సామాజిక  ‘గంధం’ పూస్తున్న కలెక్టర్ ‘చంద్రుడు’

1060

అనాగరిక సంస్కృతికి తెరదించిన యువ అధికారి
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

రాజరిక యుగం ముగిసి, ప్రజాస్వామ్య పాలన మొదలయి ఏళ్లు గడుస్తోంది. అయినా అప్పటి ఫ్యూడల్ నేతలు వదిలిన బానిక భావనలోనే మగ్గుతున్న జనం ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ప్రధానంగా నిరక్షరాస్యత తక్కువగా, చేతులు చాచే అలవాటున్న గ్రామాల్లో చెప్పులు తీసి నడవడం, పెద్దోళ్ల ముందు చేతులు కట్టుకుని, కింద కూర్చునే పాతరాతియుగ సంస్కృతి కొన్ని చోట్ల ఇంకా కనిపిస్తూనే ఉంది. ప్రజలలో.. ప్రధానంగా కింది కులాలలో బలంగా నాటుకుపోయిన, ఈ బానిస భావనను తొలగించేందుకు ఓ యువ కలెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిన వైనమిది.

సాధారణంగా కలెక్టరంటే ఆ జిల్లాకు మకుటం లేని మహారాజు. జిల్లాలో ఆయన తర్వాతనే ఎవరయినా. ముఖ్యమంత్రికి తప్ప మరెవరికీ జవాబుదారీ కాదు. చట్టంలో ఆయనకు సంక్రమించిన అధికారాలు అన్ని మరి! మరి అలాంటి కలెక్టరంటే ఎలా ఉంటారు? డాబు-దర్పంతో వెలిగిపోతుంటారు. బంట్రోతులు, బంగ్లాలో కొలువుతీరే కలెక్టర్లలో, జనం మధ్య తిరిగే వారు బహు తక్కువ. ఒకప్పుడు శంకరన్, ఒకప్పుడు హైదరాబాద్ మెట్రోవాటర్ బఓర్డు ఎండీగా పనిచేసిన ఎళ్వీ సుబ్రమణ్యం, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న రెడ్డి సుబ్రమణ్యం,  రెండేళ్ల వరకూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి, ఇప్పుడు ఏపీ సీఎంఓలో ఉన్న ధనుంజయరెడ్డి, స్మిత సభర్వాల్‌తో పాటు..  ఆమ్రపాలి, దేవసేన, శ్వేతమహంతి, మహ్మద్ అబ్దుల్ అజీమ్, సృజన వంటి ఐఏఎస్‌లకు పనిరాక్షసులని పేరు. వీరిలో ఆమ్రపాలి, శ్వేతమహంతి, అజీమ్, సృజన, దేవసేన దారి వేరు. ఏదైనా సమస్య వస్తే క్షేత్రస్థాయికి వెళతారు. వీరంతా ఇళ్ల వద్ద కంటే ఆఫీసులో గడిపే సమయమే ఎక్కువ. ఆ పని అయ్యేదాకా వదలరు.

రెడ్డి సుబ్రమణ్యం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు, రాత్రి 11 గంటల వరకూ అవిశ్రాంతంగా ఆఫీసులోనే పనిచేసేవారు. మంత్రుల వెంట బస్తీ పర్యటనలను వెళ్లినప్పుడు, ప్రజలు చెప్పిన సమస్యలను తన వద్ద చిన్న టేప్‌రికార్డర్‌లో నమోదుచేసేవారు. తిరిగి ఆఫీసుకు వెళ్లినప్పుడు వాటిని, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాల రూపంలో పంపేవారు. మెట్రోవాటర్ బోర్డు ఎండీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం కూడా రాత్రివరకూ పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అందుకే ఏళ్లు గడుస్తున్నా వారిని ప్రజలు మర్చిపోరు.

కలెక్టర్లలో రెండు రకాలుంటారు. ఒకరు తమ పని తాము చేసుకుపోతూ, మిగిలిన విషయాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తారు. మరొకరు పైవారి మెరమెచ్చుల కోసం, పనిచేస్తున్నట్లు నటిస్తుంటారు. ఇప్పటితరం కలెక్టర్లు-మున్సిపల్ కమిషనర్లు మాత్రం, ఎక్కువగా ప్రజలలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నతనం నుంచీ కష్టపడి, ఆర్ధికంగా వెనుకబడిన సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అధికారులయితే.. నేలవిడిచి సాము చేయకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనిషిని మనిషిగా చూస్తున్నారు.

ఈ కోవకు చెందిన అధికారి, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు! జిల్లా కలెక్టర్‌గా వచ్చిన వెంటనే.. సామాజిక కోణంలో వేసిన అడుగులు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -ఫ్యూడలిజం- వెనుకబాటుతనం-అణచివేత ఎక్కువగా ఉండే రాయలసీమలో, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు సహజంగా చెప్పులు బయట విడిచి లోపలకు వస్తారు. చేతులు కట్టుకుని కొందరు, నేలమీద కూర్చుని మరికొందరు తమ సమస్యలు చెబుతుంటారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా.. అది అనాగరిక పద్ధతులని, ఇది బానిస యుగం కాదని చెప్పి, కుర్చీలో కూర్చోమని చెప్పిన అధికారులు కూడా, ఇప్పటివరకూ ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే ఇది దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఓ కట్టుబాటు లాంటి అలవాటు.

అక్కడి జనంలో గూడుకట్టుకున్న,  కట్టుబాటు లాంటి ఈ అనాగరిక అలవాటుకు.. కడు పేదరికంలో పుట్టి, సామాజిక కట్టుబాట్లను అనుభవించి వచ్చిన చంద్రుడు, కలెక్టర్‌గా చరమగీతం పలికారు. ఎవరూ చెప్పులు విప్పి లోపలికి వెళ్లి.. అధికారుల వద్ద కింద కూర్చోవడానికి వీల్లేదని, వారిని కచ్చితంగా కుర్చీల్లోనే కూర్చోబెట్టి గౌరవించాలంటూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు పోస్టర్లు పెట్టించారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. అలాంటి పాతరాతి యుగ ఆలోచనకు, పాతర వేస్తున్న అద్భుత దృశ్యం.. ఇప్పుడు అనంతపురం జిల్లాలో దర్శనమిస్తోంది. వెనుకబడిన కులంలో పుట్టి ఎంతోమంది కలెక్టర్లయినప్పటికీ, సామాజికకోణంలో జరుగుతున్న ఈ అనాగరిక అలవాటును మాత్రం, ఎవరూ సరిదిద్దలేకపోయారు. అదే వర్గం నుంచి వచ్చిన చంద్రుడు మాత్రం ఆ సామాజికకోణాన్ని దర్శించి, దిద్దుబాటకు దిగడం అభినందనీయమే.

ఎవరికయినా కలెక్టర్ కావడం అంత సులభం కాదు. అందులోనూ, గంధం చంద్రుడు వంటి నిరుపేద-దళిత వ ర్గాల నుంచి వచ్చిన వారికి చాలా కష్టం. అయితే, నిరంతర అధ్యయనం, నిత్యసాధన, ఉన్నత విద్య చదవాలన్న తపన, ఐఏఎస్ కావాలన్న పట్టుదల.. కలసి వెరసి ఆయనను ఐఏఎస్‌గా మార్చింది. దానికి నవోదయ విద్యాలయలో విద్య పునాది వేసింది. కర్నూలు నవోదయ విద్యాలయలో చదివిన చంద్రుడు ఒక్కరే కాదు. ఇప్పుడు జడ్జిగా ఉన్న  ప్రవీణ్,  భువనేశ్వర్‌లో కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న తిరుమల నాయక్, ఒడిషాలో ఎస్పీగా ఉన్న గంగాధర్, చత్తీస్‌గఢ్‌లో ఎస్పీగా ఉన్న ఉదయకిరణ్, తెలంగాణ పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న  బట్టు నవీన్‌కుమార్ కూడా, ఆ స్కూలులో చదివిన వారే. ఆవిధంగా తన నేపథ్యం మరిచిపోకుండా.. తాను చూసిన అనాగరిక సంస్కృతికి, తనకు సంక్రమించిన కలెక్టర్ హోదాలో, సామాజిక అసమానతలకు తెరదించిన చంద్రుడిని,  సామాజిక స్పృహ ఉన్న ఎవరయినా అభినందించాల్సిందే.

రాష్ట్రంలో ఉపాథి హామీ పధకం కింద.. పని కావాలని అడిగిన ప్రతివారికీ పనికల్పించే వ్యవస్థకు శ్రీకారం చుట్టిన, చంద్రుడు ప్రయోగం కేంద్రప్రభుత్వాన్ని మెప్పించింది. కోవిద్ నివారణ చర్యలు, గ్రామీణ ఉపాథి హామీ పనులలో అద్భుతమైన ఫలితాలు సాధించారు. అంటే రోజుకు ఆరులక్షల మందికి పని కల్పించి, రాష్ట్రంలోనే అత్యధిక మందికి పనికల్పించిన జిల్లాగా రికార్డు సృష్టించారు.  ఫలితంగా స్కోచ్ అవార్డు ఆయనకు దక్కింది.  క్వారంటైన్ సెంటర్లలో ఉన్న, కరోనా బాధితుల మానసిక ఉల్లాసం కోసం.. షటిల్, క్యారమ్, వాలీబాల్ వంటి క్రీడలు ఏర్పాటుచేసి, అందరినీ మెప్పించారు. కరోనా బాధితుల వద్దకు వెళ్లేందుకు బంధువులే వెనకంజ వేస్తున్న సమయంలో..  పీపీఈ కిటు, మాస్కులు-గ్లౌజులు వేసుకుని రోగుల వద్దకు వెళ్లి, వైద్యం అందిస్తున్న వైనాన్ని స్వయంగా పరిశీలించిన చంద్రుడు చొరవను, కేంద్ర ఆరోగ్య శాఖ అభినందిస్తూ ట్వీట్ చేసింది. చంద్రుడి చర్యలు రోగులలో మానసిక ఉల్లాసం-స్ధైర్యం పెంచుతాయని ప్రశంసించింధి. ఉపాథి హామీ పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లి, కూలీలలో కూలీగా మారిన చంద్రుడు చొరవ, పొలంలోకి దిగి రైతులతో పాటు, వ్యవసాయం చేసిన వైనం అందరి ప్రశంసలు అందుకుంది. కరోనా కల్లోలంలో ప్రైవేటు వైద్యం తీసుకునేందుకు, రాష్ట్రంలో తొలుత చొరవ తీసుకున్న కలెక్టర్ కూడా చంద్రుడే కావడంవిశేషం. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన చంద్రుడుకు-అనంతపురం జిల్లా కలెక్టర్‌గా చేస్తున్న గంధం చంద్రుడుకూ.. అసలు పోలికలే కనిపించవన్న వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తుంటుంది.