గుడి ‘గంట’లు మోగుతున్న వేళ..

725

వైసీపీ కార్యకర్తల నిరసన హేల
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

గౌతు లచ్చన్న.. మజ్జి తులసీదాస్.. ద్రోణంరాజు సత్యనారాయణ.. పివి చలపతిరావు..బొడ్డేపల్లి రాజగోపాల్.. ఇప్పటికాలంలో ఎర్రన్నాయుడు…. అయ్యన్నపాత్రుడు.  వీరి పేర్లు చెబితే ఉత్తరాంధ్ర గర్వంతో ఉప్పొంగుతుంది. వీళ్లంతా తమ బిడ్డలని సగర్వంగా చెబుతుంది.  వీరిలో ఉత్తరాంధ్ర పతాకను, ఎక్కువకాలం ఢిల్లీలో ఎగురవేసిన చరిత్ర ఎర్రన్నాయుడిదే. మరికొందరు రాష్ట్ర స్థాయి, ఇంకొందరు ఉత్తరాంధ్ర రాజకీయాలలో చక్రం తిప్పిన వారే. ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. అదొక్కటే కాదు. వీరంతా పుట్టిన పార్టీలోనే గిట్టిన వారు. పార్టీ మారటం వీరి రక్తంలోనే కనిపించదు. ఫిరాయింపు రాజకీయాలంటే తెలియని వారు. అధికారం లేకపోయినా, దానికోసం అర్రులుచాచని నేతలు. సిద్ధాంతాల మడి కట్టుకున్న మహామహులు. పార్టీ మారితే మైలపడిపోయినట్లే భావించే నాయకులు. రాజకీయాల్లో విలువలు.. నైతిక విలువలకు ఆ స్థాయిలో కట్టుబడిన నేతలు. అందుకే తరాలు మారినా, వీరంతా ఇంకా జనం మదిలో నిలిచిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కూడా చేర్చాలన్నది, విశాఖ వాసుల డిమాండ్.  అదే విశేషం!

గంటా శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తే.. ఆయనను కాంగ్రెస్-తెలుగుదేశం-ప్రజారాజ్యం పార్టీల వారు తమ వాడిగానే భావిస్తారు. ఆయనకు ఆయా పార్టీలలో, అంతమంది అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నారు మరి. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస వెళ్లిన, చాలామంది ప్రముఖులు విశాఖ రాజకీయాల్లో తళుక్కున మెరిశారు. ఇప్పుడున్న చాలామంది రాజకీయ ప్రముఖులలో, ఎక్కువమంది ప్రకాశం-కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వలస వెళ్లిన వారే. వీరిలో కమ్మ సామాజిక వర్గం నాయకులే ఎక్కువమంది ఉండటం గమనార్హం. ఆ ప్రకారంగా.. గంటా కూడా ప్రకాశం నుంచి విశాఖకు వ్యాపారం కోసం వెళ్లిన వ్యక్తి. ఆయనకు ఎంపీ టికెట్ కోసం, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు వద్దకు వెళితే.. ‘‘ఈయన ప్రకాశంలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తే, మీరు మీ దగ్గర పోటీ చేయమంటారేమిటని’’ బాబు ప్రశ్నిస్తే, పాపం తమ్ముళ్లంతా బిత్తరపోయారట. అంటే గంటా పేరు ప్రఖ్యాతలు,  ఆరోజుల్లోనే ఏ స్థాయిలోనే ఉండేవన్నది ఊహించుకోవచ్చు.

విలువలతో కూడిన రాజకీయాలు చేయడంలో గంటా తర్వాతనే ఎవరయినా! అదేం విశేషమో గానీ, ఆయనకున్న ఊహాశక్తి ఏమిటో గానీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆయన ఇట్టే కనిపెట్టేస్తారు. వెంటనే ఆయనకు ఆ పార్టీ నుంచి పిలుపు వస్తుంది. ఉన్న స్థానం విడిచి, మరో నియోజకవర్గం నుంచి గంట కొట్టేస్తారు. అలా మంత్రి పదవులూ పట్టేస్తారు. ఆ రకంగా ప్రజల నాడి పట్టడంలో, గంటాకు సాటెవరూ రారన్నది నిష్ఠుర నిజం. కాంగ్రెస్-టీడీపీలో మంత్రి పదవులు సాధించడమంటే సామాన్య విషయమా మరి? ఎంత టాలెంట్ లేకపోతే ఆ పదవులు వస్తాయి? మంత్రి పదవులు వచ్చిన తర్వాత, ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతారు.  విశాఖను కనుసన్నలతో నడిపిస్తారు. తనకంటూ ఓ వ్యక్తిత్వం సృష్టించుకుంటారు. సీఎంఓ నుంచి ఫోన్లు చేసినా తీయరు. చివరాఖరకు సీఎం చేసినా ఎత్తరు. ఆయన తీయాలనుకుంటేనే, మాట్లాడాలనుకుంటేనే స్పందిస్తారు. అది టీడీపీ అయినా, కాంగ్రెసులోనయినా సరే. దటీజ్ గంటా!

నిజానికి.. పాపం ఆయనకు ఏనాడూ, పార్టీ మారాలని ఎప్పుడూ ఉండదు. విలువలతో కూడిన రాజకీ యాలనే కోరుకుంటారు. కానీ, ఆయన అనుచరులు ఊరుకోవద్దూ…? ప్రజలకు అంత ఓపిక ఉండవద్దూ..? మీరు మంత్రిగా ఉంటే తప్ప, నియోజకవర్గ అభివృద్ధి జరగదని ఒకటే ఒత్తిళ్లు. ఈ నియోజకవర్గానికి దిక్కెవరని ఒకటే పోరు. అన్నం తిననీయరు. నిద్ర పోనీయరు. అప్పటికీ.. ఆయన కూడా.. ‘ ప్రతిపక్షంలో ఉంటే అందరిలా పనిచేయలేమా? అధికార పార్టీలోనే ఉంటే అభివృద్ధి చేస్తామా? ఫిరాయిస్తే పరువుపోదా?’ అని,  నిరంతరం అద్దం ముందు నిల్చుని, తన ను తాను  ప్రశ్నించుకుంటారు. చివరాఖరకు కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు.. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ‘జెండాపై కపిరాజు’ అంటూ పాట అందుకుంటారు. ఇదంతా కొన్నేళ్ల నుంచీ విశాఖ వాసులకు అలవాటయిన వ్యవహారమే.

ఇప్పుడు మళ్లీ గంటా విలువల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన ఆగస్టు 9న వైసీపీలో చేరుతున్నారని ఒకసారి,  ఆగస్టు 15, 16 తేదీల్లో సీఎం జగన్ సమక్షంలో చేరుతున్నారని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఆయనేమో.. మీడియావాళ్లకు, అందరికీ  చెప్పే చేరతానంటారు. ఇంకోసారి నన్ను మీడియానే చాలాసార్లు వైసీపీలో చేర్పించింది అని సెటైర్లు వేస్తారు. ఈ విషయంలో గంటా సత్యసంధత, నిజాయితీ, టీడీపీ పట్ల అంకితభావాన్ని తప్పుపట్టకపోయినా.. ఆయన గత చరిత్రను చూసిన వాళ్లు మాత్రం, పార్టీ మారతారని చెబుతున్నారు. ఎవరి అంచనాలు వారివి!

అయితే… విశాఖ వైసీపీ సూపర్‌మ్యాన్ విజయసాయిరెడ్డి, చాలాసార్లు గంటాపై విమర్శలు కురిపించారు. ఆయనను పార్టీలోకి తీసుకునే సమస్యనే లేదని, బహిరంగంగానే ప్రకటించారు. ‘‘గంటా శ్రీనివాసరావు  గోడమీదపిల్లిలా వ్యవహరించే వ్యక్తి. ఏ పార్టీ అధికారంలో వస్తుందనుకుంటే, ఆ పార్టీలో చేరతాడు. అతడికి డబ్బే ప్రధానం. నీతి, నియమాలు లేని వ్యక్తి. ఆయన వైసీపీలో చేరాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వాడికి అసలు నైతిక విలువ, నైతిక హక్కు ఉందా?’’ అని కడిగేశారు. మరోసారి.. ‘‘టీడీపీ ప్రభుత్వ హయాంలో తుప్పుపట్టిన సైకిళ్లు కొన్నావు. 12 కోట్ల కోనుగోలులో 5 కోట్ల అవినీతికి పాల్పడ్డావు. ఎస్‌కె బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్‌లిస్టు చేసినా, బ్లాక్‌మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదులు వస్తున్నాయని’’ ట్వీట్ కూడా చేశారు.


అటు మంత్రి ముత్తంశెట్టి కూడా.. గంటా ప్రజాసేవ కోసం వైసీపీలోకి చేరడం లేదని, తన స్వార్ధం కోసం, కేసులు తొలగించుకోవడానికే తమ పార్టీలోకి వస్తున్నారంటూ బాంబు పేల్చారు. అవినీతి రుజువయితే అందరిమాదిరిగా ఆయన కూడా అరెస్టవుతారన్నారు. ‘అధికారం పోయి 15 నెలలు కూడా కాకముందే, ఐదేళ్లు మంత్రిగా చేసిన నువ్వు మళ్లీ పార్టీ మారి, వైసీపీలోకి వస్తున్నావంటే, అంతంకంటే దిగజారుడు ఇంకేముంటుంది? నమ్మకం ఉండక్కర్లా? ఎంతమందిని మోసం చేశావ్? ఎన్ని పార్టీలు మారుస్తావ్? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. నాజోలికొస్తే నీ చరిత్ర విప్పుతా. నేను నీలాగా వ్యాపారం పెట్టి పార్టనర్స్‌ను మోసం చేసి పైకి రాలేదు. మిత్రులను మోసం చేయలేదు. చెట్టు ఎక్కడుంటే పక్షులు అక్కడికి వస్తాయి. గంటా కూడా అంతే. ఆయన అధికారం లేకపోతే ఉండలేదు. కేసులు-అరెస్టుల నుంచి తప్పించుకునే పార్టీ మారే ప్రయత్నాలు చే స్తున్నారు. అందుకే మా పార్టీలోకి చేరుతున్నారని లీకులు ఇప్పిస్తున్నార’ని విరుచుకుపడ్డారు.

ఒకప్పుడు ఆప్తమిత్రులైన ఈ ఇద్దరికీ, ఇప్పుడు విశాఖలో కోల్డ్‌వార్ జరుగుతోంది.  గంటా పార్టీలోకి రావడం ఇష్టం లేని మంత్రి ముత్తంశెట్టి.. ఎంపి విజయసాయిరెడ్డి ద్వారా, అడ్డుచక్రం వేయించే పనిలో ఉన్నారు. తాజాగా గంటా రాకను వ్యతిరేకిస్తూ, వైసీపీ కార్యకర్తలు నిరసనలతో రోడ్డెక్కారు. గంటా వంటి అవకాశవాదిని చేర్చుకుంటే,  ప్రజలు వైసీపీని కూడా నమ్మరని హెచ్చరించారు.  విజయసాయిని వ్యతిరేకిస్తున్న.. విశాఖకు చెందిన ప్రజాప్రతినిధి, ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ మంత్రి కలసి… విజయసాయి పెత్తనానికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తున్నారట. అందుకే  గంటాను వైసీపీకి తెచ్చేందుకు, ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. విజయసాయి రాకతో, ఒకప్పుడు ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన ఆ సీనియర్ నేత,  ఇప్పుడు పాపం ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. ఆ రకంగా కులం కూడా కలసివచ్చిన నేపథ్యంలో.. అటు విజయసాయి-ఇటు ముత్తంశెట్టికి గంటా ద్వారా,  జమిలిగా చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుయిందట.  ఏదేమైనా.. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించేందుకు ప్రయత్నిస్తున్న గంటాకు, ఇన్ని కష్టాలు రావడం బాధాకరమే!