ఛీ..ఛీ.. ఇంత కులపిచ్చనా.. యాక్.. థూ!

636

అదో కులాంధ్రప్రదేశ్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మనం ముందు భారతీయులం. ఆ తర్వాతే కులం-మతం-ప్రాంతం-భాష. ఇది అన్నం తినేవారందికీ తెలిసిన ప్రాధమిక సూత్రం. కానీ ఆంధ్రావాళ్లు మాత్రం, ముందు కులంతోనే పుడతారు. కులంతోనే పెరుగుతారు. కులంతోనే సహవాసం చేస్తారు. కులమే తింటారు. కులంతోనే సంపాదిస్తారు. కులాన్నే తాగుతారు. కులంతోనే చస్తారు. ఎవరికైనా అంతో ఇంతో కుల స్పృహ ఉంటుంది.  కానీ దేశంలో కులపిచ్చ మాత్రమే ఉన్న రాష్ట్రం ఏదయినా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే! ఈ పిచ్చి రాష్ట్రం-దేశ సరిహద్దులు దాటి, అమెరికా వరకూ విస్తరించి.. అక్కడ కూడా తెలుగువారి పేరుతో కులసంఘాలు కళ్లు తెరిచిన అరాచక పరిస్థితి వరకూ వెళ్లింది. ప్రాణాలు పోసే వైద్యులు-ఆసుపత్రులకు సైతం కులాన్ని అంటగట్టి వేధిస్తున్న తీరు చూస్తే.. కాంగ్రెసునుద్దేశించి కేసీఆర్ చేసిన, ‘థూ.. మీ బతుకులు చెడ’ అన్న తిట్లు గుర్తుకు రాక మారదు. ఇది మనం మనుషులం అన్నం నిజం. కాదనే దమ్ము ఎవరికైనా ఉందా?

రెడ్ల రూటే వేరు..

ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని పుట్టించనంత వరకూ, ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలలో రెడ్లదే పెత్తనం. రాష్ట్రాన్ని ఏలిన వారిలో ఎక్కువమంది రెడ్లే. నీలం సంజీవరెడ్డి నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కాలం వరకూ.. రెడ్లకు అధికారయావ, వర్గాలు-ముఠాల ఆలోచన తప్ప పెద్దగా డబ్బు ధ్యాస లేదు. శాశ్వతంగా అధికారం తమ వద్దనే ఉంచుకోవాలన్న లక్ష్యమే తప్ప, ఐదారు తరాలకు సరిపడా తినాలనే ఆశ వారిలో కనిపించదు.  సహజంగా రెడ్లు అన్నివర్గాలతో సులభంగా కలిసిపోయే తత్వంతో ఉంటారు. కొంచెం బోళాతనం కూడా కనిపిస్తుంటుంది. ఫ్యాక్షనిజం-రౌడీఇజం-ముఠా కక్షలు అది వేరే వ్యవహారం.

పైసలు కన్నా పేరు కోసమే బతికిన నాటి నేతలు

జిల్లా నుంచి, కేంద్రమంత్రి పదవులు చేసిన కాసు-కోట్ల కుటుంబాలు, వారి జీవితకాలంలో సంపాదించింది శూన్యం. ముఖ్యమంత్రులు-కేంద్రమంత్రులుగా పనిచేసిన అలాంటి కుటుంబాలకు.. ఇప్పటికీ వ్యవసాయం, పొలాల నుంచి వచ్చే పంటలే ఆదాయవనరు. సరే.. వారి వారసులెవరైనా, ఈ ఆధునిక యుగంలో తెలివివచ్చి, కొద్దో గొప్పో సంపాదించుకోవచ్చేమో? కానీ, అర్ధంతరంగా రాజకీయాల్లోకి వచ్చి.. ఐదారుతరాలు తినికూర్చేంతగా సంపాదించుకుంటున్న, ఈతరం నేతల ముందు.. అలాంటి పెద్ద కుటుంబాలు ఎప్పటికీ చిన్నవే. అలాంటి తరహా నేతలను చూసి,  ఎలా బతకాలో ఆ పెద్ద కుటుంబాలు నేర్చువాల్సిందే!  నాటి రాజకీయాలను రెడ్లు ఏకపక్షంగా శాసించినా, ఇప్పటిమాదిరిగా కులపిచ్చ అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. గ్రామ రాజకీయాలను బ్రాహ్మణులకు అప్పగించారు. అయితే 1973 వరకూ రాజకీయాలను శాసించిన బ్రాహ్మణ వర్గం, రెడ్ల రాకతో వెనుకబడిపోయింది. సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వరకూ అందరూ రెడ్ల బాధితులే.

కాంగ్రెస్ జమానా తీరే వేరు

అయితే రెడ్డి నేతలు,  వ్యాపారాల్లో కమ్మవారిని ప్రోత్సహించారు. దళిత-మైనారిటీ వర్గాలను మరీ దగ్గరికి తీసుకోకపోయినా, వారిని రాజకీయంగా ప్రోత్సహించారు. ఎన్నికల్లో వారే రెడ్ల నాయకులకు రక్షకులు. ఇక ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కాపులకు పెద్దపీటనే వేశారు. జనాభా-పట్టు ఎక్కువగా ఏ కులానికి ఉంటుందో ఆ కులం వారిని ఆదరించేవారు. చివరకు కలెక్టర్ నుంచి సీఐల పోస్టింగులు కూడా అదే కోణంలో కనిపించేవి. ఎటొచ్చీ, నాటి రెడ్ల పాలనలో ఎదగనిది, పాపం బీసీలొక్కరే. అయితే అప్పటికి రెడ్లలో కులస్పృహ ఉంది తప్ప, కులపిచ్చలేదు.ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతనే, కులపిచ్చి మొగ్గతొడిగిందన్నది నిర్వివాదం. అప్పటివరకూ వ్యవసాయ-వ్యాపార-వినోద-పత్రికా రంగాలను శాసిస్తూ వస్తున్న కమ్మ వర్గానికి, ఎన్టీఆర్ ఓ ప్రత్యామ్నాయంగా- ఓ దేవుడిలా కనిపించారు. కమ్మ జర్నలిస్టుల ప్రాధాన్యం-ప్రాబల్యం కూడా టీడీపీ వచ్చిన తర్వాతనే మరింత పెరిగింది. అప్పటివరకూ పత్రికారంగంలో బ్రాహ్మణులు-వామపక్ష భావజాల ఇతర కులాల వారికే ప్రాధాన్యం ఉండేది.

 ఎన్టీఆర్ రాకతో కమ్మవర్గంలో పెరిగిన దూకుడు

టీడీపీ వచ్చాక దానిని అధికారంలోకి తెచ్చేందుకు, ‘ఈనాడు’ పత్రిక బహిరంగంగానే శ్రమదానం చేసింది. అభ్యర్ధుల జాబితా, దాని మేనిఫెస్టో, ఎన్టీఆర్ ఎన్నికల సభలకు ప్రచారం ఇవన్నీ ఈనాడు రామోజీ నాయకత్వంలో నడిచిన ప్రయోజిక కార్యక్రమాలే. ఆరకంగా టీడీపీతో ఆ బంధం ‘ఈనాడు’ మొదలయింది కాదని అర్ధమవుతూనే ఉంది. రెడ్ల పాలనలో అనాధలుగా మారిన బీసీలు, టీడీపీకి మూలస్తంభాలయ్యారు. దానితో సాదా సీదా బీసీలకు రాజకీయాల్లో అవకాశం వచ్చింది. అప్పటికి గుంటూరు-ప్రకాశం-కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల్లో మాత్రమే, కమ్మ వర్గం కొంతమేరకు కాంగ్రెస్‌లో ప్రభావం చూపింది. వారి ప్రాబల్యం దృష్య్టా రెడ్లు, ఆ జిల్లాల్లో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే వంటి కీలకపదవులు కమ్మ వర్గానికి కేటాయించారు.  ఆవిధంగా.. అంగ-అర్ధబలం దండిగా ఉన్నప్పటికీ, రాజకీయాధికారం లేదని కుమిలిపోతున్న కమ్మ వర్గానికి,  ఎన్టీఆర్ రూపంలో ఓ నాయకుడు దొరికారు. దానితో కాంగ్రెస్‌లో అప్పటివరకూ పనిచేస్తున్న కమ్మ నాయకులంతా టీడీపీలోకి దూకేశారు.

బీసీలను అందలమెక్కించిన ఎన్టీఆర్

డాక్టర్లు-లాయర్లు-టీచర్లు-వ్యాపారులయిన, కొత్త కమ్మ యువతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.  పల్నాడు, సీమలోని కొన్ని జిల్లాల్లో రెడ్లపై దాడులు జరిగాయి. ఇక అక్కడి నుంచి కులపిచ్చి పెరిగి పెద్దదయింది. టీడీపీపై కులముద్ర ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం బీసీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటి బీసీ ప్రముఖులంతా ఎన్టీఆర్ దయ వల్ల ఈ స్థాయికి వచ్చిన వారే. పార్టీపై ఉన్న కులముద్ర-ఎన్టీఆర్‌పై లేకపోవడం అదో విచిత్రంగా అనిపించేది. అప్పటికే దళితులపై దాడులు పెరుగుతున్నాయి. కారంచేడు దానికి పరాకాష్ఠగా నిలిచింది. ఆ తర్వాత పార్టీ నాయకత్వ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతికి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ వృద్ధ నేతలు కాలం చేశారు. మరికొందరు తెరమరుగయ్యారు. వారి స్థానంలో, దూకుడుగా వెళ్లే రాజశేఖర్‌రెడ్డి వచ్చారు. ఆయనతో చాలామంది రెడ్డి వర్గ నేతలు పోటీ పడినా.. మెజారిటీ రెడ్లు మాత్రం, జనాభిమానం దండిగా ఉన్న వైఎస్ వెనుకే నిలిచారు. వారికితోడు బ్రాహ్మణ- కాపు-మైనారిటీ నేతలు వైఎస్‌కు దన్నుగా నిలిచారు.

‘ఉమ్మడి’లో మొదలయిన టీడీపీ కులపిచ్చి

చంద్రబాబు తొలిసారి సీఎం అయి-వైఎస్ పూర్తిగా కాంగ్రెస్‌లో కీలకనేత  స్థాయికి ఎదిగిన తర్వాత.. ఉమ్మడి రాష్ట్రంలో కులపిచ్చి మరింత ముదురు పాకానపడింది. కొందరు రెడ్లు అధికారఫలాల కోసం టీడీపీలో ఉన్నా, మానసికంగా వైఎస్‌నే అభిమానించేవారు. బాబు సీఎం అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా.. కమ్మ వర్గానికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా, మంత్రి పదవుల వద్ద మాత్రం జాగ్రత్తపడ్డారు. కానీ జిల్లాల్లో పెత్తనం మాత్రం వారిదే. అయితే ఎన్టీఆర్ హయాంలో స్వేచ్ఛ అనుభవించిన బీసీలు, బాబు జమానాలో రాజకీయంగా నిమిత్తమాత్రులయ్యారు. మంత్రివర్గంలో యనమల, ఎర్రన్నాయుడు వంటి అతికొద్దిమందికి ప్రాధాన్యం ఇచ్చినా, మిగిలిన విషయాల్లో జిల్లాల్లో కమ్మ వర్గానిదే హవా. అయితే, నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం బాబు సామాజిక న్యాయం పాటించారు. డబ్బున్న వారికి, కాంట్రాక్టర్లకు, రియల్టర్లకు రాజకీయాల్లో తలుపులు తెరిచిన ఘనత కూడా బాబుదే. వారంతా ఎక్కువమంది కమ్మవారే ఉండటంతో, ఎన్టీఆర్ కంటే బాబు నాయకత్వంపైనే కులముద్ర ఎక్కువ పడింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ, చంద్రబాబుకు కులాభిమానం కంటే- అధికారం-కీర్తి కాంక్ష ఎక్కువగా ఉండేది.

ఉమ్మడి రాష్ట్రంలో కమ్మలను దూరంగా ఉంచిన బాబు

కానీ,  ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ బాబు, కమ్మవారిని రాజకీయంగా పెద్దగా ప్రోత్సహించలేదు. తెలంగాణలో బీసీ-మాదిగలను పూర్తి స్థాయిలో రాజకీయంగా ప్రోత్సహించారు. పారిశ్రామిక-వ్యాపార రంగాల్లో ఉన్న కమ్మవారిని మాత్రం బాగా ప్రోత్సహించారు. అయినప్పటికీ, రాజకీయంగా తమకు పెద్దపీట వేయకపోవడం, తమను ప్రోత్సహిస్తే బీసీలు ఎక్కడ దూరమవుతారోనన్న భయంతో.. బాబు తమను పక్కనపెడుతున్నారని, కమ్మ వర్గం అప్పట్లో అసంతృప్తితో రగిలిపోయేది. చివరకు బాబుతో యూత్ కాంగ్రెస్ నుంచి కలసి నడిచిన, కొమ్మినేని వికాస్ వంటి నాయకులకూ ప్రాధాన్యం దక్కలేదంటే.. బాబు ఇతర కులాలను చూసి, నాడు  ఏ స్థాయిలో భయపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

ఏళ్ల తర్వాత రెడ్లలో పెరిగిన కులపిచ్చి

వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు రాజకీయాలన్నీ బాబు-వైఎస్ మధ్య వ్యక్తిగతంగా,  పోటాపోటీగానే ఉండేవి. వైఎస్ పాదయాత్ర ఆయన ఇమేజీని ఆకాశానికి పెంచింది. అప్పటికి బాబు తన కులం వారిని ప్రోత్సహించకపోయినా, జిల్లాల్లో వారి పెత్తనం ఇతర కులాలకు ఇబ్బంది కలిగించింది. దానికితోడు ప్రభుత్వోద్యోగులతోపాటు, అన్ని వర్గాలూ బాబుపాలనపై విసుగుచెందాయి. ప్రధానంగా.. రెడ్డి సామాజికవర్గంలో అప్పుడే  తొలిసారి కులపిచ్చి మొదయింది. చివరకు తెలంగాణలోని రెడ్లంతా ఏకపక్షంగా, కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన పరిస్థితి. అప్పటికి కొన్నేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటం, స్థానికంగా పెత్తనంలేక గౌరవం తగ్గిపోవడంతో.. ఎలాగైనా కాంగ్రెస్‌ను గెలిపించి, వైఎస్‌ను సీఎంగా చూడాలన్న కసి పెరిగింది.

వైఎస్ హయాం నుంచి రెడ్లలో కులభావన

ఫలితంగా ఎన్నికల్లో  కాంగ్రెస్ గెలిచి, వైఎస్ సీఎం అవడంతో రెడ్లలో దూకుడు పెరిగింది. అప్పటివరకూ కమ్మవారికే పరిమితమైన అన్ని వ్యాపారాల్లో, రెడ్లు కూడా పోటీగా రంగప్రవేశం చేశారు. వైఎస్ కూడా.. వ్యాపారస్తుల ప్రాధాన్యం గుర్తించి,  మైనింగ్-సిమెంట్-రియల్‌ఎస్టేట్-లిక్కర్-భవననిర్మాణ రంగంలో రెడ్డివర్గ వ్యాపారులను ప్రోత్సహించారు.  రెడ్ల యువతలోనూ ‘ఇది రెడ్డిరాజ్యం’ అనే భావన వచ్చింది. దానికి తగినట్లుగానే వైఎస్,  మెజారిటీ పదవులన్నీ వారికే కట్టబెట్టారు. దానిపై ఇప్పటి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం-దేవేందర్‌గౌడ్ ‘రెడ్డివారే మీకు దొడ్డవారా’ అని గర్జిస్తూ, ఆ జాబితా విడుదల చేశారు.

విభజన తర్వాత పెరిగిన కులపిచ్చి

ఆ తర్వాత వైఎస్ మృతి చెందడం, రోశయ్య-కిరణ్ సీఎం కావడం, రాష్ట్ర విభజన కావడం జరిగిపోయింది. విభజన తర్వాత ఎన్నికల్లో కమ్మవర్గం ఏకతాటిపైకి రాగా, రెడ్లు కూడా జగన్ కోసం ఏకతాటిపైకి వచ్చారు. అప్పటికి పదేళ్లు అధికార వియోగంలో ఉన్నందున, కమ్మవర్గంలో కసి-పట్టుదల పెరిగి, మళ్లీ తమ పాలన తెచ్చుకోవాలన్న భావన పెరిగింది. నిజానికి ఎన్నికలకు మూడునెలల ముందు వరకూ,  వైసీపీ ఖాయంగా అధికారంలోకి వస్తుందన్న అంచనా బలంగా ఉంది. కానీ కమ్మ సామాజికవర్గం సర్వశక్తులూ ఒడ్డి, నిధులు సమీకరించి, అప్పటివరకూ తమకు వ్యతిరేకంగా ఉన్న కాపు-బ్రాహ్మణ వంటి ‘సంప్రదాయ టీడీపీ వ్యతిరేక కులాలను’ దరిచేర్చుకుని, అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఓడినా 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది.

అంతా కులం కంపు

 ఇక అక్కడి నుంచే ఏపీలో వృక్షంగా ఉన్న కులపిచ్చి, గత ఎన్నికల నాటికి మహావృక్షమయింది. అది సోషల్‌మీడియాలో పేర్ల చివర కులాలను తగిలించి, దూషించుకునేంత వరకూ చేరింది.  ఆ అరాచక సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ కులాన్ని.. రాజకీయంగా దూరంగా పెట్టిన బాబుకు, విభజిత రాష్ట్రంలో ఆ కులాన్ని ప్రోత్సహించడం అనివార్యమయింది. దానికితోడు, కొత్తతరం కమ్మ యువ నేతలు లోకేష్ నాయకత్వం చుట్టూ మూగారు.  ఎస్సీల నియోజకవర్గాల్లో కూడా కమ్మ నేతల పెత్తనమే సాగింది. పారిశ్రామికవేత్తలు-వ్యాపారులతోపాటు, కాసులిచ్చిన వారికి అన్ని రకాల పందేరాలు చేయడం, అందులో కమ్మ వర్గం వారే ఎక్కువగా ఉండటాన్ని, జగన్‌పార్టీ సోషల్‌మీడియా బాగా వాడుకుంది. అప్పటికే టీడీపీని-వ్యక్తిగతంగా చంద్రబాబును చూసి.. ఆయనతో నడిచిన కమ్మ పెద్ద నేతలు, యువ నేత జోక్యం పెరగడంతో వెనకడుగు వేశారు. ఎన్నికల తర్వాత పూర్తిగా నిష్క్రమించారు.

కమ్మ-రెడ్లు ఇలా..

నిజానికి రెడ్లు సమాజంలో అన్ని వర్గాలతో కలసిపోతారు. పైగా ఇతరులను ఆదుకునే గుణం ఎక్కువ. ఆ లక్షణాలు కమ్మవర్గంలో కనిపించవు. వారిదంతా వ్యాపారదృక్పథం. సమాజంలో ఒక వర్గంగా ఉండటమే తప్ప, సమాజంతో కలసి ఉండే అలవాటు లేదు. అవకాశాలు అందిపుచ్చుకుని, పరిస్థితులకు తగ్గట్లు ఎటువైపయినా మళ్లే తెలివితేటలు ఎక్కువ. తొలుత కాంగ్రెస్-తర్వాత టీడీపీ. ఇప్పుడు వైసీపీ. అధికారంలో ఎవరున్నా పనులు చేయింకోవడంలో వారి తర్వాతయినా ఎవరయినా. మిగిలిన కులాలతో పోలిస్తే.. కష్టపడే గుణం ఎక్కువగా ఉండే కమ్మవర్గం, రెడ్ల మాదిరిగా సమాజం కోసం డబ్బు ఖర్చు చేయదు. మిగిలిన కులాలతో పోలిస్తే, ఐకమత్యం-సాటి  కులస్తుడిని ఆదుకోవడంలో కమ్మవర్గమే ముందుంటుంది. బహుశా ఈ కారణాలతోనే కమ్మ వర్గం వెంట ఏ సామాజికవర్గం దన్నుగా  ఉండదేమో?

కుల విద్వేషానికి సోషల్ మీడియానే వేదిక

బాబు అధికారంలో ఉన్న సమయంలో జగన్ పార్టీ మీడియా..  టీడీపీని పూర్తి స్థాయి కమ్మ పార్టీగా చూపించడం ద్వారా, మిగిలిన కులాలను దాని నుంచి వేరుచేయడంలో విజయం సాధించింది. దానికితోడు.. కోస్తా ప్రాంతంలో అనేకమంది కమ్మ యువకులు, తమ వాహనాైలపె ‘చౌదరి’ అని.. స్టిక్కర్లు తగిలించుకునే అతి చేష్టలు కూడా, వారిపై ఇతర వర్గాల్లో ఒకరకమైన ఈర్ష్యను పెంచడానికి కారణమయింది. దానికి అనుగుణంగానే వైసీపీ సోషల్‌మీడియా.. ప్రతి కమ్మ నేత పేరు చివర ‘చౌదరి’ అన్న ట్యాగ్ తగిలించింది. చివరకు లోకేష్‌ను కూడా ‘లోకేష్ చౌదరి’ అని, ‘నిమ్మగడ్డ రమేష్ చౌదరి’ అని, ‘దేవినేని ఉమా చౌదరి’ అని, ‘కోడెల శివప్రసాదరావు చౌదరి’ అని బాహాటంగా కులముద్ర వేసి ప్రచారం చేసింది. తాజాగా అగ్నిప్రమాద ఘటన జరిగిన వెంటనే రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్‌పై ‘రమేష్ చౌదరి’ అని ముద్రవేసింది. దానిపై టీడీపీ సోషల్ మీడియా కూడా ‘జగన్‌రెడ్డి’ అన్న ప్రచారం చేసింది. చివరకు చాలామందికి తెలియని, ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లం కులాన్ని కూడా తెరపైకి తెచ్చి, ‘అజయ్‌కల్లం రెడ్డి’ అని జనాలకు పరిచయం చేసింది. ‘రాజారెడ్డి రాజ్యాంగమ’ంటూ కొత్త పదాన్ని వాడుకలోకి తెచ్చింది.

నాడు కమ్మవారిపై బురద వేసి నేడు ‘రెడ్డి’కార్పెట్

బాబు హయాంలో, కమ్మ వారికే పెద్దపీట వేస్తున్నారని ప్రచారం చేసిన జగన్ పార్టీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 700 మంది రెడ్లకు పదవులివ్వడాన్ని, టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ ప్రచారానికి తగినట్లుగానే జగన్ కూడా రెడ్లకే అన్నింటా పట్టం కడుతున్నారు. ఫలితంగా.. కమ్మ వారి పేరుతో టీడీపీపై బురద చల్లిన వైసీపీ, ఇప్పుడు రెడ్లను అందలమెకిస్తోందన్న భావన, మిగిలిన కులాల వారిలో బాగా నాటుకుపోయింది. చివరకు జగన్‌పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా,  ఏపీలో ‘రెడ్డిఇజం’ నడుస్తోందంటూ తూర్పారపట్టడం ప్రస్తావనార్హం.
ఏపీలో కులపిచ్చ ఉన్మాదం.. తీర్పులిచ్చే న్యాయమూర్తుపై కూడా కులముద్ర వేసి, వ్యక్తిత్వ హననం చేసేంత పరాకాష్ఠకు చేరడం అహస్యం కలిగిస్తోంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతి వ్యవస్థపై, వైసీపీ సోషల్‌మీడియా నిర్లజ్జగా బురదచల్లడంతో ఆ వర్గంపై సమాజంలో  ఏహ్యభావం ఏర్పడుతోంది.

ఆసుపత్రులకూ కులం అంటగడతారా?

చివరాఖరకు.. ప్రాణాలు పోసే వైద్యులకూ కులాలు అంటగట్టే పైశాచికానందానికి, ఏపీ కేరాఫ్ అడ్రసు కావడం సిగ్గుచేటు.
విజయవాడలో  కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న స్వర్ణప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దానిని రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ అనుమతితో లీజుకు తీసుకుంది. అగ్నిప్రమాదానికి కారణమైన అంశాలపై విచారరణ  చేయడం తప్పు కాదు. రోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని వారిని పీడించడాన్ని ఎవరూ స్వాగతించరు. దానిపై చర్యలు తీసుకోవలసిందే. కానీ, ఆ రెండూ కమ్మవారివి కాబట్టి.. జరిగిన ఘటనకు కమ్మవారే కారణమన్న ప్రచారాన్ని, వైసీపీ సోషల్‌మీడియా ప్రారంభించడమే అసహ్యకరం.

కుల విద్వేషానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్ర

ఆసుపత్రి యజమాని రమేష్‌ను ‘రమేష్ చౌదరి’ అని సంబోధిస్తూ, జరుగుతున్న ప్రచారం వెగటు కలిగించేదే. రేపు రెడ్లు నిర్వహించే ఆసుపత్రిలో..  ఏదైనా ఘటన జరిగితే, రెడ్ల ఆసుపత్రులపై ఇలాగే కులం ముద్ర వేసి వేధిస్తారా? అన్నది ప్రశ్న. ఆసుపత్రులకు అన్ని కులాల రోగులు వస్తారు.  కులాలను బట్టి వైద్యం చేసే దరిద్రపు సంస్కృతి ఎక్కడా ఉండదు. ఆసుపత్రులకు రోగుల పల్సు-పర్సు మాత్రమే కావాలి. మరోవైపు విజయవాడ ఆసుపత్రితో సంబంధం లేని, గుంటూరు రమేష్‌లో పనిచేసే రాయపాటి కోడలిపై, కేసు నమోదు చేయడం మరో వింత. దీన్ని బట్టి ఆంధ్రాలో కులపిచ్చి-కుల విద్వేషం ఎంత క్రూరమైన వికృతరూపం దాల్చినదో  అర్ధమవుతోంది. అందుకే ఛీ.. ఛీ.. యాక్..  థూ.. మీ బతుకులు చెడ అని, సామాజికస్పృహ ఉన్న ఎవరయినా అనకతప్పదు.