సోము అలా… రాంమాధవ్ ఇలా.. పాత నాయకత్వం మరోలా!

378

మూడుపై రాంమాధవ్ ఎద్దేవా
13 రాజధానులు చేసేస్తామన్న సోము
అమరావతిలోనే ఉండాలన్న గత నాయకత్వం
రాంమాధవ్ చెప్పిందే రమణ చెప్పినా ఆయనపై వేటు
మరి ఇప్పుడు రాంమాధవ్‌పై వేటు వేస్తారా?
రాజధానిపై కమలదళాల మాటలకు అర్ధాలు వేరయా
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

విభిన్న వాదనలు.. విరుద్ధ వ్యాఖ్యలు.. ఒకాయన ఒకటి చెబితే.. మరొకాయన మరొకటి చెబుతారు. ఇంకొకాయన ఇంకొకటి చెబుతారు. అసలు రాష్ట్రం నుంచి ఎప్పుడో వెళ్లిపోయి, ఇంకో రాష్ట్రం నుంచి నాయకుడిగా మారిన  మరొక ప్రవాస ఆంధ్రుడు ఇంకేదో చెబుతారు. ఈ వాదనలు, వేదనలన్నీ అంతర్గత ప్రజాస్వామ్యం విశృంఖలంగా ఉండే, కాంగ్రెస్ పార్టీవనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఇవన్నీ ఒకేమాట-ఒకే బాట, క్రమశిక్షణ అనే మడి కట్టుకున్న భారతీయ జనతా పార్టీలో వినిపించే గళాలు. అవును నిజం. కావాలంటే మీరే చూడండి.

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలన్న అంశంలో, భాజపాకు ఇంకా స్పష్టత వచ్చినట్లు కనిపించడం లేదు. పలువురు నేతల విభిన్న ప్రకటనలతో ఇప్పటికే గందరగోళంగా మారిన రాష్ట్ర పార్టీని… జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ వ్యాఖ్యలు,  ‘కింకర్తవ్యం’ అనే ప్రశ్నను ముందుకుతెచ్చాయి. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అయిన తర్వాత.. టీవీ9 జర్నలిస్టు రజనీకాంత్, ఆయనతో భేటీ వేశారు. ఆ సందర్భంగా ‘మేం చంద్రబాబు మాదిరిగా చేయం. జగన్మోహన్‌రెడ్డిలా చేయం. అభివృద్ధి వికేంద్రీకరిస్తాం. మాకు అధికారం ఇప్పించండి. మొత్తం జిల్లాకో రాజధానిని చేసేస్తాం. మాకు అధికారం ఇప్పించేయండి రజనీకాంత్‌గారూ’ అని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆ ప్రకారంగా.. బీజేపీకి అధికారం ఇస్తే, ఇప్పుడున్న 13 జిల్లాలను 13 రాజధానులను చేస్తుందన్న విషయాన్ని ఆయన బయట పెట్టినట్లయింది. అయితే, సర్కారు ఇప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు అధికారికంగానే సన్నాహాలు చేస్తోంది. ఆ ప్రకారంగా 25 జిల్లాలు ఏర్పడతాయి. అప్పుడు సోము వీర్రాజు హామీ ప్రకారం.. ఏపీలో బీజేపీ 25 రాజధానులను ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోంది. అంటే బహుశా.. 13 జిల్లాల రాజధానులు ఏర్పాటుచేస్తే, పార్టీ కూడా విస్తరించి బలపడుతుందని భావన వీర్రాజు అంచనా కావచ్చు.

వీర్రాజు ఈ మాట చెప్పి వారం రోజులు కూడా కాకముందే… పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ చేసిన వ్యాఖ్య, కొంత గందరగోళం రేపింది. వీర్రాజు ప్రమాణస్వీకారానికి హాజరయిన రాంమాధవ్.. ‘దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యుపీలోనే ఒక్క రాజధాని ఉంది. అయిన పరిపాలన బ్రహ్మాండంగా చేయడం లేదా? కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఒక్క రాజధానిలో అవినీతిపై పోరాడాం. ఇప్పుడు మూడు కలిపి ట్రిపుల్ ధమాకా కాకుండా చూడాలి’ అని చేసిన వ్యాఖ్య, అసలు పార్టీ వైఖరేమిటో అర్ధం కాక గందరగోళంలోకి నెట్టింది.

అసలు రాంమాధవ్.. అమరావతి రాజధానిపై ఏం చెప్పారో స్పష్టత ఇవ్వకపోగా, మూడు రాజధానులను ఆక్షేపించడాన్ని  ఏవిధంగా అర్ధం చేసుకోవాలో తెలియక, కమలనాధులు అయోమయంలో పడ్డారు. పెద్ద రాష్ట్రమయిన యుపీతో పోలుస్తూ, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ఆక్షేపించినందున.. ఆయన మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని అర్ధం చేసుకోవాలా? లేక.. గవర్నరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించినా, రాజధాని పరిధి కేంద్రం చేతిలో లేదని అఫిడవిట్ ఇచ్చిందని చెప్పారు కాబట్టి.. ఆ ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని అర్ధం  చేసుకోవాలా? అని తెలియక కమలనాధులు పాపం  జుట్టు పీక్కుంటున్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న ప్రణబ్ ముఖర్జీ కూడా, ఎప్పుడూ ఇలా అర్ధం కానట్లు డ్రాఫ్టులు తయారుచేయలేదు. పూర్వ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ కమిటీ, అమరావతి రాజధానికి మద్దతునిచ్చింది.

తాజాగా రాంమాధవ్ మూడు రాజధానులను ఆక్షేపించినట్లే.. ఆ పార్టీ నేత ఓవి రమణ కొద్దిరోజుల క్రితం ఓ వ్యాసం రాశారు. రాజధానిపై పార్టీ నేతలు చేస్తున్న పొంతన లేని వ్యాఖ్యల కారణంగా, బీజేపీ జనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన, తన వ్యాసంలో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఆయనను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి రాంమాధవ్  చెప్పిందే కదా రమణ రాసింది? అలాంటిది ఆయనను సస్పెండ్ చేసిన నాయకత్వం, మరి రాంమాధవ్‌ను సస్పెండ్ చేయదేమిటన్నది అమాయకుల సందేహం. ఆ మేరకు అమరావతికి చెందిన ఓ యువకుడు సంధించిన ప్రశ్న సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.  ఏపీలో బీజేపీ నాయకులు ఏమైనా మాట్లాడతారు. ఎలాగైనా వాదిస్తారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న బీజేపీ స్కూలు హెడ్మాష్టరు, కరస్పాండెంట్లను మారిస్తే అయినా మార్పు వస్తుందేమో మరి!