కమలం పొమ్మంటే.. కాషాయం రమ్మంది!

493

తన చెప్పుతో తానే కొట్టుకున్న వెలగపూడి
బీజేపీ నుంచి సస్పెండయిన వెలగపూడి గోపాలకృష్ణ
ఆ వెంటనే అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్ష పదవి
ఇక మూడో టార్గెట్ లంక దినకరేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

హిందూ కార్డుపై పేటెంటీ ఉందని భావించే పార్టీ… ఆయనను ఆ పార్టీ నుంచి సాగనంపింది. అయితే కొద్ది గంటల తేడాలోనే, ఆయనను కాషాయదళ సంస్థ.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్న వైచిత్రి ఇది. అమరావతిపై బీజేపీ వైఖరితో పాటు, అన్ని పార్టీల వైఖరి వెల్లడించిన క్రమంలో,  తన చెప్పుతో తానే కొట్టుకున్న బీజేపీ నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ తీరు, సంచలనం సృష్టించింది. ఆయన అమరావతిలో.. పార్టీలకు అతీతంగా రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకుల్లో ఒకరు. అంతేకాదు. తన సొంత భూమిని బీజేపీకి దానంగా ఇచ్చిన నాయకుడు. మరి అలాంటి నాయకుడిని, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.

అంతకు రెండు రోజుల ముందుగానే.. రాజధానిపై పార్టీ వైఖరిపై ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని వివరిస్తూ, ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాసిన బీజేపీ నేత, ఓవి రమణపై.. అధ్యక్షుడు సోము వీర్రాజు తొలి వేటు వేశారు. దానిపై ఆయన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత పార్టీ ఆఫీసు కోసం భూమి ఇచ్చిన, వెలగపూడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అసలు ఈ ఇద్దరికీ షోకాజు నోటీసులివ్వకుండా, ఏకంగా సస్పెండ్ చేయడమే ఆశ్చర్యం. కాగా, అమరావతి రాజధాని అంశంపై పిల్ వేసిన బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, కొత్త నాయకత్వానికి మూడో టార్గెట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి సమాచారం, అనుమతి లేకుండానే ఆయన పిల్ వేశారన్న అభియోగంతో, దినకర్‌పై వేటు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీవీ9 చర్చలో రజనీకాంత్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ఈ ‘కర్లు, గిర్లు’ ఎవరి కోసం మాట్లాడుతున్నారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. దీన్ని బట్టి.. బీజేపీలో మూడో టార్గెట్ లంకా దినకర్‌గా కనిపిస్తోంది. అయితే ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాసిన తర్వాతనే, పిల్ వేసినట్లు చెబుతున్నారు. ఆరకంగా కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత,  చేరికల బదులు సస్పెన్షన్లు పెరుగుతుండటంపై, పార్టీలో విస్మయం వ్యక్తమవుతోంది.

తాజాగా బీజేపీ నుంచి సస్పెండయిన వెలగపూడి గోపాలకృష్ణను.. అఖిల భారత హిందూ మహాసభ ఏపీ అధ్యక్షుడిగా నియమించడం, ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారాలను ప్రముఖ న్యాయవాది, తెలంగాణ శాఖ అధ్యక్షుడయిన జంధ్యాల రవిశంకర్ పర్యవేక్షిస్తున్నారు. గతంలో మత మార్పిళ్లు, దేవాలయాలపై దాడులకు నిరసనగా, జంధ్యాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిర్వహించారు. చక్రపాణి మహరాజ్ నాయకత్వంలోని హిందూమహాసభ, దేశంలో హిందువులకు దన్నుగా ఉంటోంది.


ప్రస్తుత యుపీ సీఎం యోగి, బాబ్రీమసీదు విధ్వంసంలో కీలకభూమిక పోషించిన వినయ్ కటియార్, సాధ్వీరితింభర హిందూ మహాసభలో పనిచేసినవారే. నాటి వీరసవార్కర్, గాడ్సే కూడా హిందూమహాసభ నాయకులే. ప్రస్తుత అధ్యక్షుడయిన చక్రపాణి మహరాజ్ శిష్యుడే, యుపి సీఎం యోగి.  చాలాకాలం పాటు యోగి, హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తి.. యోగి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, హిందూమహాసభ అభ్యర్ధిని నిలబెట్టి, ఆయనను ఓడించింది. 1913లో ముస్లింలీగ్‌కు వ్యతిరేకంగా ఆవ ర్భివించినదే అఖిల భారత హిందూమహాసభ.

అంత ప్రాముఖ్యం ఉన్న హిందూమహాసభ.. ఏపీలో కార్యకలాపాలపై చాలాకాలం క్రితమే దృష్టి సారించింది. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లు, హిందూ దేవాలయాలపై దాడులు, ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా.. అమరావతికి సాధువులను తీసుకువచ్చి, వారితో మహాసభ నిర్వహించాలని, ప్రణాళికలు ఖరారు చేసింది. అయితే కరోనా సీజన్ మొదలుకావడంతో, అది వాయిదా పడింది. ఇప్పుడు దాని అధ్యక్షుడిగా వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌ను నియమించడంతో, ఇక రాష్ట్రంలో హిందూమహాసభ కార్యకలాపాలు, విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.