ఇందుకే బాబూ…23 వచ్చింది

704

కాపులకు 2019 వరకు చంద్రబాబే నాయకుడు అని అప్పుడు ఎందుకు అన్నానంటే…!
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్న రాజకీయ పరిస్థితిని ఊహించుకోండి. అప్పటికి 8,9 ఏళ్ల నుంచి ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం.ఒక మరో పక్క కేసీఆర్, ఇంకో పక్క నుంచి జగన్-చంద్రబాబు ను ఊపిరి సలపనివ్వడం లేదు. ఈ ముప్పేట దాడిలో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో తెలుగు దేశం నాయకులు ఒక్కొక్కరే చంద్రబాబుకు వీడ్కోలు చెబుతున్నారు. ఎండాకాలంలో ఎండిపోయే గోదావరిలా రోజు రోజుకూ ఆయన పరిస్థితి దిగజారి పోతూ వస్తున్నది. రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ బాబు ను ఎగతాళి చేయని వారు లేరు…అప్పటి రాజకీయ పరిస్థితుల్లో. ఇక, చివరి ప్రయత్నంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు.
2004 కు ముందు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును పదవినుంచి దింపడానికి -అప్పటి ప్రతిపక్ష నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి -చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. సూపర్ హిట్ అయ్యింది.
అది గుర్తుకు వచ్చి, చంద్రబాబూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నిజానికి అప్పుడు చంద్రబాబుకు మరో మార్గం కనపడలేదు.
ఆ పాద యాత్ర సందర్భంగా..ముగ్గురికే ఆయన హామీలు ఇచ్చారు.1)అడిగిన వాళ్ళు.2)అడగని వాళ్ళు.3)ఆయన నడుస్తుంటే….చూడడానికి గుమిగూడిన వాళ్ళు. ఇవన్నీ కలిపితే…650 అయ్యాయని వైసీపీ నేత ఒకాయన మొన్న ఏదో టీవీ డిబేట్ లో చెప్పారు.
పాదయాత్రలో ఆ మాట తీరు; రెండు వేళ్ళు ఊపడం మానేసి, రెండు చేతులతో నమస్కారం పెట్టడం చూసి….బాబు మారాడహో అంటూ ఆయన పత్రికలు టముకు వేయడం చూసి నాకు కూడా ఆయన పట్ల మొదటి సారిగా కొంచెం సదభిప్రాయం కలిగింది(అంటే-1983 లో ఆయన తెలుగు దేశం లో కాలు పెట్టిన దగ్గరనుంచి-2012 అక్టోబర్ 3 న పాదయాత్ర మొదలు పెట్టేవరకు అని అర్ధం). ఈ పాద యాత్రలోనే-కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తానని; కాపులకు ఏటా 500 కోట్ల కేటాయింపుతో ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి;కాపులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తానని హామీ ఇచ్చుకుంటూ…ఆయన ఊరూరా తిరిగారు.
నిజానికి, ముద్రగడ పద్మనాభం ఒత్తిడితో, కాపు విద్యార్థులకు రిజర్వేషన్స్ కల్పించే జీ. ఓ నెంబర్ 30 ని అప్పటి కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం 1994 ఆగస్టు 24 న జారీ చేసింది. దానిని అమలు కాకుండా, దాని పీక పిసికింది కూడా చంద్రబాబు నాయుడే. అయినప్పటికీ; దాదాపు 19,20 ఏళ్ల తరువాత-కాపులకు రిజెర్వేషన్లు కల్పిస్తాను…కార్పొరేషన్ పెడతాను అని ఆయన ఊరూరా తిరిగి చెబుతుంటే…నిజంగానే చేస్తారేమో అనుకున్నాను. మనిషి మారారేమోలే,ఎదురు దెబ్బల దెబ్బకు అని అనుకున్నాను.
2014 ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చారు.
ఓ సంవత్సరం వరకు కాపులకు సంబంధించి ఉలుకు… పలుకు లేదు.
2015 వరకు చూసిన ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా కాపు అవతారం ఎత్తి; చంద్రబాబు పై యుద్ధభేరీ మోగించారు. ముద్ర‘గడబిడ’ లేకపోతే.. ఏపీ ఏం కానూ?
అయితే…కాపులపై అభిమానంతో గాక; పాత కక్షలు తీర్చుకోడానికి ఇదే అదునుగా భావించి, ముద్రగడ కాపు రెజర్వేషన్ అంశాన్ని హైజాక్ చేశారని నాకు తెలుసు.
అయితే;ముద్రగడకు ఉద్యమ లక్ష్యం గానీ,ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు గానీ, ఒక పెద్ద ఉద్యమాన్ని నడపగల స్థాయి గానీ లేవంటూ 2015 డిసెంబర్, 2016 జనవరి లో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో నాలుగు ఆర్టికల్స్ రాశాను. ఆయనకు అప్పుడు ఉన్నదల్లా- చంద్రబాబు పై ద్వేషం, కక్ష, కసి. అదే రాశాను. చంద్రబాబు పై పాత కక్షలు తీర్చుకోడానికి, కాపులను బలి పెట్టబోతున్నారని రాశాను. ముద్రగడ నాకు పాతికేళ్లకు పైబడి సన్నిహితులు. ఆయన గురించి నాకు తెలిసినంత …ఆయనకు కూడా తెలియదు. ఆయన నాకు సన్నిహితులు కావడంతో….;ఆయన సన్నిహితులైన అనుచరులు నాకూ సన్నిహితులే.
‘మీరు ఆంధ్రజ్యోతిలో రాసింది అక్షరం అక్షరం కరెక్ట్. కానీ ఏం చేస్తాం?’ అంటూ నిట్టూర్పులు విడిచిన వారే!
ఆ రాతల సందర్భంగా…2019 వరకూ చంద్రబాబు నాయకుడే కాపులకు నాయకుడు అని రాశాను. కాపులకు నాయకత్వం వహించగల నాయకుడు కాపులలో లేరని రాశాను.కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే…2019 లో ఏమి చేయాలో – కాపులు అదే చేస్తారని కూడా నా ఆంధ్రజ్యోతి వ్యాసాలలో రాశాను.
చంద్రబాబు తో పాటు;కమ్మ సామాజిక వర్గం పట్ల అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న కాపు యువత- ఈరాతలుచూసి,రగిలిపోయారు.
సోషల్ మీడియా వేదికలపై నన్ను ఫుట్ బాల్ ఆడారు. కాపు ద్రోహి అన్నారు. కమ్మోరి కుక్క అన్నారు. కాపులకు పుట్టలేదా అన్నారు. ముద్రగడ ను విమర్శించేంత మొగాడివా అన్నారు. నాకు 20,25 ఏళ్ళుగా అత్యంత సన్నిహితంగా వ్యవహరించినవారు…మా పిల్లల్ని స్కూళ్లకు ,కాలేజీలకు వెంటబెట్టుకు తీసుకెడుతూ…స్కూల్ లో గార్డియన్ గా సంతకాలు పెట్టినవారు సైతం-నన్ను వాళ్ళ దగ్గిరా…,వీళ్ళ దగ్గరా…’ఆడా! నా కొడుకు. యదవ నాకొడుకు…లం…. డుకు…’ అని దూషిస్తూ మాట్లాడారు.తూర్పు గోదావరిలో నేను తెలిసినవారు, నాకు తెలిసిన జర్నలిస్ట్ లు కూడా ఆ భాష వింటూ ఆశ్చర్యపోయేవారు. నాకు ఫోన్ చేసి-వాళ్లేంటి సార్…ఆ భాష..నమ్మలేకపోతున్నాం అంటూ అడిగేవారు. నవ్వేసి ఊరుకునే వాడిని.
అలా చాలామంది ఇంకా చాలా చాలా అన్నారు. అయినా… కాపులకు తాను ఇచ్చిన హామీలను నిజాయితీతో, చిత్త శుద్ధితో చంద్రబాబు అమలు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మాను.
కానీ, చంద్రబాబు కదా!
ఈ సందర్భంగా సుమతీ శతక కారుడు రాసిన పద్యం ఒకటి గుర్తు చేసుకుంటాను.
కనకపు సింహాసనమున
ఆ బాబును కూర్చుండ బెట్టి
శుభలగ్నమున్ దొనరగ బట్టము
కట్టిన వెనుకటి గుణమేల
మానురా సుమతీ!
నాకెందుకు 23 వచ్చినయ్…నాకెందుకు 23 వచ్చినయ్…అంటూ చంద్రబాబు అదేపనిగా గింజుకున్నారు కదా! ఇదిగో…ఇందుకొచ్చినయ్.

-భోగాది వెంకట రాయుడు