మూడు.. మూడు.. నాలుగు.. ఒకటి

479

ఇండియాటుడే ‘మూడు’ మారిందేమి చెప్మా
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

మూడు.. మూడు.. మూడు.. నాలుగు.. నాలుగు.. ఒకటీ.. ఒకటీ..  ఏమిటీ అంకెలాట అనుకుంటున్నారా? లేక పోతే,  ఏమిటీ చైతన్య-నారాయణ విద్యాసంస్థ మాదిరిగా అడ్వర్టయిజమెంట్లనుకుంటున్నారా? కాదండీ. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రెండు సంస్థలు ఇటీవల ఇచ్చిన ర్యాంకులివి. సీ-ఓటర్ నాలుగో ర్యాంకు, రెండురోజుల క్రితమే ఇండియాటుడే జగన్మోహన్‌రెడ్డి అత్యుత్తమ మూడవ ముఖ్యమంత్రి అని ర్యాంకు ఇచ్చింది. కానీ, అదేం విచిత్రమో.. జగన్మోహన్‌రెడ్డి దేశంలో అత్యుత్తమ మూడవ ముఖ్యమంత్రి అని, కితాబు ఇచ్చిన అదే ఇండియాటుడే.. కరోనా సేవల్లో అధ్వానమైన రాష్ట్రాల్లో,ఏపీకి మూడవ స్థానం ఇచ్చింది. మరి జగన్మోహన్‌రెడ్డికి ఏ ప్రాతిపదికన అంతకుముందు మూడవ ర్యాంకు ఇచ్చిందన్నది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. బహుశా.. ఈ ప్యాకేజీ, ఆ ప్యాకేజీ వేర్వేరా అన్నది జగనన్న విమర్శకుల మరో సందేహం.

కరోనా కట్టడిపై రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ‘ఇండియాటుడే’ వెలువరించిన కథనం, జగనన్న అభిమానులు-వైసీపీ నేతలను అత్యంత నిరాశ పరిచింది. రెండురోజుల క్రితమే, జగనన్న పాలన అద్భుతమంటూ ఆయనకు మూడవ ర్యాంకిచ్చిన, అదే ఇండియాటుడే.. కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే జగనన్న రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని, త్వరలోనే ప్రధమ స్థానంలోకి వస్తుందని జోస్యం చెప్పింది. వైరస్ వ్యాప్తిలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత ఏపీనే అని వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత స్ధానం ఏపీదేనని వివరించింది.

కరోనా కట్టడిలో విఫలమయినట్లు ఇంత స్పష్టంగా చెప్పిన ఆ సంస్థ.. మరి.. జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రాతిపదికన, మూడవ ఉత్తమ ముఖ్యమంత్రి అని ఎలా ప్రకటించిందన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికీ అంతుపట్టడం లేదు. బహుశా సంక్షేమ రంగాన్ని ప్రాతిపదిక తీసుకున్నా, లబ్ధిదారుల కంటే అవి రాని వారి సంఖ్యనే సహజంగా ఎక్కువగా ఉంటుంది. అంటే, అక్కడా అసంతృప్తి ఉన్నట్లే లెక్క. పోనీ పాలనపరమైన నిర్ణయాలేమైనా, ప్రాతిపదికగా తీసుకున్నారా అంటే.. ప్రతి కీలకమైన నిర్ణయంపైనా, కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఏ లెక్కన జగన్మోహన్‌రెడ్డిని మూడవ జాబితాలో చేర్చారన్న సందేహాలు, మెదడు ఉన్న ఎవరికయినా వస్తాయి కదా?

కరోనాతో సహజీవనం చేయాలని ఆయనే చెప్పినప్పటికీ, పరీక్షల నిర్వహణలో చాలా రాష్ట్రాల కంటే ఏపీనే మెరుగ్గా ఉంది. కరోనా విస్తృతి, మరణాలకు ఏ సీఎం అయినా వ్యక్తిగతంగా బాధ్యులు కాదన్నది నిజం. కానీ, ప్రజాదరణ ఉన్న సంస్థల నుంచి మూడు, నాలుగు స్థానాలు పొందిన సీఎం రాష్ట్రం కరోనా కట్టడిపై చేతులెత్తేయడం నామర్దానే కదా? అన్నట్లు..  కరోనా టెస్టులు, ట్రేసింగులో ఏపీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని.. రెండురోజుల క్రితమే బ్రిటీష్ తాత్కాలిక హై కమిషనర్ జాన్ థాంప్సన్ ప్రశంసిచినట్లు..జగన్ సొంత మీడియా సాక్షిలో,  తాటికాయంత అక్షరాలతో వచ్చింది. మరి ఇంతలోనే,  కరోనా కట్టడిలో ఏపీ వరస్ట్‌గా ఉందని  ..‘ఇండియాటుడే’ వెల్లడించడం ఏమిటో అర్ధం కావడం లేదు.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ నెంబర్ 1 అని ప్రకటించింది. స్కోచ్ అవార్డు వ్యవహారం కూడా అంతే. ప్రపంచంలో ముక్కు మొహం తెలియని యూనివర్శిటీలు, సంస్థలు కూడా బాబు పాలన బ్రహ్మాండమని తెగ మెచ్చుకున్నాయి. సమైక్య రాష్ట్రంలో కూడా చంద్రబాబు పాలనకు అంతర్జాతీయ, జాతీయ పత్రికలు బ్రహ్మరథం పట్టాయి. బాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో, స్థానిక మీడియా ఆయన పాలనా వైఫల్యాలను ఎత్తిచూపింది. కానీ, దేశ-విదేశ పత్రికలు, మ్యాగజైన్లు మాత్రం..బాబు పాలన అనితర సాధ్యం-అనన్య సామాన్యమని ఆకాశానికెత్తేశాయి. కానీ ఆయన పతనం మాత్రం తప్పలేదు.

విభజిత రాష్ట్రంలో కూడా.. బాబు పాలనలో 89 శాతం సంతృప్తి వ్యక్తం చేశారంటూ, అధికార-పార్టీ భజనబృందం  బాబు కళ్లకు గంతలు కట్టింది. రోజూ ఎంపిక చేసుకున్న కొందరితో ఫోన్లు చేయించి, మీ పాలన క్షేత్రస్థాయిలో బాగా ఉందంటూ గ్యాస్ కొట్టించేవారు. అందుకోసం లోకేష్ తెచ్చి పెట్టుకున్న ఓ యువ మేధావి,  చాలా పెద్ద మంత్రాంగమే నడిపారట. రోజూ వేలాదిమందికి ఫోన్లు చేస్తున్నామంటూ, కొద్దిమందితో బాబుకు ‘దేవతా వస్త్రాలు’ చూపించేవారు. నిఘా దళం కూడా, ప్రత్యర్ధి బలహీనుడేనని చూపించేందుకు పోటీపడింది. పొగడ్తలకు పొంగిపోయి, క్షేత్రస్థాయిలో పార్టీని గాలికొదిలి, పెట్టుడు సర్వేలను నమ్ముకున్న చంద్రబాబు చివరాఖరకు నిండా మునిగిపోయారు.

ఇప్పుడు  జగనన్న కోటరీ, బహుశా చంద్రబాబు స్కీమును ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో, జగన్ ప్రభుత్వంపై 64 శాతం సంతృప్తస్థాయి ఉందని నివేదిక వచ్చిందట. అదీ సంగతి! జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే  అవార్డులన్నీ ప్రభుత్వాల తాహతు- వారు పాడే వేలం పాటను బట్టి ఉంటాయన్న విషయాన్ని, సామాన్యులు గుర్తించినా.. పాపం పాలకులే ఇంకా గుర్తించకపోవడం అమాయకత్వం!