జనసేన-నాదెండ్ల మనోహర్! నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ !!

243

నాదెండ్ల భాస్కర రావు నాకు 1981 నుంచి మిత్రులు. చెన్నారెడ్డి ప్రభుత్వం లో ఆర్ధిక, వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా ఉన్న రోజుల నాటి నుంచి.
కుల స్పృహ తప్ప…కులతత్వం లేని రోజులు అవి. అప్పటికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించలేదు. చంద్రబాబు కూడా అప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు.
1982 లో ‘ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆ వర్కింగ్ జర్నలిస్ట్స్’ ఆధ్వర్యం లో రాష్ట్ర గ్రామీణ జర్నలిస్ట్స్ సదస్సు జరిపితే బాగుంటుందని రాష్ట్ర జర్నలిస్ట్స్ సంఘం నాయకుడు కే. శ్రీనివాస్ రెడ్డి(నేను ట్రైనీ సబ్ గా 1978 లో ఆంధ్రజ్యోతి లో చేరినప్పటినుంచి…ఇప్పటి దాకా ఆయనే….వివిధ హోదాలలో జర్నలిస్ట్స్ సంఘానికి మార్గదర్శి) ఒకసారి సూచించారు. అప్పుడు నేను ఏలూరులో ఆంధ్రజ్యోతి విలేకరిగా ఉన్నాను. ఆ సూచనను సవాలుగా తీసుకుని….; గ్రామీణ విలేకరుల తొలి రాష్ట్ర సదస్సు ను ఏలూరులో ఏర్పాటు చేశాం. మామూలుగా జర్నలిస్ట్స్ స్టేట్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిధిగా సీ. ఎం ను ఆహ్వానించడం; ఆయన రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ…ఏలూరు రాష్ట్ర సదస్సుకు అప్పటి ఆర్ధిక శాఖామంత్రి నాదెండ్ల భాస్కరరావు ను ఆహ్వానించాం. ఆయన ఏలూరు వచ్చి; రోజంతా వేదిక మీద ఉన్న నాటి సంపాదకులతో కలిసి కూర్చున్నారు.వారితోనే కలిసి ఆయన ఆరోజు భోజనం చేశారు. అదీ నా పట్ల ఆయనకు గల అభిమానం.ఇప్పటికీ నా పట్ల ఆయనకు ఆ అభిమానం ఉన్నదని అనుకుంటా.అప్పుడు నాదెండ్ల మనోహార్ 18 ఏళ్ల పిల్లోడు. అందుకే… మనోహర్ కు ఎలా చెప్పాలో అర్థం కాక; నాలో నేను ఓ ఏడాదిన్నర నుంచి పిసుక్కు చచ్చి పోతున్నాను.
నాదెండ్ల మనోహర్ చదువుకునే రోజుల్లో లాగా లేదు, ఇప్పటి సమాజం. అప్పుడు -జస్ట్ -కుల స్పృహే ఉండేది. ఇప్పుడు-కుల తత్వంతో కునారిల్లి పోతున్నది.
పవన్ కళ్యాణ్ ఎంతటి ఆదర్శ భావాలతో…., విశాల దృక్పథం తో జనసేన అంటూ ప్రజా జీవితం లోకి అడుగు పెట్టినప్పటికీ; క్షేత్ర స్థాయిలో ఆయనను బలపరిచేవారిలో- 85-90 శాతం మంది మాత్రం ఆయన కులస్థులైన కాపులే. తనకు కులం లేదని పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు గానీ; ఆయనను సమర్ధించే కాపులు అనుకోవడం లేదు.
పవన్ కళ్యాణ్ లాగా -కాపులూ ఆలోచిస్తే;ఆయన అటు కాపులకూ, ఇటు మిగిలిన కులాలకు కాకుండా పోతారు.
చివరకు, రాజకీయం గా అజ్ఞాతవాసి లా మిగిలి పోతారు.
ఈ పరిస్థితుల్లో -పవన్ కళ్యాణ్ పక్కన నాదెండ్ల మనోహర్ ను చూసి -తాము జీర్ణించుకోలేకపోతున్నామని అనేకమంది కాపు ముఖ్యులు, ప్రముఖులు నాకు చెప్పారు.కమ్మ వారి వ్యవహారశైలి పట్ల తమకు అనేక అనుమానాలు ఉన్నాయని విజయవాడ కాపు ప్రముఖులు కొందరు అన్నారు. వంగవీటి రంగా పక్కన చేరిన కాట్రగడ్డ రాజగోపాలరావు -రంగా నుంచి కాపు ముఖ్యులను దూరం చేశారని; అలాగే దాసరి నారాయణ రావు ను-ఆయన పక్కన చేరిన మాగంటి సుధాకర్ లాటి వాళ్ళు బాగా మిస్ లీడ్ చేశారని కొందరు కాపు ప్రముఖులు చెప్పారు. అయితే…ప్రజా జీవితం లో గుర్తింపు లోకి వస్తున్న కాపు నేతలు- తమ ఆర్ధిక అవసరాలకు బాగా ఉపయోగపడతారనే భావన తో కమ్మ వారిపై ఆధార పడుతుంటారు. ముద్రగడ పద్మనాభం కూడా తన ఆర్ధిక అవసరాలకు – బొడ్డు భాస్కర రామారావు పైనో; ఏలూరు లోని మాగంటి రవీంద్రనాథ చౌదరి గారి పైనో ఆధారపడేవారు. నువ్వొకందుకు పోస్తుంటే…నేను ఒకందుకు తాగుతున్నాను అనే సామెత ఇక్కడ అటూ-ఇటూ కూడా వర్తిస్తుంది. ఇందులో ఎవర్నీ తప్పు పెట్టాల్సిన పని లేదు. ఎవరి కన్వీనియన్స్ వారిది. అందుకే, పవన్ పక్కన మనోహర్ ను చూస్తుంటే…
గుండెల్లో ….కలుక్కుమని గుచ్చుకున్నట్టు ఉంటున్నదని ఒక మాజీ మంత్రి అన్నారు. ఈ అనుభవాలు, అభిప్రాయాలను చూస్తుంటే-;పవన్-మనోహర్ జోడీని కాపులు హర్షించలేకపోతున్నారు అనే మాటలో రెండో మాటకు అవకాశం ఉంటుందని నేను కూడా అనుకోవడం లేదు.
నాదెండ్ల మనోహర్ చిన్న వారేమీ కాదు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు చివరి స్పీకర్ గా చరిత్ర లో చోటు దక్కించుకున్న నేత. స్పీకర్లగా పని చేసిన అందరిలోకి వయసులో చిన్నవారు కూడా. రాష్ట్ర విభజన అనంతరం, మారిన రాజకీయ పరిస్థితుల్లో….కాంగ్రెస్ కనుమరుగై పోవడం తో ఆయన రాజకీయ జీవితం కూడా ప్రశ్నర్థకమై పోయింది.
నిజమే. ఎంత కమ్మ అయినప్పటికీ; చూస్తూ చూస్తూ తెలుగు దేశం లో చేరలేని పరిస్థితి ఆయనకు వారసత్వంగా వచ్చింది. వైసీపీ లో ఎందుకోగానీ…చేరలేదు. మెగా బ్రదర్స్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని; జనసేనలో చేరివుంటారు.
ఆయన, పవన్ కూడా దాదాపు సమ వయస్కులు.ఇద్దరూ రెండు పెద్ద ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా. మాజీ స్పీకర్ గా- మనోహర్ ఒక రాజకీయ స్థాయి కలిగిన వారు కావడం తో; ఆయనను జనసేన పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ నియామకం నిజంగా సమర్ధనీయమే.
ఇక్కడే…జనసేనను సమర్ధించే కాపులు బాగా ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతున్నది. పవన్ పక్కన ఆయనను కాపు ఓటర్లు ఊహించుకోడానికే ఇబ్బంది పడుతుండడం కూడా-ఆయన మొన్న రెండు చోట్లా ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణమని….పశ్చిమ గోదావరి కి చెందిన రాజకీయ ప్రముఖుడు ఒకరు నాతో అన్నారు. అంతకు ముందు చాలామంది నాతో ఆమాట అన్నారు గానీ;ఒక గొప్ప రాజకీయ కుటుంబానికి చెందిన ముఖ్యుడు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం తో-ఇప్పుడు నేనూ నమ్ముతున్నాను.
తన స్నేహితుడైన పవన్ కళ్యాణ్ కు; తన ఆత్మీయ మెగా ఫామిలీ కి నాదెండ్ల మనోహర్ ఒక సహాయం చేసి పెట్టాలి .
జనసేనకు ఆయన దూరంగా జరగాలి.
ఎటుదిరిగీ నాదెండ్ల భాస్కర రావు గారు ఇప్పుడు బీజేపీ లోనే ఉన్నారు. ఆ బీజేపీ కూడా జనసేనకు మిత్రపక్షంగా రాష్ట్రం లో ఉంది. అందువల్ల; మనోహర్ -జనసేన ను వదిలి బీజేపీ లో చేరితే; వారి స్నేహానికి ముప్పు వాటిల్లదు. పైపెచ్చు,బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ఆంధ్ర బీజేపీ లో ఉన్న కమ్మ నేతలకూ…ఆయనకూ సరిపడడం లేదు. ఆయన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కమ్మ నాయకులైన కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, కన్నెత్తి కూడా చూడలేదు.
అందుకని, బీజేపీ లో వారు కనపడని లోటును సోము వీర్రాజుకు తీర్చినవారూ అవుతారు; ఇటు జనసేనను సమర్ధించే కాపుల మనో భావాలను గౌరవించిన వారూ అవుతారు.
అందుకే;జనసేన క్షేమం కోరుకునే నేతగా-నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేసి; ఆ కుటుంబం తో సఖ్యత కొనసాగిస్తూనే-బీజేపీ లో చేరాలని ఆయనకు వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నాను. అదృష్టం కలిసివస్తే; ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి వంటి కేంద్ర బీజేపీ నేతల దృష్టిలో కూడా పడవచ్చు.

-భోగాది వెంకట రాయుడు