నక్సలైట్లపై ఇంకా ఆశనా…?

458

శిరోముండన బాధితుడి లేఖ
నక్సలైట్లలో కలుస్తానంటున్న  దళితుడు
పాలకుల పనితీరు ఫలితమా?
పోలీసు-నేతల జమిలి అరాచక ప్రభావమా?
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

మనిషి తనకు అన్యాయం జరిగితే.. ముందు చట్ట ప్రకారం పోరాడతాడు. అయినా అక్కడా న్యాయం దక్కకపోతే, అడ్డదారులు ఆశ్రయిస్తాడు. తన లక్ష్యసాధన కోసం తుదివరకూ పోరాడతాడు. దానిపేరే ప్రత్యామ్నాయం. అది రౌడీయిజమయినా, గూండాయిజమయినా, మావోయిజమయినా! తన కసి తీరాలి. తనకు అన్యాయం చేసిన వారిని అంతే అమానవీయంగా శిక్షించాలి. అంతే!! వ్యవస్థపై కసి పెరగనే కూడ దు. పెరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జనంలో తిరుగుబాటు భావన జనించకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే. ఒక యువకుడు ‘నేను నక్సల్స్‌లో చేరతాను. అనుమతించమని’ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయడం అసాధారణ చర్య. అంటే తనకు జరిగిన అవమానానికి, నక్సల్స్‌లో చేరితే తప్ప ప్రతీకారం లభించదన్న భావన. ఆశ! ఇది బాధితులో, ముఖ్యంగా దళితులలో  బలపడుతుందంటే.. మళ్లీ రాజ్యహింస పెరుగుతోందనే అర్ధం!! పాలకులు పోలీసురాజ్‌ను ప్రోత్సహిస్తున్నట్లే అర్ధం!!! అందుకు తూర్పు గోదావరి జిల్లా.. సీతానగరం పోలీసుస్టేషన్‌లో శిరోముండనానికి గురయిన, ఓ దళిత యువకుడిలో రగులుతున్న ప్రతీకారేచ్ఛనే సాక్ష్యం.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో.. ఇండుగుమిల్లి ప్రసాద్ అనే దళిత యువకుడిని వైసీపీ నేతల ప్రోద్బలంతో, పోలీసులు శిరోముండనం చేసిన వైనం, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బాధితుడు దళితుడు కావడంతో, దళిత సంఘాలన్నీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కాయి. తర్వాత ఎస్‌ఐపై కేసు పెట్టి జైలుకు తరలించారు. కానీ ప్రధాన నిందితులయిన.. 1 నుంచి 6వ ముద్దాయిలపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం, బాధితుడిలో ఆగ్రహం పెంచింది. అసలు తాను ఏ ఇసుక మాఫియా నేతపైనయితే పోరాడి… అవమానం పాలయ్యానో, ఆ వైసీపీ నేత, మరో పోలీసు అధికారిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడాన్ని, బాధితుడు ఇంకా భరించలేకపోయాడు.


దీనితో విసిగిపోయి ‘నేను నక్సలైట్లలో కలవాలనుంటున్నాను. అనుమతించగలరు. నాకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా పట్టించుకోవడం లేదు. నేను దళితుడిని కాబట్టే న్యాయం జరగడం లేదు. నేను పరువు కాపాడుకుంటాను. దయచేసి నన్ను నక్సల్స్‌లో కలవడానికి అనుమతించండి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు’ అని రాష్ట్రపతికి లేఖ రాయడం ఇప్పటి పరిస్థితిలో సంచలనమే. అంటే.. ఉనికి కోల్పోయిన నక్సల్స్ ఉనికిని,  బాధితుడు కోరుతున్నాడన్నమాట.

బాధితుడు శిరోముండన సమయంలో పడిన మానసికక్షోభ- అవమానం-పగ-ప్రతీకారేచ్ఛ ఊహించుకుంటేనే, ఎవరికయినా పోలీసు వ్యవస్థపై ఆగ్రహం వస్తుంది. ఓ తప్పును ప్రశ్నించినందుకు, అకారణంగా ఓ యువకుడిలో.. నక్సల్స్‌లో కలవాలన్న భావనకు గురిచేసిన, మద్దాయిలందరూ కచ్చితంగా శిక్షార్హులే. ఇలాంటి భావన పెరిగి పెద్దదయి, ప్రతి బాధితుడిలోనూ బలపడితే.. ఉనికిలో లేని నక్సలిజం/మావోయిజం మళ్లీ జనం గుండెను తాకడ ం ఖాయం. శిరోముండన బాధితుడి వయసు, దాని తాలూకు ఆవేశం, తనకు జరిగిన  ఘోర అవమానం, దానికి ప్రతీకారేచ్ఛ.. కలసి వెరసి ఆ లేఖకు ప్రేరణగా నిలిచిందని అర్ధమవుతూనే ఉంది. కానీ, నక్సల్స్‌లో చేరడానికి రాష్ట్రపతి అనుమతికి లేఖ రాయడం చూస్తే, బాధితుడి అమాయకత్వమేమిటో స్పష్టమవుతూనే ఉంది.

అంటే ఏపీలో రాజ్యహింస ఏ స్థాయిలో ఉందో, పాలకులు తమ పార్టీ నేతలకు ఏవిధంగా అరాచకాలకు, పోలీసుల ద్వారా లైసెన్సు ఇచ్చారో.. లేఖ అందుకున్న రాష్ట్రపతికి సైతం బోధపడి ఉండాలి.  దళితులపై వరస వెంట జరుగుతున్న దాడులతో,  పల్లెలు ఏ స్థాయిలో కన్నీరు పెడుతున్నాయో దేశ ప్రధమ పౌరుడికి అర్ధమయి తీరాలి.  దళిత, బడుగు వర్గాల ఆక్రందనలు రాష్ట్రం దాటి, దేశ రాజధాని వరకూ వినిపిస్తున్నన్న తీరు.. ‘పోలీస్‌రాజ్’ మళ్లీ ఇరవైఏళ్ల నాటి మాదిరిగా, జడలు విప్పుతోందన్న సంకేతమే.

అయినా బాధితుడిది ఆశనో, అత్యాశనో అర్ధంకావడం లేదు. కొన్నేళ్ల నుంచి ఉనికిలో లేని, అడవి అన్నల గురించి ఆలోచించడమే అమాయకత్వం. ఇరవై ఏళ్ల క్రితం నాటి నక్సలిజం ఇంకా మనుగడలో ఉందని భ్రమించినట్లున్నాడు కామోసు? రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు అనుసరిస్తున్న దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు, వారిపై నిర్నిరోధంగా జరుగుతున్న దాడులపై, గత ఆరేళ్లలో అన్నలు స్పందించిన దాఖలాలు లేవు. వారు సాధించిందల్లా… రెండేళ్ల క్రితం విశాఖ జిల్లాలో, ఎమ్మెల్యే-మాజీ ఎమ్మెల్యేని చంపి మేమున్నామని చెప్పడమే!  పాలకులు తెలివిమీరి, అడ్డదారులలో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు గొంతు చించుకుంటున్నా, వాటిపై మావోల విధానమేమిటో ఇప్పటికీ తెలియదు. సాగునీరు, మద్యం, మైనింగ్, మెడికల్, భూ కేటాయింపులలో పాలకులు వేల కోట్లకు పడగలెత్తుతున్నారన్న ఆరోపణలపై, మావో నేతలు స్పందించిన దాఖలాలు లేవు. తెలంగాణ యువనేత రేవంత్‌రెడ్డి… ‘రాష్ట్రంలో ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే, నక్సల్స్ ఎందుకు గళం విప్పడం లేదు? అక్కడ కూడా దొరలే నాయకత్వం వహిస్తున్నందుకా’ అని ప్రశ్నించారు.

ప్రజాసమస్యలపై గళం విప్పినందుకే నక్సలిజం, ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు విర్ధిల్లింది. ప్రజాప్రతినిధుల ఆగడాలను ప్రశ్నించినందుకే, ప్రజలు నక్సల్స్‌ను ప్రత్యామ్నాయంగా భావించారు. పల్లెలు వారిని గుండెలో పెట్టి దాచుకున్నాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో, శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకూ నక్సలిజం విస్తరించింది. పదేళ్ల క్రితం వరకూ.. తెలంగాణలో ప్రజాప్రతినిధులెవరూ హైదరాబాద్ దాటి, తమ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. నక్సల్స్ ప్రభావం ఆ స్థాయిలో ఉండేది. మరి ఇప్పుడు?  ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, దళితులపై నిర్నిరోధంగా జరుగుతున్న దాడులు, హత్యలపై పెదవి విప్పిన పాపాన పోలేదు. బహుశా శిరోముండనం బాధితుడు.. సినిమాల్లో నక్సలైట్లను చూసి ప్రేరేపితుడయి, తాను కూడా నక్సల్స్‌లో చేరతానని అమాయకంగా లేఖ రాసినట్లు కనిపిస్తోంది.

ఒకరకంగా శిరోముండనం బాధితుడి లేఖ, ప్రజలు తిరిగి తమను మళ్లీ కోరుకుంటున్నారన్న సంకేతాలిచ్చేవే. జనంలో నమ్మకం కోల్పోయి, అగ్రనేతలు ఒక్కొక్కరే పిట్టల్లా రాలిపోతూ..  మరికొందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తూ,  రిక్రూట్‌మెంట్లు లేక, ఉనికి మాయమవుతున్న మావోలకు, శిరోముండన బాధితుడి లేఖ కొత్త ఆశలు చిగురింపచేసేదే. కానీ, ఇది ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక సంకేతమని విస్మరించకూడదు. గతంలో పోలీసులకు మితిమీరిన స్వేచ్ఛ ఉన్నప్పుడు, నక్సలైట్లను బాధితులు ప్రత్యామ్నాయంగా చూశారు.

కానీ ఇప్పుడు పోలీసుల ధోరణిలో, చాలావరకూ మార్పువచ్చింది. ఇప్పుడు మెజారిటీ పోలీసులు విద్యాధికులే. కానిస్టేబుళ్లు, హోం గార్డులు కూడా పీజీలు చేసి వచ్చిన వారున్నారు. సామాజికస్పృహ ఉన్నవారు బోలెడుమంది. కానీ ఖాకీచొక్కా వేసుకోగానే, తలకెక్కే పొగరు జీర్ణించుకునే పోలీసులు ఇంకా అక్కడక్కడా ఉన్నారు. అందుకే ఈ ఘటనలు. ప్రస్తుతం..  పాతరోజుల్లో ఖాకీల దాష్ఠీకం పోయి, ఇప్పుడు రాజకీయ నాయకుల దౌర్జన్యాలు దర్శనమిస్తున్నాయి. శిరోముండన బాధితుడు చెబుతున్న ఆ ఆరో ముద్దాయి, సదరు ఆ జాతికి సంబంధించిన వాడే మరి. పాలకులారా… యువత భవిష్యత్తు ఆలోచన ఏమిటో మీకు అర్ధమవుతోందా?