకరించిన 600 రూపాయలను నారాయణ -టిటో కు అందచేశారు. మేము ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాము.
అలా…విద్యార్థుల ,యువజనుల, కార్యకర్తల శిక్షణా శిబిరాలు నిరంతరం ఎక్కడో ఓ చోట జరుగుతూ ఉండేవి.
ఇప్పుడు…అలా ….ఎక్కడైనా జరుగుతున్నాయా రామకృష్ణ గారూ?
కొత్తగా సీపీఐ లోకి ఏటా ఎంతమంది వస్తున్నారు? వారికి పార్టీ మూల సిద్ధాంతాలు తెలియచేస్తున్నారా? శిక్షణా తరగతులు నిర్వాహిస్తున్నారా?
పేపర్లలో, టీవీ లలో చూస్తున్న దానిని బట్టి… మీరు శిక్షణా శిబిరం నుంచి శిక్షణా శిబిరానికి గాక; ఎన్నికల నుంచి ఎన్నికల దాకా పార్టీ ని నడిపిస్తున్నట్టుగా కనపడుతున్నది.
తెలుగు దేశంను పట్టుకుని కొన్నాళ్ళు వేలాడారు. అది కుదరక పోతే…జనసేనను పట్టుకుని వేలాడారు. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశంను పట్టుకుని వెళ్ళాడే క్రమంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ-రాష్ట్రంలో-గంగా భగీరధీ సమానురాలవడంతో మీకు వేలాడే ఆప్షన్ లు తగ్గిపోయాయి.
మీరు ఏపార్టీతో జత కట్టినా… శాసనసభలో మీకు ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉన్నాయో…ఇకముందూ అన్నే ఉంటాయి-నేల విడిచి సాము చేసినంత కాలమూ.
మీరు జత కట్టాల్సింది ఈ పార్టీలతో కాదు. సీపీఐ కార్తాకర్తలతో. శ్రేయోభిలాషులతో. అభిమానులతో.
రాష్ట్రం అంతా తిరగండి. పార్టీని బతికించుకోవడానికి మీ వంతుగా ఏమి చేయాలో తెలుసుకోడానికి వారితో సమావేశాలు నిర్వహించండి. నోట్స్ రాసుకోండి. వచ్చిన సూచనల్లో నిర్మాణాత్మకంగా ఉన్నవాటిని అమలు చేయడానికి చిత్తశుద్ధితో మీరు కృషిచేస్తున్నారనే భావన పార్టీ అభిమానులకు;శ్రేయోభిలాషులకు కలగనివ్వండి.
పేపర్ స్టేట్మెంట్లు…జగన్ కు ఉత్తరాలే… ప్రధాన వ్యాపకంగా పార్టీని నడిపించకండి. అవి ఎప్పుడైనా చేయవచ్చు. పేపర్ లూ ఎక్కడికీ పోవు. జగనూ ఎక్కడికీ పోరు. కానీ సీపీఐ పోతుందేమో అనే భయం ఉంది.

-భోగాది వెంకట రాయుడు

1 COMMENT