తెలుగు రాష్ట్రాల్లో కమలానికి తెరువుందా?

132

రాజకీయ కోణం లేని సంఘటనా నేతలు
ఏళ్ల తరబడి వారే మార్గదర్శకులా?
రాష్ట్ర అధ్యక్షుల పాత్ర సున్నా
కొత్త నేతలకు దక్కని గౌరవం
పాతుకుపోతున్న పాతకాపులే సైంధవులట
అమిత్‌షా హెచ్చరికలు బేఖాతర్
జాతీయ నాయకత్వానికీ అవగాహన లేదంటున్న నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న.. రాజకీయ సానుకూల పరిస్థితులను, సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమమవుతోందన్న వ్యాఖ్యలు, ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు సంఘ్ నుంచి ఉన్న సంఘటనా మంత్రులకు, రాజకీయ కోణం- ఆలోచనలు- నేపథ్యం-అంచనా లేకపోవడమే, దీనికి ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  జాతీయ నాయకత్వానికి సైతం తెలుగు రాష్ట్రాల కుల-వ్యక్తుల, రాజకీయ సమీకరణలపై అవగాహన లేకపోవడం కూడా, దురదృష్టకరమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార-ప్రధాన ప్రతిపక్షాల ఎత్తుపై ఎత్తు వేయడం, సోషల్ ఇంజనీరింగ్ చేయడం, బలమైన నేతలను గుర్తించని కారణంగా.. కేంద్రంలో వరసగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పార్టీ ఎదగకపోవడానికి ప్రధాన కారణమంటున్నారు.

అంతా ఆయనే చేశారు..

ఎవరైనా క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్టే ఆడాలి. షటిల్ ఆడకూడదు. కానీ, దేశంలో ఇన్నిసార్లు అధికారంలో ఉంటూ, కొత్త రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తున్న బీజేపీ..  రెండు తెలుగు రాష్ట్రాలో ఇప్పటికీ, కనీసం ప్రతిపక్ష హూదాకు సైతం ఎదగని దయనీయ వైనంపై, చాలా ఏళ్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదంతా.. సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన, ఓ అగ్ర నాయకుడి పుణ్యమేనన్న వ్యాఖ్యలు కూడా, బహిరంగంగానే వినిపిస్తుంటాయి. ఆయన నిర్వాకం వల్లనే, ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ చతికిలపడిందన్న విమర్శలూ లేకపోలేదు. ఆయనే ఓ పార్టీకి బీ టీముగా మార్చారని, కీలక నేతలను ఎదగకుండా అడ్డుకున్నారన్న విమర్శలున్నాయి. ఆయన పుణ్యాన చాలామంది సీనియర్లు ఇప్పటికీ, రాష్ట్ర రాజధానులు దాటి ఢిల్లీకి వెళ్లలేకపోయారన్న ఆవేదన లేకపోలేదు.

ఇన్చార్జి-సంఘటనా మంత్రుల అవగాహనాలోపం..

దానికితోడు.. రాష్ట్రానికి వస్తున్న ఇన్చార్జులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శులుగా వ్యవహరించే..  సంఘటనా మంత్రుల రాజకీయ అవగాహనాలోపం.. కలసి వెరసి, తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసించకపోవడానికి ప్రధాన కారణాలంటున్నారు. ఈ సంఘటనా కార్యదర్శులు ఇచ్చే నివేదికలు, సూచనలను జాతీయ సంఘటనా కార్యదర్శులు నమ్మి.. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా, బీజేపీ రాజకీయంగా వెనకబడేందుకు, మరో కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యవహారాలు చూస్తున్న జాతీయ నాయకుడు కొన్నేళ్ల నుంచి అదే పదవిలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క అంగుళం కూడా పెరగలేదన్న వ్యాఖ్యలు పార్టీలో చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.  రాష్ట్ర ఇన్చార్జులు-సంఘటనా కార్యదర్శుల పెత్తనంతో, రాష్ట్ర అధ్యక్షులు నిమిత్తమాత్రులుగా మిగిలిపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఫల్యాల పేరిట రాష్ట్ర అధ్యక్షులను మారుస్తున్న నాయకత్వం.. దానికి అంతకంటే ఎక్కువ బాధ్యులయిన రాష్ట్ర ఇన్చార్జి-సంఘటనా మంత్రులను మాత్రం ఏళ్లతరబడి కొనసాగిస్తుండటం మరో వైచిత్రి.

నాలుగంచెల వ్యవస్థలో అధ్యక్షులదే వైఫల్యామా?

వ్యక్తుల కేంద్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీ అయిన  బీజేపీ భిన్నంగా ఉంటుంది. టీఆర్‌ఎస్-వైసీపీ-టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలలో ఒక ప్రధాన కార్యదర్శి/అధికార ప్రతినిధి/ వంటి పదవులలో ఎవరిని ఎప్పుడైనా నియమించవచ్చు. నేతల ప్రతిభ-పార్టీ అవసరాల కొలమానంతో, వాటి నియామకం జరుగుతుంటుంది. అధి అధ్యక్షుడి ఇష్టం.  కానీ బీజేపీలో అది సాధ్యపడదు. పార్టీ అధ్యక్షుడికి సొంతంగా, తనకు ఇష్టం వచ్చిన వారిని నియమించే అధికారం ఉండదు. రాష్ట్ర ఇన్చార్జి- సంఘటనా మంత్రి-కోర్ కమిటీ సమిష్టిగా చర్చించి, నిర్ణయిస్తారు. జాతీయ సంఘటనా మంత్రితో, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా కీలకమైన అంశాల్లోనే మాట్లాడతారు. కానీ, రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలు-కార్యక్రమాలు-నియామకాలన్నీ, జాతీయ-రాష్ట్ర సంఘటనా కార్యదర్శుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉంటాయి. మరి.. పార్టీలో ఇన్ని అంచెల వ్యవస్థ ఉన్నప్పుడు, వైఫల్యాలకు కేవలం… రాష్ట్ర పార్టీ అధ్యక్షులనే బాధ్యులను చేసే  సంప్రదాయం ఎందుకన్న ప్రశ్నలు,  చాలాకాలం నుంచీ పార్టీలో వినిపిస్తున్నా, సమాధానం చెప్పే వారే ఉండరు.

ఎనిమిదేళ్ల నుంచీ ఆయనేనా?

తెలంగాణలో ప్రస్తుత సంఘటనా మంత్రి,  దాదాపు 8 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఆయన హయాంలో పార్టీ బలం, అసెంబ్లీలో 5 నుంచి ఒకటికి పడిపోయింది. స్వతహాగా సంఘ్ నుంచి ఏబీవీపీలో పనిచేసిన ఆయన, పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన సందర్భాలు లేవని, పార్టీ సీనియర్లే చెబుతుంటారు. సహజంగా విద్యార్ధి ఉద్యమాలకు-పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్‌కు.. ఆలోచన-ఆచరణ-రాజకీయ విధానంలో చాలా తేడా ఉంటుంది. రాజకీయ కోణం, విద్యార్ధి ఉద్యమ నేతలకు సహజంగా ఉండదు. వారి దృష్టి అంతా విద్యార్ధుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పోరాటాలు, విద్యావిధానంపై చర్చలకే పరిమితమయి ఉంటాయి. అలాంటి కార్యకలాపాల నుంచి వచ్చిన నేతకు, పార్టీ బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కిషన్‌రెడ్డి పదవీకాలం పూర్తయి-లక్ష్మణ్ అధ్యక్షడయ్యే మధ్య కాలంలో, 25 మంది బీజేపీ నేతలు.. ఆయన పనితీరుపై నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేసిన విషయం తెలిసిందే.

ఫుల్‌టైమర్లను నియమించినా.. వచ్చింది ఒక్క సీటేనా?

అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచీ.. ఫుల్‌టైమర్లకు నెలకు 10 వేల చొప్పున, ఒక ద్విచక్రవాహనం కూడా ఇచ్చి, నియోజకవర్గాలకు పంపించారు. వారిలో ఏబీవీపీ వారే ఎక్కువని అప్పట్లో ప్రచారం జరిగింది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి-నేతల వ్యవ హారశైలి-బలాలు,బలహీనతలు తెలుసుకుని, వాటిని సంఘటనా మంత్రికి మాత్రమే సమాచారం ఇవ్వడం వారి విధి. ఆవిధంగా మూడేళ్ల పాటు నెలకు లక్షలు ఖర్చు చేసినా, పార్టీకి వచ్చిన సీటు ఒకే ఒక్కటి. మరి దీనికి బాధ్యులెవరన్నది సీనియర్ల ప్రశ్న. ఇక పార్టీ సభ్యత్వాల ప్రారంభం నుంచీ, ఇప్పటివరకూ సభ్యత్వ వివరాల విశ్లేషణ జరుగుతూనే ఉండటంపై, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటుచేశారు. సభ్యత్వం తీసుకున్న వారికి రోజూ ఫోన్లు చేయడం, వారికి కార్యక్రమాల వివరాలు చెప్పడం వారి విధి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ ప్రక్రియ వల్ల, వచ్చింది కూడా ఒక్క సీటేనంటున్నారు. ఈ వ్యవస్థ వివరాలు కోరిన నాయకులకు, ఇప్పటికీ  జవాబు కరవు.

గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగుసీట్లు రావడానికి, మోదీ    ఇమేజ్-జాతీయవాదం-తెరాస అభ్యర్ధుల ఎంపిక లోపం- బీజేపీ అభ్యర్ధులు వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్న చోట్ల మాత్రమే గెలిచారని, సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఒక ప్రొఫెసర్ నివాసంలో, పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు భేటీ అయి, నాలుగయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస బలహీన అభ్యర్ధులను నిలబెట్టేందుకు, ఓ సీఎంఓ స్థాయి అధికారితో మంతనాలు జరిగాయన్న ఫిర్యాదులు, ఢిల్లీ వరకూ వెళ్లిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర కమిటీ కూర్పుపై అసంతృప్తి

కాగా, తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీపైనా, అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన అధ్యక్షుడి పాత్ర అందులో ఏమీ లేదని, అంతా సంఘటనా మంత్రి కనుసన్నలలోనే జరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి రాష్ట్ర కమిటీల్లో పాతుకుపోయిన వారిని, తొలగించడంపై మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. అయితే తీసుకున్న కొత్తవారిలో, పట్టుమని పదిమందిని తీసుకువచ్చే వారు కొద్దిమందే ఉన్నారంటున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ-కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి, పెద్దగా స్థానం లేదంటున్నారు. డికె అరుణ, మోత్కుపల్లి, గరికపాటి మోహన్‌రావు, చాడా సురేష్‌రెడ్డి, బోడ జనార్దన్, బాబూమోహన్, మేకల సారంగపాణి ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యే-మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్ష స్థాయి నేతలు బీజేపీలో చేరారు. వీరు కాకుండా మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావుతో చాలామంది నేతలు చేరారు. వారికెవరికీ కమిటీల్లో స్థానం లేకపోవడం, అసంతృప్తికి గురిచేసింది. పార్టీలో చేరిన వారిని సీనియర్లు ఎదగనీయరని, వారంతట వారే వెళ్లిపోయేలా వ్యవహరించే విధానం, ఇప్పటికీ అమలవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చాలాకాలం క్రితం అమిత్‌షా.. పార్టీ నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చినా, దానిని ఖాతరు చేయడం లేదంటున్నారు.

గరికపాటి అనుచరులకు మొండిచేయి

ముఖ్యంగా గరికపాటితో పాటు పార్టీలోకి వచ్చిన వారందరికీ.. పాత హోదాలు మళ్లీ బీజేపీలో ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఆయన మాట ఇచ్చారని, ఇప్పుడు కేవలం ముగ్గురికి మాత్రమే అదికూడా, ఒకే జిల్లా నుంచి ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పార్టీని ఆరు జిల్లాలుగా మార్చినా, ఇప్పటివరకూ కమిటీలు వేయలేదు. అందులో కూడా టీడీపీ నుంచి చేరిన నగర స్థాయి నేతలకు, ఒక్క జిల్లా కూడా దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంబర్‌పేట జిల్లా తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుపడుతున్నారు. అక్కడ చింతల,  తన అనుచరుడికి ఆ జిల్లా అధ్యక్ష పదవి కావాలని పట్టపడుతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశించిన చింతల అది దక్కకపోవడంతో, అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష స్థానం కోసం, టీడీపీ నుంచి చేరిన నగర స్థాయి నాయకులు పట్టుపడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?  అయితే.. అగ్రనేతలకు జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తారంటున్నారు. ఆ లెక్కన  బీజేపీలో ప్రస్తుతం జాతీయ కమిటీలో ఉన్నవారితోపాటు, లక్ష్మణ్ సహా రాష్ట్ర ప్రముఖులకు జాతీయ కమిటీలో ఎంతమందికి, స్థానం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ఎదుగుదల ఏదీ?

ఇక ఏపీలో పార్టీ ఎదుగల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏపీలో సాధారణ స్థాయి నుంచి.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి, ఉప రాష్ట్రపతి స్థాయికి వెంకయ్యనాయుడు ఎదిగారు. కానీ పార్టీ మాత్రం వీసమెత్తు కూడా ఎదగలేదు. అన్నేళ్లు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన బీజేపీ.. ఇప్పటివరకూ కనీసం అసెంబ్లీలో, ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోలేకపోవడం ఒక విషాదమయితే, ఈ శాసనసభలో ఒక్క స్థానం కూడా లేకపోవడం మరో దారుణం. మరి సంఘటనా మంత్రలు-ఇన్చార్జులు ఏం చేస్తున్నారన్నది శ్రేణులు సంధిస్తున్న ప్రశ్న.

టీడీపీతో కలసి దాదాపు 4 ఏళ్లు అధికారంలో భాగస్వామిగా ఉన్నా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడం ఎవరి లోపమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ అవినీతి గురించి ఇప్పుడు నేతలు కొత్తగా మాట్లాడటమే నేతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగేళ్లు ఆ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా, ఆ అవినీతికి బాధ్యురాలే కదా అన్న లాజిక్‌ను, అగ్రనేతలు మిస్సవడమే వారి ఆశ్చర్యానికి కారణం.

ఓటమిలో ఇన్చార్జి-సంఘటనా కార్యదర్శి వైఫల్యం లేదా?

గత ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడిని నియమించారు. అప్పుడు ఆయనకు ఎన్నికలు-ప్రచారంతోనే సమయం  సరిపోయింది.  తర్వాత పార్టీ ఎన్నికలు. ఇటీవలే ఆయనను వైఫల్యం పేరిట తెలంగాణలో మాదిరిగానే తొలగించారు. అయితే, ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఇన్చార్జి-సంఘటనా మంత్రిని మాత్రం కొనసాగిస్తుండటం విశేషం. ఏపీలో అయినా-తెలంగాణలో అయినా, అధ్యక్షులు వైఫల్యం చెందారని భావించినప్పుడు… మరి అంతకంటే ఎక్కువ బాధ్యతలున్న రాష్ట్ర ఇన్చార్జి-సంఘటనా మంత్రులను కూడా, ఎందుకు తొలగించలేదో శ్రేణులకు  అర్ధం కావడం లేదు.

నేలవిడిచి సాము చేస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం.. నేలవిడిచి సాము చేస్తోందన్న వ్యాఖ్య, పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది. ప్రధానమైన సోషల్ ఇంజనీరింగ్‌లో నాయకత్వం విఫలమయిందంటున్నారు. ఉత్తర భారతం మాదిరిగా, దక్షిణ భారతంలో మత రాజకీయాలకు ప్రాధాన్యం ఉండదు. దక్షిణ భారతంలో కులాలే కీలకం. తెలుగు రాష్ట్రాల్లో కులాలకే ప్రాధాన్యం. తెలంగాణలోని జిల్లాల్లో, ముస్లింల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే, జాతీయ వాదం-జాతీయ భావన  పనిచేస్తుంది. అందుకే బీజేపీ ఇప్పటికీ అక్కడ మనుగడ సాగిస్తోంది. ఇక ఆంధ్రాలో కమ్మ-రెడ్డి-కాపు, తెలంగాణలో బీసీ-ఎస్సీల చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి. ఏపీలో అగ్ర కులాలకు బీసీలు తోడయితే, తెలంగాణలో రెడ్లు తోడవుతారు. ఏ పార్టీ అయినా,  ఈ కాంబినేషన్‌పైనే రాజకీయాలు చేస్తుంది.

వలస నేతలకు దన్ను ఏదీ?

ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల, టీడీపీ-కాంగ్రెస్ నుంచి వలసలు పెరిగాయి. ఆ రెండు పార్టీల్లో టీడీపీ నుంచి వచ్చిన నేతలు, నిరంతరం మీడియా- ప్రజల్లో ఉంటారు. రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటారు. ఆ పార్టీ స్కూలు అలాంటిది మరి. అలాంటి వారిని సద్వినియోగం చేసుకోవడంలో, నాయకత్వం విఫలమయిందన్నది ఒక విమర్శ. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ప్రముఖులు చేరినా, వారి సేవలు కూడా వినియోగించుకోవడంలో, సంఘటనా మంత్రులు విఫలమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అస్సోంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు సీఎం, ఏపీలో అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అయితే, ఏపీలో టీడీపీ నుంచి వచ్చిన నేతలను.. ఇంకా టీడీపీ కోవర్టులుగా-తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ నుంచి చేరిన వారిని, ఇంకా ఇతర పార్టీల వారిగానే చూస్తున్న వైచిత్రి.  ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రేణుల  భావన.

అలాగే పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి, ఆర్గనైజర్లుగా పేరున్న నేతలను గుర్తించకుండా..  కోర్ కమిటీలో అగ్ర నేతలు సిఫార్సు చేసిన వారికి పదవులిప్పించే సంస్కృతి వల్ల, సీనియర్లు దూరంగా ఉండిపోతున్న పరిస్థితి. ఏపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతలను గందరగోళంలో పడేస్తున్నాయి. తమ పోరాటం అధికారపక్షంపైనా? ప్రతిపక్షంపైనా అన్నది వారు తేల్చుకోలేకుండా ఉన్నారు. ఒక్కో అంశంపై ఒక్కో నేత విభిన్నంగా మాట్లాడుతున్నారు. అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో.. అందులోని సమర్ధులను గుర్తించి, వారిని ఆకర్షించడం మాని, తమకే ఒక స్పష్టత సృష్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరి.. పార్టీ నేతలే  సంఘటనా మంత్రులవుతారా?

‘‘ ఒక్కముక్కలో చెప్పాలంటే.. తె లుగు రాష్ట్రాల్లో పార్టీ ఉన్న ఈ పరిస్థితి ప్రకారం, మా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా, దూకుడుగా వెళ్లి నిర్ణయాలు తీసుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. కుల రాజకీయాలే చేయాలి.  కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తే, అది పార్టీలో చేరాలనుకుంటున్న వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మీడియా, సోషల్ మీడియా, కౌంటర్ మెకానిజంపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రధానంగా.. సంఘటనా మంత్రులు-రాష్ట్ర ఇన్చార్జిల పాత్ర, వీలయినంత మేరకు తగ్గించాలి. వేరే రాష్ట్రం నుంచి నియమించే బదులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతను ఆంధ్రాకు- ఆంధ్రాకు చెందిన నేతను తెలంగాణకు ఇన్చార్జిగా నియమిస్తే, వారికి సమస్యలు వెంటనే అర్ధమవుతాయి. అసలు మూలాల నుంచి వచ్చిన వాడిగా నేను ఇది చెప్పకూడదు. కానీ.. పార్టీ ఎదగాలంటే, పార్టీలో కింది స్ధాయి నుంచి పనిచేసిన వచ్చిన వారినే, సంఘటనా మంత్రులుగా నియమించాలి. ఏబీవీపీ, సంఘ్ నుంచి వచ్చిన వారికి తెలుగు రాష్ట్రాల కుల రాజకీయాలపై అవగాహన ఉండదు కాబట్టి, పార్టీ వారినే నియమిస్తేనే, ఫలితాలుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పార్టీ ఆర్గనైజేషన్ గురించి తెలిసిన వ్యక్తినే, సంఘటనా మంత్రిగా నియమించాలి.  బహుశా ఇవేమీ  సాధ్యం కావేమో?’’నని ఓ సీనియర్ నాయకుడు నిరాశతో వ్యాఖ్యానించారు.