ఎట్టెట్టా.. పీఆర్పీ-జనసేన ఓట్లన్నీ కమలానికేనట!

579

ఇదేం సమీక‘రణం’ అంటున్న శ్రేణులు 
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
ప్రపంచ క్రికెట్‌కప్‌లో హర్యానా హరికేన్.. కపిల్‌దేవ్ 175 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. చాలాకాలం తర్వాత అదే రాష్ట్రం నుంచి, చేతన్‌శర్మ అనే ఫాస్ట్‌బౌలర్ క్రికెట్ రంగంలోకి వచ్చారు. ఆయన తొలి మ్యాచ్‌లో 25 పరుగులు చేశారనుకుందాం. కానీ ‘మావాడయిన కపిల్‌దేవ్ చేసిన 175 పరుగులతో కలిపి, నేను చేసిన 25  కలిపితే 200 పరుగులు చేసినట్టే’నని వాదిస్తే ఎలా ఉంటుంది? పీఆర్పీ-జనసేనకు వచ్చిన ఓట్ల శాతమంతా కలిపితే.. ఇప్పటి మా పార్టీ ఓట్ల శాతం బలమని చెప్పిన, భాజపా కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు మాదిరిగా ఉంటుంది.
ఎప్పుడో చిరంజీవి పుట్టించి.. తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లతో పాటు, ఆయన తమ్ముడు పవన్ పెట్టిన జనసేన ఓట్లన్నీ, భవిష్యత్తులో ఇక భాజపాకే పడతాయట. ఆ ప్రకారంగా ఏపీలో ఇప్పుడు బీజేపీ ఓట్ల శాతం 24 శాతమట. అదేంటీ.. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పీఆర్పీ ఓట్లు కూడా, కమలం ఖాతాలో ఎలా కలుస్తాయి? మొన్న ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు కూడా, భాజపా అకౌంటులో ఎలా పడతాయని అడక్కండి.  ఇది భాజపా నవ సారథి సోము వీర్రాజు గారి లెక్కల మంత్రం!  పొరపాటున ఆ ముక్క ఎవరయినా ఆయనను ప్రశ్నిస్తే, ‘మా పార్టీ మా ఇష్టం. మా లెక్కలు మా ఇష్టం. మీకేంటీ బాధ? మేం ఏం లెక్కలు వేసుకుంటే మీకెందుకు ఇబ్బందని’ మొన్న టీవీ9 రజనీకాంత్‌ను నిలదీసినట్లు నిలదీస్తారు. జాగ్రత్త!
నిజమే. రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికుంటాయి. మామూలుగా అయితే ఒకటి ప్లస్ ఒకటి రెండు. కానీ రాజకీయ నాయకుల లెక్కలు వేరుంటాయి. సరే. కానీ.. కొన్నేళ్ల క్రితం మూసేసిన, చిరంజీవి దుకాణం కస్టమర్లను కూడా, తన పార్టీ ఖాతాలో ఎలా వేసుకుంటారన్నది, ఇప్పుడు వినిపిస్తున్న లా పాయింటు. 2009 ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీకి.. 75 లక్షల ఓట్లు, 18 సీట్లతో 18 శాతం ఓట్లు వచ్చాయి. అది సమైక్య రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు. తెలంగాణలో కూడా పీఆర్పీ ఖాతా తెరవడంతోపాటు, అనేక నియోజకవర్గాల్లో సంతృప్తికర స్థాయిలో ఓట్లు సాధించింది. వచ్చిన 18 శాతం ఓట్లు, సీట్లన్నీ తెలంగాణతో కలిపేనన్నది విస్మరించకూడదు. ఆ తర్వాత ఆయన ఎక్కువకాలం పార్టీని నడిపించే ఓపిక లేక, ఢిల్లీకి వెళ్లి సోనియామాతను కలసి, ఓ కేంద్రమంత్రి పదవి బేరం పెట్టుకుని, పీఆర్పీని కాంగ్రెస్ సముద్రంలో కలిపేశారు.
నాటి నుంచీ ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఆ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. పైగా, ఆయనను నమ్మి ఇతర పార్టీల నుంచి చేరిన వారంతా, మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు, పీఆర్పీ నుంచి వెళ్లిన తర్వాత, ఇప్పటికి రెండు పార్టీలు మారారు. మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పీఆర్పీలో చేరిన ఇలాంటి అనేక మంది గంటాలు, ఎవరి దారి వారు చూసుకుని ఏళ్లయిపోయింది.
అటు కులాభిమానంతో, తమను అందలమెక్కించిన పార్టీలను కాదనుకుని..పీఆర్పీలో చేరిన అనేక మంది కాపునేతలు, పీఆర్పీ దుకాణం మూసివేతతో రాజకీయంగా అనాధలయ్యారు. కాపు రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ నాయకత్వం వద్ద షరతు విధించకుండా, తన మానాన తాను పార్టీని విలీనం చేసిన ‘అన్నయ్య’ తీరుపై కాపులు రగలిపోయారు. తూ.గో-ప.గో జిల్లాల్లో అయితే.. చిరంజీవి దిష్టిబొమ్మలను తగులబెట్టి, తమ కోపం చల్చార్చుకున్నారు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నయ్య కాంగ్రెస్‌కు ప్రచారం చేసినా.. జనంతోపాటు, ఓట్లు కూడా రాలేదు.
మరి అలాంటి ప్రజారాజ్యం పార్టీకి పడిన.. 18 శాతం ఓట్లు, ఏ లె క్కన, ఏ లాజిక్కు ప్రకారం కమలం ఖాతాలో కలుస్తాయన్న సందేహం, కమలనాధుల బుర్రలను వేధిస్తోంది. సోము వీర్రాజు లెక్కలనే తీసుకున్నా, పీఆర్పీకి వచ్చిన 18 శాతం ఓట్లలో 9 శాతం తెలంగాణ ప్రాంతానిది. అంటే ఏపీలో ఆయనకు వచ్చిన ఓట్ల శాతం తొమ్మిదన్న మాట. పోనీ.. కాపు కులకోణంలో చూసుకున్నా, ఇప్పుడు చిరంజీవిని నమ్మి, ఆ పిచ్చి రోజుల మాదిరిగా చొక్కాలు చించుకుని, జేబులు ఖాళీ చేసుకునే కాపులెవరూ లేరు. ఆ జ్ఞానోదయంతోనే, పీఆర్పీ అనుభవం చూసిన కాపులు.. మొన్నటి ఎన్నికల్లో ఆయన తమ్ముడు పవన్ పార్టీకే ఓట్లు వేయలేదు. నిజంగా సోము లెక్కల మాస్టారి గణిత శాస్త్ర కోణమే నిజమయితే… అన్నయ్యకు వచ్చిన 18 శాతం, తమ్ముడు పార్టీకి వచ్చిన 7 శాతం కలిపితే.. 25 శాతం ఓట్లతో కనీసం 15 సీట్లు రావాలి కదా? సరే తెలంగాణ వాటా విడిచిపెడితే, కనీసం ఆ సగం 9 శాతం ఓట్లయినా కలవాలి కదా? మరి అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కల్యాణ్‌బాబు రెండుచోట్లా ఓడిపోయి, ‘ఏకవీరుడే’ ఎందుకు గెలిచినట్లు? పోనీ పవన్ పోటీ చేసిన చోట, కాపులు లేరా అంటే… వారి ఓట్లు దండిగానే ఉన్నాయి. కానీ గెలవలేదు.
అంతకుముందు.. అన్నయ్య పోటీచేసిన సొంత నియోజకవర్గంలోనే కాపులు ఎందుకు ఆయనను నెత్తినపెట్టుకోలేదు? వైశ్య నేతను ఎందుకు గెలిపించారు? పవ న్ కల్యాణ్ పార్టీకి, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 21 లక్షల 30 వేల ఓట్లు.. మళ్లీ బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తే అంతే వస్తాయన్న గ్యారంటీ ఏమిటి? గత ఎన్నికల్లో పవన్ ఏకవీరుడు కాబట్టి.. మోదీ-బాబు-జగన్‌ను జమిలిగా ఏకిపారేశారు కాబట్టి, ముస్లిం-క్రైస్తవులు జనసేనకు ఓటేశారు. మరి రేపు బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తే మైనారిటీలు మళ్లీ, ఆ కూటమికి ఓట్లేస్తారా? అన్నది మరో ప్రశ్న. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో, టీడీపీ-వైసీపీ మధ్య తేడా 5 లక్షల ఓట్లు మాత్రమే. మరి తొలి ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు, మళ్లీ గత ఎన్నికల్లో పోలవలేదన్న వాస్తవాన్ని బీజేపీ గణితశాస్త్ర పితామహులు విస్మరించడం విడ్డూరం. మరి ఏ లెక్కల ప్రకారం పీఆర్పీ-జనసేన పాత ఓట్లన్నీ, కొత్త కూటమి ఖాతాలో కలుస్తాయో వీర్రాజుకే తెలియాలి.
బీజేపీ-కాంగ్రెస్-వామపక్షాలకు కలపి, రాష్ట్రంలో వచ్చిన ఓట్ల శాతం 6.8 మాత్రమే. ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్‌కు 3 లక్షల 68 వేలు రాగా, అసలు రాష్ట్రంలో ఉందో లేదో తెలియని బీఎస్పీకి 88 వేల ఓట్లు వచ్చాయి. మరి నాలుగేళ్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, పోటీచేసిన బీజేపీకి వచ్చింది 2లక్షల 63 వేలు మాత్రమే. మొదటిసారి పనిచేసిన మోదీ మంత్రం, రెండోసారి ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎందుకు పనిచేయలేదు? రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన ఇండిపెండెంట్లకు 2 లక్షల 86 వేల ఓట్లు రావడం గమనార్హం. వైసీపీ కోటీ 56 లక్షలతో 49.96 శాతం, టీడీపీకి కోటీ 23 లక్షలతో 39.18 శాతం ఓట్లు, జనసేనకు 21 లక్షల 30 వేలు పోలయ్యాయి. ఏ ఎన్నికల లెక్కలన్నీ, ప్రతిసారీ ఒకేలా ఉండవు. ఒకసారి ఒక పార్టీకి ఓటేసిన వర్గాలు, మళ్లీ తర్వాత ఎన్నికల్లో కూడా, ఆ పార్టీకే ఓటేయరని చెప్పడానికి.. ఇంతకుమించిన ఉదాహరణ పెద్దగా అవసరం లేదు. మరి భాజపా బలం 24 శాతం అని నమ్ముదామా?