కమలం- కరోనా.. ఒక్కటేనన్న కొడాలి!

1039

అయినా కస్సుమనని కమలదళం
నాడు కన్నా.. నేడు కమలం పైనే దాడి
విజయసాయి, కొడాలిని మందలించని జగన్
జగనన్న ఆదేశంతోనే కమలదళంపై దాడి?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

‘‘ఇండియాలో పుట్టిన కరోనా ఉంది. బీజేపీ. బీజేపీ అనేది మీరు చూసుకుంటే వెస్ట్‌బెంగాల్‌లో కాంగ్రెస్-కమ్యూనిస్టులను కలిపి తినేస్తుంది. త్రిపురలో కాంగ్రెస్‌ను తినేస్తుంది. ఒరిస్సాలో కాంగ్రెస్‌ను తినేసింది. జనతా పార్టీలు, కాంగ్రెసులు, కమ్యూనిస్టులు దానికి. బీజేపీ అనే కరోనాకు అదీ ఇదీ అని ఏమీ లేదు. అది తగులుకుంటే కనుక తినేస్తుంది. ఏపీకి ఆల్రెడీ వచ్చింది. మనం మాస్కులు పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి దానితో. చంద్రబాబు ఎన్నికల ముందు మాస్కులు, ఫ్యాంట్లు, షర్టులు తీసేశాడు. ఆయన దానిపై ఎగబడ్డాడు. టైం వచ్చినప్పడు ఆళ్లెందుకు వదులుతారు? ఆ బీజేపీ కరోనా అనేది ఓ పక్క నుంచి కబళించడానికి సిద్ధంగా ఉంది’’
అంటే మీరు చెప్పిన ఇండియన్ కరోనా వైసీపీని కూడా కబళించడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉందా?
‘‘అంటే.. కరోనా వచ్చిన ఒక వ్యక్తికి ఒక్కోసారి లక్షణాలు కూడా ఉండవు. ఒక్కొక్కడికి కొంచెం లక్షణాలుంటాయి. ఒక్కొక్కడికి ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అట్టా ఇండియాలో జగన్ గారికి లక్షణాలు లేకుండా బయటపడగల శక్తి ఉంది. వైసీపీకి ఆ లక్షణాలు కూడా తగలవు. ఈ కరోనా ఆయనను ఏమీ చేయలేవు.  ఆయనే చాలా బలమైన శక్తి’’
ఇదంతా ఏ అల్లాటప్పా అప్పారావు.. లేదా సొల్లుకబుర్లు చెప్పే సుబ్బారావో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తూ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడయిన, మంత్రి కొడాలి నాని చేసిన చేసిన వ్యాఖ్య. కొడాలి నాని.. అదేనండీ వాడెమ్మ మొగుడు మంత్రి ఫేం. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని,  కరోనాగా అభివర్ణించారు. అవును. మీరు విన్నది నిజమే! ఆ కరోనా లాంటి బీజేపీ, ఏపీలో వైసీపీని ఏమీ చేయలేదని చాలా మర్యాదగా సెలవిచ్చారు.

మరి కొత్త కమల దళపతి చెప్పినట్లు, రాష్ట్రంలో 24 శాతం ఓట్ల బలం ఉండి.. తమకు అధికారం ఇస్తే 13 రాజధానులు ఏర్పాటుచేస్తామని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్న అదే కొత్త కమల దళపతి మంత్రి మాటలపై ఎదురుదాడి చేయరేం? మా పార్టీని కరోనాతో పోల్చి అవమానిస్తారా అని మూకుమ్మడి మాటల దాడి చేయలేదేం? తమ పార్టీని అవమానిస్తే, తమనూ అవమానించినట్లేనని భావించలేదేం? కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌తో తమ పార్టీని పోల్చి, తమది అంత ప్రమాదకరమైన పార్టీ అని దూషించిన, మంత్రి కొడాలి నానిపై కస్సుమనరేం? అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? ఇదీ.. కొడాలి నాని తమపై చేసిన దూషణపై, నాయకత్వ మౌనరాగంపై కమలనాధుల అంతర్మథనం.

భాజపాను కరోనాతో పోల్చిన మంత్రి కొడాలి నానిపై..  కమలదళ నాయకత్వం ఇప్పటివరకూ ఎదురుదాడి చేయకపోవడంపై, కమలనాధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీవీ చానెల్‌లో మంత్రి కొడాలి.. తమ పార్టీని లెక్కలేకుండా మాట్లాడమే కాకుండా, బీజేపీ తమను ఏమీ చేయలేదని దిలాసాగా చెప్పినా,  ఎవరూ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,  టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి 20 కోట్లు తీసుకున్నారని, దానికి సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అది పెద్ద దుమారం రేపింది. కానీ, రాష్ట్ర పార్టీ నాయకులెవరూ దానిని ఖండించలేరు. కానీ, దానిపై అప్పటి బీజే పీ నేత ఓవి రమణ.. ఏకంగా ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాసి, విజయసాయి గత చరిత్రను తవ్వితీశారు. ఆయనను తాజాగా సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. అది వేరే విషయం. కనీసం రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ గానీ, సంఘటనా మంత్రి మధుకర్‌జీ గానీ విజయసాయి ఆరోపణలు ఖండించలేదు. ఇప్పుడు ఏకంగా.. పార్టీనే కరోనాతో పోల్చిన మంత్రి కొడాలి వ్యాఖ్యలను కొత్త అధ్యక్షుడూ ఖండించలేదు. ఇటు సునీల్ గానీ, మధుకర్‌జీ గానీ ఖండించకపోవడం పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది.

ఓవైపు కరోనా అంశంపై.. ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటున్న సీఎం జగన్, అదే ప్రధాని నాయకత్వం వహించే పార్టీని, తన మంత్రివర్గ సహచరుడు నాని, కరోనాతో పోల్చారు. అయినా జగన్ ఆయనను మందలించలేదంటే.. ఇదంతా జగన్ ఆదేశాల మేరకు, ఆయన అనుమతితోనే చేసిన వ్యాఖ్యగా భావించాల్సి ఉంటుందని కమలనాధులు స్పష్టం చేస్తున్నారు. ‘గతంలో కన్నాపై విజయసాయి ఆరోపించినప్పుడు గానీ, ఇప్పుడు మంత్రి నాని ఏకంగా బీజేపీనే విమర్శించినప్పుడు గానీ, జగన్ వారిని వారించలేదు. కనీసం మందలించలేదు. అంటే జగన్ ఆదేశాలతోనే రాష్ట్రంలో బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని’ ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. దీనిని తాము జాతీయ నాయకత్వ దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు.

గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, మంత్రుల వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఇదే సోము వీర్రాజు.. ఇప్పుడు పార్టీ అధ్యక్ష హోదాలో ఉంటూ, తమ పార్టీని కరోనాతో పోల్చిన మంత్రిపై ఎదురుదాడి చేయకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీని అంత దారుణంగా విమర్శించిన మంత్రి నానిపై, పార్టీ నాయకులు కాకుండా.. బీజేవైఎం వంటి అనుబంధ సంస్థతో మాట్లాడించడంపై, పార్టీ నాయకులు నోరెళ్లబెడుతున్నారు. ‘కొడాలి నాని వ్యక్తిగత స్థాయి ఏమిటన్నది పక్కనపెడితే, ఆయన రాష్ట్ర మంత్రి. మరి ఆయనపై ఎదురుదాడి కూడా పార్టీ నాయకత్వమే చేయాలి. కానీ ఒక అనుబంధ సంస్థతో చేయించారంటే ప్రభుత్వంపై విమర్శించేందుకు ఏదో మొహమాటం అడ్డువస్తున్నట్లు అర్ధమవుతోందని’ ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. చివరకు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన  సోము వీర్రాజు కూడా, మంత్రి వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.