మానుకోట గాయం మానింది..ట!

699

జగన్ అనుచరులపై కేసుల ఎత్తివేత?
తెలంగాణ వాదులపై జగన్ అనుచరుల దాడి కేసు
మరి నాటి క్షతగాత్రుల మానసిక గాయం మానినట్టేనా?
ఆంధ్రాతో నీళ్ల పంచాయతీ వేళ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం
కేసీఆర్-జగన్ లాలూచీకి నిదర్శనమన్న బీజేపీ
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

అది 2010. మే 28. ఆంధ్రోళ్ల వలస పాలనకు వ్యతిరేకంగా, ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ కాలం. ముఖ్యమంత్రి రోశయ్య అయినప్పటికీ, పార్టీని ధిక్కరించి ఓదార్పు యాత్రకు వచ్చిన జగన్మోహన్‌రెడ్డికి, వరంగల్ జిల్లాలో స్వాగతం చెప్పిన కొండా సురేఖ అండ్ అదర్స్  ఆశ్చర్యకర తీరది. అంతకుమించి.. సమైక్యరాష్ట్రానికి జై కొట్టిన జగన్‌ను, గోబ్యాక్ అంటూ ఓరుగల్లు జిల్లా పోరలు, జగన్ బృందంపై రాళ్లెత్తిన రోజు ఇది. దానికి బదులుగా తెలంగాణవాదులపై జగన్ అభిమాన కాంగ్రెస్ శ్రేణులు కూడా, రాళ్లతోనే బదులిచ్చిన ఘటనకు వేదిక అది. హరీష్‌రావు, ఈటెల రాజేందర్ వంటి తెలంగాణ అగ్రనేతలు  తరలివచ్చిన రోజు. ఫలితంగా పోలీసు కాల్పులు, లాఠీచార్జిలో 13 మంది తెలంగాణ పోరాట యోధులు, క్షతగాత్రులయిన రోజది. లోక్‌సభలో సమైక్యాంధ్రకు జై కొట్టి, తెలంగాణకు నై చెప్పిన జగన్ వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు.. ఆయనకు వ్యతిరేకంగా మానుకొండలో ప్రతిధ్వనించిన నిరసన ధ్వనులు, తెలంగాణ ఉద్యమకారులపై విరిగిన పోలీసు లాఠీ గాయాలు, మోగిన తుపాకీ శబ్దాలు.. అన్నీ మానసికంగా మానిపోయినట్లు, కేసీఆర్ సర్కారు భావిస్తోంది. అందుకే ఆనాటి కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతోంది.

నీళ్లు-నిధులు-నియామకాలలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా పుట్టిన, తెలంగాణ ఉద్యమమే టీఆర్‌ఎస్‌ను ప్రభుత్వంలోకి తెచ్చిందన్నది నిష్ఠుర సత్యం. యావత్ తెలంగాణ సమాజం రోడ్డెక్కి, పిడికిలి బిగించి రణనినాదం చేస్తే.. దానిని కోదండరామ్ సారథ్యంలోని జేఏసీ కార్యాచరణగా మలిచింది. కేసీఆర్ ఉద్యమపగ్గాలను తన చేతిలో తీసుకుని, ఉద్యమాన్ని రాజకీయ మార్గం పట్టించారు. ఇవన్నీ కలసి వెరసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమయ్యేందుకు కారణమయింది. రెండుసార్లు నిర్నిరోధంగా కేసీఆర్ సీఎంగా గెలుస్తూ వస్తున్నారు. కానీ, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై సమైక్య పాలకులు పెట్టిన కేసులు, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నాయకులు ఇంకా దానికి సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైళ్లను ఆపిన కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి కేంద్రం పరిథిలో ఉన్నాయి. ఈ క్రమంలో, నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలనం సృష్టించిన మానుకోట ఘటన కేసును, కేసీఆర్ సర్కారు ఉపసంహరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమయింది.

 2010 మే 28న మానుకోటకు వచ్చిన జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా, వందలాది తెలంగాణ ఉద్యమకారులు నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ అక్కడే ఉన్న జగన్ మద్దతుదారులయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై రాళ్లు రువ్వారు. వారికి రక్షణగా నిలిచిన పోలీసులపైనా రాళ్లు వేశారు. అందుకు  ప్రతిగా, కొండా అనుచరులు కూడా తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్వారు. దానితో కాల్పులు జరిపిన పోలీసు చర్యకు 13 మంది గాయపడ్డారు.తనను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నందుకు జగన్ టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. హరీష్‌రావు, ఈటెల రాజేందర్ ఏ జిల్లా వాళ్లని ఇక్కడకు వచ్చారు? వరంగల్ నుంచి టీఆర్‌ఎస్ వాళ్లు ఇక్కడెందుకు వచ్చారు’ అని పోలీసులపై విరుచుకుపడ్డారు.  తర్వాత ఆ ఘటనపై నాటి జేఏసీ నేత,  డాక్టర్ డోలి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు ఫలితంగా.. ఎమ్మెల్యే కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పుల్లాపద్మావతి తదితరులపై కేసు నమోదయింది. ఆ కేసును నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సీబీసీఐడికి బదిలీ చేసింది. నాటి నుంచి నేటి వరకూ, కేసు కొనసాగుతూనే ఉంది. అందులో ముద్దాయిగా ఉన్న భూమా నాగిరెడ్డి మృతి చెందగా, కొండాతో సహా చాలామంది, పార్టీలు కూడా మారారు.

అయితే, తాజాగా ఆ కేసు విచారణ నిలిపివేస్తూ.. మొత్తం కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు, ఫిర్యాదుదారయిన సత్యనారాయణకు, సీబీసీఐడీ నోటీసులిచ్చింది. తమ నోటీసుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే.. వారం రోజుల్లో, వరంగల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరవాలని పేర్కొన్న వైనం, సోషల్‌మీడియాలో చర్చకు తెరలేపింది. తెలంగాణ వాటా నీళ్లను కూడా వాడుకుంటూ, దక్షిణ తెలంగాణను ఎడారి చేస్తున్న ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. న్యాయపోరాటంతోపాటు, అపెక్స్ కౌన్సిల్‌లో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. అటు ప్రతిపక్షాలు కూడా.. కేసీఆర్ అనుమతి ఇచ్చినందుకే, తెలంగాణ జలాలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరలించుకుపోతోందంటూ దుయ్యబడుతున్నాయి. ఈ సమయంలో.. జగన్‌పై రాళ్లేసి ‘గాయపడిన కేసును’ మూసివేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇది వ్యూహాత్మక తప్పిదమని, అందుకు ఇది సరైన సమయం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గతంలో తనపై రాళ్లేసిన ప్రాంతానికే, సీఎంగా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు హాజరయిన జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం, అప్పట్లోనే దుమారం రేపింది. ఇప్పుడు మళ్లీ అదే జగన్మోహన్‌రెడ్డి బృందానికి వ్యతిరేకంగా పెట్టిన కేసులను, ఉపసంహరించుకోవడం ద్వారా, ప్రభుత్వం ఎలాంటి సంకేతం పంపిస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ కేసులో ప్రస్తుత తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారు. నిజంగా సీబీసీఐడి నోటీసుకు డాక్టర్ సత్యనారాయణ స్పందించి, కోర్టుకు హాజరయి.. కేసుల ఉపసంహరణకు తమ అభ్యంతరం లేదని చెబితే, మానకోట కేసు మూసుకుపోతుంది. ఒకవేళ మూసివేయడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది మరికొన్నాళ్లు కొనసాగుతుంది. చూడాలి.. నాటి జేఏసీ నేత సత్యనారాయణ ఏం చేస్తారో?

సహజంగా ఇలాంటి కేసులను నిందితులే కొట్టివేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రత్యర్ధులతో రాజీలు చేసుకుంటారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటారు. కానీ విచిత్రంగా ప్రభుత్వమే.. తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించడంపై, ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే.. తెరాస నాయకులు మాత్రం, దీనికి వేరే భాష్యం చెబుతున్నారు. ‘మానుకోట ఘటన అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మరింత వేగంగా జనంలోకి తీసుకువెళ్లడానికి పనికివచ్చింది. ఆ సెంటిమెంటు మిగిలిన జిల్లాలకు విస్తరించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మనకు సొంత రాష్ట్రమే వచ్చింది. ఏపీతో సంబంధాలు మంచిగనే ఉన్నాయి. ఇక ఆ కేసులతో సమయం-డబ్బు వృధా అనుకున్నందుకే ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లుంది. అయితే.. ఏపీతో నీళ్ల పంచాయితీ నడుస్తున్న ఈ సమయంలో కాకుండా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని’ తెరాస సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఇది జగన్ కోసం కేసీఆర్ చేస్తున్న త్యాగమే: బీజేపీ

కేసుల ఉపసంహరణకు జరుగుతున్న ప్రయత్నాలపై బీజేపీ విరుచుకుపడింది. ‘ఇది కేసీఆర్-జగన్ మధ్య కొనసాగుతున్న లాలూచీకి నిదర్శనం. ఆరోజు కూడా కేసీఆర్ అనుమతితోనే జగన్ 203 జీఓ ఇచ్చి దక్షిణ తెలంగాణను ఎడారి చేసే కుట్రలకు తెర ఎత్తారు. అప్పుడు కేసీఆర్ రాయలసీమకు వెళ్లినప్పుడు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని నెరవేరుస్తున్నారు. జగన్ కోసం కేసీఆర్ మరో త్యాగం చేస్తున్నారు.  ఇప్పుడు మనం ఆంధ్రా జలచౌర్యంపై పోరాడుతున్నాం. ఈ సమయంలో జగన్‌తో ఏపీ నుంచి వచ్చి, తెలంగాణవాదులపై రాళ్లేసిన వారిపై కేసులు ఉపసంహరించుకుంటారంటే వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటన్నది తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలి. మానుకోట ఘటనలో గాయపడ్డ 13 మందికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంద’ని బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు ప్రశ్నించారు.