బీజేపీ..వైసీపీ..బీజేపీ.. మళ్లీ వైసీపీ!

184

 గందరగోళంలో గంటా
చివరాఖరకు వైసీపీకే జై
16న చేరతారట?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అధికారం లేకపోతే ప్రజలకు సేవ  చేయలేమని గట్టిగా భావించే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాపం.. ఏ పార్టీలో చేరాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారట. తొలుత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,  జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఒక తమిళనాడు మంత్రితో రాయబారం నడిపారు. చివరాఖరకు నాటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ద్వారా కూడా పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. రాంమాధవ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయనను కలిశారు. కానీ, అప్పుడు బీజేపీ నాయకత్వం ఎందుకో గానీ ఆయన చేరికపై నాన్చుడు ధోరణి అవలంబించింది. పైగా బీజేపీలో చేరితే, జగన్ అనర్హత వేటు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించిందట. తాజాగా చిరంజీవి-బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీని కూడా గంటానే ఏర్పాటుచేశారన్న ప్రచారం జరుగుతోంది.

దానితో గంటా తిరిగి వైసీపీ వైపు చూశారట. ఒకదశలో ఆయన చేరిక ఖరారయిందన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను, స్థానిక వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. మంత్రి అవంతి శ్రీనివాసయితే.. కేవలం అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే, గంటా తమ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బహిరంగంగానే ఆరోపించారు. ఒక పార్టీలో ఉంటూ, మరో పార్టీతో మంతనాలు సాగించడంలో నైపుణ్యం ఉన్న గంటా.. ఈసారి వైసీపీని చూపించి బీజేపీతో, బీజేపీని చూపించి వైసీపీతో మంతనాలు చేశారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనకు బీజేపీ జాతీయ దళపతి నద్దా కూడా ఫోన్ చేసి, ఆహ్వానించారంటున్నారు. బీజేపీలో చేరితే, అనర్హత వేటు పడకండా చూస్తామని హామీ ఇచ్చినట్లు చె బుతున్నారు. దానితో గంటా, హైదరాబాద్‌లో తన సన్నిహితులతో భేటీ నిర్వహించారు. అప్పటివరకూ 9వ తేదీన వైసీపీలో చేరిక ఖరారయిందట. మళ్లీ బీజేపీ నాయకత్వం పిలుపుతో, వైసీపీలో చేరికను వాయిదా వేసుకున్నారట.

మళ్లీ తాజాగా, జగన్‌తో మాటా-ముచ్చట అయిన తర్వాత, వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారంగా ఇప్పటి సమాచారం ప్రకారం.. గంటా ఈనెల 16న వైసీపీ తీర్ధం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే, తాను తన పదవికి రాజీనామా చేస్తానని గంటా, తన మనసులోకి కోరికను జగన్ వద్ద వెల్లడించారట.  తిరిగి గెలిచి, మళ్లీ మంత్రి కావాలన్నది గంటా కోరికగా కనిపిస్తోంది. అయితే..  ఎవరైనా తన పార్టీలోకి రావాలనుకుంటే, వారు  తమ పదవికి రాజీనామా చేయాలని జగన్ గతంలో షరతు విధించారు. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే, వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్వయంగా జగన్, సభలో స్పీకర్‌ను కోరారు. దానితో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు భయపడి, వైసీపీలో చేరకుండా నిలిచిపోయారు. అనర్హత వేటు వేయకపోతే, మరికొంతమంది ఎమ్మెల్యేలు జగన్ వెంట నడిచేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, వైసీపీ కండువా వేసుకోకున్నా.. అనధికారికంగా ఆయన సమక్షంలో, పార్టీలో చేరారు. అంటే జగన్ అప్పటి సిద్ధాంతాలను, పూర్తిగా వదిలేసినట్లు అర్ధమవుతోంది. ఆ ప్రకారంగా రేపు గంటా కూడా..  వారి మాదిరిగానే, విడిగా ఉండనున్నారు.