జగ్గన్నా.. పోలీసు..ఎక్కడయినా పోలీసే!

252

స్వేచ్ఛ ఇచ్చేది కాదు తీసుకునేది మరి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘అప్పుడు తెలంగాణలో ఉద్యమాల స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడది మచ్చుకయినా కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు సహకరించడం వల్లే తెలంగాణ వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు-తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తేడా ఏమిటో ప్రజలు చూస్తున్నారు. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పోలీసులు, ఐపిఎస్ ఏం చేస్తారో అప్పుడు చూస్తాం’
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసుల దాష్టీకం, ఉమ్మడి రాష్ట్రంలో.. తాము అనుభవించిన సంపూర్ణ స్వేచ్ఛ గురించి, మననం చేసుకుంటూ చేసిన వ్యాఖ్య ఇది. బహుశా పోలీసుతత్వం తెలుసుకోనందుకే జగ్గన్న ఈరకంగా వాపోయినట్లు కనిపిస్తుంది.

తెలంగాణ పోలీసు రాజ్యంగా మారిందని, న్యాయమైన హక్కులు, అప్రజాస్వామ్య విధానాలపై..  గళమెత్తిన వారిపై పోలీసు జులుం చూపిస్తున్నారని, విపక్షాలు చాలాకాలం నుంచీ విరుచుకుపడుతున్నాయి. తెలంగాణలో దండిగా ప్రజాభిమానం సంపాదించుకున్న రేవంత్‌రెడ్డి ..  తనను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో, మీసాలు తిప్పి తొడగొట్టి హెచ్చరించిన దృశ్యాలు తెలిసినవే. కేసీఆర్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న విపక్షాలు, విద్యార్ధి-ప్రజా సంఘాలు, చేస్తున్న ఆందోళనపై పోలీసులు సహజంగానే ఉక్కుపాదం మోపుతున్నారు. అది వారి విధి నిర్వహణలో ఓ భాగం. అయితే, ఇద్దరు ఐపిఎస్ అధికారులు గులాబీ చొక్కాలు వేసుకుని.. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దొరకు ఊడిగం చేస్తున్నారంటూ,  కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి తరచూ విరుచుకుపడుతున్నారు. రిటైరయిన వారిని మళ్లీ తీసుకున్నారని, పోలీసు వ్యవస్థను తన చేతిలో తీసుకుని నడిపిస్తున్న అధికారికి, మళ్లీ సర్వీసు పొడిగించడంపైనా రేవంత్ ధ్వజమెత్తారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోయిందని, దీనికోసమేనా పోరాడి తెలంగాణ తెచ్చుకుందని.. కోదండరామ్ నుంచి కోమటిరెడ్డి-జగ్గారెడ్డి వరకూ అందరూ నిర్నిరోధంగా వాపోతున్నారు. ఏదైనా అనుభవం అయితే గానీ, తత్వం బోధపడదు. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా, తెలంగాణ కోసం పోరాడారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా-ప్రజల దైనందిక జీవితాలకు ఆటంకం కలిగేలా చేయలేదు. అందుకే వారిని అరెస్టు చేయలేదు. పైగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే! అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది టీఆర్‌ఎస్-విద్యార్థులు-జేఏసీలే.వారంతా రోడ్లను బందు పెట్టారు. మానవహారం చేశారు. రోడ్లపై వంటావార్పు చేశారు. పోలీసులపై రాళ్లేశారు. యూనివర్శిటీల్లో పోలీసు వాహనాలను తగులబెట్టారు. రైళ్లు ఆపారు. నిరాహార-ఆమరణ నిరాహార దీక్షలు చేశారు.  కాబట్టి సహజంగానే వారిని పోలీసులు అణచివేశారు. దీన్నిబట్టి అర్ధమయ్యేది ఏమిటంటే.. స్వేచ్ఛ అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు. తీసుకుంటే వచ్చేది! సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు  కూడా అదే పోలీసులు పనిచేస్తున్నారు. అప్పుడు చేసిన పనే ఇప్పుడూ చేస్తున్నారు. మరి తేడా ఎక్కడో, జగ్గారెడ్డి వంటి సీనియర్ నాయకులు సెలవిస్తే బాగుండేది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, పోలీసులను విమర్శించడం సహజం. మళ్లీ అదే ప్రతిపక్షం, అధికారంలోకి వస్తే.. అదే పార్టీ,  పోలీసుల పనితీరును మెచ్చుకుని, వారికి దన్నుగా నిలవడం కూడా అంతే సహజం. అంతకుముందు తాము విమర్శించిన పోలీసులే.. ఇప్పుడు తమకూ పనిచేస్తున్నారని గ్రహించినా, గ్రహించనట్లే ఉంటారు.  తాము ప్రతిపక్షంలో ఉంటే.. పోలీసులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేస్తారు. అదే తాము అధికారంలో ఉంటే, అదే పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తారు. దాదాపు ప్రధాన రాజకీయ పార్టీల భావన ఇలాగే ఉంటుంది. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఇప్పుడు పోలీసుల పనితీరును ఆకాశానికెత్తుతున్న, అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. ఉద్యమం సమయంలో, వారిపై అనేక నిందలు వేసింది. కేటీఆర్-హరీష్‌రావును అదుపులోకి తీసుకున్న సమయంలో, వారిద్దరూ పోలీసులపై వాడిన భాష, దూషణలు పోలీసులకు ఇంకా గుర్తే.

ఇప్పుడు విపక్షాల ఆందోళనల సమయంలో కూడా.. పోలీసులు అప్పటిమాదిరిగానే తమ విధిని మాత్రమే నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అరెస్టు చేసినట్లే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున, ప్రతిపక్షాల ఆందోళనను అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడయినా- విడిపోయినప్పుడయినా, పోలీసులు పోలీసులుగానే పనిచేస్తారని గ్రహించకపోవడమే అమాయకత్వం. ఎవరో కొందరు వీర విధేయులు, మరీ వెన్నుముక లేని అధికారులే, పాలకులకు ఎప్పుడూ సాగిలబడుతుంటారు. ఇలాంటి బాపతు అధికారులు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కనిపిస్తుంటారు.  మంచి పోస్టింగుల కోసం కొందరు, కులాభిమానంతో మరికొందరు, పై అధికారుల మెరమెచ్చుల కోసం ఇంకొందరు , అధికారపార్టీ కార్యకర్తలు కూడా ఈర్ష్యపడేలా పనిచేస్తుంటారు. ఈ బాపతు అధికారులు ఒక్క తెలంగాణలోనే కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ దర్శనమిస్తుంటారు. మిగిలిన వారంతా, తాము పోలీసులమన్న స్పృహతోనే పనిచేస్తుంటారు.

మరికొందరు అధికారులు, పాలకులు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేయరు. రూలు ప్రకారం ఉంటేనే పనిచేస్తారు. ఈ బాపతు అధికారులకు,  ఏ పాలకులూ సహజంగా, ప్రాధాన్యం ఉన్న పోస్టింగులు ఇవ్వరు. మరికొందరు పోలీసులు.. తమతో ఎంత స్నేహం ఉన్నా వారిని పరిమితులు దాటనీయరు. తాము పోలీసులమని మర్చిపోరు. ఇంకొందరు స్నేహం కోసం ఏమైనా చేస్తారు.  కొందరు అధికారులు నిజాయితీ-ముక్కుసూటిగా వెళతారు. కానీ, వారు ఎవరికీ సహాయం చేయరు. ఇలాంటి వారి వల్ల ఎవరికీ లాభం ఉండదు. నష్టమూ ఉండదు. ఈవిధంగా పోలీసుల పనితీరు-మనస్తత్వం-సమర్థతను అర్ధం చేసుకుంటే.. జగ్గారెడ్డి ఖాకీలపై కన్నెర చేసేవారు కాదేమో?!