(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)



నిజానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, ప్రకటించిన కొత్త పథకాలన్నీ.. కేసీఆర్ మస్తిష్కం నుంచి ఆవిర్భవించినవే. కాకపోతే పేరు మాత్రం చంద్రబాబుకు వచ్చింది. ఆ పేరు జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో, ఆయనను ఓ పరిపాలనా దక్షుడిగా నిలబెట్టింది. అలాంటి కేసీఆర్.. రాష్ట్రం విడిపోయాక, రెండోసారీ తెలంగాణ సీఎంగా గెలుస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన పార్టీదే విజయపతాక. పైగా అనేక కొత్త పథకాలతో జనంలో ఉన్నారు. ఐటీలో ప్రపంచం తెలంగాణ వైపే చూస్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ తెలంగాణ పోటీ పడుతోంది. కానీ.. రాజకీయంగా తన కంటే సబ్ జూనియర్ అయిన, ఏపీ సీఎం జగన్ కంటే జాతీయ ర్యాంకింగ్‌లలో, ఆయన తరచూ వెనుకబడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
తాజాగా ‘ఇండియాటుడే’ నిర్వహించిన సర్వేలో, జగన్ మూడవ అత్యుత్తమ సీఎంగా నిలిస్తే, కేసీఆర్ ఎనిమిదవ స్థానానికి పరిమితమయ్యారు. ఇండియాటుడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో నిర్వహించిన ఆ సర్వేలో.. జగన్‌కు 11 మార్కులొస్తే, కేసీఆర్‌కు మూడు మార్కులే వచ్చాయట. ఈ సర్వేలో 67 శాతం మంది గ్రామీణ ప్రజలు, 33 శాతం పట్టణ ప్రాంత ప్రజలు పాల్గొన్నట్లు ఇండియాటుడే వెల్లడించింది. గతంలో సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలోనూ.. జగన్‌కు నాలుగు, కేసీఆర్‌కు పదహారో స్థానం లభించడంపై ఆశ్చర్యం వ్యక్తమయింది. బహుశా.. సర్వే సంస్థ కరోనా వైద్యసాయంపై సర్వే నిర్వహించి ఉండవచ్చని, కరోనా టెస్టులు- చికిత్సలు- వాలంటీర్ల సేవల విషయంలో, తెలంగాణ కంటే ఏపీనే ముందంజలో ఉన్నందున.. సహజంగానే ప్రజలు, ఏపీ సీఎం జగన్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. విపక్షాల విమర్శల జడిలో, తడిసి ముద్దవుతున్న కేసీఆర్ సర్కారుకు, తాజా సర్వే ఫలితాలు మరో తలనొప్పే. ఇది విపక్షాల విమర్శనాస్త్రాల్లో మరో ఆయుధం అదనంగా చేరినట్లే.
తాజా సర్వే ఫలితాలు.. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి బోలెడంత ఊరట. ఇటీవలి కాలంలో.. వరస వెంట వరస కోర్టు తీర్పులతో, తలబొప్పి కట్టిన జగన్ సర్కారు, ఇండియాటుడే ఇచ్చిన ‘మూడో ర్యాంకు సీఎం’ ప్రశంస కాస్తంత తెరపినిచ్చేదే. ఇది జాతీయ స్థాయిలో కూడా జగన్‌కు ఇమేజ్ తెచ్చిపెట్టేదే. యోగి ఆదిత్యనాధ్, కేజ్రీవాల్ సరసన నిలవడం జగన్‌కు రాజకీయంగా అదనపు మైలేజీనే. నిజానికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాలను, కోర్టులు కొట్టివేస్తున్న వైనం దేశం మొత్తాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోంది. ఏ సీఎం తీసుకున్న నిర్ణయాలపై రానంత వ్యతిరేకత, జగన్‌పై వస్తోంది. అమరావతి వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనితో జగన్ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న భావన, మిగిలిన రాష్ట్రాలలో ఏర్పడింది. జాతీయ మీడియా కూడా, వాటిని ప్రముఖంగా ప్రచురించడం కూడా ఆ భావనకు ఓ కారణం.
ఆ క్లిష్ట సమయంలో, కరోనా పరీక్ష-చికిత్చలు ఎక్కువ చేస్తున్న రాష్ట్రంగా కూడా, ఏపీ గుర్తింపు పొందడం జగన్‌కు కలసివచ్చిందనే చెప్పాలి. దానికి… గతంలో సీ- ఓటర్, ఇప్పుడు ఇండియాటుడే నిర్వహించిన సర్వేల్లో జగన్ ర్యాంకు పెరగడం, ఆయన ఇమేజ్ పెంచినట్లయింది. అయితే సీ- ఓటర్లో జగన్‌కు నాలుగవ ర్యాంకు వచ్చిన తర్వాత కూడా.. ఆయన పనితీరుకు కోర్టులలో చుక్కెదురవడం గమనార్హం. గతంలో సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో.. ఆయనకు నాలుగవ స్థానం దక్కగా, ఇప్పుడు ఇండియాటుడే సర్వేలో మూడవ స్థానం లభించడం విశే షం. అంటే జగ నన్న ర్యాంకు పెరిగిందన్నమాట. అయితే.. ఎన్డీటీవీకి చెందిన ఇండియాటుడేతో, జగన్ మీడియా చిరకాల స్నేహబంధం ఉంది కాబట్టి.. జగన్‌కు ఈ ర్యాంకు వచ్చిందన్న పుల్లవిరుపు మాటల్లో నిజమెంతో ‘జగన్నా’ధుడికి ఎరుక?