ఫాఫం.. ఫవన ‘కమల కల్యాణం’!

అమరావతి కోసమే పొత్తని గర్జన
ఇప్పుడు ఆ రెండు పార్టీలూ రాజీనామాలు చేయాలట
మరి సొంత పార్టీ ఎమ్మెల్యేతో ఆ పని చేయించరేం?
అమరావతిపై అడకత్తెరలో జనసేనాధిపతి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
‘నేను లేస్తే మనిషిని కాదన్నాట్ట’ వెనకటికి ఓ వృద్ధ వస్తాదు. ఆయన భారీ కాయం చూసి, అది నిజమేకామోసని ఆయన జోలికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు. కానీ విషయమేమిటంటే.. సదరు సవాలు విసిరిన వస్తాదు అసలు పైకి లేవనేలేడు. అదీ రహస్యం! అమరావతిపై సవాళ్లు, గర్జనలు, ఆడపిల్ల టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, సర్కారుపై తొడ కొట్టి సవాళ్లు విసురుతున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాటలు చూస్తే.. ఎవరికయినా, ఈ సామెత గుర్తుకు రాక తప్పదు.
‘‘అమరావతిలోనే రాజధాని ఉంచుతామని హామీ ఇచ్చిన తర్వాతనే, మేం భారతీయ జనతాపార్టీతో పొత్తుకు ముందుకెళ్లాం. నేను స్వార్ధం కోసం, నా స్వలాభం కోసం పొత్తు పెట్టుకోలేదు. ప్రజాక్షేమం కోసమే పొత్తు పెట్టుకున్నాం. ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన మీరు, అన్యాయానికి గురయితే ఎవరికి చెప్పుకుంటాం? అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ మాట్లాడుతోంది గానీ కేంద్రం కాదు. మీకోసం మేం సంయుక్తంగా పోరాడతాం’
-ఫిబ్రవరి 19న జనసేన వీరుడు పవన్‌కల్యాణ్, అమరావతి రైతుల సమక్షంలో చేసిన గర్జన ఇది.
‘అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీతో ఒప్పందం రాసుకున్నాం. అమరావతి కోసమే భాజపాతో కలిశా. కమల నేతలు అలా చేస్తారనుకోను. ఒకవేళ మార్చినా మళ్లీ వెనక్కి తెస్తాం. వైసీపీ సర్కారును కూల్చేవరకూ నిద్రపోం. అమరావతే మన శాశ్వత రాజధాని. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. అక్కడ పోలీసు రాజ్యం నడుస్తోంది. కేంద్రహోంశాఖ కల్పించుకోవాలి’
– ఈ ప్రకటన చేసింది కూడా జనసేన వీరుడు మన కల్యాణ్బాబే.
మరి రాజధానిపై ఇన్ని పిల్లిమొగ్గులు వేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలట. రాజధానుల బిల్లుపై గవర్నరు సంతకం చేయడాన్ని విపక్షాలన్నీ ఖండించాయి. కానీ పవన్ మాత్రం స్పందించలేదు. పార్టీ నాయకులతో మాట్లాడి చెబుతానన్నారు. అంతేగానీ, గవర్నరు చర్య మంచిదా? కాదా అని మాత్రం తేల్చకుండా, తెలివిగా దాటేశారు. మరి, ముందు అమరావతిలోనే రాజధాని ఉండాలని చేగువేరా వారసుడి లా గర్జించిన పవన్బాబు.. ఆ తర్వాత దాని కోసమే బీజేపీతో జట్టు కట్టానని చెప్పి, ఇప్పుడు మాత్రం గవర్నరు చర్యను ఖండించకపోవడం చూస్తే… కమలం చేతికి చిక్కిన కలియుగ చేగువారాను చూసి, ‘ఫాఫం ఫవన్’ అనుకోవడంలో తప్పేమిటి?
రాజధానిపై రెండు పార్టీలను రాజీనామా చేయాలని, చూపుడువేలితో డిమాండ్ చేసిన జనసేనాధి పవన్.. ముందు తన పార్టీకి ఉన్న ‘ఏకవీరుడితో’ రాజీనామా ఎందుకు చేయించలేదన్నది ప్రశ్న. అసలా ఏకవీరుడితో పార్టీకి కనెక్షను ఉందో లేదో మరి! న్యాయం అనేది, ముందు తన ఇంటి నుంచి కదా మొదలుపెట్టాలి? పవన్ ఈ ఫాలసీని అంత వీజీగా మర్చిపోతే ఎలా చెప్మా? అసలు ప్రశ్నించేందుకే పుట్టిన పార్టీ అయిన జనసేన.. రాజధాని బిల్లులపై ఎందుకు సంతకం చేశారని, గవర్నరును ప్రశ్నించకపోవడం ఏమిటో అర్ధం కాదు. ఇప్పటివరకూ రాజధాని రైతులకు కాపుకాసినన జనసేనాధిపతి, ఇప్పుడు గవర్నరు సంతకంతో వారి బతుకు బస్టాండవుతుంటే.. మళ్లీ మునుపటి మాదిరిగా, పోలీసు కంచెలను దాటుకుని వారి వద్దకు ఎందుకు వెళ్లలేదో, ఫవన కల్యాణానికే తెలియాలి. అంటే దీన్ని బట్టి.. బీజేపీ బాహువుల్లో చిక్కుకున్న, పవన్ పరిస్థితి ఏమిటన్నది స్పష్టమవుతూనే ఉంది.
లేకపోతే, సహజంగా ఆవేశపరుడు-సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే పవన్… అమరావతి పరిణామాలను చూస్తూ కూర్చోలేరు. కమలంతో రాజకీయ కల్యాణం కాకపోయి ఉంటే, ఈపాటికే ఆయన గర్జనలు అమరావతిలో ప్రతిధ్వనించి ఉండేవి. బహుశా తాను ఎక్కడ గవర్నరు చర్యపై కన్నెర చేస్తే.. కమల కుటుంబంలో ఎక్కడ కలతలొస్తాయన్న మొహమాటంతోనే, కాటమరాయుడు తెలివిగా ‘రాజధాని’ని దాటవేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫాఫం.. చేగువేరా వారస ఫవన కల్యాణం!