‘రెడ్డి’కార్పెట్.. గుట్టు రట్టు చేసిన రాజు!

498

రెడ్ల నియామకాల జాబితా విప్పిన రఘురాముడు
నిన్నటి వరకూ విపక్షమే నేడు స్వపక్షం కూడా 
బహిష్కరించకపోవడమే కారణమంటున్న వైసీపీ సీనియర్లు
రాజుకు జగన్ భయపడుతున్నారంటున్న నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇప్పటివరకూ ఏపీలో రెడ్డిరాజ్యం నడుస్తోందంటూ విపక్షాలే విరుచుకుపడుతున్నాయి. తాజాగా స్వపక్ష ఎంపీనే ఆ కులానికి వేస్తున్న రెడ్డికార్పెట్ గుట్టు రట్టు చేసి, జగన్మోహన్‌రెడ్డి సర్కారును అడ్డంగా ఇరికించేశారు. అధికారం వచ్చిన నాటి నుంచి, ఇప్పటివరకూ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల కోసారి నియమించిన రెడ్ల జాబితాను.. యుశ్రారైకా పార్టీ రెబెల్ ఎంపీ, రఘురామకృష్ణంరాజు బయటపెట్టి.. అధికార పార్టీపై కులముద్ర వేయడం, మిగిలిన సామాజికవర్గాలను రెచ్చగొట్టినట్లుగానే కనిపిప్తోంది. అయితే… ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు శరపరంపరగా విమర్శలు సంధిస్తూ, నగుబాటు పాలుచేస్తున్నా, ఇప్పటివరకూ ఆయనను బహిష్కరించకపోవడమే ఈ పరిణామాలకు కారణమని, యుశ్రారైకా పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

యుశ్రారైకా పార్టీ సోషల్‌మీడియా బాధ్యుడిగా పనిచేస్తూ, సమాచారశాఖలో ఇప్పుడు ప్రభుత్వ పదవిలో ఉన్న దేవేందర్‌రెడ్డి.. తనపై చేసిన కామెంట్లపై రఘురాముడు అగ్గిరాముడయ్యారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ, ఓ ఎంపీనయిన తనపై, ఎలా కామెంట్లు పెడతారని రాజు మండిపడ్డారు. దేవేందర్‌రెడ్డిని తొలగించాలని, ఆయన నేరుగా జగన్‌ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గత 16 నెలల నుంచి.. వరసగా జరుగుతున్న రెడ్ల నియామకాలపై గళం విప్పడం, అధికారపార్టీని ఇతర సామాజికవర్గాల వారి ముందు ముద్దాయిగా నిలబెట్టేలా ఉంది. రెండు రోజులకోసారి రెడ్లను ఏదో ఒక విభాగంలో నియమిస్తున్నారని.. సాక్షిలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వపదవులిచ్చి, సాక్షిలో పనిచేయించుకుంటున్నారని ఆరోపణల వర్షం కురిపించడం,  నిస్సందేహంగా అధికారపార్టీకి ఇరకాటమే.వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పదవులన్నీ, కమ్మ వర్గానికే ఇచ్చారన్న ప్రచారాన్ని జగన్ పార్టీ, క్షేత్రస్థాయికి తీసుకువెళ్లింది. కృష్ణా-గుంటూరు-ప్రకాశం జిల్లాలతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల్లో కమ్మ వర్గంపై సాధ్యమయినంత వరకూ, వ్యతిరేకతను పోగు చేయడంలో విజయం సాధించింది. ఫలితంగా.. కమ్మ వర్గానికి మిగిలిన సామాజిక వర్గాలు దూరమయ్యాయి. చివరకు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు కూడా, ఆ పార్టీకి దూరం చేయటంలో వైసీపీ వ్యూహబృందాలు విజయం సాధించాయి. తొలుత వైసీపీ వ్యూహబృందం.. రాష్ట్ర-విదేశాల సలహాదారులు, కన్సల్టెంట్లు, సమాచారశాఖలో పార్టీ బృందాలు, ఈనాడు-ఆంధ్రజ్యోతితోపాటు, కమ్మ వర్గానికి చెందిన టీవీ చానెళ్లకు ప్రకటనలు, పార్టీ ఆఫీసులో సిబ్బంది, పోలీసు విభాగంలో నియామకాల్లో కమ్మ వర్గ ప్రాధాన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది.

ఆయా రంగాల్లో మరొక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం, వైసీపీ ఆరోపించిన అంశాల్లో కమ్మ వర్గమే ఎక్కువగా ఉండటంతో.. ప్రజలు-సంబంధిత  వర్గాలు కూడా, దానిని నిజమేనని నమ్మడానికి అవకాశం ఏర్పడింది. డీజీపీ రాముడు, స్పీకర్ కోడెల, ఇంటలిజన్స్ చీఫ్‌గా ఏబి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ ఎండీగా సురేందర్‌బాబు,  పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సుజనా చౌదరి, ఎన్నారై సలహాదారుడిగా కోమటి జయరాం, వేమూరి రవికుమార్, ఐ. వెంకట్రావు తనయుడు అనిల్‌కు మీడియా, హరిప్రసాద్‌కు ఫైబర్‌నెట్ బాధ్యతలు అప్పగించడాన్ని.. సాక్షిలో, సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. దానికితోడు,  చుట్టూ కమ్మ వర్గం వారే ఎక్కువ కనిపించడం.. కీలక పదవుల్లో వారే ఎక్కువగా ఉండటం కూడా, వివిధ వర్గాల వారిలో వైసీపీ ప్రచారం నిజమని నమ్మేందుకు వీలు కల్పించింది.

ఓ దశలో కొందరు జర్నలిస్టులకు, మంగళగిరిలో స్థలాలు ఇచ్చారన్న ప్రచారానికి వైసీపీ సోషల్‌మీడియా తెరలేపింది. నిజానికి, ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన ప్రకటనలకు, ఇప్పటిదాకా బకాయి పడ్డ డబ్బులే చెల్లించలేదు. కమ్మ వర్గంపై ఆకాశమే హద్దుగా చేసిన ప్రచారం ఫలించిన ఫలితంగా, గత ఎన్నికల యుద్ధం.. కమ్మ-నాన్ కమ్మ అన్నట్లుగా సాగి, వైసీపీని అధికారంలోకి తెచ్చింది. అయితే, కమ్మ వర్గంపై ఆ స్థాయిలో ప్రచారం చేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత..  కీలక పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టడం చర్చనీయాంశమయింది. దానితో కమ్మ వర్గాన్ని విమర్శించిన వైసీపీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, రెడ్డి కార్పెట్ వేసిందన్న భావన ప్రజల్లో బలపడింది.

ఆ సందర్భంలో టీడీపీ కూడా.. ఈ 16 నెలల కాలంలో జగన్మోహన్‌రెడ్డి, దాదాపు 700 మంది రెడ్లకు పదవులిచ్చారని, యూనివర్శిటీ నియామకాల నుంచి వాలంటరీల వరకూ, రెడ్లనే నియమిస్తున్నారన్న విషయాన్ని ప్రచారం చేసింది. విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి, అజయ్‌కల్లం రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జస్టిస్ నాగార్జునరెడ్డి, ఐపిఎస్ అధికారి రాజేంద్రనాధ్‌రెడ్డికి ఇంటలిజన్స్ ఏడీజీ, కృష్ణమోహన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, భరత్‌రెడ్డి, హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కెసి రెడ్డి, కాస జగన్మోహన్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, దేవిరెడ్డి శ్రీకాంత్, ఎంవిఎస్ నాగిరెడ్డి, కె.రాజశేఖర్‌రెడ్డి, బైరాగిరెడ్డి, రోజారెడ్డి, ఉడుముల అశోక్‌రెడ్డి, బి.అనిల్‌రెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, సిహెచ్ పాండురంగారెడ్డి వంటి దాదాపు 700 మంది రెడ్లకు పదవులిచ్చారని.. టీడీపీ సోషల్‌మీడియా విభాగం, వాటి వివరాలను ప్రజల ముందు ఉంచింది.

తాజాగా రఘురామకృష్ణంరాజు.. జగన్మోహన్‌రెడ్డి పాలనలో, అంతా రెడ్లకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణ,  మిగిలిన సామాజికవర్గాల్లో కొత్త ఆలోచనలకు కారణమయింది. ప్రధానంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే బీసీ వర్గాల్లో, దీనిపై చర్చ మొదలయింది. ఎన్నికల ముందు కమ్మ వర్గంపై తమలో ద్వేషం రగిలించిన వైసీపీ.. ఇప్పుడు అన్ని రంగాల్లో ‘రెడ్డి’కార్పెట్ వేస్తున్నారన్న వాస్తవం తెలియడంతో, వైసీపీ తమను మోసం చేసిందన్న భావన స్ధిరపడింది. కీలకమైన పదవులన్నీ రెడ్లకు ఇస్తూ, టీడీపీ మాదిరిగానే.. అధికారం లేని మంత్రి పదవులు, బీసీ-ఎస్సీ-ఎస్టీలకు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజుకు జగన్ భయపడుతున్నారా?

సున్నితమైన కులభావన అనే తేనెతుట్టెను కదిపిన, రఘురామకృష్ణంరాజుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజు చేస్తున్న విమర్శలు- వ్యాఖ్యల కారణంగా.. సమాజం-వివిధ సామాజికవర్గాల్లో తమ పార్టీ ముద్దాయిగా మారాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. ఇప్పటికే రాజు వ్యాఖ్యల వల్ల హిందువుల్లో తమపై వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. దీనికి తమ అధినేత జగనే కారణమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజును ఆనాడే బహిష్కరించి ఉంటే, ఇప్పుడు ఈ సంకటస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు,  వ్యూహబృందం తప్పుడు సలహాలిస్తోందని విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లో అనుభవం లేని వారిని సలహాదారులుగా పెట్టుకుంటే, పరిణామాలు ఇంతకు భిన్నంగా ఉండవని ఓ మాజీ మంత్రి స్పష్టం చేశారు. ‘మాకు తెలిసి జగన్‌గారు ఎవరికీ  భయపడరు. ఆయన సోనియానే ఎదిరించారు. కానీ ఒక సాధారణ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజును చూసి, భయపడుతుండటమే మాకు ఆశ్చర్యం వేస్తోంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించకుండా, ఇంతకాలం ఎందుకు భరిస్తున్నారో మాకూ అర్ధం కావడం లేదు. రామకృష్ణారెడ్డి గారు జగన్‌గారికేదో సలహా ఇచ్చారంటున్నారు. రాజు బెజవాడ వస్తే ఆయనపై ఉన్న ఫిర్యాదుల కారణంతో అరెస్టు చేద్దామని జగన్‌గారికి సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అసలు ఆయనకు రాజకీయాలేం తెలుసని, జగన్‌గారు ఆయనను నమ్ముతున్నారో మాకు అర్ధం కావడం లేదు. రాజును పార్టీ నుంచి బహిష్కరిస్తే, ఇక ఆయన చేసే ప్రకటనలకు ఏమాత్రం విలువ ఉండదు. ఇది రాజకీయాల్లో ఓ కౌన్సిలరుకు సైతం తెలుసు. కానీ ఆ విషయం, పేపర్‌లో పనిచేసిన వాళ్లకు ఏం తెలుస్తుంది? ఇట్లా రాజకీయాల్లో ఓనమాలు తెలియనివాళ్లంతా, మా సార్ చుట్టూ ఉండటం మా ఖర్మ’ అని ఓ మాజీ మంత్రి వాపోయారు.