‘ప్రైవేటు’పై వేటు.. అంత వీజీ కాదు!

183

అవి ‘కాసు’ పత్రులు మరి
‘యాడ్స్’ మత్తులో నిజాలు దాస్తున్న మీడియా
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రోజుకు కేవలం లక్ష రూపాయలతో మాత్రమే కోవిడ్ సేవలందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వేటు వేయాలన్నది పాలకుల కోరిక. అదో కల కూడా. నిజమే.. అది కలే మరి! పాలకులతో పరిచయాలు-బంధుత్వాలు, రాజకీయనాయకులతో మిత్రత్వాలు, ఎన్నికలప్పుడు చేతికి ఎముక లేకుండా పార్టీలకు చందాలు, కొంపలు మునిగిపోయే వార్తలు వచ్చినప్పుడు మీడియాకు ప్యాకేజీలు సమర్పించే ప్రైవేటు ఆసుపత్రులు.. సర్కారు వారి బెదిరింపు-అదిరింపులకు భయపడతారనుకోవడమే పెద్ద జోకు.

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు,  రోగుల భయాన్ని సాధ్యమయినంత వరకూ సొమ్ము చేసుకుంటున్నాయి. చికిత్సకు తాము నిర్దేశించిన ఫీజులు మాత్రమే, వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణలో అయితే, ఆంధ్రాలో కంటే ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో.. పాలకులకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఓ ఖరీదైన ఆసుపత్రిలో, దర్శకుడు బాపు సోదరుడి చికిత్సకు భౌతిక కాయంతో కలిపి 12 లక్షలయ్యాయట. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ పరకా ప్రభాకర్ ట్వీట్ చేస్తేగానీ వెలుగుచూడలేదు.

అక్కడ పాపం రోజుకు కేవలం, లక్ష రూపాయలు మాత్రమే ఫీజు. అది కూడా ముందస్తుగా చెల్లించాల్సిందే. అంత ఉదారంగా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తోంది. ఆ ఆసుపత్రి నిలువుదోపిడీ విధానానికి నిరసనగా, ఇటీవల బీజేపీ కార్యకర్తలు ధర్నా కూడా నిర్వహించారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా రాకపోవడం, ముందు టీవీల్లో స్క్రోలింగులు మాత్రమే వచ్చి.. తర్వాత మాయమవుతుండటం బట్టి, తెరవెనుక ఏం జరుగుతోందో, మెడపై తల ఉన్న ఎవరికయినా సులభంగా అర్ధమవుతుంది.


తాజాగా క్రైస్తవ నాయకుడయిన జెరూసలేం మత్యయ్య, ఓ క్రైస్తవ పేషెంటుకు విధించిన బిల్లుపై వాగ్వావాదానికి దిగితే, మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై మృతుడి తల్లి తాజాగా, మార్కెట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తమ వద్ద వసూలు చేసిన 16 లక్షల రూపాయలు తిరిగి ఇప్పించాలని ఆయన తల్లి కోరింది. ఆసుపత్రి వేసిన బిల్లును కూడా మీడియాకు చూపించారు. అయితే, అంతకుముందు మృతుడి బంధువే,  స్వయంగా యాజమాన్యం తప్పేమీ లేదని, లిఖితపూర్వకంగా లేఖ రాసి ఇచ్చారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. బాపు సోదరుడి మృతి కూడా.. పత్రికల్లో కరోనా మృతి అని కాకుండా, సాధారణ మృతిగానే రావడం మరో ఆశ్చర్యం.


ఇక హైదరాబాద్‌లో దాదాపు ప్రతీ ఆసుపత్రి, కరోనా చికిత్సకు రోజుకు కనీసం లక్ష రూపాయలు వసూలుచేస్తోంది. ఇవన్నీ అధికార-ప్రతిపక్ష పార్టీతో సత్సంబంధాలు ఉన్నవే కావడం, మీడియాలో అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో భారీ ప్యాకేజీలు ఇస్తుండటం వల్ల, ఇలాంటివేవీ వెలుగులోకి రావడం లేదు. సికింద్రాబాద్‌లోని ఓ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి, అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో, అసలు అది నిబంధనలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. విపక్షాలు కూడా ఒకరోజు ఆరోపణలు చేసి, రెండోరోజు వాటి గురించి మాట్లాడకపోవడంతో.. ఈ జేబుదోపిడీనీ ప్రశ్నించేవారు గానీ, వెలుగులోకి తెచ్చేవారు గానీ లేకుండా పోయారు. చివరకు కోర్టు కూడా.. కరోనా చికిత్సకు అయ్యే ఫీజులను బోర్డులో ఉంచాలని, ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నదీ ప్రకటించాలని  ఆదేశించింది. అయినా పట్టించుకునే దిక్కులేదు.

ఆంధ్రాలో అయితే కొన్ని ఆసుపత్రులు మాత్రమే, కరోనా చికిత్స చేస్తున్నాయి. చికిత్సకు నిరాకరించే ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఇటీవలి కాలంలో హోటళ్లను లీజుకు తీసుకుని, అక్కడ రోగులకు చికిత్స చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, రోగులను దారుణంగా దోచుకుంటున్నాయి.   ఇటీవలి స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనతో అది వెలుగుచూసింది. వాటిలో ఉన్న సౌకర్యాలు గానీ, వసూలు చేస్తున్న బిల్లుల గురించి గానీ, ఆ హోటళ్లకు ఉన్న భద్రత గురించి గానీ అధికారులు పట్టించుకునే దిక్కులేదు. తాజాగా రాజధాని హైదరాబాద్‌లో.. కరోనా రోగులపై కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడీకి, మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఫలితంగా కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో,  అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని, సగం బెడ్లు ప్రభుత్వానికి, అంటే అది పంపించే రోగులకు ఇవ్వాలని ఆదేశించింది. అంటే.. జీఓ నెంబర్ 248 ప్రకారం.. ఐసోలేషన్ బెడ్డుకు రోజుకు 4 వేలు, ఐసియుకి 7,500, వెంటిలేటర్‌కు 9 వేలు వసూలు చేయాలి. నర్సింగ్ సేవలు, టుడీ ఎకో, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజులు, మరికొన్ని పరీక్షలతోపాటు, రోగికి భోజనం అంతా కలిపి, ఈ ప్యాకేజీలో చేర్చారు.

అందుకు అంగీకరించిన యాజమాన్యాలు, తెలివిగా మరో మెలిక పెట్టాయి. మిగిలిన సగం బెడ్లలో.. మా ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేస్తామంది. అది కూడా నిరుపేదలకు మాత్రమే, సిఫార్సు చేయాలని షరతు విధించింది. మా త్యాగానికి ఆ మాత్రం ప్రతిఫలం ఇవ్వకపోతే ఎలా అని మెలికపెట్టడంతో, ఫీజుల నియంత్రణ వ్యవహారం తేలకుండా నానింది. పాపం తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. కార్పొరేట్-ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయకూడదని కన్నెర్ర చేసినా, ఇప్పటికి రెండు బడా ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్పొరేట్లా? మజాకానా?